close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎక్కడిదాకా..?

ఎక్కడిదాకా..?
- నల్లూరి హేమకుమారి

నాకసలు నచ్చట్లేదు. కస్తూరి... నాతో చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయింది?
ఇంత సాహసం తనకసలు ఎలా అబ్బింది? బజారుకే తనొక్కత్తీ పోయేదికాదే!?
బాలేదని ఫోనొచ్చాక వెంటనే బయల్దేరానే. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాంట్‌ నుంచి
ఇంటికొచ్చేదాకా కూడా ఆగలేకపోయిందా? అసలు ఇక ఎప్పటికీ రాదా?
పిలవాలనుంది... మాట రావట్లేదు. లేవాలనుంది... చేతకావట్లేదు. ఏంటిది సగం సగం స్పృహ?
నేనిలా అయిపోయినందుకేమో వెంట కూడా తీసుకెళ్ళటంలేదనుకుంటా, కొడుకున్నాడు కదా అన్నిటికీను.
నలుగురు పట్టుకుని తీసుకెళ్తున్నారు. దొడ్లోనే నెత్తి మీదుగా నీళ్ళు కుమ్మరిస్తున్నారు. ఒంటిమీది బట్టలు తీస్తున్నారు... ఇక నాకేం తెలీదు. మెలకువ వచ్చేసరికి ఇంట్లో అంతా హడావుడిగా
ఉంది. నా దగ్గర అటొకరు ఇటొకరు మా అమ్మాయీ అబ్బాయీ కూర్చున్నారు- నా చేతులు పట్టుకుని. కస్తూరి తల్లీ తోబుట్టువులూ, నా తల్లీ తోబుట్టువులూ కాబోలు సన్నగా ఏడుస్తున్నారు. డాక్టరు వచ్చి వెళ్ళినట్టున్నాడు... నా చేతికి సెలైన్‌ ఎక్కుతోంది. ఈ వెలుగుగానీ స్పృహగానీ నాకు నచ్చలేదు. నేనున్నది నా ఇంట్లోనో కాదో కూడా కాసేపు అయోమయం. మంచమ్మీద కాదు అగాధంలో ఉన్నట్టు ఊపిరి ఆడట్లేదు.
అబ్బాయి కూడా నా దగ్గరే ఉన్నాడంటే అక్కడ అంతా ముగించుకుని ఇంటికొచ్చేసినట్టున్నారు. నేను తనవంక చూసేటప్పటికి మళ్ళీ బొటబొటా కన్నీళ్ళు కార్చాయి నా కూతురి కళ్ళు. ‘మేమేం చేయగలం నాన్నా’ అన్నట్టు చూశారిద్దరూను. అయితే జరిగింది నిజమేనన్నమాట. ఇది కలైతే బావుండేది. నేను అనుమతించకుండా వచ్చిన ఈ వెలితి తొంగిచూస్తేనే నాతో ఉండిపోతుందేమో అన్న భయంతో నా కళ్ళు మూతపడ్డాయి.
మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఇంటినిండా లైట్లు వెలుగుతున్నాయి. నెమ్మదిగా తలతిప్పి చూస్తే గోడమీది గడియారం మూడు మీద ఉంది. నా కూతురు నా చేయి పట్టుకునే నా మంచమ్మీదే తలవాల్చి నిద్రపోతోంది. బాగా అలసిపోయింది పాపం. చుట్టూ చూస్తే
కింద పడుకుని మా పిన్నీ, గోడకానుకుని మా అక్కా, బాబాయీ నిద్రలో ఉన్నారు - నన్ను కనిపెట్టుకుందుకు కాబోలు. నేను వేరూ, నా ఒళ్ళు వేరూ అన్నట్టుంది. కదుల్చుదామన్నా శరీరంలో
ఏ అవయవమూ కదలటం లేదు. ఎటుచూసినా శూన్యంలా ఉంది. నాకు మలేరియా జ్వరం తగిలి ఇరవై రోజులు మంచమ్మీదున్నప్పుడు కూడా శరీరానికి ఇంత నీరసం కలగలేదు. అంటే కస్తూరి అంటే నాకంత ప్రేమా?
‘నేను లేకపోతే నీకు రోజు ఎలా గడుస్తుంది’ అని నేను కదా తనను అస్తమానం తిట్టేది?
ఈ ఒళ్ళేమిటిలా నా మాట వినకుండా జావగారిపోతోంది?
మళ్ళీ ఒకసారి కస్తూరి మీద చివ్వున కోపం రేగింది. అలా ఎలా చెయ్యగలిగింది? నేననేవాణ్ణి ఉన్నానన్న గుర్తును ఏ గాలికి వదిలిపెట్టింది? నేను ఈ నిర్లక్ష్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నాకెంత కోపం... ఎంత వదరుబోతుతనం! నాకు చెప్పకుండా పక్కింటికెళ్ళి నేనొచ్చేవేళకి ఇంట్లో లేదని
మా పెళ్ళయిన కొత్తల్లో తనతో పదిహేను రోజులు మాట్లాడలేదు. అప్పుడు తనెంత ఏడ్చింది! ఎన్ని రోజులు తినలేదో చిక్కి శల్యమైపోలేదా? ఆ భయంతో ఎప్పుడూ ఎక్కడికీ చెప్పకుండా వెళ్ళడం కానీ, నా మాటకి ఎదురుచెప్పడం కానీ చేయనేలేదు. ఇప్పుడేంటీ ఇంత ధైర్యంగా? తనమీద అరవాలనుంది.
చాలా చిన్నప్పుడే కాపురానికొచ్చింది. నాదీ పెద్దగా ఆరిందాతనం రాని వయసు మూలానో ఏమో, తనని తననుగా ప్రత్యేకించి గౌరవించడమో, ప్రేమించడమో పెద్దగా చేయలేదు. ఎప్పుడూ ఇంటినిండా జనం. అరుదుగా ఎప్పుడైనా తనకోసం ఏదైనా చేద్దామన్నా ఏదో ఇగో. ఎప్పుడూ తన ఇష్టమేమిటో ప్రత్యేకించి తెలుసుకోనేలేదు. ఏదడిగినా తాత్సారం చేసి ఎప్పటికో తెచ్చిపెట్టడం. అవును, నేను మగాడిని, ఇలాగే ఉంటాను, తనకేమొచ్చింది? ఇన్నాళ్ళూ నేనెలా ఉంటే అలాగే భరించింది కదా. అన్ని విషయాల్లోనూ నన్ను అందరిముందూ గర్వంగా నిలబడేలానే చేసింది కదా. ఇప్పుడేంటి ఇలా నవ్వులపాలు చేసింది? ఇంట్లో చాకిరీ చేయలేక ఎప్పుడైనా నాలుగు రోజులు ఉండివస్తానని తను అడిగినా వాళ్ళమ్మగారింటికి కూడా పంపించేవాణ్ణి కాదు. అలాంటిది, నన్ను ఒంటరిని చేసి అలా వెళ్ళడమేంటి? ఎక్కడికని వెళ్ళి అడిగిరాను? అయినా నేనిప్పుడిప్పుడే మారదామనుకుంటున్నాను కదా. తన చేతి కూడేగా నేను తింటున్నాను. ఆ విషయం తనకు తెలీదా? ఇంతమందిముందు నన్ను అవిటివాణ్ణి చేసి నించోబెట్టింది?
అమ్మాయికీ అబ్బాయికీ రెండేళ్ళక్రితమే పెళ్ళి చేశాం. రెండు జంటలూ అన్యోన్యంగా ఉంటారు. పిల్లల్ని చూశాకే భార్యతో కొంత స్నేహంగా ఉంటే బావుండనిపించింది. కానీ చిన్నప్పటి నుంచీ ఉండిన అహం ఒక్కసారే పోవాలంటే పోదు కదా. తను వెయిట్‌ చేయలేకపోయిందా?
నా వ్యాపారం కోసం తన బంగారం అంతా అమ్మేశా. తరవాత బాగా సంపాదించాక కూడా తను చాలాసార్లు అడిగితేగానీ కొనలేదు. తను ‘ఏవండీ ఫంక్షన్లప్పుడు ఒంటిమీద నాలుగు నగలు లేకపోతే చుట్టూ ఉన్న ఆడవాళ్ళు సరిగ్గా పలకరించరండీ. చిన్నచూపు చూస్తారు’ అని బాధపడేది. చాలా కటువుగా ‘నువ్వేం జమీందారు బిడ్డవి కావులే’ అని కొట్టిపడేసేవాణ్ణి. చూసిచూసి ఓసారి ‘మరి మీరు సంపాదించారన్నది లోకానికి ఎలా తెలుస్తుంది? మీ భార్య కట్టుకున్న చీరా, పెట్టుకున్న నగే కదా మీ స్థాయిని ఊరికి చెప్పేది’ అంది. అప్పుడు ‘అబ్బో, చాలా తెలివితేటలొచ్చాయే... వేసుకుని ఊరేగాలనుంది అని చెప్పరాదూ’ అంటూ చాలా కటువుగా తుంచిపడేశా. తనెంత అందంగా అడిగింది... నేనెంత అసహ్యంగా కాదన్నాను? మరెప్పుడూ ఆ మాట తేలేదు తను. అప్పటికే మా అమ్మాయి ఇంటరు.
ఆ తరవాత కొన్నా తన ముచ్చట తీరకుండానే అవన్నీ అమ్మాయికి పెట్టి అత్తారింటికి పంపించడం జరిగింది.
ఎప్పుడూలేంది ఏమిటీ ఆత్మావలోకనం? ఇదీ నాకు విసుగ్గానే ఉంది. అయినా ఎవరో వచ్చి తెరలేపుతున్నట్టు పాతవేవో గుర్తుకొస్తున్నాయి. ఈమధ్యే ఊరి నుంచి అమ్మనీ నాన్ననీ, మా పెద్దమ్మనీ తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాను. ముగ్గురికీ అన్నీ మంచందాకా పట్టుకెళ్ళి అందించాల్సిందే. ఊళ్ళో బంధువుల మధ్య మంచి పేరుంటుందని దగ్గరవాళ్ళ పిల్లలందర్నీ ఇంట్లో పెట్టుకుని చదివించాను. ఎప్పుడూ పదిమందికి వండిపెడ్తూ ఎంతో కష్టపడేది. విచిత్రంగా - తను కష్టపడిందనేది
ఇప్పుడు తడుతోంది కానీ నిజానికి, బయటినుంచి నేను తెచ్చిపడేస్తుంటే వండి పెట్టటానికేమిటనే అనుకునేవాణ్ణి.
ఇప్పుడు గుర్తొకొస్తోంది... ఎప్పుడో ఏడాదిలో రెండు మూడుసార్లు హోటల్‌కి తీసుకెళ్ళినా నాకేం కావాలో అదే ఆర్డరిచ్చేవాడిని తప్ప, తనకేం కావాలో ఎప్పుడూ అడగలేదు. తనే ఓసారి చెప్పింది ‘పిల్లలు ఎదిగారు, వాళ్ళకీ ఇష్టాలుంటాయి. ఆర్డరు వాళ్ళకి వదిలెయ్య’మని. అప్పుడూ తనకోసం నేను ఆలోచించలేదు. వంటగది తనదే కదా... కావాలంటే వండుకోదా? ఏమో నేను తినకపోతే తను తినకపోవడం చూశాను కానీ, కావాల్సిందంటూ వండుకోవడం చూసిన గుర్తులేదు. ఇప్పుడీ ముసలోళ్ళందర్నీ ఎవరు చూస్తారు? నాకు మంచినీళ్ళు ముంచుకోవడమే రాదు కదా? అయినా తనని అడిగి వీళ్ళందర్నీ తీసుకొచ్చానా? నాకంటే ముందువాడు అన్నయ్య ఉన్నాడు కదా. వదిన చూస్తానంటుందో లేదో తెలీదు. వాడెప్పుడూ ఇంటి బాధ్యతలు నెత్తినేసుకోలేదు. ఊళ్ళో నాకెంత మంచిపేరు! చెల్లెళ్ళ బాధ్యతంతా నేనే మోశా... కాదు కాదు కస్తూరే.
నాకు నామీదకంటే కస్తూరి మీదే అధికారంగా ఉండేది. అది ఇప్పటివరకూ నా సమర్థతే అనుకునేవాణ్ణి. నా సమర్థతే అయితే ఇప్పుడిలా ఎందుకయింది? నా అనుకున్న వస్తువును నన్నడక్కుండా అలా ఎలా లాక్కుపోతారు ఎవరయినా? నన్ను నన్నుగా తను మన్నించిన మూలాన కాబోలు ఇన్నాళ్ళ నా గెలుపు. తను చెయ్యగలదని నమ్మేగా ఎన్ని బాధ్యతలైనా తనమీద పెట్టింది? ఆమాత్రం అర్థంచేసుకోలేదా?
అయినా ఈమధ్యే అనుకుంటున్నా తనని అటూ ఇటూ యాత్రలకి తిప్పాలని. ఏమో ఇది కూడా నిజం కాదనుకుంటా.
నా స్నేహితులు వెళ్తున్నారని స్టేటస్‌ సింబల్‌గా నేనూ చూడాలని అవే ప్రదేశాలకి తీసుకెళ్ళాలనుకున్నానేమో. తనని అడగలేదుగా నీకేం చూడాలని ఉందని. అయినా తనకి బంగారం కొనాలని అనుకుంటున్నట్టు ఈమధ్యే చెప్పాగా. తను నవ్వుతూ ‘మన చుట్టాలూ స్నేహితుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళన్నీ అయిపోయాయి. మీరు కొంటేమటుకు ఎక్కడికి వేసుకెళ్ళాలని?’ అంది. నాకు ముల్లు గుచ్చుకున్నట్లయింది. అయినా తమాయించుకోలా నేను? తను ఎందుకింత పనిచేసింది?
నాకు చాలా మంచిపేరు అందర్లో - స్నేహితులూ చుట్టాలూ ప్లాంట్‌లో వర్కర్స్‌ దగ్గరా - అందర్నీ బాగా చూసుకుంటానని. అలా చూడటం కోసం అవసరమై కొన్నిచోట్లా అవసరం లేకుండా కొన్నిచోట్లా ఆమెను చాలా చిన్నచూపు చూశాను నేను. చాలా చిన్నచిన్న విషయాల్లో కూడా బాగా నలిగిపోయిందనేది ఈమధ్యే... నాక్కొంచెం కోపం తగ్గాక, అల్లుడూ కోడలూ వచ్చాక - నవ్వుతూ తను అంటుంటే తెలిసేది. నేను దిద్దుకుందామనుకున్నాను కదా!? మా అమ్మా చెల్లెళ్ళూ తనని చాలా మాటలనేవాళ్ళు. నేనెప్పుడూ ఓదార్పుగా కూడా
ఓ మంచిమాట అనలేదెందుకనో.
వదినలో లేని చాలా మంచి గుణాలు ఈమెలో ఉన్నా- ఎందుకని నేనెప్పుడూ తనని అభినందించలేదు? తను అలా ఉండటం నా హక్కు అన్నట్టే ఉండేది.
ఈమధ్య... ఈమధ్యే తను చాలా లోట్లు పడుతూ నన్ను పూరించిందని అర్థమయింది. నన్ను పూర్తిగా చదువుతుందేమో అన్నట్లు ఇంతకాలం నడిచింది కదా. మరి నేను తనకేమేమో చెయ్యాలనుకుంటున్న విషయాన్ని చదవలేదా? తను కోరినప్పుడు ఇవ్వలేదని ఇప్పుడు తీసుకోవద్దనుకుందా? ఎప్పటికీ నా ఆజ్ఞల్ని నెరవేర్చే సైనికుడిలా వెంట ఉంటుందనుకున్నానే? నా ఆలోచనకు రూపమిచ్చే పనిముట్టులా ఉంటుందనుకున్నానే... ఇదేంటి ఇలా?
ఏమో నా ఇష్టం... తన మనస్సునీ శరీరాన్నీ ఆత్మగౌరవాన్నీ పైకెత్తుకుంటే ఎత్తుకుంటా, తుంగలో తొక్కుకుంటే తొక్కుకుంటా అన్నట్టు- వాడినప్పుడంతా నాతో ఉండి ఇప్పుడు మన్నించుకుందామనుకునేటప్పటికి ఇలా చేసిందేమిటి?
ఎప్పుడూ పల్లెత్తుమాట అనని కస్తూరి చేసిన ఈ పని నన్ను ఎడమకాలితో రొమ్ము మీద తన్నినట్టుగా లోపల బాధ మెలిపెట్టేస్తోంది. నన్ను శిక్షించాలనే చేసిందా ఈ పని? ఇన్నేళ్ళబట్టీ మనసా వాచా కర్మణా పీడనకు గురిచేశానని తెలిసింది కానీ, ఇంత పెద్దగా ఆమె రివెంజ్‌ తీర్చుకుంటుందని అనుకోలేదు. మనోవాక్కాయ కర్మలతో ఎప్పుడూ ఆమెను ఉన్నతంగా ఉంచాలనుకోని నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది కాదు. నన్నెవరి దగ్గరా తక్కువచేసి మాట్లాడేదీ కాదు కదా... ఒక్కసారిగా నట్టేట్లో ముంచేసిందేమిటి?
బండి దిగినట్టున్నారు ఒంగోలువాళ్ళు. ‘ఆరోగ్యంగానే ఉండేది కదా బావగారూ... అక్కకి హార్ట్‌ అటాక్‌ ఏంటండీ’ అంటూ బావురుమంది మా చిన్నత్తగారి అమ్మాయి. ఏమో ఆ గుండెనిండా ఎన్ని అవమానాలూ అవహేళనలూ చీకూచింతలూ దాచుకుందో తెలీదు కదా. నేనెప్పుడైనా చదివితేనా?
‘అన్నీ ఉన్నయ్యనుకోవటమేగానీ మా అక్కకి ఏమీ తీరలేదు. దినకర్మలైనా ఘనంగా చెయ్యండి బావగారూ’...నా మరదలి మాటలు నన్నింకొంచెం ఆత్మన్యూనతలోకీ, అవమానమనే నరకంలోకీ నెట్టేశాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.