close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దిక్సూచి

దిక్సూచి
- శ్రీమతి రాఘవ టి.

రాత్రి పదకొండు గంటలు కావస్తోంది. హాల్లో కూర్చుని కొడుకు రవి కోసం ఎదురుచూస్తోంది వసుధ. భర్త రామారావు ఊళ్ళో లేడు. కాసేపటికి ఇన్నోవాలోంచి దిగి, ఫ్రెండ్స్‌కి ‘బై’ చెప్తూ కొద్దిగా తూలుతూ ఇంట్లోకి వస్తున్న రవి- తల్లిని చూసి తడబడ్డాడు. తల దించుకుని తన రూమ్‌లోకి వెళ్ళబోయాడు.

ఫ్రెండ్‌ కారులోంచి దిగిన కొడుకు వాలకం చూసి తాగొచ్చాడని అర్థం అయింది వసుధకి. కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో ‘‘ఆగు’’ అని ఉరిమింది.

తల్లికేసి ఓసారి చూసి పట్టనట్టుగా సోఫాలో కూర్చుని బూట్లు విప్పుకున్నాడు రవి.

‘‘ఇంత రాత్రి వరకూ ఈ తిరుగుళ్ళేంటి, ఎక్కడికెళ్ళావ్‌?’’ కోపాన్ని అణచుకోవడం కష్టంగా ఉంది వసుధకి.

‘‘పార్టీకి!’’ బూట్లని పక్కకి తోసేసి నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు రవి.

‘‘తాగొచ్చావా?’’ కొడుకు గడ్డం పట్టుకుని తలెత్తి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వసుధ.

నెమ్మదిగా లేచి తూలిపడిపోకుండా సోఫాని ఆనుకుని నిలబడి, ‘‘ఫ్రెండ్‌...బర్త్‌డే...పార్టీ...’’ నాలుక తడబడుతుంటే, ఒక్కో అక్షరం వత్తి పలికాడు. మరుక్షణం చెళ్ళుమన్న శబ్దానికి అత్తామామలు కామేశ్వరీ, ప్రసాదంగారూ ఉలిక్కిపడి లేచి కంగారుగా హాల్లోకి వచ్చారు.

ఆ చెంపా ఈ చెంపా ఫట్‌ఫట్‌ మంటూ కొడుతున్న కోడలి చెయ్యి గట్టిగా పట్టుకుంది కామేశ్వరి. రవిని సోఫాలో కూర్చోబెట్టి పక్కనే తనూ కూలబడ్డారు ప్రసాదంగారు.

‘‘వీడు... పదహారేళ్ళ కుర్ర వెధవ! తాగటం మొదలుపెట్టాడు’’ వసుధ ఆవేశంతో రగిలిపోతోంది. శరీరం వణుకుతోంది. మత్తుగా తూలుతున్న మనవడికేసి చూశారు ప్రసాదంగారు.

మళ్ళీ ఎత్తబోయిన వసుధ చేతిని గట్టిగా పట్టుకుంది కామేశ్వరి.

‘‘అర్ధరాత్రి గొడవ వద్దు వసుధా... రేపు పొద్దున్న మాట్లాడుకుందాం’’ అని కోడలిని వారించి, మనవడిని తీసుకెళ్ళి పడుకోబెట్టి, తమ రూములోకి వెళ్ళారు ప్రసాదంగారు.

‘‘తొందరపడ్డావు వసుధా, పదహారేళ్ళ కొడుకుని స్నేహితుడిలా చూడాలి’’ అంటూ భర్తననుసరించింది కామేశ్వరి.

చేష్టలుడిగి సోఫాలో కూలబడింది వసుధ. జరిగిన సంఘటనని ఆమె మనసు జీర్ణించుకోలేకపోతోంది. చిన్నప్పటి నుంచీ శ్రద్ధగా చదువుతూ, బోలెడు ప్రైజులతోపాటు ఆరో క్లాసులో డబుల్‌ ప్రమోషన్‌ తెచ్చుకున్న రవి... టెన్త్‌లో డిస్ట్రిక్ట్‌కే టాపర్‌గా నిలిచి, తోటి పిల్లలకి ఆదర్శంగా నిలిచి తమకి పుత్రోత్సాహాన్ని కలిగించిన సుపుత్రుడు... ‘కొడుకంటే రవిలా ఉండాలని మెచ్చుకుంటూ, అతడిని చూసి నేర్చుకోమనీ’ అతని క్లాస్‌మేట్స్‌కి వాళ్ళ తల్లిదండ్రులు పబ్లిక్‌గా బోధించటం తనకి తెలుసు.

అలాంటి వాడిలో రెండేళ్ళ కాలేజీ జీవితం ఇంత మార్పు తెచ్చిందా? ...లేక ప్రపంచంతోబాటు తాము అడ్వాన్స్‌ అవలేకపోతున్నారా? తను ఉద్యోగరీత్యా ఆఫీసు పనిమీద తప్పనిసరై ఆర్నెల్లు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో అత్తగారూ మామగారూ ఉన్నారన్న ధైర్యంతో వెళ్ళింది. తరచూ క్యాంపుల్లో తిరిగే తండ్రి ఎప్పుడూ పట్టించుకోడు. అమ్మ కంట్రోల్‌ కూడా లేకపోయేసరికి రవికి స్వేచ్ఛా, గ్రాండ్‌ పేరెంట్స్‌ గారాబం ఎక్కువై ఉంటాయి. కాలేజీ జీవితంలో ఆకర్షణలు జీవితాన్ని రంగుల్లో చూపించాయి. ఆ రంగుల్లో దాక్కున్న విషం... ముసలాళ్ళని మాయచేసి డబ్బులు నొక్కేసి సరదాలు తీర్చుకునేలా రవిని ప్రేరేపించి ఉంటాయి. ఆలోచనలతో మెదడు వేడెక్కి ఆ రాత్రి నిద్ర దూరమైంది ఆమెకి.

రోజూలాగానే తెల్లారింది. వసుధకి లోలోన ఆందోళనతో కూడిన కోపం చల్లారడం లేదు. మొహం కడుక్కుని వచ్చిన కొడుకుని పిలిచి నిలదీసింది ‘‘ఎందుకు తాగావు?’’ అంటూ.

క్రితంరోజు రాత్రి తల్లి కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చి రోషంతో భగ్గుమన్నాడు రవి. చెంపల్ని చేత్తో రాసుకుంటూ ‘‘నేను అమ్మ చెయ్యి పట్టుకు నడిచే చిన్నపిల్లాడినో, పాలుతాగే పసివాడినో కాదు... టీనేజీలో ఉన్నా... ఇంటర్‌ చదువుతున్నా. పరీక్షలయిపోయాయి... పార్టీ అంటే వెళ్ళాను. అక్కడ నలుగురితో కలిసి తాగకపోతే అవమానం కాదా? నాకూ కొన్ని సరదాలు ఉంటాయి... ఫ్రెండ్స్‌ మధ్య చులకన అయిపోకుండా కొంత లెవెలూ మెయింటెయిన్‌ చేయాలని ఉంటుంది. నా క్లాస్‌మేట్స్‌ అందరూ స్కూల్‌లోనే డ్రింక్స్‌ స్టార్ట్‌ చేశారు. గర్ల్‌ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారు వాళ్ళకి. నా ఫ్రెండ్స్‌ అందరూ గర్ల్‌ఫ్రెండ్‌ లేని ఆడంగివాడని వెక్కిరిస్తున్నారు నన్ను. కూల్‌డ్రింక్‌ తాగుతానంటే ‘అదిమాత్రం ఎందుకు... ఇంటికెళ్ళి పాలు తాగు, పసిపాపవి కదా’ అని వెక్కిరిస్తున్నారు. ఆ ఎగతాళి భరిస్తూ నలుగురిలో అవమానాలపాలు కావటం నావల్ల కాదు’’ ఆవేశంగా అరిచాడు.

‘‘ఎవడో ఏదో వాగుతాడని...’’ మరోసారి కొడుకు చెంప ఛెళ్ళుమనిపించింది వసుధ.

పట్టలేని ఉక్రోషంతో లేచి పక్కనే స్టాండ్‌ మీద ఉన్న బొమ్మని నేలకేసి విసిరికొట్టాడు రవి. ముక్కలైన ఆ బొమ్మని చూపిస్తూ... ‘‘సాటివాళ్ళ ముందు తలెత్తుకు తిరగలేక... నా బతుకూ ఇలాగే ముక్కలయితే మీ కళ్ళు చల్లబడతాయా?’’ కోపంగా ఊగిపోతూ... రక్తనాళాలు తెగేలా పెద్దగా అరిచాడు. ‘‘కాలేజీ స్టూడెంట్‌ని, ఏదో కొంచెం తాగితే ఏదో మర్డరే చేసేసినట్టు ఈ గొడవలూ శిక్షలూ ఏవిటి... నాకు ఆమాత్రం స్వేచ్ఛ లేదా, ఏంటీ రూల్సు? నానమ్మావాళ్ళ ముందు నన్ను కొట్టి అవమానిస్తావా? ఇలా తన్నులు తింటూ పడి ఉండాల్సిన ఖర్మలేదు నాకు. ఇంత అవమానం జరిగాక అసలు నాకీ బతుకే అక్కర్లేదు. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే నీకు తృప్తిగా ఉంటుంది. నేను లేకపోతే నా విలువ తెలిసివస్తుంది. అవును... నన్ను కొట్టినందుకు నీకదే సరైన శిక్ష. ‘పార్టీకెళ్ళినందుకు కొడుకుని కొట్టి పొట్టన పెట్టుకున్న తల్లి’ అని అందరూ నిన్ను
అసహ్యించుకుంటారు.’’ ఉద్రేకంతో శివమెత్తినట్టు ఊగిపోతూ... అరుస్తూ... వీధి తలుపు తెరిచి లిఫ్ట్‌ వైపు పరిగెత్తబోయాడు రవి.

రెప్పపాటు వ్యవధిలో జరగబోతున్న ప్రమాదాన్ని గ్రహించిన ప్రసాదంగారు లేని శక్తి తెచ్చుకుని ఒక్క ఉదుటున లేచి రవి నడుంచుట్టూ ఉడుం పట్టుపట్టి కామేశ్వరి సాయంతో బలవంతాన ఆ కుర్రాడిని ఈడ్చుకుంటూ ఇంట్లోకి లాక్కువచ్చి సోఫాలో కూలేసి, ఇద్దరూ మనవడికి చెరోవైపు కూర్చున్నారు.
కాసేపటికి ఆవేశాల ఉధృతం తగ్గింది. మృదువుగా మనవడి వీపు నిమురుతూ పక్కనే కూర్చున్నారు ప్రసాదంగారు. కామేశ్వరి వెన్న తెచ్చి రవి బుగ్గలమీద రాసింది. కాసేపటికి తాతగారి ఒళ్ళో వాలిపోయాడు రవి.

ఆ తరవాత నాయనమ్మతో తాతగారితో ముభావంగా మాట్లాడాడు. తల్లిని అసలు పట్టించుకోలేదు. ఎప్పుడు ఆవేశం హద్దులుదాటి ఏ అఘాయిత్యం చేస్తాడో అనే భయంతో ఒక్క క్షణం కూడా రవిని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఆఖరికి నిద్ర కూడా వంతులవారీగా పోతూ మనవడిని కంటికిరెప్పలా కాచుకుంటూ అంటిపెట్టుకుని గడిపారు పెద్దవాళ్ళిద్దరూ.

అలా నాలుగు రోజులు గడిచాయి. వసుధ కొడుకు నిరసన తట్టుకోలేకపోతోంది.

‘‘నీతో మాట్లాడాలి’’ అని కొడుకుకి చెప్పింది. రవి విననట్లుగా ఊరుకున్నాడు.

నాలుగు రోజులు అలా అడిగాక... ఓరోజున తల్లి దగ్గరికి వచ్చి ‘‘ఏంటో చెప్పు’’ అన్నాడు అనాసక్తంగానే.

‘‘ఇక్కడ కాదు’’ అంటూ కొడుకుని తమ రూమ్‌లోకి తీసుకెళ్ళింది వసుధ.

మళ్ళీ తల్లీకొడుకులు ఏం గొడవపడతారో అన్న ఆందోళనతో ఆ రూమ్‌లోకి వచ్చారు ప్రసాదంగారూ, కామేశ్వరీ.

అందరూ కూర్చున్నాక లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి బటన్స్‌ నొక్కింది వసుధ.

‘‘ఏంటీ గోల’’ అన్నట్టు విసుగ్గా చూశాడు రవి.

‘‘నీ చిన్నతనానికి సంబంధించిన కొన్ని సంఘటనలు రికార్డ్‌గా దాచుకోవాలని మీ డాడీ స్పెషల్‌ వీడియో తీశారు. ముందు చూడు, తర్వాత చెప్తాను’’ అంటూ ఎంటర్‌ నొక్కింది.

తన బాల్యానికి సంబంధించినవి తెలుసుకోవాలని మనుషుల్లో సహజంగా ఉండే క్యూరియాసిటీకి పదహారేళ్ళ రవి అతీతుడు కాదు. కుతూహలంతో ముందుకు వంగి చూడటం మొదలుపెట్టాడు.

మొదటిది...పాకటం వచ్చిన రవి పాక్కుంటూ సాంబ్రాణి పొగ కోసం అంటించిన కుంపటిలో ఎర్రటి బొగ్గులు ఆకర్షిస్తుంటే అటు వెళ్ళాడు. మరొక్క క్షణమైతే నిప్పులో చెయ్యి పెట్టేవాడు. వసుధ చటుక్కున పట్టుకుని ఎత్తుకుంది. నిప్పును ముట్టుకోకుండా తనని అడ్డుకున్న తల్లిమీద కోపంతో వదలమని గింజుకుంటూ కెవ్వుమంటూ రాగం అందుకున్నాడు రవి. సుతారంగా చెంపమీద ఒక్క దెబ్బ వేసి ‘అది నిప్పురా భడవా... ముట్టుకుంటే కాలుతుంది’ తర్జని చూపిస్తూ బెదిరించింది వసుధ. వాడికేం అర్థం అయిందో... తల్లి కొంగుతో మొహం కప్పుకుంటూ చిరునవ్వులు చిందించాడు. వాడి బుగ్గమీద ముద్దు పెట్టుకుని ‘కాలితే... మచ్చ జీవితాంతం ఉండిపోతుంది బంగారం’ అంది.

వీడియో చూస్తున్న రవి పెదవుల మీద సన్నటి నవ్వు తళుక్కుమంది.

రెండోది...రవికి కూర్చోటం వచ్చింది. యూరిన్‌ పోస్తే నిక్కర్‌ తీసేసి మరోటి తేవటానికి వెళ్ళింది వసుధ. ఇంతలో మరోపని కూడా చేసేశాడు రవి. దానికేసి కుతూహలంగా చూస్తూ... చేత్తో తడుతూ, ఆట మొదలుపెట్టాడు.
‘ఛీ... యాక్‌... ఈ ఛండాలాన్ని కూడా వీడియో తియ్యాలా’ అనుకున్నాడు రవి.

పరుగున వచ్చిన వసుధ వాడిచేతి మీద చిన్న దెబ్బ వేసింది. ఇల్లెగెరిపోయేలాగా వాడు శోకాలు పెడుతున్నా పట్టించుకోకుండా బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి డెట్టాల్‌తో శుభ్రంచేసి ఒళ్ళు తుడిచి, పౌడర్‌ వేసి బట్టలు వేసింది.
మళ్ళీ అటువైపే వెళ్ళబోతున్న కొడుకుని పక్కకి లాగుతూ ‘అది అశుద్ధం వెధవా... ఇంకోసారి ముట్టుకున్నావంటే కొట్టేస్తాను’ వార్నింగ్‌ ఇచ్చింది.

‘అ..ఆ...’ అంటూ వాడూ వాడి భాషలో బెదిరించాడు.

‘నోర్ముయ్యి... ముట్టుకున్నావంటే దెబ్బలే’ గట్టిగా అంది వసుధ. కింది పెదవి బిగించి తలను అటూ ఇటూ తిప్పుతూ ఏడుపు అపుకుంటున్న కొడుకుని చూస్తే జాలి వేసింది వసుధకి. వాడి కనుకొలకులలో నిలిచిన ముత్యాల్లాంటి కన్నీటి చుక్కలని మృదువుగా అద్ది ఎత్తుకుని సముదాయించింది. తల్లి భుజం మీద తల వాల్చి అలవాటుగా కాళ్ళూ చేతులూ ఊపుతూ ఆమె కొంగుతో ఆట మొదలెట్టాడు రవి.

మూడోది...తప్పటడుగులు వేస్తోన్న కొడుకుని రెండు చేతులూ చాచి ‘రమ్మ’ని పిలుస్తూ నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తోంది వసుధ. అమ్మని అందుకోవాలనే ఉత్సాహంలో ఒక్కో అడుగూ ముందుకి వస్తూ చివరలో బ్యాలెన్స్‌ తప్పి, ముందుకు తూలిపడబోయిన కొడుకుని చేతులడ్డుపెట్టి ఆపి, ఎత్తుకుని ముద్దుపెట్టుకుంటూ... అక్కున చేర్చుకుంది ‘నిన్ను పడిపోనివ్వను బంగారుకొండా’ అంటూ. ఆ మాటలు అర్థం కాకపోయినా అమ్మకి తనూ ముద్దుపెట్టాడు రవి.

నాలుగోది... చివరిది... నడక వచ్చాక మంచం ఎక్కటానికి ప్రయత్నం చేస్తున్నాడు రవి. వసుధ నిశ్శబ్దంగా గమనిస్తోంది. మంచం ఎత్తు కొంచెం ఎక్కువ ఉండటంతో సగం ఎక్కేసరికి నేలమీదకి జారిపోయి పడిపోతున్నాడు. అయినా ఓటమిని ఒప్పుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో ఎలాగయినా సాధించాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. అటుగా వచ్చిన కామేశ్వరి ‘చంటాడు ఎక్కలేక కష్టపడుతూంటే నీకు సరదాగా ఉందా?’ అంటూ వాడిని ఎత్తి మంచంమీద కూర్చోబెట్టింది. తన ఆటకి అడ్డువచ్చిన నాయనమ్మని మింగేసేటట్టు చూసి జుర్రున నేలమీదకి జారిపోయి మళ్ళీ
ఎక్కటానికి ప్రయత్నించడం మొదలెట్టాడు.

‘భడవా, నీ అవస్థ నువ్వే పడు. సాయం చేయటం తప్పయింది’ మూతి బిగించి వసుధ పక్కకు వచ్చి కూర్చుంది కామేశ్వరి.

‘కష్టపడి విజయం సాధించాలన్న వాడి పట్టుదలని మెచ్చుకోవాలి అత్తయ్యా’ కొడుకుకేసి మురిపెంగా చూసుకుంటూ అంది వసుధ.

‘నువ్వూ నీ కొడుకూ... మీ ఇష్టం’ లేని అలక నటించింది కామేశ్వరి. చివరికి సాధించాడు రవి. పరుపుని గట్టిగా నొక్కిపట్టుకుని మంచం ఎక్కేసి, చప్పట్లు కొడుతూ గర్వంగా నవ్వుతూ తల్లికేసీ, నాయనమ్మకేసీ చూశాడు.

‘వెరీగుడ్‌’ మెచ్చుకుంది వసుధ. తల్లి మెచ్చుకోలుని ఆస్వాదిస్తూ నవ్వుతూ మంచంమీద పొర్లిగింతలు మొదలుపెట్టాడు ఆ మగధీరుడు.

లాప్‌టాప్‌ ఆఫ్‌ చేసింది వసుధ. తల్లికేసి రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు రవి.

‘‘నిన్ను ఆ పసివయసులో కూడా కొట్టాను. ఏడుస్తూ కూడా నువ్వు అమ్మనే హత్తుకుపోయావు. ఇప్పటిలా నామీద నీకు కోపం రాలేదు, నువ్వు అలగలేదు’’ ఆపైన గొంతు పెగల్లేదు వసుధకి.

‘‘అప్పుడు చిన్నవాడిని, నాకేం తెలీదు’’ బింకంగా అన్నాడు రవి.

‘‘ఓహో! ఇప్పుడు మంచీచెడుల భేదం నీకు బాగా తెలుస్తోందా? అయితే, అమ్మ అవసరంలేనట్లేనా?’’ పేలవంగా నవ్వింది వసుధ.

తలెత్తి తల్లికేసి చూశాడు రవి. ఆమె మొహం పీక్కుపోయి నీరసంగా ఉంది.

‘‘పిచ్చి నాన్నా... ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏ విషయమైనా నీకు హాని చేస్తుందంటే నేను అడ్డంపడతాను. అవసరం అయితే దండిస్తాను. అది నిన్ను హింసించటం కాదు... జన్మ ఇచ్చిన తల్లిగా నీ బంగారు భవిష్యత్తు కోసం నిన్ను సరిదిద్దటం. అది నా బాధ్యత. సరదాలు అలవాటుగా మారకూడదు. ఓపక్క పట్టుచిక్కక కిందికి జారిపోతున్నా నాయనమ్మ సహాయాన్ని కాదని తోసేసి ఓటమిని ఒప్పుకోకుండా నీ అంతట నువ్వు మంచం ఎక్కటానికి ఆ పసివయసులో చూపించిన పట్టుదల జ్ఞాపకం ఉంచుకుంటేనూ... టీనేజీ స్నేహాల ఒత్తిళ్ళ నుంచి నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితేనూ... నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటావు. నీ మాటలూ చేతలూ అలవాట్లూ అన్నీ కలిసి రూపుదిద్దుకునే నీ వ్యక్తిత్వం... నిన్ను వశం చేసుకోవాలని అన్నివైపుల నుంచీ దూకుతున్న ఆకర్షణలకి ఎదురొడ్డి నిలవాలి. జీవితంలో మొదటి దశలో ఉన్న కుర్రాడివి. జీవితంలో నువ్వనుకుంటున్న ఎంజాయ్‌మెంట్స్‌ని మించిన అసలైన ఎంజాయ్‌మెంట్స్‌ నువ్వింకా రుచి చూడలేదు. బోలెడు జీవితం ముందుంది ఇంకా నీకు. అమ్మ తిట్టిందన్న కసితో నువ్వు ఆత్మహత్య చేసుకుని నీ నూరేళ్ళ జీవితాన్ని అంతం చేసుకుని వాటికి దూరం అవకూడదు. అదేదో నేనే చేస్తాను. అప్పుడు నిన్ను సాధించేవాళ్ళూ, నీ స్వేచ్ఛకి అడ్డుతగిలేవాళ్ళూ ఎవరూ ఉండరు. పనికిమాలిన సోదితో నీ టైమ్‌ వేస్ట్‌ చేశాను అనుకుంటే ఈ అమ్మని క్షమించు’’ కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకుంది వసుధ.

అగమ్యగోచరం అనిపిస్తూన్న గందరగోళంలో తను కోరుకున్న మార్గమేదో సుస్పష్టంగా కళ్ళకి కనిపిస్తున్నట్లనిపిస్తోంది రవికి. తల్లి మాటలకి లోలోన ఎక్కడో కలుక్కుమనేసరికి బేలగా తల్లి కళ్ళలోకి తేరిపార చూశాడు.

కొడుకు చూపుల్లో తను ఆశించిన దానినేదో వెతుక్కుంది వసుధ.

‘‘ఐయాం సారీ మమ్మీ, రియల్లీ వెరీ సారీ... మరెప్పుడూ ఇలా జరగదు... గాడ్‌ ప్రామిస్‌’’ పూడుకుపోతూన్న స్వరంతో అని, చటుక్కున లేచి నిలబడి, తల భూమిలోకి దించుకుని, చిన్నచిన్న అడుగులతో తన గదిలోకి నడిచాడు రవి.

వసుధలో ఒక్కసారిగా... మండుతున్న తన గుండెలమీదుగా ఓ చల్లనిగాలి కెరటం సాగిన అనుభూతి. ఆమె కళ్ళు ఆనందాశ్రువులతో దొప్పదోగిపోయాయి.

ప్రసాదం దంపతులు సంతోషం నిండిన గుండెలతో అభినందనగా కోడలివైపు చూశారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.