close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బరువును తగ్గించే నూడ్యుల్స్‌..!

షిరటాకి... పేరే వింతగా కొత్తగా ఉంది కదూ. కానీ జపాన్‌వాసులకి మాత్రం 1400 ఏళ్ల నుంచీ ఆ పేరుతో అనుబంధం ఉంది. ఇది వాళ్ల సంప్రదాయ ఆహారం. షిరటాకి అంటే జపనీస్‌లో తెల్లని జలపాతం అని అర్థం. దాంతో చేసే నూడుల్స్‌ చూడ్డానికి అలాగే ఉంటాయి కాబట్టి అలా పిలుస్తారట. కాంజాక్‌ లేదా కొనియాకు అనే ఒక రకం దుంప నుంచి వీటిని తయారుచేస్తారు. ఈ దుంపనే ఎలిఫెంట్‌ యామ్‌, డెవిల్స్‌ టంగ్‌ అనీ అంటారు.

జీరో క్యాలరీలు!
ఈ దుంపల్లో 97 శాతం నీరు, మూడు శాతం పిండిపదార్థాలు అదీ ఎక్కువగా గ్లూకోమనన్‌ అనే పీచు రూపంలో ఉంటాయి. ముందుగా దుంపను పిండి చేసి నూడుల్స్‌ లేదా బియ్యం ఆకారం వచ్చేందుకు సహజమైన సున్నపుతేటను కలుపుతారు. దాంతో వీటి నుంచి కొంత కాల్షియం కూడా లభ్యమవుతుంది. సంప్రదాయ పద్ధతిలో తయారయ్యే ఈ మిరకిల్‌ నూడుల్స్‌ నుంచి వచ్చే క్యాలరీలు దాదాపు జీరో. ఎందుకంటే వంద గ్రా. నూడుల్స్‌లో 2.1 గ్రా. పిండిపదార్థాలు, 3 గ్రా. పీచు లభ్యమవుతాయి. వీటి నుంచి సుమారు 12 క్యాలరీలు మాత్రమే లభ్యమవుతాయి. అదే వంద గ్రా. గోధుమ నూడుల్స్‌ నుంచి అయితే 368 క్యాలరీలు వస్తాయి.

ఎలా చేస్తారు?
ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పండే ఈ దుంపను పిండి చేసి, దాన్ని నూడుల్స్‌, స్పాగెట్టి, రైస్‌, పాస్టా...  ఇలా రకరకాల ఆకారాల్లో తయారుచేస్తారు. చివరగా వీటిని ఎండబెట్టి లేదా నీళ్లలోగానీ ప్యాక్‌ చేయడం ద్వారా నిల్వ చేస్తారు జపనీయులు. ఎక్కువగా నీళ్లతో కలిపి ప్యాక్‌ చేసే ఈ రకం నూడుల్స్‌, పాస్టా ఏవయినాగానీ ముందుగా బాగా కడిగి, ఆ తరవాత మరిగించిన నీళ్లలో వేసి ఉడికించాలి. అప్పుడే వాటికుండే ఒకలాంటి వాసన పోతుందట. ఇటీవల పాలకూర, టోఫు... వంటి ఫ్లేవర్లూ జోడిస్తున్నారు. సహజంగా వీటికి ఎలాంటి రుచీ ఉండదు కానీ వీటితో రకరకాల వంటలు చేసుకునేటప్పుడు కలిపే సాస్‌లూ, ఫ్లేవర్లూ వాటికి పట్టి మంచి రుచిగా ఉంటాయట.

ఎందుకు మంచిది?
ఈ నూడుల్స్‌ లేదా బియ్యంలోని పీచు పారదర్శకంగానూ జిగురుగానూ మందంగానూ ఉంటుంది. దాంతో అది జీర్ణాశయంలోకి మెల్లగా జారుతూ మరింత నెమ్మదిగా జీర్ణమవుతుంది. దాంతో తిన్న వెంటనే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. అదేసమయంలో ఈ పీచు ఇతర పదార్థాలు
జీర్ణమయ్యేలా చేయడంతోబాటు అవి రక్తంలో కలిసేందుకూ సాయపడుతుంది. ఈ పీచుకి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. దాంతో రక్తంలో చక్కెర శాతం పెరగదు.
* గ్లూకోమనన్‌ మలబద్ధకానికి మంచి మందు. అందుకే జపనీయులు దీన్ని ‘బ్రూమ్‌ ఫర్‌ ద స్టమక్‌’ అనీ అంటారు. పైగా ఈ నూడుల్స్‌లోని జిగురు ప్రి-బయోటిక్‌గా పనిచేయడం ద్వారా మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. దాంతో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* గ్లూకోమనన్‌ కొలెస్ట్రాల్‌ను విసర్జితమయ్యేలా చేస్తుంది. దాంతో రక్తంలో దాని శాతం తగ్గుతుంది. అందుకే దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడంవల్ల కొలెస్ట్రాల్‌ పది శాతం తగ్గిందనీ, బీపీ తగ్గిందనీ అనేక అధ్యయనాల్లోనూ తేలింది.
* పూర్తిగా జీర్ణమయ్యే పీచువల్ల బరువు తగ్గుతారు. కానీ అలాంటి పీచు బియ్యం, ఓట్స్‌, బార్లీ, పండ్లు, ఆపిల్‌... వంటి వాటిల్లోనే దొరుకుతుంది. వాటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. ఈ నూడుల్స్‌లో అయితే క్యాలరీలు దాదాపు జీరో కాబట్టి, ఇతర పోషకాలతో కలిపి తీసుకోవడంవల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లకి మేలు.
* ఈ పీచు పొట్టలో జీర్ణమయ్యే దశలో చిన్న ఫ్యాటీ ఆమ్లాలుగా విడిపోతుంది. అవి పొట్ట నిండినట్లుగా అనిపించేలా చేసే పి.వై.వై. అనే హార్మోన్‌ విడుదలకు కారణమవుతాయి. అదేసమయంలో ఆకలిని కలిగించే గెర్లిన్‌ అనే హార్మోన్‌ విడుదలను తగ్గిస్తాయి. అందుకే ఈ నూడుల్స్‌ను నాలుగు వారాలపాటు క్రమం తప్పక తీసుకుంటే ఆకలి హార్మోన్‌ విడుదల తగ్గి, కనీసం ఒకటిన్నర నుంచి రెండున్నర కిలోల బరువు తగ్గుతారని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ చేసిన అధ్యయనాల్లోనూ తేలింది.
అయితే బరువు తగ్గడానికి గ్లూకోమనన్‌ని నూడుల్స్‌ రూపంలోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. సప్లిమెంట్‌ రూపంలో నీటితో కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుందట. కానీ ఆ సప్లిమెంట్‌ను భోజనానికి ఓ గంట ముందే వేసుకోవాలి. అయితే కడుపునిండా తిన్న అనుభూతిని మిస్సవకుండా ఉండాలంటే నూడుల్స్‌ లేదా రైస్‌ రూపంలో ఇతర పదార్థాలతో కలిపి తినడమే ఉత్తమం. ట్రై చేద్దామనుకుంటే ఆన్‌లైన్‌లోకి వెళ్లి చూడండి మరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.