close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రేమంటే ఇదేరా...

ప్రేమంటే ఇదేరా...

ప్రేమ... అందాన్నో ఆస్తుల్నో చూసి పుట్టేది కాదు. నిజమైన ప్రేమ మనసునీ మంచితనాన్నీ చూసి పుడుతుంది. ప్రాణమున్నంత వరకూ ఉంటుంది.  అలాంటి స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనమే ఈ ప్రేమికులు. (ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం)

యువరాణి... సామాన్యుడు... ప్రేమ!

అనగనగా ఓ యువరాణి. అంతఃపురంలో అపురూపంగా పెరిగిన అందాలబొమ్మ. ఆమె ఏదికావాలంటే అది చిటికెలో కళ్లముందుకొచ్చేసేది. అలాంటి అమ్మాయి అనుకోకుండా ఓ సామాన్యుడిని ప్రేమించింది. కానీ ఆ దేశ చట్టాల ప్రకారం రాజ కుటుంబంలోని ఆడపిల్లలు ఇతరుల్ని పెళ్లి చేసుకుంటే రాచరికాన్ని వదులుకోవాల్సిందే. అయినా ఆమె వెనుకాడలేదు. ఇది జపాన్‌ యువరాణి ‘మాకో’ ప్రేమకథ. రాజు అకిహిటొ పెద్ద మనుమరాలైన ఆమె అయిదేళ్ల కిందట ఓ పార్టీలో ‘కెయ్‌ కొమురొ’ని కలిసింది. తొలి చూపులోనే అతడి నవ్వుకి ఫ్లాటైపోయింది. మాకో మనసేంటో కొమురొ కళ్లకూ తెలిసిపోయింది. కొంతకాలం ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుంటామంటూ రాజుగారి దగ్గరకు వెళ్లారు. యువరాణి కోరికను రాజకుటుంబమూ కాదనలేదు. కానీ ‘చట్టం చట్టమే. రాచరికాన్ని వదులుకోవాల్సిందే’ అని నొక్కి చెప్పారు. అయినా, మాకో మనసు మారలేదు. అంతఃపురాన్ని వదిలి మామూలు ఉద్యోగం చేసుకుంటున్న కొమురొతో చిన్న ఇంట్లో ఉండడానికే ఇష్టపడింది. 

హద్దుల్లేని ప్రేమ

‘ఇవ్వడమే తెలిసిన ప్రేమ తన కొరకు ఏ సిరినీ అడగదు కదా...’ అంటాడు ఓ కవి. అవును, మనసైనవారి సంతోషం కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడటం ప్రేమలో ఉన్నవారికే సాధ్యమవుతుంది... దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ ప్రేమకథ కూడా అలాంటిదే. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన ఇమ్రాన్‌ నిజానికి మొదట ఆ దేశం తరఫునే క్రికెట్‌ ఆడేవాడు. 1998లో అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడటానికి దక్షిణాఫ్రికా వెళ్లిన అతను అనుకోకుండా అక్కడ భారత సంతతి యువతి సుమయ్య దిల్దర్‌ను చూశాడు. అంతే తొలి చూపులోనే క్లీన్‌ బౌల్డ్‌. ఆమె మనసు గెలుచుకోవడానికి మాత్రం చాలా తంటాలే పడాల్సొచ్చింది. ఎట్టకేలకు సుమయ్య ఒప్పుకుంది కానీ ‘పాకిస్థాన్‌ వెళ్లకుండా నాతో దక్షిణాఫ్రికాలో ఉండిపోతానంటేనే నిన్ను పెళ్లి చేసుకోగలను’ అంది. ఇమ్రాన్‌కి ఆమె ప్రేమ కన్నా ఏదీ ఎక్కువగా అనిపించలేదు. పాకిస్థాన్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడే అవకాశాన్ని వదులుకుని మరీ ఆమె చెయ్యి పట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలంటే ఆ దేశంలో కనీసం నాలుగేళ్లు ఆడాలన్నది నిబంధన. అన్నాళ్లూ క్లబ్‌ స్థాయిలో బాగా రాణిస్తూ చివరకు 2011లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడతడు ఆ జట్టులోని మేటి బౌలర్లలో ఒకడు. నిజమే ఇమ్రాన్‌ గ్రేట్‌... ప్రేమలోనూ క్రికెట్‌లోనూ.

కోట్లు కాదు ప్రేమే కావాలి!

దాదాపు రెండువేల కోట్ల రూపాయల ఆస్తి. రాజభవనంలాంటి ఇల్లూ నిమిషాల్లో ఎక్కడికైనా వెళ్లేలా ప్రత్యేక విమానాలూ... పెళ్లికాకముందు ఏంజిలిన్‌ది నిజంగా రాజభోగమే. కానీ ఇప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తూ చిన్న ఇంట్లో ఉంటోంది. ‘అయినా నేను సంతోషంగానే ఉన్నా’ అంటుంది. ఏంజిలిన్‌ తండ్రి ఖూ కయ్‌ పెంగ్‌ మలేషియాకు చెందిన పెద్ద వ్యాపారవేత్త. ఫోర్బ్స్‌ అత్యంత సంపన్నుల్లో ఒకడు. కరీబియన్‌ దేశస్తుడైన ఓ సామాన్యుడిని ప్రేమించింది ఏంజిలిన్‌. అతడు డేటా సైంటిస్ట్‌. తెలుగు సినిమాల్లోలానే వారి విషయం తెలిసిన ఏంజిలిన్‌ తండ్రి ‘వాడిని మర్చిపోకపోతే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదు’ అని కూతురిని హెచ్చరించాడు. అయినా ఆమె వెనకడుగు వెయ్యలేదు. అవునుమరి, స్థితినీ గతినీ చూస్తే అది ప్రేమ ఎలా అవుతుందీ...

ఇది ప్రేమ యాత్ర

సైకిల్‌తో ఏకంగా ఎనిమిది దేశాలు దాటే ధైర్యం ఎవరైనా చేస్తారా... ప్రేమకోసం అతడు చేశాడు. ప్రస్తుతం స్వీడన్‌లో ఒరియా కల్చరల్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న ప్రద్యుమ్న కుమార్‌ మహానందియా తన ప్రియసఖిని కలుసుకునేందుకు స్వీడన్‌కి సైకిల్‌ మీద వెళ్లిపోయాడు. అతడి ప్రేమకథ ‘ద మ్యాన్‌ హూ సైకిల్డ్‌ ఫ్రమ్‌ ఇండియా టూ యూరప్‌ ఫర్‌ లవ్‌’ ప్రపంచవ్యాప్తంగా బాగా అమ్ముడైనపుస్తకాల్లో ఒకటి. ఒడిశాలోని ఓ గిరిజన పల్లెలో పుట్టిపెరిగిన ప్రద్యుమ్న 1971లో దిల్లీలోని ‘కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌’ కళాశాలలో చేరాడు. చదువుకుంటూనే ఖర్చుల కోసం కన్నాట్‌ప్లేస్‌ దగ్గర పర్యటకుల పెయింటింగ్‌లు గీసేవాడు. అలా ఓసారి తన బొమ్మ గీయించుకోవడానికి వచ్చిన స్వీడన్‌ అమ్మాయి ‘చార్లెట్‌ వన్‌ స్కెడ్విన్‌’తో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ప్రద్యుమ్నని ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పర్యటకురాలిగా వచ్చిన చార్లెట్‌ ఎంతకాలమని ఇక్కడే ఉండగలదు... అందుకే, తన దేశానికి వెళ్లిపోతూ ప్రద్యుమ్నను కూడా రమ్మంది. చదువు పూర్తిచేసుకుని వస్తానన్న ప్రద్యుమ్న, ఆమె విమాన టిక్కెట్లు పంపిస్తానన్నా వద్దన్నాడు. అయితే, తర్వాత సరిపడా డబ్బు కూడబెట్టలేకపోయాడు. కానీ చార్లెట్‌ని కలుసుకోవాలనేకోరికతో ఓ పాత సైకిల్‌ని కొని భారత్‌ నుంచి అఫ్గానిస్థాన్‌ మీదుగా రోడ్డు మార్గంలో స్వీడన్‌కి పయనమయ్యాడు. నాలుగు నెలలా మూడు వారాల పాటు నానా కష్టాలూ పడి ఎనిమిదిదేశాలు దాటుకుని సైకిల్‌ మీదే స్వీడన్‌కి చేరుకున్నాడు ప్రద్యుమ్న. అతడి గురించి తెలుసుకున్న అక్కడి అధికారులూ అవాక్కయిపోయారు. అసలు విషయం ఏంటంటే.. చార్లెట్‌ రాజవంశానికి చెందిన యువతి. ఆమె ఓ పేద భారతీయుడిని పెళ్లి చేసుకుందంటే వాళ్లకి నమ్మకం కలగలేదు. కానీ చార్లెట్‌ ఎంతో సంతోషంగా అక్కడికొచ్చి భర్తను ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకి పరిచయం చేసింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో కలసి ఆ జంట స్వీడన్‌లోనే ఉంటోంది. చిత్రకారుడుగా ప్రద్యుమ్నకు అక్కడ ఎంతో పేరుంది. అంతేకాదు, ప్రేమకోసం అతడు చేసిన సాహసాన్ని అందరూ కథలుగా చెప్పుకుంటుంటారు.

షాజహాన్‌ మళ్లీ పుట్టాడు

షాజహానే కాదు భార్యకోసం తాజ్‌మహల్‌ని కట్టించేవాళ్లు ఈ రోజుల్లోనూ ఉన్నారు! ఉత్తర్‌ప్రదేశ్‌, బులంద్‌షహర్‌లోని ఈ మినీ తాజ్‌మహలే అందుకు సాక్ష్యం. ప్రాణానికి ప్రాణమైన భార్య క్యాన్సర్‌తో మరణించడంతో తట్టుకోలేకపోయిన స్థానిక కసెర్‌కలన్‌ గ్రామ వాసి ఫైజుల్‌ హసన్‌ కాదరి ఆమె జ్ఞాపకంగా ఈ ప్రేమ మందిరాన్ని కట్టించాడు. రిటైర్డ్‌ పోస్ట్‌మాస్టర్‌ అయిన అతడికి పెన్షన్‌గా వస్తున్న రూ.15వేలు తప్ప మరో ఆదాయం లేదు. దాంతో పొదుపుచేసిన సొమ్ముతో పాటు పొలంలో కొంత భాగాన్ని అమ్మి మిగిలిన స్థలంలో ఓ పక్కగా 27 అడుగుల ఎత్తులో ఈ తాజ్‌మహల్‌ని కట్టించాడు. లోపల భార్య సమాధి పక్కనే తన సమాధికీ కొంత చోటు ఉంచుకున్నాడు. అయితే డబ్బు సరిపోక ఈ మినీ తాజ్‌కి ప్లాస్టరింగ్‌, టైల్స్‌ పని ఇంకా మిగిలే ఉంది. ఈ విషయం తెలిసి దాన్ని చూడ్డానికి వచ్చే పర్యటకులు ఆర్థికసాయం చేస్తామన్నా 81ఏళ్ల ఆ వృద్ధుడు ‘ఇది మా ప్రేమకు గుర్తు. నా సంపాదనతోనే పూర్తిచేస్తా’ అని చెబుతున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సాయం చేస్తానన్నా తనకేమీ వద్దనీ ఊళ్లో బడి కట్టించమనీ అడిగాడు కాదరి. అందుకోసం తాజ్‌ పక్కనున్న తన స్థలాన్నే విరాళంగా ఇచ్చాడు. అలా ఆ ప్రేమమందిరం పక్కన ఇప్పుడు పాఠశాల వచ్చింది. ప్రేమ ప్రేమనే పంచుతుంది మరి!

100% లవ్‌!

అమెరికాకు చెందిన టేలర్‌ మోరిస్‌, డేనియల్‌ కెల్లీ చిన్నప్పట్నుంచీ స్నేహితులు. పెద్దయ్యేసరికి ఆ స్నేహం ప్రేమగా మారింది. అయిదేళ్ల కిందట పెళ్లి చేసుకునేందుకూ సిద్ధమయ్యారు. అంతలో అమెరికా నేవీ విభాగంలోని బాంబు స్క్వాడ్‌లో పనిచేస్తున్న డేనియల్‌ ఉద్యోగంలో భాగంగా అఫ్గానిస్థాన్‌ వెళ్లాల్సొచ్చింది. అక్కడ ఉగ్రవాదులు అమర్చిన శక్తిమంతమైన బాంబు పేలి  అతడి కాళ్లూ చేతులూ పోయాయి.  అదృష్టవశాత్తూ డేనియల్‌ బతికాడు. విషయం తెలియడంతో టేలర్‌కి ఓ క్షణం ప్రపంచం తల్లకిందులైనట్లూ అనిపించింది. కానీ తను ప్రేమించింది అతడి దేహాన్ని కాదు, మనసుని. అందుకే,  డేనియల్‌ దగ్గరికి పరుగుతీసింది. దగ్గరుండి సేవ చేసింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అతడిని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే తన భుజాలమీద మోసుకెళ్లడానిక్కూడా వెనకాడదు టేలర్‌. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకేముంటుందీ...

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.