close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ పెన్సిల్‌కి చెట్లతో పనిలేదు!

ఈ పెన్సిల్‌కి చెట్లతో పనిలేదు!

ఐటీ నిపుణురాలిగా ఉద్యోగం చేస్తున్న దివ్యకి రైతుల కోసం ఏమైనా చేయాలన్న ఆలోచన రావడానికి కారణం తాతయ్య జ్ఞాపకమే. వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు దివ్య వయసు పదమూడేళ్లు. పెద్దయినా ఆమె మనోఫలకం మీదినుంచి ఆ దృశ్యం అదృశ్యం కాలేదు. అందుకే ఉద్యోగం మాని గ్రామీణ రైతుల ఉపాధికీ పర్యావరణ పరిరక్షణకీ పనికొచ్చే సంస్థలను నెలకొల్పింది.
పెన్సిల్‌ చిన్న పిల్లల వ్యవహారం కానేకాదట. 2,500 పెన్సిళ్లు తయారుచేయడానికి ఒక చెట్టును కొట్టేస్తున్నాం. ఏటా మన దేశంలోనే వందకోట్ల పెన్సిళ్లు తయారవుతున్నాయి. ఆ లెక్కన ఎన్ని చెట్లు  నేలకూలుతున్నాయి? పైగా పారేసిన పెన్సిల్‌ ముక్క మట్టిలో కలిసిపోవడానికి పదేళ్ల పైనే పడుతుంది. ఇదంతా పెద్దల బాధ్యతారాహిత్యం కాదా... అన్నది వీరి ప్రశ్న. ఆ ప్రశ్నే వారి చేత ఓ స్టార్టప్‌కి శ్రీకారం చుట్టించింది. ‘ప్లాంట్‌సిల్‌’ పేరుతో వీరు తయారుచేస్తున్న పెన్సిళ్లకు అసలు చెట్లతో పనిలేదు. పైగా ఒక్కో పెన్సిలూ ఒక్కో మొక్కకు ప్రాణం పోస్తుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దివ్యా శెట్టి, ఆమె స్నేహితుడు విష్ణువర్ధన్‌లు ప్లాంట్‌సిల్‌ వ్యవస్థాపకులు.

తాతయ్య జ్ఞాపకం
దివ్య బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా సహోద్యోగి విష్ణువర్ధన్‌తో పరిచయమైంది. చేసేది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమైనా వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగిన నేపథ్యం ఇద్దరి స్నేహానికీ బాటవేసింది. వ్యవసాయంలో నష్టాలతో తన తాతయ్య ఆత్మహత్య చేసుకున్నాడనీ, రైతుల కోసం ఏమైనా చేయాలని ఉందనీ విష్ణుకి చెప్పింది దివ్య. ఇద్దరూ కలిసి చర్చించి మూడేళ్లక్రితమే కోయంబత్తూరులో ‘ఇండియన్‌ సూపర్‌ హీరోస్‌’ అనే సంస్థను ప్రారంభించారు. రైతులకు సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కల్పించడమూ, పండించిన పంటలను వారే నేరుగా వినియోగదారులకు అమ్ముకునే ఏర్పాటు చేయడమూ ఈ సంస్థ ఉద్దేశం. సేంద్రియ సాగు చేస్తున్నట్లు అధికారికంగా గుర్తింపు పొందిన 800లకు పైగా రైతులు వీరి సేవలు అందుకుంటున్నారు. ‘ఇండియన్‌ఆర్గానిక్‌.స్టోర్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ పెట్టి ఈ రైతులు పండించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. రైతుల కోసమూ, నగరాల్లో నివసిస్తూ సేద్యం పట్ల ఆసక్తి కలవారికోసమూ సంస్థ తరఫున తరచూ వర్కుషాపులు నిర్వహిస్తుంటారు. అలాంటి ఓ సందర్భంలో అడవుల నరికివేత అంశం చర్చకు వచ్చింది. నానాటికీ తగ్గిపోతున్న అడవుల వల్ల నీటి సంక్షోభం ఏర్పడుతోందనీ ఆ ప్రభావం పంటలమీదా పడుతోందనీ రైతులు చెప్పిన మాట ఈ జంటని ఆలోచింపజేసింది. అప్పుడే పెన్సిళ్ల కోసం ఎన్ని చెట్లు నేలకూలుతున్నాయో తెలిసి నిర్ఘాంతపోయారు. కలపతో కాకుండా పెన్సిళ్లను ఇంకా వేటితో తయారుచేయవచ్చో చూద్దామని అన్వేషణ ప్రారంభించారు. చైనాలో తప్ప ఇంకెక్కడా అలాంటి ప్రయత్నాలు జరిగినట్లు తెలియలేదు. కలప బదులు పాత వార్తాపత్రికలను రీసైకిల్‌చేసి పెన్సిళ్లు తయారుచేయవచ్చని తెలిసి దాని గురించి అధ్యయనం చేశారు. ప్రణాళిక సిద్ధం చేసుకుని కోయంబత్తూరు దగ్గర అవినాశి అనే ప్రాంతంలో చిన్నగా పెన్సిళ్ల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. అందులో పరిసర గ్రామీణులే వంద మంది ఉపాధి పొందుతున్నారు.

తయారీ కూడా ప్రత్యేకమే
సాధారణంగా పెన్సిళ్ల తయారీకి రెండు కలప బద్దలను తీసుకుని మధ్యలో గ్రాఫైట్‌ పెడతారు. కానీ ప్లాంట్‌సిల్‌ తయారుచేసే పెన్సిళ్లకు రీసైకిల్‌ చేసిన పేపరును గుండ్రంగా చుడతారు. దాంతో ఇవి మరింత నాణ్యంగా ఉండడమే కాదు, రాసేటప్పుడు చేతికి పట్టు బాగా కుదురుతుంది. వేర్వేరు పండ్ల సువాసనలతో, చిన్నగా అయిపోయిన పెన్సిల్‌ని నాటితే మొక్క వచ్చేలా, పెన్సిల్‌ చెక్కితే వచ్చే రంగురంగుల పొడితో పిల్లలు కొలాజ్‌ బొమ్మలు చేసుకునేలా... రకరకాల పెన్సిళ్లను వీరు తయారుచేస్తున్నారు. పిల్లల అభిరుచికి తగినట్లుగా సూపర్‌మ్యాన్‌లాంటి బొమ్మలతోనూ, పుట్టినరోజులాంటి సందర్భాలకీ, కంపెనీల పేర్లతో కస్టమైజ్డ్‌ పెన్సిళ్లనూ తయారుచేస్తారు. ప్రస్తుతం రోజుకు ఆరువేల పెన్సిళ్లను తయారుచేస్తున్నామనీ ప్లాంట్‌సిల్‌.కామ్‌ వెబ్‌సైట్‌నుంచి ఆన్‌లైన్‌లో వీటిని కొనుక్కోవచ్చనీ చెప్పారు దివ్య. పేపరుతో తయారైనవి కాబట్టి పారేసినా కొద్ది రోజుల్లోనే మట్టిలో కలిసిపోతాయివి. అచ్చం ఇలాగే పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగని రీతిలో పెన్నులనూ తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మిత్రద్వయం.
వాడేసిన వార్తాపత్రికలను పాఠశాలలనుంచి నేరుగా తీసుకుంటారు. బదులుగా పెన్సిళ్లు సరఫరా చేస్తున్నారు. అలా చేయడం వలన చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం గురించి పిల్లలకు తెలుస్తుందంటారు దివ్య. చిన్న పిల్లలు పెన్సిళ్లను నోట్లోపెట్టుకుని నములుతుంటారనీ అందుకని ఎలాంటి రసాయనాలూ వాడకుండా ఎంతో జాగ్రత్తగా పెన్సిళ్లను తయారుచేస్తున్నామనీ చెప్పే దివ్యను అభినందించాల్సిందే కదూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.