close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌!

ఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌!

స్మార్ట్‌ఫోన్‌... ఈ కాలపు అద్భుత ఆవిష్కరణ. సైకిల్‌ తర్వాత అత్యంత ప్రయోజనకరమైన సాధనం  ఇదేనంటూ ప్రపంచమంతా జేజేలు పలుకుతున్న గ్యాడ్జెట్‌. దేశ, ప్రాంత, వర్గ, భాషా భేదాలు లేకుండా అందరి చేతుల్లో వెలిగిపోతున్న ఉపకరణం. వేలి స్పర్శతో వేయిన్నొక్క పనులు చేసి పెడుతోందంటూ సంబరంగా ఈ చిన్ని పరికరానికిగానీ అతుక్కుపోయామా... అంతే సంగతులు!

దంపతులిద్దరూ మంచం మీద చెరోవైపు తిరిగి పడుకుని ఉంటారు. మధ్యలో చార్జింగ్‌కి పెట్టిన రెండు సెల్‌ఫోన్లు. కింద ‘మేమిద్దరం మాకిద్దరు’ అంటూ ఓ వాక్యం.

‘కాసేపు ఆ ఫోను పక్కనపెడితే మూడుముళ్లూ వేయిస్తాను’ పెళ్లి పీటల మీద ఫోన్లతో బిజీగా ఉన్న వధూవరులను బతిమాలుతుంటాడు పురోహితుడు.

‘ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారంటే ఏమిటి అర్థం?’‘వాళ్లిద్దరి ఫోన్లూ ఛార్జింగ్‌లో ఉన్నాయని..!’

సామాజిక మాధ్యమాల్లో తలమునకలవుతున్నవారి గురించి ఆ మాధ్యమాల్లోనే ఇలాంటి జోకులు ఎన్నో. సెల్‌ఫోన్‌ ఇప్పుడు చాలా స్మార్ట్‌గా మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చేసింది. పుష్కరం క్రితం అసలా పదమే లేదు నిఘంటువులో. ఇప్పుడు ప్రపంచమంతా దాని చుట్టూనే తిరుగుతోంది!

ఇంట్లో కుటుంబసభ్యులకు ఏనాడూ శుభోదయం చెప్పనివారు నేడు సామాజిక మాధ్యమాల్లో ముఖపరిచయమే లేని మిత్రులకు శుభోదయం చెప్పకుండా మంచం దిగడం లేదు. చాలామందికి ఇదో అబ్సెషన్‌ అయిపోయింది. మనదేశంలో మూడింట ఒక వంతు స్మార్ట్‌ఫోన్లలో రోజూ స్టోరేజ్‌ స్పేస్‌ అయిపోతుండడం చూసిన గూగుల్‌ దానిపై అధ్యయనం చేసింది. అందమైన ఫొటోలతో, దేవుళ్ల చిత్రాలతో ప్రజలు చెప్పుకొంటున్న ఈ శుభోదయం సందేశాలే అందుకు కారణమని తేల్చింది. గత ఐదేళ్లలో ఇలాంటి చిత్రాలకోసం గూగుల్‌లో వెదుకుతున్న వారి సంఖ్య పదిరెట్లు పెరిగిందట. ఈ సమస్య తగ్గించడానికే ‘స్టేటస్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్‌. అక్కడ ఒక్క ఫొటో పెట్టి, గుడ్‌మార్నింగ్‌ అని క్యాప్షన్‌ ఇస్తే అందరికీ చెప్పినట్లే. కానీ దాన్ని ఉపయోగించేవారు అరుదు. కొత్త సంవత్సరం నాడు ఒక్క మనదేశంలోనే రికార్డు స్థాయిలో రెండు వేల కోట్ల సందేశాలను ఫోన్లు చేరవేశాయి.ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని సందేశాలు నమోదవలేదు!

ఇది చాలదూ ఫోనుని మనం ఎంత ఎక్కువగా వినియోగిస్తున్నామో చెప్పడానికి.

ఫోను వాడితే తప్పేముంది?
తప్పేమీలేదు, ఫోను అవసరమే. అయితే ఆ వాడకానికి ఒక పరిమితి అంటూ లేకపోతేనే తిప్పలు. రెండువైపులా పదునున్న కత్తిలాంటిదీ స్మార్ట్‌ఫోను. దాంతో పనులూ చేసుకోవచ్చు. కాలక్షేపమూ చేయొచ్చు.దుర్వినియోగమూ చేయొచ్చు. దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామన్న దాన్నిబట్టి ఫోను మన నియంత్రణలో ఉందో లేక మనమే దానికి బానిసలమయ్యామో తెలుస్తుంది. ఫోన్‌ ద్వారా బంధుమిత్రుల యోగక్షేమాలు విచారించవచ్చు. ఉద్యోగ, వ్యాపార పనుల గురించి మాట్లాడొచ్చు. సందేశాలూ మెయిల్సూ పంపొచ్చు. ఇంకా ఎన్నో పనులు చేయొచ్చు. వాటికి ఎంతో సేపు పట్టదు. బ్యాంకు లావాదేవీలూ ఇతరత్రా పనులూ రోజూ ఉండేవి కావు. అయినా ఎక్కువ సమయం ఫోనుతో గడుపుతున్నారంటే, ఫోను లేకపోతే చేతులు విరిచేసినట్లుగా ఇబ్బంది పడిపోతున్నారంటే- ఫోనుతో గడపడమనేది వారికి వ్యసనంగా మారిపోయిందనే అర్థం. కొందరు సామాజిక మాధ్యమాలు ఎక్కువగా చూస్తుంటారు. తమ పోస్టుకి లైకులూ కామెంట్లూ ఎన్నొచ్చాయోనని పదినిమిషాలకోసారి చెక్‌ చేస్తుంటారు. కొందరు ట్విటర్‌ని అనుసరిస్తుంటారు. అనుక్షణం అప్‌డేట్స్‌ కావాలి వారికి. ఇంకొందరు అవసరం ఉన్నా లేకపోయినా వారికి తోచిన విషయం గురించి అంతర్జాలంలో శోధిస్తుంటారు. వీరే కాదు, వీడియోలూ, సినిమాలూ చూసేవారూ; గాసిప్స్‌ చదివేవారూ; ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారూ; గంటల తరబడి గేమ్స్‌ ఆడేవారూ... ఇలా ఎందరో తమను తాము సెల్‌ఫోన్‌తో కట్టేసుకుంటున్నారు. తింటున్నా, రోడ్డుమీద నడుస్తున్నా, వాహనం నడుపుతున్నా, ఆఖరికి నిద్రపోతున్నా చేతిలో సెల్‌ఫోను వదలడం లేదు ఇలాంటివారు.

దాన్ని వ్యసనమని ఎలా అంటారు?
చాలామందికి ఫోన్‌ అబ్సెషన్‌ అంటున్నారు దీనిపై పరిశోధన చేసిన నిపుణులు. అంటే వారి ‘మనసంతా ఫోనే’ ఆక్రమించేసి ఉంటోందట. ఆ దశ కూడా దాటి కొందరు వ్యసనం స్థాయికి చేరుకుంటున్నారన్నది నిపుణులు చెప్తున్న లెక్క. ఇప్పుడిది ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న సమస్య. మన దేశ పరిస్థితి చూస్తే...
* సెమిస్టర్‌ పరీక్షలు పాస్‌ కాకపోవడంతో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని కళాశాలనుంచి పంపించేశారు... రోజూ 14 గంటలు ఫోనుతో గడుపుతూ చదువు వదిలేసిన ఆ అబ్బాయిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాఠాలు వినకుండా ఫోనుతో ఆడుకుంటున్నాడని 16 ఏళ్ల కుర్రాడి ఫోనును స్కూలు యాజమాన్యం తీసుకుంది... ఆ అబ్బాయి మరో ఫోను కొనుక్కోడానికి తండ్రి జేబులో డబ్బు దొంగిలించాడు. దిల్లీలోని ఎయిమ్స్‌కి ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి. పరిస్థితులు చేతులు దాటితే కానీ అవి ఆస్పత్రిదాకా రావన్నది వాస్తవం. హైదరాబాద్‌లోనూ
ఖరీదైన ఫోన్లు కొనుక్కోవడానికే ఎక్కువ మంది విద్యార్థులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.
* 13-24 మధ్య వయసువారిలో గత ఏడాదిలోనే ఫోన్‌ ఎడిక్షన్‌ సమస్య 75 నుంచి 100 శాతం వరకూ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారికి ఎంఆర్‌ఐ, సీఏటీ స్కాన్‌ పరీక్షలు చేసినప్పుడు వాటి ఫలితాలు హెరాయిన్‌, కొకైన్‌ లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారి ఫలితాలను పోలి ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
* రెండేళ్ల క్రితం జరిగిన ఓ అధ్యయనంలోనే స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారిలో 83 శాతం దాన్ని పక్కనే పెట్టుకు పడుకుంటున్నారని తెలిసింది. 57 శాతం ఫోను లేకుండా తాము బతకలేమని చెప్పారట.
* నానాటికీ డేటా చౌకగా లభించడమూ కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ని ముంచెత్తడం వల్ల ఈ సమస్య భవిష్యత్తులో ఎన్నో రెట్లు పెరుగుతుందని క్రిసిల్‌ రీసెర్చ్‌ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
* చాలామంది నవతరం తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించడానికి ఫోనుల్ని వాడుకుంటున్నారన్నది నిపుణుల ఫిర్యాదు. ఫోనులో రైమ్సో, కార్టూన్‌ ఫిల్మో పెట్టి పసిపిల్లలు అది చూస్తుంటే తాము పనులు చేసుకుంటున్నారనీ ఈ అలవాటే పిల్లల్ని ఫోనుకు అలవాటు చేస్తోందనీ పెద్దయ్యాకా అది పోవడం లేదనీ నిపుణులంటున్నారు.

ఇది వ్యసనంగా మారిందని ఎలా తెలుస్తుంది?
* ఫోను లేకుండా క్షణం కూడా ఉండలేను... అంటుంటారా?
* ఫోను వాడే విషయంలో కుటుంబ సభ్యులకూ మీకూ మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయా?
* చదువూ, ఇంటి పనులూ, ఆఫీసు పనులను సమయానికి పూర్తిచేయలేకపోతున్నారా?
* మనసు బాగోనప్పుడల్లా ఫోన్‌ ఆన్‌ చేస్తున్నారా?
* చదువు/ఉద్యోగం తప్ప మరో హాబీ లేదా? మిగిలిన సమయం అంతా ఫోనుతోనేనా?
* పనిలో ఉన్నా సోషల్‌ మీడియా పోస్టులూ లైకులూ కామెంట్ల గురించీ ఆలోచిస్తుంటారా?
* కాసేపు ఫోనుకి దూరంగా ఉండాల్సి వస్తే చిరాకుపడిపోతున్నారా?
* స్నేహితులను కలిసి మాట్లాడడంకన్నా ఫోనుతో గడిపే సమయమే ఎక్కువగా ఉంటోందా?
* భోజనం చేసేటప్పుడూ పడుకున్నప్పుడూ ఫోను పక్కనే పెట్టుకుంటున్నారా?
... పై తొమ్మిది ప్రశ్నల్లో కనీసం ఆరింటికి ‘అవును’ అన్నది సమాధానమైతే ఫోను వాడకం వ్యసనంగా మారినట్లే లెక్క.

ఫోను ఉంది వాడుకోడానికేగా, ఎక్కువసేపు వాడితే నష్టమేముంది?
ఫోను అవసరానికి వాడాలి. అనవసరంగా వాడితే నష్టమే. ఎవరికి వారు తమ ఫోన్లకి అతుక్కునిపోవడం వల్ల ముఖ్యంగా మానవసంబంధాలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. ప్రత్యక్ష స్నేహ సంబంధాల కన్నా వర్చువల్‌ స్నేహాలు ఎక్కువవుతున్నాయనీ, ముఖ పరిచయం లేకుండా దూరంగా ఎక్కడో ఉన్నవారితో చాటింగ్‌ చేసి ఆ స్నేహాలను నమ్మి జీవితాలను పణంగా పెట్టే యువతీయువకులు ఎక్కువవుతున్నారనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికత వాడకం ఎక్కువైన కొద్దీ మనుషులు యంత్రాల్లా మారిపోతున్నారన్నది వాస్తవం. ఏకాగ్రత తగ్గడమూ, మానసిక ఒత్తిడి పెరగడమూ, నిద్రలేమీ, కుంగుబాటూ, ఒంటరితనమూ ఫోను ఎక్కువగా వాడేవారిలో కన్పించే లక్షణాలు. ఒత్తిడితో బాధపడుతున్నవారికి ఉద్యోగ, కుటుంబ జీవితాలను సమన్వయం చేసుకోమని ఒకప్పుడు నిపుణులు సలహాలిచ్చేవారు. ఆ వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ కాస్తా ఇప్పుడు టెక్‌ లైఫ్‌ బ్యాలన్స్‌గా మారింది. ఫోను వాడకం మానసికాందోళనను పెంచుతున్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన ఒక అధ్యయనం తేల్చింది. ఫోను కనపడకుండా ఉంటే ఏదో కోల్పోయినట్లు అన్పించడమూ ఫోను మోగకపోయినా మోగినట్లు అనుభూతి చెంది పదే పదే తీసి చూడడమూ, పలకరిస్తే చికాకు పడడమూ... ఇలాంటివి ఫోను వ్యసనంగా మారుతోందనడానికి నిదర్శనాలు.

ఈ వ్యసనం నుంచి బయటపడడమెలా?
స్మార్ట్‌ఫోను వ్యసనాన్ని వదిలించుకోవాలని గట్టిగా నిర్ణయించుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండగల పట్టుదల ఉంటే వ్యసనాన్ని వదిలించుకోవడం కష్టమేమీ కాదు. అందుకు నిపుణులు చెబుతున్న కొన్ని చిట్కాలు...
* కొంతకాలం స్మార్ట్‌ ఫోను పక్కనపెట్టేసి మామూలు ఫీచర్‌ ఫోను వాడడం. అవసరమైన పనులు చేసుకోడానికి అది సరిపోతుంది. రెండు నెలలు అలా ఉండగలిగితే అప్పుడు స్మార్ట్‌ ఫోనుని కూడా జాగ్రత్తగా వాడడం అలవాటైపోతుంది.
* ఫోనులో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని తీసేయొచ్చు. లేదంటే తక్కువ డేటా వేయించుకుని రోజూ ఒక నిర్ణీత సమయంలో మాత్రమే సామాజిక మాధ్యమాలు చూడాలి. పదినిమిషాలకోసారి ఫోను చూసుకునే అలవాటుంటే గంటకోసారి, తర్వాత రెండు గంటలకూ... వ్యవధిని పెంచుకుంటూ వెళ్లాలి.
* నోటిఫికేషన్లను కస్టమైజ్‌ చేసుకోవాలి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌... ఇలా అన్ని ఆప్‌లనీ సెట్టింగ్స్‌లో మ్యూట్‌ చేసుకుంటే చీటికీ మాటికీ నోటిఫికేషన్‌ శబ్దాలు ఇబ్బందిపెట్టవు. మెసేజ్‌ వచ్చిన విషయం తెలియదు కాబట్టి చూడాలన్న కుతూహలం తగ్గుతుంది.
* కుటుంబంతోనో, స్నేహితులతోనో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ వాడకూడదన్న మర్యాదని పాటించాలి. కన్పించకుండా దూరంగా ఉంచడం ఒక పద్ధతి. విన్పిస్తుంది కాబట్టి ఫోను వచ్చినప్పుడు లేచి వెళ్లవచ్చు.
* అందుబాటులో ఉన్న సోషల్‌మీడియా అన్నిటిలోనూ ఖాతాలు తెరిచి రోజూ అన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఎవరికీ 24 గంటల సమయం సరిపోదు. ఒకటి రెండు వినియోగించుకుంటే చాలు. పదేళ్ల క్రితం అసలు స్మార్ట్‌ ఫోనే లేకుండా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఎందుకు ఉండలేమని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే ఫోనుకు దూరంగా ఉండడం తేలిక.
* కొంతమంది టైమ్‌ చూసుకోడానికి ఫోన్‌ ఆన్‌ చేస్తారు. ఆన్‌ చేశాక ఇక ఏదో ఒక ఆప్‌ ఓపెన్‌ చేసి మెల్లగా దానిలో లీనమైపోతారు. వాచీ పెట్టుకుంటే ఆ అలవాటు మానవచ్చు.
* రోజూ రాత్రిళ్లు కచ్చితంగా ఫోను స్విచాఫ్‌ చేస్తే మధ్యలో మెలకువ వచ్చినప్పుడు చెక్‌ చేసుకునే అలవాటు తగ్గుతుంది.

అయినా నియంత్రించుకోలేకపోతే..?
స్వయంగా పరిమితులు పెట్టుకుని దానికి తగ్గట్టుగా నడచుకోలేని వారికోసం కొన్ని ఆప్‌లు కూడా ఉన్నాయి. రెస్క్యూటైమ్‌, ఆప్‌ డిటాక్స్‌, ఫారెస్ట్‌, స్టెప్‌లాక్‌, డిన్నర్‌మోడ్‌, ఆన్‌వర్డ్‌ లాంటివి కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేస్తూ ఫోనులోని ఇతర ఆప్స్‌ని ఉపయోగించకుండా కట్టడి చేస్తాయి. ఎప్పటికప్పుడు ఎంతసేపు ఫోనుతో గడిపిందీ తెలుపుతూ నిర్ణీత సమయం గడవగానే ఫోను ఆఫ్‌ చేసేస్తాయి. ప్లేస్టోర్‌లో, ఐఓఎస్‌లోనూ ఈ ఆప్‌లు అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో ఇప్పటికే ఈ సమస్యనుంచి బయటపడడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. ఒక్క ఫోనే కాదు, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌...ఏదో ఒక తెర మీద ఏదో ఒక పనిచేస్తూ రోజుల్ని క్షణాల్లా గడిపేసే అలవాటున్నవారిని ఆ తెరనుంచి దూరంగా ఉంచడానికి ‘డిజిటల్‌ డీటాక్స్‌’ విధానాన్ని అనుసరించమంటున్నారు నిపుణులు. కొన్ని రోజులు సెలవుపెట్టి దూరంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించడం, సాహసక్రీడలనో కళలనో నేర్చుకోవడం... చేస్తున్నారు. డిజిటల్‌ డీటాక్స్‌ టూర్స్‌ పేరుతో ప్రత్యేక పర్యటనలూ నిర్వహిస్తున్నారు. ఏదైనా దీర్ఘకాలిక మానసిక సమస్య ఉన్నవారు కూడా ఫోనుకి బానిసైపోతారు. అలాంటి వారు నిపుణులను
సంప్రదించి అసలు సమస్యకి చికిత్స పొందితే వ్యసనాన్నీ వదిలించుకోవచ్చు.

* * *

రాత్రి భోజనాలయ్యాక ఒక టీచర్‌ విద్యార్థుల హోమ్‌వర్క్‌ పేపర్లను దిద్దుతోంది. పిల్లలు పడుకున్నారు. భర్త స్మార్ట్‌ఫోన్‌లో ‘క్యాండీ క్రష్‌ సాగా’ ఆటలో లీనమయ్యాడు.
చివరి పేపర్‌ దిద్దుతున్న ఆ టీచర్‌ కళ్ళనిండా నీళ్ళు, ఆగని వెక్కిళ్ళు. ఆ శబ్దానికి గేమ్‌ ఆడుతున్న ఆమె భర్త ‘‘ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్‌...’’ టెన్షన్‌గా అడిగాడు.
‘‘నిన్న సెకండ్‌క్లాస్‌ పిల్లలకి ‘మీరు ఏం కావాలనుకుంటున్నారు’ అనే అంశంపైన వ్యాసం రాయమని  హోమ్‌వర్క్‌ ఇచ్చాను. ఇదిగో, ఈ వ్యాసం చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నావల్ల కావడంలేదు.’’
‘‘అంత ఏడిపించేది ఏముంది అందులో?’’ అడిగాడు భర్త ఆసక్తిగా.
‘‘వినండి చదువుతాను...
‘అమ్మానాన్నలు స్మార్ట్‌ఫోన్‌ను చాలా ప్రేమిస్తారు. దాన్ని ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా  చూసుకుంటారు. నాకన్నా ఫోనే వాళ్లకి ఎక్కువ ఇష్టం. నాన్న ఆఫీసు నుంచి అలసి వచ్చినా ఫోన్‌తోనే రిలాక్స్‌ అవుతాడు. ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా ఫోన్‌ మోగితే వెంటనే తీసి మాట్లాడతారు.
అదే నేను పిలిస్తే పనిలో ఉన్నాం అవతలికి పొమ్మని విసుక్కుంటారు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు. అదే నాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ వస్తే వెంటనే తీసి మాట్లాడతారు. నాతోకన్నా ఫోన్‌తో ఆడుకోవడానికీ ఫోన్లో మాట్లాడటానికే ఎక్కువ ఇష్టపడతారు. దాన్ని చూస్తూ నవ్వుకుంటుంటారు. పడుకున్నప్పుడూ పక్కనే ఉంచుకుంటారు. పొద్దున్న లేవగానే దాన్నే ముందు చూస్తారు.
అందుకే... నేను అమ్మానాన్నా చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకుంటున్నాను.’’
‘‘ఎవరు రాశారది?’’ అడిగాడు భార్యని, గొంతు గద్గదమవుతుండగా.
‘‘మన అబ్బాయే’’ చెప్పింది భార్య కన్నీళ్ళతో.

వాళ్లు వాడడం లేదు!

కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లూ రకరకాల సామాజిక మాధ్యమాలనూ తయారుచేసి మార్కెట్లోకి వదులుతున్న సాంకేతిక నిపుణులు వాటిని వాడరన్న సంగతి తెలుసా? సిలికాన్‌ వ్యాలీలో పనిచేసేవారు చాలామంది ఇంటికొచ్చాక ఫోన్లు ముట్టుకోరు. జస్టిన్‌ రోజెన్‌స్టీన్‌... ఫేస్‌బుక్‌లో ‘లైక్‌’ బటన్‌ సృష్టికర్త. తాను ఐఫోన్‌ కొనుక్కోగానే స్నేహితుడికిచ్చి అందులో పిల్లల ఫోనుల్లో పెట్టే పేరెంటల్‌ కంట్రోల్‌ ఫీచర్‌ పెట్టివ్వమన్నాడట. అది ఉంటే ఆప్‌లేవీ డౌన్‌లోడ్‌ అవవు. తానే పెట్టుకుంటే ఎపుడైనా తీసేయొచ్చు. స్నేహితుడిని అడగడానికి మొహమాటం అడ్డొస్తుంది కాబట్టి అలా చేశాడు. ల్యాప్‌టాప్‌లో సైతం సోషల్‌ మీడియా సైట్లు రాకుండా బ్లాక్‌ చేశాడు. అతడో ఉదాహరణ మాత్రమే. పలువురు సీఈవోలూ ఉన్నతోద్యోగులూ ఇళ్లకు వెళ్లాక ఫోన్లు వాడరు. పిల్లలకూ వాటిని అందుబాటులో ఉంచరు!

ఫోను పక్కన పెడితే డిస్కౌంట్‌!  

తినే తిండిమీదా పక్కనున్న మనుషుల మీదా ధ్యాసపెట్టకుండా ఫోను చూసుకుంటూ కూర్చునే అలవాటు తగ్గించడానికి రెస్టరెంట్లూ రంగంలోకి దిగుతున్నాయి. లెబనాన్‌లోని ఓ రెస్టరెంట్‌ ఫోను తమ కౌంటర్‌లో పెట్టేసి భోజనం చేసేవారికి బిల్లులో పదిశాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. చాలా హోటళ్లు తినే సమయంలో ఫోన్‌ వాడకూడదనీ, లేదా వైబ్రేషన్‌ మోడ్‌లోనే పెట్టుకోవాలని నోటీసులు పెడుతున్నాయి. భోజనాన్నీ, పక్కనున్నవారి సాహచర్యాన్నీ ఆస్వాదించకుండా యాంత్రికంగా తినివెళ్లడం మాకు నచ్చడం లేదు అందుకే ఈ ఏర్పాటు- అంటున్నాయి జపాన్‌లోని కొన్ని రెస్టరెంట్లు. ఫోన్‌ స్టాక్‌ అనే గేమ్‌నీ చాలా రెస్టరెంట్లలో వాడుతున్నారు. భోజనానికి ముందు అందరి ఫోన్లూ ఓచోట పెట్టేస్తారు. బిల్లు చెల్లింపులు అయ్యేవరకూ ఎవరూ ఫోను తీయకూడదు. భోజనం పూర్తయినా బిల్లు చెల్లించకముందే ఫోను చూసే హడావుడిగాళ్లకి ఓ శిక్ష ఉంటుంది. అదేంటంటే స్నేహితులందరి బిల్లూ వాళ్లే చెల్లించాలి. బ్రియాన్‌ పెరెజ్‌ రూపొందించిన ఈ ఆట కొద్దికాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. కుటుంబంతోనో, స్నేహితులతోనో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేయడానికి హోటళ్లకెళతాం. కానీ చేతిలో ఫోను ఉంటే దాన్ని చూడకుండా ఉండలేం. అందుకే ఈ ఆట... అంటాడు పెరెజ్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.