close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీ తిండి బంగారం కానూ...

సొమ్మున్నవాళ్ల తిండి సోగ్గా ఉండాలన్నది తప్ప నిజం చెప్పాలంటే స్వచ్ఛ బంగారానికి రుచీ ఉండదు. కుంకుమపువ్వులా పరిమళమూ లేదు. తింటే ఏమొస్తుందన్నదీ ఎవరికీ సరిగ్గా తెలియదు, కానీ వాళ్లు తిన్నారనో వీళ్లు తిన్నారనో పొట్టను శుద్ధి చేస్తుందన్న నమ్మకంతోనో గొప్పగా ఫీలై తెగ తినేస్తున్నారు. తింటున్నారు కదాని రెస్టరెంట్లు వాళ్లు పోటీపడి దోసెలమీదా పిజ్జాలమీదా బర్గర్లమీదా అందంకోసం పుత్తడిరేకుల్ని అంటించేస్తున్నారు. కేకులూ చాకొలెట్లూ ఐసుక్రీములూ కాఫీలూ టీలూ సరేసరి. ఒకప్పుడు సిల్వర్‌ వరఖ్‌లని అతికించినట్లుగా మిఠాయిలకీ పుత్తడిని అద్దేస్తున్నారు. గోల్డెన్‌ స్వీట్స్‌ పేరుతో మంగళూరుకి చెందిన ఓ మిఠాయి దుకాణంలో సాధారణంగా కిలో నాలుగైదొందల రూపాయలుండే స్వీట్లని సుమారు ఆరు వేల రూపాయలకి విక్రయిస్తున్నారట. మరీ అంత రేటా అంటే మేం 23.5 క్యారెట్ల రేకుల్నే వాడుతున్నాం అంటున్నారా దుకాణదారులు. కేవలం ఆర్డరుమీద మాత్రమే చేస్తారట. ఒక్కో స్వీటు ధర 300 నుంచి 400 వరకూ పడుతుందట మరి. హైదరాబాద్‌లోనూ కొన్ని రెస్టరెంట్లు బంగారు పూత పూసిన దోసెల్ని వేడివేడిగా అందిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో వైనూ షాంపేనూ వంటి... హాట్‌ డ్రింకుల్లోనూ గోల్డెన్‌ ఫ్లేక్సు కలుపుకుని తాగేస్తున్నారు. అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ‘గ్రాండ్‌ క్యూ’ పేరుతో 24 క్యారెట్ల బంగారాన్ని కలిపిన వైన్‌ను ప్రత్యేకంగా తయారుచేశారట. మిగిలిన గోల్డెన్‌ వైన్స్‌లో మాదిరిగా మన ప్రమేయం లేకుండా  వాటంతటవే కదులుతూ మెరవడం దీని ప్రత్యేకత.

‘పసిడి’చాపల్యం!
పసిపిల్లలకు వెండిబువ్వ తినిపించేందుకన్నట్లు సంపన్నులతోబాటు కాస్తో కూస్తో డబ్బున్నవాళ్లూ ఏదో తంటాలుపడి వెండిపళ్లాలూ వెండిగిన్నెల్లాంటివి కొంటుంటారు. సిల్వర్‌ వరఖ్‌ల పేరుతో వెండి తినడమూ తెలుసు. బంగారపు తిండి మన దగ్గర అరుదనే అనుకుంటాం. కానీ చిత్రంగా ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా బంగారాన్ని భుజిస్తున్నది మనమేనట. ఒకటీ రెండూ కాదు, ఏటా 12 టన్నుల బంగారాన్ని లాగించేస్తున్నాం. పెళ్లిళ్లూ వేడుకల సందర్భంలో- కొన్ని రకాల వంటకాలనీ, కేకులూ పేస్ట్రీల్లాంటి వాటినీ బంగారంతో అలంకరిస్తున్నారు. ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లోని అపర కుబేరులు పెళ్లిభోజనంలో అన్నంలో కూర వేసినట్లుగా గోల్డ్‌ఫ్లేక్స్‌నీ వడ్డించిన సంగతులు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దాంతో పసిడి తిండి ఓ విలాసవంతమైన ట్రెండ్‌గా మారింది. కానీ బంగారాన్ని తినడం అనేది ఈనాటిది కాదు, జపాన్‌లో కొత్త సంవత్సరానికి బంగారురేకులు అద్దిన వంటల్ని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఆరోగ్యానికి మంచిదన్న నమ్మకంతో పలుచని బంగారు రేకుల్ని టీలో వేసుకుని చప్పరిస్తారట. బంగారాన్ని భుజిస్తే మరణం ఉండదని చైనీయులు నమ్మితే, దేవతల ప్రీత్యర్థం ఈజిప్షియన్లు ఆహారాన్ని బంగారంతో అలంకరించేవారట. ఆరోగ్యమని భారతీయులూ, శృంగారప్రేరితమని పాకిస్థానీయులు తింటుంటారట. ఫ్రాన్స్‌, స్విట్జర్లాండుల్లో చాకొలెట్లూ ట్రఫెల్సూ... వంటి వాటిని గోల్డ్‌ ఫ్లేక్స్‌తో అలంకరించడం వాడుకలో ఉంది. పోలెండ్‌, నెథర్లాండ్స్‌లో వైనుల్లో కలపడం 16వ శతాబ్దంలోనే మొదలైందట.

సువర్ణ వైద్యం!
బ్యాక్టీరియాని తట్టుకునే శక్తి బంగారానికి ఉండటంతో అనేక వ్యాధుల నివారణకోసం మందుల్లో వాడేవారు సంప్రదాయ వైద్యులు. స్వర్ణ భస్మంతో కలిపి చేసిన అనేక రకాల ఔషధాల్ని ఆయుర్వేద వైద్యంలో తయారుచేయడం తెలిసిందే. బంగారాన్ని మందు రూపంలో వాడటాన్నే క్రిజోథెరపీ అంటారు. 1929లో జాక్వెస్‌ ఫారెస్టీయర్‌ అనే నిపుణుడు ఆర్థ్రయిటిస్‌ వ్యాధికి క్రిజోథెరపీ వల్ల ఫలితం ఉంటుందని ప్రయోగపూర్వకంగా తెలిపాడు. దాంతో ఆ తరవాత ఐరోపాలో బంగారు ఔషధంతోనే రుమటాయిడ్‌ ఆర్ధ్రయిటిస్‌ను తగ్గించేవారట. దీన్ని ఇంజెక్టు చేయడంవల్ల అరిగిన ఎముకలకు ఊతంలా ఉండి, అంటే మృదులాస్థిలా పనిచేసి, నొప్పుల్ని తగ్గిస్తుందట. ఇటీవల హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ చికిత్సల్లో బంగారులోహం పనితీరు గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ నిపుణులయితే క్యాన్సర్‌ చికిత్సలో వాడే మందుల్లోని బంగారు సమ్మేళనం గురించి పేటెంట్‌ కూడా తీసుకున్నారు. బంగారపు దంతాలను పెట్టించుకోవడం అనేది క్రీ.పూ. ఏడో శతాబ్దం నుంచీ ఉంది. ప్రస్తుతం గుండెకి అమర్చే పేస్‌మేకర్లూ చెవిలోని పరికరాలూ... వంటి వాటిని కూడా బంగారంతోనే తయారుచేస్తున్నారు. శరీరంలోని ఏ భాగంలో అమర్చినా శుద్ధ బంగారం వేటితోనూ చర్య పొందదు. రసాయనభాషలో చెప్పాలంటే ఇదో జడపదార్థం. కరగాలన్నా కూడా 1064.43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కావాలి. దాంతో జీర్ణ వ్యవస్థకు ఎలాంటి హానీ ఉండదు. ఈ కారణంతోనే విలాసవంతమైన హోటళ్లలోని షెఫ్‌లు, నగల డిజైనర్ల తరహాలోనే లక్షల రూపాయల ఖరీదు పలికే రకరకాల పసిడి వంటకాలను వండి, వడ్డించేస్తున్నారు.

ఎలా చేస్తారు?
తినొచ్చన్నారు కదాని గొలుసు కరిగించి నోట్లో వేసుకునేరు.... సాధారణంగా తినే బంగారాన్ని 23, 24 క్యారెట్ల బంగారంతోనే తయారుచేస్తారు. వస్తువుల్లో మాదిరిగా తినే బంగారంలో వెండి తప్ప మరే ఇతర లోహాన్నీ కలపరు. వెండి పొట్టలో పూర్తిగా జీర్ణమైపోగా, బంగారం మాత్రం 24 గంటల తరవాత విసర్జితమవుతుందట.
పైగా వెండి, ఇత్తడి... వంటి లోహాల మాదిరిగా బంగారం ఆక్సీకరణం చెందదు. అందుకే అది ఎప్పటికీ వన్నె తరగదు. మిగిలిన లోహాలతో పోల్చితే ఇదే మృదువైనది. దాంతో ఒక గ్రాము పుత్తడిని సుత్తితో కొట్టడం ద్వారానే చదరపు మీటరు పరిమాణం గల రేకులా ఎంతమాత్రం మెరుపు తగ్గకుండా తయారుచేస్తారు. దీని తయారీలో జపనీయులు సిద్ధహస్తులు. డెలాఫీ వంటి అంతర్జాతీయ బ్రాండెడ్‌ కంపెనీలే కాదు, స్థానికంగానూ అనేకమంది బంగారాన్ని పొడి, రజను, ఫ్లేకులు, రేకులు... ఇలా రకరకాల రూపాల్లో తయారుచేస్తుంటారు. రేకుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ముక్కలుగా తుంచి చల్లుకునేందుకు వీలైనవీ కేకుల్లాంటి వాటిమీద మొత్తంగా అతికించేల్లాంటివీ రెండు రకాలు ఉంటాయి. కొన్ని కంపెనీలయితే క్యాప్సూల్స్‌నీ చేసి విక్రయిస్తున్నాయి. కొందరు రాగి కూడా కలిపి చేస్తుంటారు. అందుకే కొనేటప్పుడు ఎలాంటి లోహాలూ కలపని స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే కొనాలన్నది గుర్తుంచుకోవాలి. ఏదిఏమైనా అందం, గొప్పతనం ప్రదర్శనలకోసమే ఆహారపదార్థాలని బంగారంతో అలంకరిస్తున్నారు. అదే అందులోని రహస్యం సుమీ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.