close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సామాన్యుల కోసం... ఓ వాస్తు అద్భుతం!

సామాన్యుల కోసం... ఓ వాస్తు అద్భుతం!

నెల్లూరు జనశక్తినగర్‌లో అదో బడి. ఇరవై ఏళ్లు దాటిన ఆ బడికి గత ఏడాది కొత్త భవంతులు నిర్మించాలనుకుంది దాన్ని నడుపుతున్న తరిమెల నాగిరెడ్డి ట్రస్టు. 300 గజాల స్థలంలో ఉన్న ఆ బడి ప్రాంగణంలో ఓ ఆధునిక భవంతి నిర్మించాలంటే..  నలభై ఐదు లక్షలవుతుందని చెప్పారు కాంట్రాక్టర్లు.  కానీ ఆ పేదపిల్లల కోసం అంతకంటే 30 శాతం తక్కువ ఖర్చుతో అత్యాధునిక ప్రాంగణం ఈ మధ్యే కట్టిచ్చాడు ఓ ఆర్కిటెక్ట్‌. సుమారు పదిహేనులక్షల తేడా. ఓ మధ్యతరగతి జీవి ఇంచుమించు ఓ డాబా కట్టుకోగలిగేంత డబ్బు ఆదా! పక్కనున్న చిత్రంలోని భవనం అదే. ‘అరె.. ఇదెలా సాధ్యమైంది!’ అన్నవాళ్లకి ఆయన ఇచ్చిన సమాధానం..‘లారీ బేకర్‌ వాస్తు పద్ధతితో ఇది సాధ్యమే’నని!  ఏమిటా పద్దతి?
ప్రకృతికి దగ్గరగా అక్కడున్న రాళ్లూ, రప్పలూ, గుట్టలూ, చెట్లని చెక్కుచెదరనీయకుండా.. సిమెంటూ, ఖరీదైన కలపా, కంకర వాడకాన్ని వీలున్నంత తగ్గించి నిర్మించాలన్నదే లారీ బేకర్‌ శైలి. అంతమాత్రాన గట్టిదనానికి లోటు రాదు. గాలీ, వెలుతురికి ఢోకా లేదు. మన కళాభిరుచులకి తగ్గట్టే కాకుండా.. అటు తక్కువ ఖర్చుతోనే ఆవాసాలని ఏర్పాటుచేసుకోవచ్చు. అదెలా సాధ్యమవుతోంది? సిమెంటుని పాక్షికంగా వాడటం లేదా పూర్తిగా వాడకపోవడం ద్వారా. దానికి బదులు బంకమట్టీ, సున్నం ఉపయోగిస్తారు. ఇటుకలు కూడా ఎంతో అందంగా ముచ్చటగొలుపుతుంటాయి ఈ పద్ధతిలో. ఏ ప్లాస్టరింగ్‌ ఆచ్ఛాదనా ఉండదు! ఇవన్నీ లేకపోవడం వల్ల చాలావరకూ ఖర్చు తగ్గుతుంది.

అంతేకాదు..
ఇటుకలని పేర్చడంలో ర్యాట్‌ ట్రాప్‌ విధానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా గోడల నిర్మాణంలో ఇటుకలని అడ్డంగా పేర్చుతారు. అలాకాకుండా ఒకవైపే నిల్చున్నట్టు పెట్టి మధ్యలో ఖాళీ స్థలం ఉండేలా పేర్చడమే ఈ ర్యాట్‌ట్రాప్‌ విధానం. బేకర్‌ విధానంలో ఉన్న మరో ప్రత్యేకత.. ఫిల్లర్‌ శ్లాబ్‌! శ్లాబుల అడుగు భాగాన కంకరకి బదులు మట్టి కుండలు, మైసూరు టైల్స్‌ వంటివి వాడతారు. ఇక ద్వారబంధాలకి కంకర, కొయ్యలని వాడకుండా వెదురుతో అందమైన ఆర్చ్‌లని నిర్మిస్తారు. అసలు పైకప్పుని కూడా అర్ధవలయం(వాల్డ్‌ రూఫ్‌)గా మార్చేస్తారు. వీటితోపాటూ కొయ్య ఫ్రేములు అక్కర్లేని కిటికీలు, అసలు కిటికీల అవసరాన్నే తగ్గించే ఇటుక జాలీలూ.. ఇవన్నీ కలిసి లారీ బేకర్‌ విధానాన్ని సామాన్యులకి అనువుగా మారుస్తున్నాయి! వీటివల్ల ఇటుకలూ, స్టీలూ, సిమెంటు వాడకం 30 శాతం తగ్గుతుంది. అంతేకాదు, కట్టడం లోపలి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది.

మన చుట్టుపక్కలా ఉన్నాయి..!
లారీ బేకర్‌ విధానంలో చిన్నపాటి ఇళ్ల నుంచి అతిపెద్ద భవనాల దాకా ఎన్నో అద్భుత నిర్మాణాలు చేసి చూపిస్తున్నారు నేటితరం వాస్తు శిల్పులు. నెల్లూరు తరిమల నాగిరెడ్డి స్కూల్‌ ఇందుకు తాజా ఉదాహరణ. విజయవాడకి చెందిన క్యూబ్‌ డిజైన్‌ కన్సార్టియం దీన్ని చేపట్టింది.విజయవాడ నగరం శివారులో ఉన్న వికాస విద్యా వనం బడి గురించి వినే ఉంటారు! అది కూడా లారీ బేకర్‌ విధానంతో రూపుదిద్దుకున్నదే. దాని వ్యవస్థాపకుడు ఎస్‌.ఆర్‌.పరిమి సివిల్‌ ఇంజినీరు కూడా కావడంతో అక్కడ ఈ చక్కటి నిర్మాణం చోటుచేసుకుంది. విశాఖలోని రిషీ గురుకులం.. ఈ విధానంలో రూపుదిద్దుకున్న మరో వాస్తు అద్భుతం. కడపలో ఉన్న హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలూ, హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామం కుటీరాలు ఈ పద్ధతిలో తీర్చిదిద్దినవే. ఇక.. వివిధ కుటుంబాలు తమదైన కళాభిరుచితో నిర్మించుకున్న ఇళ్లు మన తెలుగు నగరాల్లో చాలానే ఉన్నాయి!

మూడువేలకే ఇల్లు
లారీ బేకర్‌... ఈ నిర్మాణ పద్దతికి ఆద్యుడు. ఇంగ్లండుకి చెందిన ఆర్కిటెక్ట్‌. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఆయన గాంధీజీని కలిశారు. అప్పుడు బాపూజీ ‘నిరుపేదలకి మీలాంటి వాస్తుశిల్పులు.. మంచి ఇళ్లు కట్టివ్వొచ్చుకదా!’ అని అడిగారట. ఆ మాటలతో ఆయన ఇక్కడే ఉండిపోయారు. కేరళలో స్థిరపడ్డారు. ఇల్లులేని వలస కార్మికులూ, నిరుపేదల స్థితి చూసి కదిలిపోయారు. ‘పేదలకి మూడువేల రూపాయలకి(ఇప్పటిలెక్కన 30 వేల రూపాయలు) ఇల్లు కట్టిస్తా!’ అని ప్రకటించాడు. ఇందుకోసమే ఈ ప్రత్యేక శైలి ఆవిష్కరించారు. వాస్తు నిర్మాణ గాంధీగా పేరుతెచ్చుకుని 2007లో తన 90వ ఏట భారతదేశంలోనే కన్నుమూశారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.