close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిజమో కాదో చెప్పేస్తారు!

నిజమో కాదో చెప్పేస్తారు!

పాకిస్థాన్‌లో హిందువులపైన దాడి, బంగ్లాదేశ్‌లో భారతీయ నకిలీ కరెన్సీ ముద్రణ, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆకుపచ్చ చొక్కా ధరించిన కేరళ ముస్లిం పోలీసులు... ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఇలాంటి వార్తలూ, ఫొటోలూ నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. వాటిని అనాలోచితంగా షేర్‌ చేసేవాళ్లూ ఎక్కువే. అలాంటి వార్తల్లోని నిజానిజాల్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు సైబర్‌ సైనికులు.
ముంబయి కేంద్రంగా పనిచేసే smhoaxslayer.com ని స్థాపించింది కంప్యూటర్‌ ఇంజినీర్‌ పంకజ్‌ జైన్‌. ఇతడి వాట్సాప్‌ నంబరుకి తరచూ స్నేహితుల నుంచి కొన్ని ‘ఫార్వర్డ్‌’ వార్తలు వచ్చేవి. వాటిలో కొన్ని అవాస్తవమని సులభంగానే అర్థమయ్యేది అతడికి. ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా ‘జన గణ మన...’ ఇలాంటి వార్తల్ని అతడి వాట్సాప్‌ గ్రూప్‌లో చాలామంది నిజమని నమ్మేవారు. ఆ అంశమే తనను వార్తల్లో వాస్తవాల్ని నిర్ధారించే పనిలోకి దింపిందనీ చెబుతారు పంకజ్‌. ‘కొన్ని సెకన్లపాటు ఆలోచిస్తే ఏ వార్తలోనైనా నిజం ఎంతో తెలుస్తుంది. మేమైతే వార్తల నిజ నిర్ధారణ కోసం గూగుల్‌లో రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేసి ఆ ఫొటోలు గతంలో ఎప్పుడు వార్తల్లోకి వచ్చాయో చూస్తాం. అలాగే కొన్ని కీ వర్డ్స్‌తో గూగుల్‌ని జల్లెడ పడతాం’ అంటారు పంకజ్‌.

భాషను బట్టి చెప్పొచ్చు
సోషల్‌ మీడియా వినియోగంతోపాటే వాటిలో అవాస్తవమైన ఫొటోలూ, వార్తలూ, వీడియోలు విస్తృతంగా పెరగడాన్ని గమనించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రతీక్‌ సిన్హా ఆ పరిస్థితిలో మార్పు తేవాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి altnews.in ను ప్రారంభించాడు. ‘2016-17 బడ్జెట్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఫ్లడ్‌లైట్లు పెట్టినట్టు ఓ నివేదికలో ఫొటో పెట్టారు. చూడ్డానికి అది మనదిలా అనిపించలేదు. నెట్‌లో వెతికి అది స్పెయిన్‌-మొరాకో సరిహద్దు ఫొటో అని తేల్చాం సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల్లోని భాష విద్వేషం సృష్టించేదిగా ఉంటుంది. అలా కూడా గమనించవచ్చు’ అని చెబుతారు ప్రతీక్‌.

పోలీసుల సాయంతో
పాత్రికేయులైన గోవిందరాజ్‌, జెన్సీ జాకబ్‌... ప్రారంభించిన వెబ్‌సైట్‌ boomlive.com సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న, విద్వేషాలు రేపేలా ఉన్న తాజా వీడియోలపైన దృష్టిపెట్టి వాటిలోని నిజానిజాల్ని వెలికితీసి తమ వెబ్‌సైట్లో పెడతారు. ప్లాస్టిక్‌ క్యాబేజీ, ప్లాస్టిక్‌ బియ్యం గురించి వార్తలు వచ్చినపుడు అవి అవాస్తవమని ప్రయోగపూర్వకంగా చూపించారు. ఫలానా ప్రాంతంలో జరిగిందని వార్త వచ్చినపుడు ఆ ప్రాంత పోలీసుల్ని సంప్రదించి వాస్తవాల్ని తెలుసుకుంటారు. ఇటీవల  గురుగ్రామ్‌లో స్కూల్‌ బస్సుపైన దాడి సంఘటనలో ముస్లిం యువకుల్ని అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయమై స్థానిక పోలీసుల్ని సంప్రదించి అందులో నిజంలేదని తేల్చారు.

సామాన్యుడి కోసం
బాగా ఏడుస్తున్న ఓ వ్యక్తి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో కనిపించింది ఓలియత్‌కి. ఆ వ్యక్తి కుమార్తె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందనీ చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడనీ ఆ వీడియో ద్వారా ప్రచారం చేశారు. దాంతో చాలామంది ఆయనకి ఫోన్‌ చేసి డబ్బు సాయం చేస్తామనేవారు. నిజానికి ఆ వ్యక్తి కుమార్తె అప్పటికే చనిపోయింది. ఆ పాత వీడియో కారణంగా ఆ తర్వాత కూడా కుమార్తె గురించి అందరూ గుర్తుచేస్తుండటంతో అతడు మానసిక క్షోభను అనుభవించాల్సి వచ్చేది. ఇలా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లు చాలామంది ఉంటారు. ‘అలాంటివారిని చూశాకే ఏది నిజమో, ఏది కాదో తెలిపే వెబ్‌సైట్‌  check4spam.com పెట్టాను’ అంటారు ఓలియత్‌. ఏదైనా వార్తని షేర్‌ చేసేముందు గూగుల్‌లో ఒకసారి సెర్చ్‌చేసి నిర్ధారించుకోవాలంటారు ఓలియత్‌.

ఫేకోపీడియా
ముంబయిలో భారీ తుపాను వస్తుందంటూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో తప్పుడు వార్తలు, జీఎస్టీలాంటి ప్రభుత్వ చట్టాల్లో లేని విషయాల్ని చేర్చి గాలి వార్తలు ప్రచారం చేయడం... ఇలాంటి అసత్య వార్తలకి ఒక పరిష్కారం చూపాలనుకున్నాడు హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అశ్విన్‌ దీనికోసమే fakopedia.com ను ప్రారంభించాడు. రాజకీయ నాయకులూ, సెలెబ్రిటీలకు చెందిన వార్తల్ని కాకుండా సామాన్యులకు సంబంధించిన అంశాలనే ఎంచుకుని వాటిలోని నిజాల్ని చెబుతారు.
దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి వీటిపైన అవగాహన కల్పిస్తున్నారు కూడా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.