close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పచ్చబంగారాన్ని పండించేద్దాం..!

పచ్చబంగారాన్ని పండించేద్దాం..!

ఫెంగ్‌షుయ్‌లో భాగంగా ఇంట్లో చిన్న కుండీల్లో నీళ్లు పోసి వెదురు మొక్కల్ని పెంచడం తెలిసిందే. కానీ ఇంటి చుట్టూ వెదురు మొక్కల్ని పెంచడం గురించి విన్నారా? ఎందుకంటే వాటితో ఆదాయాన్నీ పొందొచ్చు మరి. అదెలానో తెలుసుకోవాలంటే మహారాష్ట్రలో కొంకణ్‌ తీరంలోని సింధుదుర్గ్‌ జిల్లాలో పర్యటించాల్సిందే.
ఏఊళ్లోనయినా పెరట్లో మామిడి, కొబ్బరి, పనస, జామ, నిమ్మ, నారింజ... వంటి చెట్లే కనిపిస్తాయి. కానీ మహారాష్ట్రలోని కొంకణ్‌ తీరంలో మాత్రం వీటితోబాటు వక్క, జీడిమామిడి వంటి చెట్లనీ పెంచుతారు. ఆ ప్రాంతంలోని సింధుదుర్గ్‌ జిల్లాలోని పింగులీ, కోల్‌గావ్‌, హిర్లాక్‌, రంబంబులి, కొనాల్‌ గ్రామాలకు వెళ్తే వాటన్నింటితోబాటు పచ్చగా పొడవుగా ఎత్తుగా పెరిగిన వెదురు మొక్కలూ స్వాగతిస్తాయి. నిన్నమొన్నటివరకూ ఆల్ఫాన్సో మామిడిపండ్ల చెట్లకీ చేపల చెరువులకీ పేరొందిన ఆ ప్రాంతం, క్రమంగా రూపు మార్చుకుంటూ, ఆకుపచ్చని వెదురు అందాలతో కళకళలాడుతోంది. ముఖ్యంగా కంకావలీ, కుదాల్‌, సావంత్‌వాడి, వెంగుర్లా, దోడామార్గ్‌ తాలూకాల్లోని పంటనేలలు సైతం వెదురు మొక్కలతో వ్యవసాయ పరిశోధకుల్నీ పర్యటకుల్నీ ఆకర్షిస్తున్నాయి.

వెదురే ఎందుకు?
మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ ప్రాంతంలో ఏటా 2,000 నుంచి 4,000 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. దాంతో అక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో ఇప్పటికీ వరే ప్రధాన ఆహార పంట. దీంతోపాటు ఇటీవల వెదురునూ బాగా పెంచుతున్నారు. అందులోనూ మాంగా వెదురు రకాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. ఎందుకంటే దీన్ని అక్కడ అనేక అవసరాలకోసం వాడుతుంటారు. పొడవుగా 15 మీటర్ల ఎత్తు పెరిగే ఈ వెదురుతో రకరకాల ఫర్నిచర్‌తోబాటు అద్భుతమైన హస్తకళాకృతుల్నీ తయారుచేస్తుంటారు. ఈ మొక్కల్ని నాటిన ఐదేళ్లకు పంటకొచ్చి ఏటా కనీసం పన్నెండు కర్రల్ని ఇస్తాయి. దీంతోబాటు భీమ, బర్మా, జెయింట్‌ బర్మా, పసుపు రకం వెదురు మొక్కల్ని కూడా అక్కడ విరివిగా పెంచుతున్నారు. విశేషమేంటంటే ఈ ప్రాంతానికి చెందిన రైతులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులూ వెదురును పండిస్తుంటారు. సునీల్‌ సావంత్‌ అనే రైల్వే ఉద్యోగి, తన 20 ఎకరాల పొలంలో వెదురునే పండిస్తున్నాడట. వెదురును పెంచడంవల్ల ఆయనకు ఏటా వచ్చే ఆదాయం రూ.పదిహేను లక్షలకు పైనే. ఏటికేడూ పెరుగుతుందే తప్ప తగ్గదు.

సాధారణంగా వెదురు మొక్కను నాటాక, సుమారు ఇరవయ్యేళ్ల వరకూ జీవిస్తుంది. మిగిలిన పంటల్లో మాదిరిగా వెదురు పంటకి నీరు మరీ ఎక్కువ అవసరం లేదు. పైగా ఎలాంటి దుర్భిక్ష పరిస్థితుల్ని అయినా తట్టుకోగలదు. క్రిమికీటకాల బెడద అంతగా ఉండదు. అయితే కొత్త పిలకలు వచ్చి, అవి పెరిగే దశలో అడవిదున్నలూ అడవిపందులూ కోతులూ రాకుండా ఓ మూడు నెలలపాటు కాపలా అవసరం. అచ్చంగా వెదురే కాకుండా ఇతర పంటల మధ్యలోనూ వీటిని వేసి ఆదాయాన్ని పొందుతున్నారు కొందరు రైతులు. ఫలితంగా వెదురువల్లే ఆ ఒక్క జిల్లా ఏటా సుమారు50 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. పెట్టుబడి-లాభం చూసుకుంటే మిగిలిన తోటల పెంపకంకన్నా వెదురువల్ల వచ్చే లాభమే ఎక్కువ. దాంతో పదిహేనేళ్ల క్రితం ఒక ఎకరంలో వెదురు పండించిన వాళ్లంతా ప్రస్తుతం పదీ, ఇరవై ఎకరాల్లో వెదురును పండిస్తున్నారు. వెదురు నర్సరీల విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తోంది.

గడ్డిజాతే!
వెదురు ఓ గడ్డి జాతి మొక్కే అయినప్పటికీ మన అటవీ శాఖ దాన్ని ఓ చెట్టుగా గుర్తించడంతో ఇంతకాలం దాన్ని పండించేందుకు ప్రైవేటు వ్యక్తులెవరూ పెద్దగా ప్రయత్నించలేదు. మూడేళ్ల క్రితం వెదురును పెంచే రైతులు దాన్ని విక్రయించుకోవడం మీద మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల్నిసడలించడంతో అనేకమంది దీని పెంపకం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. పైగా వెదురు ను కర్రలు కోసమేకాదు, పిలకల(బాంబూషూట్స్‌) కోసమూ పెంచుతారు. ఎందుకంటే వీటిని ఆసియా దేశాల్లో వంటల్లో వాడుతుంటారు. వీటిని కొద్ది పరిమాణంలో తిన్నా కడుపు నిండినట్లు ఉంటుంది. పైగా క్యాలరీలు కూడా తక్కువ. దాంతో బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇవి మంచిదని చెబుతారు. వెదురు పిలకల్లో ఖనిజాలూ ఇతరత్రా పోషకాలూ అధికంగా ఉండటంతో అవి రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. జీర్ణాశయ సమస్యలతో బాధపడేవాళ్లకి వెదురు ఆకుల టీ మంచిదట. ఈ ఆకులు మధుమేహాన్నీ నియంత్రణలో ఉంచుతాయి. సో, వాణిజ్యపరంగానే కాదు, ఆరోగ్యపరంగానూ వెదురు పంట మంచిదే. అందుకే మనదగ్గర కనీసం బీడు నేలల్లోనైనా వెదురును పండిస్తే, ఆపై తినడం కూడా అలవాటు చేసుకుంటే అటు ఆదాయం... ఇటు ఆరోగ్యం... ఏమంటారు?!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.