close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొమ్మల్లో కుకూలు..కొండల్లో ఎకోలు..

కొమ్మల్లో కుకూలు..కొండల్లో ఎకోలు..

చటుక్కున చెట్లెక్కే ఉడుతలు..
గబుక్కున పొదల్లోకి దూరిపోయే కుందేళ్లు..
అప్పుడప్పుడూ గాండ్రించే పులులు..
ఆ శబ్దాలకు బిత్తర పోయే హరిణాలు..
ఈ అద్భుతాలను  ఆస్వాదించాలని అనుకుంటున్నారా! అయితే నల్లమల అడవిలోకి వెళ్దాం. కృష్ణానదికి ఇరువైపులా విస్తరించిన ఈ దట్టమైన అరణ్యాన్ని ‘ఎకో-టూరిజం’తో పర్యాటకులకు చేరువ చేసింది ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ. ఇక్కడికి వెళ్తే.. కొమ్మల్లో పక్షుల కుకూలు వినొచ్చు. పచ్చికలో పరుగులు తీయొచ్చు. కరుకు కొండలపై ట్రెక్కింగ్‌ చేయొచ్చు. జీపులో అడవంతా తిరిగేయొచ్చు. ప్రకృతి ఒడిలో రెండు రోజులు ఉల్లాసంగా గడిపేయొచ్చు. వన విహారం మిగిల్చిన అనుభూతులు కొండల్లో ఎకోల్లా.. మీ మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
ర్నూలు జిల్లాలోని పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు నల్లమల ఎకో టూరిజానికి ఇప్పుడు కేరాఫ్‌. వారాంతాల్లో వందల్లో వాహనాలు ఇక్కడి వస్తాయి. అడవి దాగిన అందాలను ఆస్వాదించాలని పెద్దలు వస్తుంటే.. వన్యమృగాలను చూడాలని పిల్లలు ఆరాటపడుతుంటారు. వన విహారంలో యువత ట్రెక్కింగ్‌ విన్యాసాలతో అదరగొడుతుంటుంది. ‘జంగిల్‌ క్యాంప్‌’లో విహారాన్ని రెండు రకాలుగా ప్రణాళిక చేసుకోవచ్చు. మొదటిది ఆయా కేంద్రాల్లోని కాటేజీల్లో బస చేసి తీరికగా అడవంతా చూడొచ్చు. లేదూ ఉదయాన్నే వెళ్లిపోయి.. సఫారీ చేసి, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ.. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఒత్తిళ్లన్నీ మరచి ఎంచక్కా సేదతీరి సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవ్వొచ్చు. అందుకే వారాంతాల్లో హైదరాబాద్‌, విజయవాడ, కర్నూలు తదితర నగరాల నుంచి పర్యాటకులు నల్లమలకు భారీ సంఖ్యలో విచ్చేస్తుంటారు. రోజంతా హాయిగా గడుపుతారు. ఇక్కడి సౌందర్యాన్ని చూడడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటం విశేషం.
పులి కంటపడితే..
ఎకో టూరిజంలో అందరినీ ఆకర్షిస్తున్నది ‘సఫారి ట్రాక్‌’. పచ్చర్ల జంగిల్‌ క్యాంప్‌లో ఈ ట్రాక్‌ 10-15 కిలోమీటర్లు ఉంది. ఒక్కో జీపులో ఆరుగురిని తీసుకెళ్తారు. దాదాపు రెండు గంటలుండే సఫారీ యాత్ర.. భారీ వృక్షాలు, దట్టమైన పొదల గుండా సాగిపోతుంది. ఎండ కన్నెరగకుండా గొడుగు పట్టే చెట్ల కొమ్మలు. వాటికి చిందర వందరగా అల్లుకున్న తీగలు. ఆ లతల సౌందర్యాన్ని రెట్టింపు చేసే పూలు, ఆ పూలలోని మకరందాన్ని ఆస్వాదించే తేనెటీగలు. ఆ పక్కనే పంచెవన్నెలున్న సీతకోకచిలుకలు, రంగు రంగుల పక్షులు..! వీటి అందాలు చూస్తూ మురిసిపోతుండగానే.. అల్లంత దూరాన గుబురులో ఎలుగుబంటి. దానిని చూసి భయంతో పారిపోయే దుప్పులు, జింకలు. ఇంకాస్త ముందుకెళ్తే జీపు వేగం మందగిస్తుంది. అప్పటి దాకా చెట్ల మీద ఉండి కీచులాడిన కోతిమూకలు గమ్మునుండిపోతాయి. నాలుగు దిక్కులూ దీక్షగా చూస్తే.. అద్భుతం కనిపిస్తుంది. బోనులో పులి కోపంగా ఉంటుంది. సర్కస్‌లో పులి క్రమశిక్షణతో ఉంటుంది. అడవిలో పులి రాజసంగా ఉంటుంది. ఠీవీగా నడుస్తుంది. అడుగులో అడుగేస్తూ.. వస్తుంది. ఆకలేసిందా చిన్న జంతువని కూడా చూడదు. లిప్తపాటులో పంజా విసురుతుంది. అలాంటి పులిని దగ్గరగా చూస్తే భలేగా ఉంటుంది కదా! ఏదో అదృష్టం ఉంటే గానీ అడవిలో పులి కంటపడదంటారు అటవీ శాఖ అధికారులు. సఫారీ ట్రాక్‌ మధ్యలో ఉల్లెడ అనే క్షేత్రం వస్తుంది. ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది. చుట్టూ లోయలతో ఈ ప్రాంతం మనోహరంగా ఉంటుంది.
జంగిల్‌ సఫారీ ధర: రూ.800 (ఆరుగురికి).
ఎక్కడ: కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పచ్చర్ల 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకాశం గిద్దలూరుకు 35 కిలోమీటర్ల దూరం. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లొచ్చు.