close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గూగుల్‌ సెర్చ్‌ చేసింది..!

గూగుల్‌ సెర్చ్‌ చేసింది..!

అంతరిక్షం నుంచి ఆవకాయ వరకూ మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో అందిస్తుంది గూగుల్‌. అలాంటి సంస్థ భారత్‌లోని ఒక స్టార్టప్‌ కోసం సెర్చ్‌ చేసింది, అదికూడా ఒక పక్కాలోకల్‌ ఆప్‌ కోసం. అంతేనా మూతపడే స్థితిలో ఉన్న ఆ కంపెనీకి కోట్ల రూపాయల పెట్టుబడిని అందించి, లాభాల బాట పట్టించింది. మనదేశంలోని ఒక స్థానిక వ్యాపారానికి గూగుల్‌ అందించిన మొట్టమొదటి పెట్టుబడి ఇదే కావడం విశేషం.
హైపర్‌ లోకల్‌ (స్థానిక) వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపవు. ఒక ప్రాంతానికే పరిమితమయ్యే ఇలాంటి వ్యాపారాల్లో అభివృద్ధి ఉండదన్న భావనే ఇందుకు కారణం. కానీ లోకల్‌ వ్యాపారాన్నే నమ్ముకున్న కబీర్‌ బిశ్వాస్‌, అంకుర్‌ అగర్వాల్‌, దల్వీర్‌ సూరి, ముకుంద్‌ ఝా బెంగళూరులో ఒక స్టార్టప్‌ని ప్రారంభించారు. నగరంలో ఒక చోటు నుంచి మరో చోటుకి డ్రాప్‌ చేయడానికీ, అమ్మకాలూ కొనుగోళ్లూ జరపడానికీ, హోమ్‌ సర్వీసులు అందించడానికీ డూన్జో పేరుతో 2015లో ఒక ఆప్‌ని రూపొందించారు. అతి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టిన డూన్జో ఆప్‌ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. అయితే దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలంటే మరింత పెట్టుబడి అవసరం. లోకల్‌ వ్యాపారం కావడంతో ఫండింగ్‌ కంపెనీలు ఏవీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆర్డర్లు వస్తున్నా తగినంత డబ్బు లేకపోవడంతో కంపెనీని మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది.

భవిష్యత్తు ప్రశ్నార్థకం!
2015లో ప్రారంభమైన డూన్జోని సమర్థంగా నిర్వహించడానికి తగినంత పెట్టుబడి లేకపోవడంతో 2017 ప్రారంభం నాటికే ఆశలు వదిలేసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. కుప్పలు తెప్పలుగా వస్తున్న ఆర్డర్లను తీసుకునేందుకు కావల్సిన మెకానిజం, ఉద్యోగులూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం వ్యవస్థాపకులకు తలకు మించిన భారమైపోయింది. నిధులుంటే కంపెనీ పరిస్థితి మారిపోతుందని అందులో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ తెలుసు. కానీ కనుచూపు మేరలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు రోజురోజుకీ ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో డూన్జో వ్యవస్థాపకులు కంపెనీని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు నిధుల సమీకరణ చేపట్టారు. అదికూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అస్సాడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, బ్లూమ్‌ వెంచర్స్‌ రెండు దఫాలుగా 15 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాయి. కానీ అవి ఏమూలకీ సరిపోలేదు.

డూన్జో కోసం...
డూన్జో ఆప్‌ ద్వారా వస్తున్న ఆర్డర్లను పూర్తిచేయాలంటే ప్రతి నెలా 90 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుంది. దీన్ని ఎలా సమకూర్చాలో వ్యవస్థాపకులకు అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం శూన్యం. ఆప్‌ బాగుంది, ఇప్పటివరకూ చేసిన వ్యాపారం, వస్తున్న ఆర్డర్లూ అన్నీ బాగున్నాయి, కానీ లోకల్‌ వ్యాపారానికి భవిష్యత్తు ఉండదన్న ఒకే ఒక్క కారణంతో పెట్టుబడి పెట్టేందుకు అన్ని కంపెనీలూ వెనకడుగు వేశాయి. అదే సమయంలో గూగుల్‌ స్థానిక వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఒక స్టార్టప్‌ కోసం వేట మొదలుపెట్టింది. చాలాకాలంగా తన వ్యాపారానికి అనుకూలంగా ఉండే భారతీయ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాలని ఎదురుచూస్తున్న గూగుల్‌ను డూన్జో ఆప్‌ బాగా ఆకర్షించింది. తన ఆలోచనలకు అనుగుణంగా కనిపించడంతో గూగుల్‌ ఇందులో భాగస్వామిగా చేరిపోయింది. సెర్చింజిన్‌లో పూర్తిస్థాయిలో స్థానిక దుకాణాలూ, ముఖ్యప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని గూగుల్‌  ప్రయత్నిస్తోంది. సరిగ్గా  డూన్జో స్టార్టప్‌ కూడా ఇలాంటి ఆలోచనతోనే వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ అంశమే గూగుల్‌ని ఆకట్టుకుంది. దీంతో డూన్జో ఆప్‌కి 80 కోట్ల రూపాయిల పెట్టుబడిని అందించింది గూగుల్‌. మంచి సంస్థ నుంచి భారీస్థాయిలో పెట్టుబడి అందడంతో ఈ లోకల్‌ కంపెనీ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

విజయం ఇలా...
డూన్జో ఆప్‌ ప్రస్తుతం బెంగళూరు వాసులకు తమ ఇంటి వస్తువుగా మారిపోయింది. దీని ద్వారా నగరంలో దాదాపు ఎనభై శాతం పికప్‌లూ, డ్రాపింగులూ, అమ్మకాలూ, కొనుగోళ్లూ జరుగుతున్నాయి. వ్యాపారానికి కావలసిన ఆర్థిక సాయం లభించడంతో ఆప్‌ పరిధిని మరింత పెంచే పనిలో నిమగ్నమయ్యారు వ్యవస్థాపకులు. దీంతో బెంగళూరులో పౌరులకు నమ్మినబంటుగా డూన్జో ఆప్‌ మారిపోయింది. ఈ ఆప్‌ చేతిలో ఉంటే చాలు తమకి ఏ పనైనా సాధ్యమే అనుకున్నంతగా వినియోగదారులను ఆకర్షించింది డూన్జో.

దీని ద్వారా జరిగే వ్యాపారంలో డెబ్భై శాతం రవాణా ద్వారా, మిగిలిన ముప్ఫై శాతం అమ్మకాలూ, కొనుగోళ్లూ, హోమ్‌ సర్వీసుల ద్వారా జరుగుతోంది. ఇప్పటి వరకూ డూన్జో ఆప్‌ ద్వారా వచ్చిన ఆర్డర్లలో ఒక్కటి కూడా విఫలం కాలేదంటూ, భవిష్యత్తులోనూ ఈ సూత్రాన్నే కొనసాగిస్తామని చెబుతున్నారు ఈ స్టార్టప్‌ వ్యవస్థాపకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.