close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాయల నగరిలో రంగుల కేళి

రాయల నగరిలో రంగుల కేళి

అద్భుత శిల్పాలు..
అపురూప ఆలయాలు..
రతనాలు అమ్మిన అంగళ్లు..
విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి సౌందర్యమిది.
రాయల వైభవాన్ని తుంగ భద్రంగా తనలో దాచుకుంది.
అందుకే.. ఇప్పటికీ అక్కడి శిలలన్నీ శిల్పాలతో కళకళలాడుతున్నాయి.
శిథిలావస్థకు చేరినా.. ఆలయ గోపురాలు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి.
ఏడాది పొడుగునా ఠీవిగా కనిపించే హంపి.. హోలీనాడు కొత్తగా పలకరిస్తుంది.
కొంటెగా పులకరిస్తుంది.
ఆనాడు అక్కడి రాళ్లు, రప్పలు, వీధులు అన్నీ రంగుల మయమవుతాయి! మనుషులంతా రంగుల్లో కలిసి పోతారు. ఆకాశమే హద్దుగా ఆటలాడుకుంటారు. ఆ సంబరంలో పాల్గొనాలని ఉందా..? అయితే చలో హంపి!

రాయలవారి హంపి చుట్టేయాలంటే ఒక్కరోజులో సాధ్యం కాదు. పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మిక సౌరభాలతో వెలుగొందుతున్న ఈ రాచనగరి అందాలు ఆస్వాదించాలంటే రెండు రోజులు అక్కడ ఉండాల్సిందే!

హోలీ బృందావనంలో ఆనందాన్ని పంచుతుంది. ముంబయిలో ఆశ్చర్యపోయేలా అలరిస్తుంది. దక్షిణాదిలోనూ రంగుల పండగ ఉల్లాసంగా జరుగుతుంది. అయితే ఉత్తరాదితో పోల్చుకుంటే తక్కువే! హంపి విషయంలో ఈ సూత్రీకరణ వర్తించదు. హోలీ కోసం హంపీకి ఎక్కడెక్కడి నుంచో ఔత్సాహికులు తరలివస్తారు. వీరిలో ఇరుగు పొరుగు రాష్ట్రాల వారుంటారు. ఉత్తరాది వారూ ఉంటారు. విదేశీయులైతే తప్పనిసరి. ఎవరొచ్చినా.. ఇక్కడి వారితో ఇట్టే కలిసిపోతారు. రంగులు పూస్తారు. రాగాలు తీస్తారు. హోలీ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహిస్తారు.
రంగులే రంగులు
హోలీకి ఒకట్రెండు రోజుల ముందే విదేశీ పర్యాటకులు గోకర్ణం, గోవాకు చేరుకుంటారు. పండగ సమయానికి బైకులేసుకొని రయ్‌మంటూ హంపికి వచ్చేస్తారు. పండగ పూట ఆనందం అంతా ఇంతా ఉండదు. నిమిషాల వ్యవధిలో హంపి కళ మారిపోతుంది. హంగామా మొదలవుతుంది. విరూపాక్షస్వామి రాజగోపురం వీధంతా వర్ణ రంజితం అవుతుంది. స్థానికులు, దేశీయ పర్యాటకులు సైతం ఆటపాటల్లో పాలుపంచుకుంటారు. ఎవరైనా ఎదుటపడితే చాలు.. రంగుపడుద్దంతే! ఎవరో తెలియకున్నా రంగులు చల్లడంలో తేడాలుండవ్‌! ఎవరు ఎవరో గుర్తుపట్టలేనంతగా రంగులు గుప్పేసుకుంటారు. ఫారిన్‌ నుంచి వచ్చిన అమ్మాయి.. పూలమ్ముకుంటున్న పెద్దమ్మపై రంగులు కుమ్మరిస్తుంది. అద్దంలోకి చూస్తూ బుర్రమీసాలు దువ్వుకుంటున్న అప్పన్న సంగతి బ్రిటన్‌ నుంచి వచ్చిన కుర్రాడు చూసుకుంటాడు. ఆటలు, పాటలు వీధి వీధంతా హోరు. వీరి చేష్టలతో హంపి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. అంటే రాయల కాలం దాటి యుగాలు వెనక్కి వెళ్లి ఒకప్పటి కిష్కిందపురంలా మారిపోతుందన్నమాట.

హిప్పీ హ్యాపీ

విదేశీయుల రాకతో సందడిగా సాగిపోయే రంగుల ఆట మధ్యాహ్నానికి పూర్తవుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి తుంగభద్ర నదికి వెళ్తారు. రంగులు పోయేదాకా ఈదులాడి.. బసకు చేరుకొని సేదతీరుతారు. ఎండ చల్లబడ్డాక నగర విహారానికి బయల్దేరుతారు. తుంగభద్ర ఆవలి ఒడ్డున హిప్పీ ఐలాండ్‌ ఉంటుంది. హంపి సంప్రదాయాలకు పట్టుగొమ్మ అయితే.. హిప్పీ ఐలాండ్‌ వినోదాలకు, విలాసాలకు అడ్డా. చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో వెదురు కాటేజీలు.. దాబాలు.. హిప్పీ దుస్తులు, అలంకరణ సామగ్రి అమ్మే దుకాణాలు, విదేశీ వాయిద్యాలు అమ్మే కొట్లు, స్థానిక, విదేశీ రుచులు చూపించే ఆహార కేంద్రాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. హంపికి వెళ్లే విదేశీయులు ఉదయం అంతా ఆలయాలు, గోపురాలు చుట్టినా.. సాయంత్రం అయ్యేసరికి హిప్పీ ఐలాండ్‌లో హ్యాపీగా కాలం గడిపేస్తారు. రంగుల పండగ ఇచ్చిన ఆనందాన్ని మూటగట్టుకొని తిరుగు ప్రయాణం అవుతారు.

బసకు భరోసా..

హంపిలో విడిదికి ఢోకాలేదు. హంపి ప్రధాన వీధుల్లోని దాదాపు అన్ని ఇళ్లు అతిథులకు ఆహ్వానం పలుకుతాయి. రూ.500 నుంచి రూ.1,000 లోపు అద్దె చెల్లిస్తే చాలు వసతి దొరుకుతుంది. విశేషమైన విడిది కావాలనుకుంటే రెస్టారెంట్లు, లాడ్జ్‌ల తలుపు తట్టాలి. హిప్పీ ఐలాండ్‌లో కాటేజీలు బుక్‌ చేసుకోవచ్చు. అద్దె రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. భోజనం గురించి బెంగ అవసరం లేదు. స్థానిక రుచులతో పాటు దేశీ, విదేశీ వంటకాలు అందించే హోటళ్లు ఉన్నాయి.

పహాడ్‌ రాగాలు

హంపీలోని విజయ విఠల ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయంలోని రాతి స్తంభాలు సరిగమలు పలుకుతాయి. ఇసుక, ఇతరలోహాలతో తీర్చిదిద్దిన 56 స్తంభాలను తాకితే చాలు.. సప్తస్వరాలు వీనులవిందు చేస్తాయి. వీటిని సరిగమ స్తంభాలు అని పిలుస్తారు. ఒకప్పుడు ఆలయాన్ని సందర్శించిన వారు స్తంభాలను మీటుతూ సరిగమలు వినేవారు. ఆలయ సంరక్షణలో భాగంగా ఈ స్తంభాలను పరీక్షించడం నిషేధించారు.

చారిత్రక ఘనత