close
4డీ సినిమా చూద్దామా!

4డీ సినిమా చూద్దామా!

త్రీడీ సినిమా చూస్తున్నాం... కాబట్టి అది అనుభవంలోకి వచ్చింది. మరి 4డీ అంటే... అదెలా ఉంటుంది... ఒక్క 4డీ అనేముంది, ఈమధ్య 5డి, 7డి, 10డి, 12డి... ఇలా చాలా పేర్లే వినిపిస్తున్నాయి. అసలీ ‘డీ’ల ప్రత్యేకత ఏమిటో ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే రండి..!
అరచేతిలో ప్రపంచంగా పిలుచుకునే సెల్‌ఫోను ఎన్ని రకాల వినోదాల్ని పంచినా సినిమా తెర ముందు అన్నీ బలాదూరే. అందుకే అది రోజురోజుకీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుని, ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పిస్తోంది.మూకీ వెళ్లి టాకీ, తరవాత ఈస్ట్‌మన్‌ కలరూ సినిమా స్కోపులూ వచ్చాయి. ప్రస్తుతం ఐమ్యాక్స్‌లూ బిగ్‌స్క్రీన్‌ల హవా నడుస్తోంది. సాధారణ తెరలతో పోలిస్తే ఐమ్యాక్స్‌లో తెర పరిమాణం పెరగడంతోబాటు బొమ్మ స్పష్టంగా పెద్దగా కనిపిస్తుంది. ఇటీవల తాజా సినిమాలన్నీ 2డీ, 3డీ రెండు వెర్షన్లలోనూ విడుదలవుతున్నా ఇంకా 2డీ హవా నడుస్తూనే ఉంది. నిజానికి ‘మై డియర్‌ కుట్టిచేతన్‌’తో 1984లోనే త్రీడీ పరిచయమైంది. కానీ సినిమా మొత్తాన్నీ నేరుగా త్రీడీలోనే నిర్మించడం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, చాలామంది నిర్మాతలు సినిమా పూర్తయ్యాకనే త్రీడీ ఎఫెక్ట్స్‌ జోడించి రెండు వెర్షన్లలోనూ విడుదల చేస్తున్నారు. క్రమంగా జనం కూడా త్రీడీ సినిమా వైపే మొగ్గు చూపడంతో థియేటర్లు కూడా క్రమంగా త్రీడీ హంగుల్ని సంతరించుకుంటున్నాయి.

అసలీ త్రీడీ… అంటే...
డి- అంటే డైమెన్షన్‌(తలం) అన్నది తెలిసిందే. ఉదాహరణకు సినిమా తెరనే తీసుకుందాం. దానిమీద మనం సినిమా చూస్తుంటాం. అది మన కళ్లముందు జరుగుతున్నట్లే ఉంటుంది. అంటే ఆ తెరలోంచి దృశ్యం మన ముందుకొచ్చిన అనుభూతిని కలిగించేదే త్రీడీ. దీన్నే థర్డ్‌ డైమెన్షన్‌గా పిలుస్తారు. అలాగని ఆ తెరలోంచి ఆ దృశ్యం నిజంగానే బయటకు వచ్చిందా... అంటే రాలేదు. అది ఒక భ్రమ మాత్రమే. దీనికి కారణం స్టీరియోస్కోపిక్‌ ఫొటోగ్రఫీ. ప్రత్యేకమైన కెమెరాల ద్వారా బొమ్మని రెండు రకాలుగా చిత్రీకస్తారన్నమాట. దాంతో డెప్త్‌ ఏర్పడి, ఆ బొమ్మ మూడో తలం కూడా కనిపిస్తుంది. ఈ రెండు బొమ్మల్నీ కలిపి ఒకటే బొమ్మలా కనిపించేలా చేసేందుకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసినవే త్రీడీ గ్లాసెస్‌. దీనివల్ల ఆ సినిమాలోని దృశ్యాలన్నీ కళ్ల ముందే జరుగుతున్న ఫీల్‌ కలుగుతుంది. చాలా సినిమాల్లో ఇలాంటి త్రీడీ ఎఫెక్ట్స్‌ జోడించడం సర్వసాధారణంగా మారింది. తాజాగా విడుదలైన పద్మావత్‌ కూడా అలాంటిదే.

మరి 4డీ అంటే...
త్రీడీలో దృశ్యం ముందుకు వచ్చిన అనుభూతి మాత్రమే కలుగుతుంది. అంటే కళ్లకీ చెవులకీ మాత్రమే పని. కానీ 4డీలో పంచేంద్రియాలూ అనుభూతి చెందుతాయి. అంటే వర్షాన్నీ మంచునీ ఉష్ణోగ్రతనీ గాలినీ వాసననీ అన్నింటినీ ఫీల్‌ అవుతామన్నమాట. ఈ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలంటే 4డీఎక్స్‌ థియేటర్లకు వెళ్లాల్సిందే. థియేటర్లను కూడా ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో డిజైన్‌ చేయడం ద్వారా సినిమాలో కనిపించేవన్నీ అనుభవంలోకి తీసుకొచ్చేదే 4డి. మరింత శాస్త్రీయంగా చెప్పాలంటే తెరమీద దృశ్యం లేదా సన్నివేశంలోని ఎఫెక్ట్స్‌ని ప్రేక్షకుడికి అనుభవంలోకి తీసుకువచ్చేదాన్నే ఫోర్త్‌ డైమెన్షన్‌గా చెబుతున్నారు.

ఎలా ఉంటుంది 4డి?
సినిమాలో మారే వాతావరణాన్ని అంటే గాలి, ఉష్ణోగ్రత, వర్షం, చలి, వాసన, శబ్దం... వంటి వాటిని స్వయంగా అనుభూతి చెందేలా చేస్తుంది. అంటే ప్రేక్షకులు కూడా సినిమాలో భాగంగా మారిపోతారు. ఉదాహరణకు సినిమాలో వర్షం పడుతుంటే, ఆ వాన తమ తలమీద పడుతున్నట్లు ప్రేక్షకులు ఫీలవుతారు. మెరుపు మెరిస్తే, ఆ మెరుపు థియేటర్‌ లోపలే వచ్చినట్లు కనిపిస్తుంది. ఓ సీన్‌లో గాలి బలంగా వీస్తుంటే అది థియేటరులో ఉన్నవాళ్లనీ తాకుతుంది. అలాగే వాసన కూడా. హీరోయిన్‌ పూలతోటలో విహరిస్తుంటే ఆ గుబాళింపు ప్రేక్షుకుల ముక్కుపుటాల్నీ సోకుతుంది. తెరమీద మంచు కురుస్తుంటే ఆ చలి వీక్షకుల్నీ తాకుతుంది. ఇంకా దృశ్యాన్ని బట్టి సీట్లు కూడా కాస్త ముందుకీ వెనక్కీ వెళుతుంటాయి. అంటే సినిమాలో కార్లు దూసుకుపోతుంటే కుర్చీలో కూర్చున్నవాళ్లూ వాటి వెనకే దూసుకెళ్తున్నట్లు ఫీలవుతారు. అలాగే ఆ కారు సడన్‌ బ్రేక్‌ పడి, కుదుపుకి లోనయితే అదీ అనుభవంలోకి వస్తుంది. అయితే ఈ రకమైన అనుభూతిని కలిగించడం అనేది ఎంతో ఖరీదైన ప్రక్రియ. థియేటర్లనూ అందులో సీట్లనూ కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేయాల్సిందే. ఇందులో భాగంగానే మనదేశంలోని అదిపెద్ద థియేటర్‌ కంపెనీలన్నీ 4డి సాంకేతిక పరిజ్ఞానంలో తనదైన ముద్ర వేసిన సియోల్‌కి చెందిన సిజె4డి ప్లెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. గతేడాది చివరి నాటికి సిజె4డి ప్లెక్స్‌ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 57 దేశాల్లో 57 వేల సీట్లను 4డిఎక్స్‌ కోసం రూపొందించిందంటే ఈ కంపెనీ ఏ స్థాయిలో 4డి పరిజ్ఞానాన్ని విక్రయిస్తుందో అర్థమవుతోంది.

ఇప్పటికే హైదరాబాదులోని ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌...వంటి వాటిల్లో సుమారు 10 నిమిషాల నిడివిలో 4డిఎఫ్‌ఎక్స్‌ వర్చువల్‌ రియాలిటీ షోల ద్వారా 4డీ అనేది చాలామందికి అనుభవంలోకి వచ్చిందనే చెప్పాలి. హాలీవుడ్‌లో అయితే 2009 నుంచి 480 హాలీవుడ్‌ సినిమాలు 4డిఎక్స్‌ ద్వారా విడుదలయ్యాయనేది ఓ అంచనా. సుమారు పదేళ్ల కిందట వచ్చిన ‘జర్నీ టు ద సెంటర్‌ ఆఫ్‌ ద ఎర్త్‌’, ‘అవతార్‌’... వంటి సినిమాలు కొన్ని ప్రాంతాల్లో 4డి ఎఫెక్ట్స్‌ ఉన్న థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. అయితే థియేటర్లలోని ప్రత్యేక హంగులూ, ఆయా సినిమాల్లోని ఎఫెక్ట్స్‌ని అనుభూతిలోకి తీసుకువచ్చే సంఖ్యను బట్టి 5, 6, 7... 15డి...ఇలా డిల సంఖ్య కూడా పెరుగుతోందన్నమాట. సో... ఇప్పటికే దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌... వంటి మెట్రో నగరాల్లో కొన్ని థియేటర్లూ అమ్యూజ్‌మెంట్‌ పార్కులూ ఈ 4డి ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. సో... ఎంజాయ్‌..!!!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.