close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మా వెంకన్న పెళ్లికొడుకాయనే..!

మా వెంకన్న పెళ్లికొడుకాయనే..!

కలియుగ దైవం మొదటిపాదం మోపిన ప్రాంతంగా, గరుడాద్రి పర్వతంమీద స్వయంభూ క్షేత్రమై విరాజిల్లుతున్న ప్రదేశంగా విశాఖజిల్లాలోని ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. మోకాళ్ల పర్వతాన్ని తలపించే ఇక్కడి గరుడాద్రి శిఖరం, స్వామికి నిర్వహించే నిత్యకైంకర్యాలూ తిరుమలను జ్ఞప్తికి తెస్తాయి. ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారంగా పేరుగాంచిన ఆపద మొక్కులవాడి కల్యాణ వేడుకలకు ఫిబ్రవరి 24వ తేదీన నాంది పలకనున్నారు.
ఉపమాక అంటే ఉపమానం లేనిదని అర్థం. ఈ కొండపై వెలిసిన స్వామివారి విగ్రహం ఆయుధాలతో గుర్రంపై కూర్చుని, ఉత్తర దిక్కుగా చూస్తున్నట్లు ఉంటుంది. ఆలయాన్ని కూడా ఇదే విధంగా నిర్మించారు. దీంతో భక్తులకు ఏడాది పొడవునా ఉత్తర ద్వార దర్శనమే లభిస్తుంది. ఇలా నిత్యం ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి, స్వామిని దర్శించుకునే పుణ్యక్షేత్రం దేశంలో మరెక్కడా లేదని ఆలయ పండితులు చెబుతున్నారు.

ఇదీ కథ...
ద్వాపరయుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణభగవానుడిని ఎల్లప్పుడూ తనవీపుమీదనే ఉండేవిధంగా వరాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. ఇందుకు సమ్మతించిన శ్రీకృష్ణుడు కలియుగంలో దక్షిణ సముద్ర తీరంలో గరుడుడు పర్వత రూపంలో ఉండగా, వేటకు వచ్చిన తాను అదే కొండపై స్థిరపడతానని అభయమిచ్చినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. కలియుగంలో వెంకటేశ్వరస్వామి మొదట ఇక్కడే వెలిశాడంటారు. అయితే స్వామి భారాన్ని మోయలేని గరుడాద్రి కుంగిపోతుండగా వెంకన్న తన రెండో పాదాన్ని ఏడుకొండలపై మోపి అక్కడే వెలిసి, రాత్రిళ్లు మాత్రం ఇక్కడ పవళిస్తారనీ. అందుకే కొండపై ఉన్న ఈ ఆలయాన్ని పగటిపూట మాత్రమే తెరచి ఉంచుతారనీ చెబుతారు.

వెంకటేశ్వర స్వామికి ఏటా కల్యాణంజరిపించేందుకు ఉత్సవ మూర్తులనూ,ఆలయాన్ని సంరక్షించేందుకు వేణుగోపాలస్వామినీ కొండ దిగువన ప్రతిష్ఠించిన నారదమహర్షి ఇక్కడి ఉపాలయాలనూ తానే స్వయంగా నిర్మించాడని ప్రతీతి. ఇదే సమయంలో బ్రహ్మ, కశ్యపుడు వంటివారు కలిసి ఇక్కడ చేసిన తపస్సు ఫలితంగా ఒక తటాకం వెలసిందనీ, తర్వాతి కాలంలో అదే బంధుర సరస్సుగా ప్రసిద్ధి చెందిందనీ పురాణ కథనం. ఇందులో స్నానమాచరిస్తే సకల పాపాలూ తొలగుతాయని భక్తుల నమ్మకం. తర్వాతి కాలంలో పిఠాపురం సంస్థానాన్ని పాలించిన కృష్ణభూపాలుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు.

ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశినాడు స్వామివారికి వార్షిక కల్యాణోత్సవాలను (ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి అలంకరించే పురాతన కాలంనాటి వజ్రాభరణాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కల్యాణం జరిగిన తర్వాత సదశ్యం, తోట ఉత్సవం, చక్రస్నానం లాంటి క్రతువులను మరో మూడురోజులపాటు నిర్వహిస్తారు. నిజానికి ఈ రోజుతోనే ప్రధాన వేడుకలు ముగిసినా తర్వాతి మూడురోజులూ పుష్పయాగోత్సవాలు చేపడతారు. ఇవేకాకుండా ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస వేడుకలు, శ్రీరాముడి అధ్యయనోత్సవాలు విశేషంగా జరుపుతారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామివారికి ఒకేసారి ఎనిమిది వాహనాలతో తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ఇరవై రోజుల తీర్థం
కల్యాణ వేడుకలతోపాటు మిగిలిన కార్యక్రమాలనూ తిలకించడానికి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ అయిదు రోజుల్లోనే దాదాపు మూడు లక్షలమంది స్వామిని దర్శించుకుంటారని అంచనా. అయితే ఇక్కడో విశేషం కూడా ఉంది. స్వామివారి కల్యాణ వేడుకలు ముగిసిన తర్వాతి రోజు నుంచీ సుమారు ఇరవై రోజులపాటు ఉపమాకలో తీర్థం జరుగుతుంది. పూర్వం ఇక్కడికి వచ్చే భక్తులు రోజులతరబడి ఇక్కడే ఉండి కల్యాణోత్సవాలను మొత్తం తిలకించి తర్వాత స్వస్థలాలకు చేరుకునేవారు. ఈ సమయంలో వారు వంటచేసుకోవడానికి కావల్సిన బియ్యం, మసాలా దినుసులు తదితర వస్తువులను తీసుకొచ్చి విక్రయించేవారు ఇక్కడి వ్యాపారులు. తర్వాతి రోజుల్లో ఇది సుగంధ ద్రవ్యాలు అమ్మే తీర్థంగా మారిపోయింది. ప్రత్యేకంగా వీటిని కొనుగోలు చేయడానికి వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. స్వామి సన్నిధిలో కొనుగోలు చేసుకున్న దినుసుల్ని ఇంట్లో వినియోగించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఇలా వెళ్లొచ్చు
ఉపమాక క్షేత్రం విశాఖపట్టణానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, విశాఖ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మండల కేంద్రం నక్కపల్లిలో దిగివెళ్లాలి. ఇక రైలు మార్గం విషయానికి వస్తే విశాఖ నుంచి వచ్చేవారు నర్సీపట్నం రోడ్డు, విజయవాడ నుంచి వచ్చేవారు తుని రైల్వే స్టేషన్లలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంద్వారా ప్రయాణించి వెంకన్నను దర్శించుకోవచ్చు!

- బి.వి.వి.సత్యనారాయణ, న్యూస్‌టుడే, నక్కపల్లి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.