close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ పల్లెకు రుణభారం లేదు!

ఆ పల్లెకు రుణభారం లేదు!

వ్యవసాయం, పిల్లల పెళ్లిళ్లూ, చదువులూ... మొదలైన అవసరాల కోసం చేసే అప్పు ఒక్కోసారి ప్రాణాలకు ముప్పుగా మారేది. ఆ రుణభారాన్ని వదిలించుకోవడానికి పొలం, ఇల్లూ, చివరకు ఇల్లాలి పుస్తెల్ని సైతం అమ్ముకోవాల్సి వచ్చేది. ఇలాంటి సంఘటనలు తమ గ్రామంలో ఇక జరగకూడదని ఆ గ్రామ పెద్దలు నిర్ణయించుకుని గ్రామాన్ని పొదుపు బాటలో నడిపించారు.
పాతికేళ్ల కిందట ఆ ఊళ్లో దాదాపు ప్రతి ఇల్లూ అప్పుల భారాన్ని మోసేది. అవి తీర్చలేక ఇబ్బంది పడేవారంతా. దాంతో కొందరు నాయకులు 1992లో రంగారెడ్డి జిల్లాలోని మహిలార్‌దేవిపల్లికి వెళ్లి అక్కడ నడుస్తున్న పొదుపు సంఘాల పనితీరుని గమనించారు. కేవలం నెలకు రూ.5 పొదుపు చేసి తమలోతామే అప్పులిచ్చుకుంటున్న వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత వరంగల్‌ గ్రామీణ జిల్లా, నర్సంపేట మండలం రాజపల్లెలో అదే ఏడాది ‘ఆదర్శ పురుషుల పొదుపు సంఘం’ ఏర్పాటుచేశారు. 40 మంది సభ్యులూ, నెలవారీ పొదుపు రూ.25తో ప్రారంభమైన ఈ సంఘంలో నేడు 421 మంది సభ్యులుండగా, నెలవారీ పొదుపు రూ.50గా ఉంది. అదే ఏడాది 78 మంది సభ్యులతో ప్రారంభమైన ‘శ్రీ ఆదర్శ మహిళా పొదుపు సంఘం’లో ప్రస్తుతం 405 మంది సభ్యులున్నారు. ఒక సంఘంలో సేకరించిన మొత్తంలోంచి అవసరమైన సభ్యులకు రుణాలిస్తారు. దానికోసం వారు హామీ పెట్టాల్సిన అవసరంలేదు. ఈ సంఘాల్లో వడ్డీ నూటికి రూపాయి మాత్రమే. పురుషుల సంఘంలో సభ్యత్వం ఉన్నవారికి గరిష్ఠంగా రూ.2 లక్షల రుణం ఇస్తారు. సభ్యులు ఆ రుణాన్ని సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించాలి. ఈ సంఘంలో మొదట్నుంచీ ఉన్న ఓ వ్యక్తి ఇప్పటివరకూ చెల్లించిన మొత్తం రూ.13వేలు కాగా, వడ్డీద్వారా వచ్చే మొత్తం నుంచి అప్పుడప్పుడూ అందుకున్న మొత్తం(బోనస్‌) రూ.50వేలకుపైనే. దీన్లో సభ్యులకు రూ.55వేల జీవిత బీమా సదుపాయమూ ఉంటుంది. అదే, మహిళా సంఘంలో అయితే రూ.లక్ష వరకూ రుణం ఇస్తారు. వీరికీ రూ.40వేల జీవిత బీమా ఉంటుంది. ఈ సంఘాల్లో 60 ఏళ్లు వచ్చేంతవరకూ సభ్యత్వం ఉంటుంది. ఆ తర్వాత సభ్యత్వం రద్దవుతుంది. ఆ సమయంలో వారికి పొదుపుచేసిన మొత్తంతోపాటు రూ.2500 అదనంగా చెల్లిస్తారు.

పిల్లకాలువగా మొదలై...
రాజపల్లెలో పొదుపు ప్రక్రియ పిల్ల కాలువలా మొదలై ఇప్పుడు మహానదిగా పారుతోంది.  గ్రామంలో సంఘాలు స్థాపించినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రతి సభ్యుడూ, సభ్యురాలూ క్రమం తప్పకుండా పొదుపు చేయడంతోపాటు అప్పుగా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లిస్తూ వస్తున్నారు. గ్రామంలో సాధారణ పొదుపు సంఘాలే కాకుండా కొన్ని సామాజిక వర్గాలు ప్రత్యేకంగా పొదుపు సంఘాల్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఇంకా 65 ఏళ్లు నిండిన మహిళలకు ఆర్థిక ఆసరా ఇచ్చేందుకు ‘మైత్రి మహిళా పొదుపు సంఘం’ ఏర్పాటుచేశారు. ఇవన్నీ కూడా దాదాపు ఒకే విధానంలో పనిచేస్తాయి. పొదుపు బాట పట్టాక రాజపల్లెలో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతీ, యువకుడూ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉంటారు.

పొదుపు సమితి...
రాజపల్లెలో పొదుపు విప్లవం వెనక గ్రామానికే చెందిన మాజీ ఎంపీటీసీ నామాల సత్యనారాయణ, గ్రామ నాయకులు శశిరాజ్‌గోపాల్‌, వెంకటేశ్వరరావు, జయపాల్‌ రెడ్డి... తదితరులు ఉన్నారు. ప్రారంభంలో కొన్నేళ్లు తన ఇంటినుంచి పనిచేసుకునే అవకాశం ఈ పొదుపు సంఘాలకు ఇచ్చారు సత్యనారాయణ. మొదట్లో రశీదులు చేత్తోనే రాసి ఇచ్చేవారు. ప్రస్తుతం కంప్యూటర్‌ బిల్లులు ఇస్తున్నారు. ప్రతి సంఘానికీ 12 మంది సభ్యులతో పాలకవర్గం ఉంటుంది. వీరంతా ఉచితంగానే సేవలందిస్తారు. మ్యాక్స్‌ చట్టం ప్రకారం సంఘాలను రిజిస్ట్రేషన్‌ చేయించి ఏటా పాలకవర్గ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతి సంఘానికీ ఒక అకౌంటెంట్ ఉంటారు. వారికి గౌరవ వేతనం అందిస్తారు. రాజపల్లె స్ఫూర్తితో ముగ్దంపురం, కమలాపురం, లక్నె పల్లి, మహేశ్వరం, పినరావుపేట ఇలా 30 వరకూ గ్రామాలు పొదుపు బాటపట్టాయి. మరిన్ని ఆ ప్రయత్నంలో ఉన్నాయి. దీని వెనకా రాజపల్లె నాయకుల కృషి ఉంది. ఈ గ్రామాల్లోని సంఘాలన్నీ ఒక ‘సమితి’గా ఏర్పడి తమ దగ్గర మిగిలే మొత్తాన్ని ఆ సమితి ఆధ్వర్యంలో ఇచ్చిపుచ్చుకుంటారు. సమితి దగ్గర డబ్బు మిగిలితే బ్యాంకులో పొదుపు చేస్తారు. రాజపల్లె పొదుపు విప్లవాన్ని గుర్తించి ‘కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌
ఫౌండేషన్‌’ సంస్థ ఉత్తమ సహకార సంఘాలకిచ్చే ‘సహ వికాస’ అవార్డుని గ్రామంలోని రెండు పొదుపు సంఘాలకు ఇచ్చింది. భవిష్యత్తులో రాజపల్లె మరిన్ని అవార్డులు అందుకోవాలనీ, ఆ పల్లెను మరిన్ని పల్లెలు స్ఫూర్తిగా తీసుకోవాలనీ కోరుకుందాం!

- బాసాని శివకుమార్‌, న్యూస్‌టుడే, నర్సంపేట రూరల్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.