close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనోహరం... మానస సరోవరం...

మనోహరం... మానస సరోవరం...

‘ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ...’ అంటూ కళ్లు మూసుకుని శివ ధ్యానం చేస్తే మనోఫలకంమీద  నిత్యం చూసే శివరూపం సాక్షాత్కరమవుతుంది. కానీ ఆ శివ సాన్నిధ్యంలో తాదాత్మ్యం చెందాలంటే మాత్రం ఆయన కొలువైన ఆ కైలాసాన్నీ, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూసి రావాల్సిందే’ అంటున్నారు ఇటీవలే కైలాస మానస సరోవర యాత్ర చేసి వచ్చిన హైదరాబాద్‌ వాసి ఎస్‌. గీతాంజలి.
మంచుకొండల్లోని మానససరోవరాన్నీ కైలాస పర్వతాన్నీ కళ్లారా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ భోళాశంకరుడి అనుగ్రహం ఇన్నాళ్లకు లభించినట్లుంది. మిత్రులంతా కలిసి ఈ యాత్రకు వెళుతున్నారని తెలుసుకుని నేనూ మా అమ్మాయితో బయలుదేరాను. అక్కడికి వెళ్లేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌ కోసం రెండు నెలల ముందు నుంచే వాకింగ్‌, యోగా, ప్రాణాయామం చేశాం. యాత్రకు అవసరమైన మందులూ, థెర్మల్‌ దుస్తులూ, నూలుదుస్తులూ, షూ, గ్లోవ్స్‌... అన్నీ సిద్ధం చేసుకున్నాం.
ఎందుకంటే మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి. టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ విపరీతంగా ఉంటాయి. కాబట్టి పగలు తేలికైన నూలు దుస్తులూ రాత్రివేళలో ధరించడానికి ఉన్ని దుస్తులూ కావాలి. ముఖ్యంగా పరిక్రమణ చేయాలనుకునేవాళ్లు సన్‌స్క్రీన్‌తోబాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. హైదరాబాద్‌ నుంచి లఖ్‌నవూకి విమానంలో వెళ్లాం. అక్కడికి చేరేటప్పటికి నేపాల్‌ ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు మమ్మల్ని ఆహ్వానించి నేపాల్‌ గంజ్‌కు తీసుకువెళ్లడానికి కార్లతో సిద్ధంగా ఉన్నారు. నాలుగు గంటల రోడ్డు ప్రయాణం అనంతరం నేపాల్‌ గంజ్‌ చేరుకున్నాం. టూర్‌ నిర్వాహకులు అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్‌ గది ఇచ్చారు. భోజనం చేసి సాయంత్రం నేపాల్‌ గంజ్‌లో శక్తిపీఠంగా పిలవబడే భాగేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాం. అక్కడ సాయంత్రం ధూపదీపాలూ, ఘంటానాదాలూ, భజనలతో సాగే హారతి కార్యక్రమాలను చూసి ఆనందించాం. నేపాల్‌ యాత్రా నిర్వాహకులు ఎంతో ప్రణాళికతో ఉన్నా ప్రకృతి సహకరించకపోవడంవల్ల సెమికోట్‌కి వెళ్లలేకపోయాం.

దేవలోకం!
ఆ మర్నాడు వాతావరణం అనుకూలించడంతో సెమికోట్‌కు చార్టర్డ్‌ విమానంలో బయలుదేరాం. కొండల మధ్యలో నుంచి మేఘాలను తాకుతూ ప్రయాణించడాన్ని ఆనందించేలోగానే మళ్లీ వాతావరణం బాగోలేదని ఓ కొండ ప్రాంతంలో విమానాన్ని ఆపేశారు. దాంతో అందరం కిందకిదిగి కెమెరాలకు పనిచెప్పాం. చుట్టూ ఉన్న మంచుకొండల్ని ఫొటోల్లో బంధించాం. దాదాపు అరగంట తరవాత తిరిగి సెమికోట్‌కు బయలుదేరాం. సెమికోట్‌ సముద్ర మట్టానికి 2910 మీ. ఎత్తున ఉన్న ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఇళ్లన్నీ కొండలమీదే ఉంటాయి. అదేరోజు హెలీప్యాడ్‌లో హిల్‌సా గ్రామానికి బయలుదేరాం.

హిల్‌సా సముద్ర మట్టానికి 3640 మీ. ఎత్తులో నేపాల్‌కీ టిబెట్‌కీ సరిహద్దులో ఉంది. చుట్టూ కొండలూ వాటిమధ్యలోంచి పారే సెలయేర్లూ... ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా అనిపించింది. పైలట్‌ చాలా జాగ్రత్తగా విమానాన్ని నడుపుతున్నాడు. ఆ అరగంట ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించింది. హిల్‌సాలో దిగగానే మాకోసం వేడి వేడి భోజనం తయారుచేశారు. అప్పటికే మా అందరికీ ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ కారణంగా తలనొప్పి మొదలైంది. అది తగ్గాలంటే డయామాక్స్‌ మాత్రలు వేసుకోవాలని చెప్పారు. దాంతో హిల్‌సా నుంచి తిరుగు ప్రయాణం వరకూ రోజూ ఉదయంపూట మాకు ఆ ట్యాబ్లెట్లే శివప్రసాదం.

హిల్‌సా ప్రాంతం అంతటా సౌరశక్తినే వాడుతున్నారు. రాత్రి పది గంటలకు చీకటి పడింది. కాస్త వెలుతురు కూడా లేదు. చుట్టూ ఆ కొండల మధ్యలో, చందమామా నక్షత్రాల వెలుగులో ఆ రాత్రి మరో లోకంలో ఉన్నట్లే అనిపించింది. నిజంగా ఇది దేవలోకమేమో అనిపించిందో క్షణం.

మానస సరోవరం!
మర్నాడు ఉదయం హిల్‌సా నుంచి సరిహద్దు దాటి చైనాలో ప్రవేశించడానికి మా యాత్రా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈ యాత్రకు పాస్‌పోర్టు తప్పనిసరి. ప్రభుత్వంతోబాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి కాబట్టి, మన పాస్‌పోర్టును వాళ్లకు పంపిస్తే, వాళ్లే చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అదే గతంలో అయితే ప్రభుత్వం మాత్రమే కైలాసమానస సరోవర యాత్రను నిర్వహించేది. కానీ ఇటీవల అనేక ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని నిర్వహిస్తున్నాయి. చైనా ఇమిగ్రేషన్‌ చాలా స్ట్రిక్టు. అవన్నీ పూర్తిచేసుకుని, నాలుగు చెక్‌పాయింట్లు దాటి తకలా కోట్‌లోని హోటల్‌కి చేరేటప్పటికి సమయం ఆరు గంటలు దాటింది. ఈ తకలా కోట్‌ సముద్ర మట్టానికి 4025 మీ. పైన ఉంది. అక్కడ అందరం మన రూపాయల్ని చైనా యెన్‌ల్లోకి మార్చుకున్నాం. ఎప్పుడెప్పుడు మానస సరోవరాన్ని చూద్దామా అన్న ఆలోచనతోనే తెల్లవారిపోయింది. మళ్లీ ఓ చెక్‌ పాయింట్‌ దాటి ఉదయం 11 గంటలకు మానస సరోవరానికి బయలుదేరాం. ముందుగా రాక్షస స్థల్‌ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు సృష్టించుకున్న ఓ పెద్ద సరోవరం అని చెబుతారు.

ఇక్కడకు చేరడంతోనే మంచు వర్షం కురవడం మొదలైంది. ఈ సరోవరంలో ఎవరూ స్నానం చేయరు. ఇది ఉప్పునీటి కొలను. ఇది మానస సరోవరానికి పడమర దిక్కుగానూ కైలాసానికి దక్షిణంగానూ ఉంటుంది. రావణాసురుడు ఇక్కడే తన పది శిరస్సుల్లో రోజుకో తలను ఖండిస్తూ శివదర్శనం కోసం తపస్సు చేశాడనీ, పదోరోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడనీ చెబుతారు.

అక్కడి నుంచి మానస సరోవరం 23కి.మీ. దూరంలో ఉంది. దాన్ని చూడగానే ఓ అద్భుతంలా తోచింది. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉందా సరస్సు. సుమారు 88 కి.మీ. చుట్టుకొలత ఉన్న ఆ సరస్సు చుట్టూ బస్సులోనే ప్రదక్షిణ చేశాం. అక్కడ మాకు స్నానాలు చేసేందుకు కూడా వీలుగా ఓ చిన్న టెంటు వేశారు నిర్వాహకులు. సరోవరంలో నీరు చాలా చల్లగా తేటగా మెరుస్తున్నాయి. అందరం గబగబా మూడు మునకలు వేసి బయటకు వచ్చాం. అందులో స్నానం చేయడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది. ఒడ్డు దగ్గరే దీపాలు వెలిగించాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పూజ చేసుకున్నారు. కొందరు యాగాలూ హోమాలూ కూడా చేశారు. మాకు దాని సమీపంలోనే సుమారు 20 అడుగుల దూరంలోనే టెంటులు వేసి వసతి ఏర్పాట్లు చేశారు.

దేవతలే దిగి వస్తే...
రాత్రివేళలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ సరోవరానికి దేవతలూ గంధర్వులూ యక్షులూ స్నానాలు చేయడానికి వస్తారనీ వీళ్లు నక్షత్ర కాంతి మాదిరిగా గోచరిస్తారనీ పురాణాల్లో వింటుంటాం. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు గానీ, మాకెందుకో రాత్రి 2.45 నిమిషాలకు ఆకస్మికంగా
మెలకువ వచ్చింది. బయటకు వెళ్లి చూసేసరికి ఓ అద్భుతం మా కళ్లముందు నిలిచింది. సరోవరానికి అవతలి వైపునా సరోవరం మధ్యలోనూ ఆకాశంలోంచి సరోవరంలోకి దిగుతున్నట్లు నక్షత్ర కాంతులు కనిపించాయి. వాటిని చూడ్డానికి రెండుకళ్లూ చాల్లేదు. రెప్ప వేయకుండా మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డ కట్టించే చలిలో దాదాపు 45 నిమిషాలపాటు ఆ కాంతుల్ని చూస్తూనే ఉన్నాం. మా జన్మ ధన్యమైనట్లుగా భావించాం.