close
రాజకీయాలు చిన్ననాటి కల!

రాజకీయాలు చిన్ననాటి కల!

గల్లా జయదేవ్‌... గత నెలవరకూ దేశంలోని ప్రముఖ వ్యాపారుల్లో, ఎంపీల్లో ఒకరు. కానీ మొన్నటి బడ్జెట్‌ సమావేశాల్లో లోక్‌సభలో చేసిన ప్రసంగంతో ఆయన తెలుగువారి అభిమాన నాయకుల్లో ఒకరయ్యారు. ఆ ప్రసంగంద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితినే కాకుండా రాష్ట్ర ప్రజల అసంతృప్తినీ ఆకాంక్షల్నీ పార్లమెంటుకు వెల్లడించి అందరి హృదయాల్నీ గెల్చుకున్నారు. ఇక్కడివరకూ చేరడానికి జయదేవ్‌ చాలా దూరం ప్రయాణించారు. ఆ ప్రయాణం గురించి ఆయన మాటల్లోనే...
నాకు మూడున్నరేళ్లపుడు 1970లో మా కుటుంబం అమెరికా వెళ్లింది. షికాగోలో దిగిన మొదటి రోజునుంచీ జరిగిన సంఘటనలన్నీ నాకు ఇప్పటికీ గుర్తే! అక్కడ ఒక్కసారిగా అంతా కొత్తగా అనిపించింది. పిల్లలు మాట్లాడే భాష వేరు, వారి రంగు వేరు, వేషధారణ పూర్తిగా వేరు. వాటికి అలవాటు పడటం నాకూ అక్క(రమాదేవి)కీ చాలా కష్టమైంది. అక్కడ వెంటనే స్కూల్లో చేరలేదు. రెండేళ్లపాటు ఇంట్లోనే ఉన్నాను. ఆ సమయంలో అమ్మానాన్నలతో, అక్కతో మాట్లాడుతూ ఇంగ్లిష్‌ నేర్చుకున్నాను. మేం వెళ్లేసరికి అక్కకి ఆరేళ్లు. తనకి వెంటనే స్కూలుకి వెళ్లక తప్పలేదు. దాంతో మొదట్లో భాష పరంగా చాలా ఇబ్బంది పడేది. నాన్న(రామచంద్ర నాయుడు)ఇంజినీర్‌గా, అమ్మ(అరుణ) కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా పనిచేసేవారు. మేం స్కూలు నుంచీ, వాళ్లు ఆఫీసుల నుంచీ వచ్చాక సాయంత్రం గంటసేపు అన్ని విషయాలూ మాట్లాడటం, తర్వాత భోజనం, ఎనిమిదింటికల్లా పుస్తకాలు తీయడం...ఇదే మా దినచర్య.

నేను మూడో తరగతిలో ఉండగా తాతయ్య (పాటూరి రాజగోపాల నాయుడు) అమెరికా వచ్చారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు, రెండు సార్లు ఎంపీగానూ పనిచేశారు. ఎన్జీ రంగా గారికి మంచి స్నేహితుడు, అనుచరుడు. తాతయ్య గురించి అమ్మానాన్న చెబితే విన్నాను. ఆయన అమెరికా వచ్చినప్పుడు భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి చెప్పారు. ఓరోజు నాతోపాటు తాతయ్యను స్కూల్‌కి తీసుకువెళ్లాను. పంచెకట్టులో ఉన్న ఆయన్ని చూసి మిగతా పిల్లలు నన్ను హేళన చేస్తారేమోనని భయం వేసింది. కానీ అక్కడంతా ఆయన్ని ఎంతో గౌరవంగా చూశారు. అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అమెరికాలో తెల్లవాళ్లకి తప్పించి మిగతా వారికి సరైన గౌరవం దక్కదని అప్పటికి నా మైండ్‌లో బాగా నాటుకుపోయి ఉంది. కానీ రంగులో కాదూ అంతా వ్యక్తిత్వంలోనే ఉంటుందని ఆరోజు అర్థమైంది. ఆయనలానే రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కలిగింది. అప్పుడే తాతయ్యతోపాటు స్ప్రింగ్‌ఫీల్డ్‌ వెళ్లాం. అబ్రహాం లింకన్‌ పెరిగిన ఊరది. ఆయన ఇంటిని సందర్శించినపుడు పిల్లల కోసం రాసిన లింకన్‌ ఆత్మకథ పుస్తకాన్ని కొనిచ్చారు తాతయ్య. అది కూడా నాకెంతో స్ఫూర్తినిచ్చింది.

ఇంజినీరింగ్‌ వదిలేశా...
నేను పదో తరగతిలో ఉన్నపుడే మెడిసిన్‌ చేయడానికి అక్క ఇండియా వచ్చేసింది. తర్వాత రెండేళ్లకి కంపెనీ పెట్టాలని 1984లో అమ్మానాన్నా వచ్చేశారు. ఆ సమయంలో నేను  ‘యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయ్‌’లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాను. యూనివర్సిటీలో ‘ఫ్రెటర్నిటీ హౌస్‌’ అని ఉంటుంది. హాస్టల్‌, సోషల్‌ లైఫ్‌కి సంబంధించి విద్యార్థులంతా బృందంగా ఉంటారు. విద్యార్థులే హౌస్‌ నిర్వహణని చూసుకోవాలి. దానికి ఎంపిక కావడానికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఆ హౌస్‌ చరిత్రలో నేను తప్ప అందరూ తెల్లవాళ్లే. సెలవులకి ఇండియా వచ్చేటపుడు తాతయ్యతో మాట్లాడుతుంటే రాజకీయాల్లోకి వెళ్లాలనే నా కోరిక మరింత బలపడింది. ఇంజినీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నపుడు ఎందుకో అది నా భవిష్యత్తుకు సరిపోయే చదువు కాదనిపించింది. నాకు మొదట్నుంచీ ఆర్ట్స్‌ సబ్జెక్టులంటే ఆసక్తి. భాష మీద పట్టు ఉండేది. రాయడం, మాట్లాడడం నా బలాలు. అందుకే బాగా ఆలోచించి పొలిటికల్‌ సైన్స్‌, ఎకనమిక్స్‌ ఆప్షన్స్‌కి మారిపోయాను.

వ్యాపారంలో అడుగులు
గ్రాడ్యుయేషన్‌ తర్వాత అమెరికాలోనే బ్యాటరీ తయారీ సంస్థ జీఎన్‌బీలో ఉద్యోగిగా చేరాను. ఆ సమయంలో మా సంస్థ (అమర్‌ రాజా)కు జీఎన్‌బీ సాంకేతిక భాగస్వామి. ఆ సంస్థలో రెండేళ్లపాటు పనిచేశాను. ఇండియాకి రాకముందే 1991లో నాకు పెళ్లి అయింది. నా శ్రీమతి పద్మావతి. హీరో కృష్ణ గారి అమ్మాయి. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లాం. నన్ను అర్థం చేసుకోవాలంటే ముందు నేను పెరిగిన అమెరికాని అర్థం చేసుకోవాలని అక్కడ రెండేళ్లపాటు ఉండాలనుకున్నాం. కానీ వెళ్లిన ఆర్నెల్లకే పద్మకి ప్రెగ్నెన్సీ రావడంతో  ముందు తనూ తర్వాత కొన్ని నెలలకి నేనూ ఇండియాకి వచ్చేశాం. మొదటి రెండేళ్లూ తిరుపతిలో ఉన్నాం. అప్పటికి ‘అమర్‌ రాజా ఇండస్ట్రియల్‌ బ్యాటరీ’కి సంబంధించిన ప్లాంట్‌ బిల్డింగ్‌లు మాత్రమే పూర్తయ్యాయి. యంత్రాలు ఇంకా రాలేదు. అంతకంటే ముందు యూ.పీ.ఎస్‌.లు ఉత్పత్తి చేసే పవర్‌ సిస్టమ్స్‌ విభాగాన్నీ, ఎలక్ట్రికల్‌ విభాగాన్నీ ప్రారంభించారు నాన్న. ఇక్కడికి వచ్చాక మొదట నాకు ‘ఇన్‌ఛార్జ్‌ ఆఫ్‌ వెహికల్స్‌’ బాధ్యతని అప్పగించారు. ‘ఇదేం జాబ్‌ నాన్నా’ అని అడిగితే. ‘నువ్వు ఆ విభాగాన్ని మేనేజ్‌ చేయగలిగితే ఏ పనైనా చేయగలవు’ అని చెప్పారు. ఆరు నెలలపాటు అక్కడ పనిచేశాక కంపెనీ మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగం పనులు అప్పగించారు. 1994లో మార్కెటింగ్‌ బాధ్యతలు పూర్తిగా నాకే వచ్చాయి. అప్పట్లో రైల్వే, రక్షణ, విద్యుత్‌ తయారీ... మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలే మా ఖాతాదారులు. వారితో సంప్రదింపులకు తరచూ దిల్లీ వెళ్లేవాణ్ని. తిరుపతి నుంచి దిల్లీ వెళ్లిరావడం కష్టమవుతోందని మార్కెటింగ్‌ ఆఫీసుని హైదరాబాద్‌కి మార్చాం. నేనూ, పద్మా ఇద్దరు పిల్లలతో ఇక్కడికి వచ్చాం. అమ్మ అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే. హైదరాబాద్‌కి పనిమీద వచ్చినపుడు మాతో ఉండేది. 1997లో అమెరికాకు చెందిన జాన్సన్‌ కంట్రోల్స్‌ని భాగస్వామిగా చేసుకుని ఆటోమోటివ్‌ బ్యాటరీ తయారీలోకి అడుగుపెట్టాం. దాంతో కంపెనీ ఉత్పత్తీ లాభాలూ బాగా పెరిగాయి. కంపెనీలో క్రమంగా మిగతా విభాగాల బాధ్యతలూ నా చేతికి వచ్చాక 1998లో కార్పొరేట్‌ ఆఫీసుని తిరుపతి నుంచి చెన్నైకి మార్చాం. ఆ సమయంలో మొదటి మూడేళ్లూ పద్మ హైదరాబాద్‌లో ఉండేది. వారాంతాల్లో ఇక్కడికి వచ్చేవాణ్ని. నేను పూర్తి సమయం ఇక్కడ లేకున్నా ఇంటి పనుల్నీ, పిల్లల్నీ పద్మ జాగ్రత్తగా చూసుకునేది. 2009లో కార్పొరేట్‌ ఆఫీసుని హైదరాబాద్‌కి మార్చాం.

నలభై ఏళ్లకే అనుకున్నా...
హైదరాబాద్‌కి ఆఫీసు మార్చడం వెనక కారణాల్లో రాజకీయాల్లోకి రావాలనే నా లక్ష్యం కూడా ఉంది. నిజానికి 40 ఏళ్లకే రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. 2004లో చిత్తూరు లోక్‌సభ టికెట్‌ కోసం ప్రయత్నించాను. కానీ సీటు రాలేదు. అమ్మకూడా అప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉంది. అందుకే ఆ విషయాన్ని నేనూ మరీ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అమ్మ ఎన్నికల్లో పోటీపడే సమయంలో ప్రచార బాధ్యతలు చూస్తూ, ఎన్నికల తర్వాత మళ్లీ కంపెనీ పనులు చూసుకునేవాణ్ని. 2009 తర్వాత రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాణ్ని. కొన్నాళ్లు ‘ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ’ సెక్రెటరీగా పనిచేశాను. తర్వాత కొన్నాళ్లకు రాష్ట్ర విభజనకు సంకేతాలు వచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రాథమిక దశలో ఉన్నపుడే 2013లో తిరుపతిలో పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాను. అమ్మ మంత్రిగా ఉన్నప్పటికీ ఆ ర్యాలీకి వచ్చింది. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన మాకు అస్సలు నచ్చలేదు. ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్‌. అందుకే ఆ పార్టీలో ఉండలేకపోయాను. 2012 తిరుపతి (అసెంబ్లీ) ఉప ఎన్నిక సందర్భంలో టికెట్‌ కోసం ప్రయత్నించినా రాలేదు. అప్పుడే టీడీపీలో చేరమంటూ లోకేష్‌ అడిగారు. కానీ అమ్మ అప్పటికే మంత్రిగా ఉంది. ‘భవిష్యత్తులో ఏమో చెప్పలేను కానీ, ఇప్పుడు మాత్రం కుదరద’న్నాను. తిరుపతి ర్యాలీ తర్వాత లోకేష్‌ మరోసారి ఫోన్‌ చేశాక 2013 అక్టోబరులో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. 2014 ఫిబ్రవరిలో టీడీపీలో చేరాం. ఎంపీగా పోటీ చేస్తానని చెప్పాను. చిత్తూరు రిజర్వ్‌డ్‌ సీటు కావడంతో గుంటూరు ఎంచుకున్నాను. అక్కడ 50 శాతం అర్బన్‌ ఓటర్లు ఉన్నారు. వాళ్లయితే నన్ను అర్థం చేసుకోగలరనిపించింది. పైగా అది మావయ్య కృష్ణగారి సొంత జిల్లా కూడా. నా నమ్మకం వమ్ముకాలేదు. నన్ను గెలిపించారు.

అందరికీ సమయం
రాజకీయాల్లోకి రాకముందు అటు కంపెనీ, ఇటు కుటుంబం నా విషయంలో 80-90 శాతం సంతృప్తిగా ఉండేవాళ్లు. ఇప్పుడు టైమ్‌ కేటాయించడంలేదని కంపెనీ, కుటుంబం, నియోజకవర్గప్రజలు- అందరికీ నాపైన అసంతృప్తి ఉంది. నిజానికి నాకసలు తీరికే ఉండదు. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే అందరూ అర్థం చేసుకుంటున్నారు. పార్లమెంటులో ప్రసంగం ఇవ్వాలంటే ఎంతో రీసెర్చ్‌ చేయాలి. 20 నిమిషాల స్పీచ్‌కీ కొన్ని రోజులపాటు వర్క్‌ చేయాలి. పార్లమెంట్‌ సమావేశాలతోపాటు రక్షణ, వాణిజ్యం, పరిశ్రమలు... మొదలైన రంగాలకు సంబంధించిన స్టాండింగ్‌ కమిటీల్లో పనిచేయడం, జాయింట్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉండటంవల్ల ఆ పర్యటనలూ, సమావేశాలూ ఉంటాయి. ఇంకా ఎంపీల పర్యటనల్లో చురుగ్గా పాల్గొంటాను. అవి ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ పర్యటనల్లో భాగంగా పెంటగాన్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ లాంటి చోట్లకి వెళ్లాను. రాష్ట్రంలో చూసుకుంటే ‘క్యాపిటల్‌ ప్లానింగ్‌ కమిటీ’ సభ్యుడిగా రాజధాని ఎంపిక నుంచి, అక్కడ అభివృద్ధి పనుల్లో నాదైన పాత్ర పోషిస్తున్నాను. ఇవి కాకుండా వైస్‌ ఛైర్మన్‌, ఎండీగా కంపెనీ బాధ్యతలూ ఉంటాయి. మరోవైపు కుటుంబాన్నీ చూసుకోవాలి. వీటన్నింటి కారణంగా నెలలో సగం రోజులు ప్రయాణాల్లోనే ఉంటాను.

అన్నింటికీ సిద్ధమే...
ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రం నిర్లక్ష్యం చేయడం గురించి పార్లమెంట్‌లో మాట్లాడాక నాపైన కొందరు బురద జల్లడం మొదలుపెట్టారు. కానీ వాటికి నేనేం బెదిరిపోను. ఇలాంటి సమస్యలు తప్పవని  రాజకీయాల్లోకి వచ్చినరోజే తెలుసు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చాను. మా కంపెనీ వ్యవహారాలన్నీ చాలా పక్కాగా ఉంటాయి. అమర్‌రాజా సంస్థ వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. చిత్తూరు జిల్లాలోని అమ్మవాళ్ల ఊరైన దిగువ మాగూరులో, నాన్న సొంతూరైన పేటమెట్టలో, ఫ్యాక్టరీ ఉన్న కరకంబాడిలో ఆ ప్రగతిని చూడొచ్చు. కంపెనీ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలతో, కుటుంబ సభ్యుల విరాళాలతో అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే... ఎదుగుదల. దాంతో సమాజం ఎదుగుదలా ముడిపడి ఉంటుంది!

అబ్బాయిలు సినిమాల్లో...

మాకు ఇద్దరు అబ్బాయిలు అశోక్‌, సిద్ధార్థ్‌. అక్కకీ ఇద్దరూ అబ్బాయిలే... హర్ష, విక్రమ్‌. ఇద్దరికీ అమ్మాయిలు లేకపోవడం కాస్త లోటుగా ఉంటుంది.
* హర్ష, విక్రమ్‌... అమర్‌ రాజా గ్రూపులోని కంపెనీలకు ఎండీలుగా ఉన్నారు.
* అశోక్‌, సిద్ధార్థ్‌కు సినిమాలంటే ఆసక్తి. అశోక్‌ టెక్సాస్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌లో డిగ్రీ చేశాడు. సిద్ధార్థ్‌ కూడా ఫిల్మ్‌ మేకింగ్‌ డిగ్రీలో చేరాడు కానీ పూర్తిచేయలేదు. ఇద్దరికీ మహేష్‌ సినిమాలకి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అనుభవం ఉంది.
* అశోక్‌ ఈ ఏడాది హీరోగా పరిచయమవుతాడు. తర్వాత సిద్ధార్థ్‌ కూడా వస్తాడు. వీరి కెరీర్‌ గురించి నాకంటే మహేష్‌   ఎక్కువ శ్రద్ధపెడుతున్నాడు.
* నా వెనక అమ్మానాన్న ఉన్నారనే ధైర్యంతోనే ఏ విషయంలోనైనా ముందడుగు వేయగలను.
* ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌, వ్యక్తిత్వ వికాసం, బిజినెస్‌ విభాగాల్లో నెలకో పుస్తకమైనా చదువుతా.
* స్కూల్‌ రోజుల్లో చెస్‌, టెన్నిస్‌ బాగా ఆడేవాణ్ని. రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో పాల్గొన్నా. వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ నిర్ణయాలకూ, వ్యూహాలకూ స్ఫూర్తి చదరంగమే.

- చంద్రశేఖర్‌ సుంకరి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.