close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాంపాహి మహేశ్వరా..!

మాంపాహి మహేశ్వరా..!

‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టద’ని విశ్వసించి ఎనలేని నిశ్చింతను పొందినా... ‘శివరాత్రితో చలి శివ శివా అంటూ పోతుంద’ని ప్రకృతి మార్పును నానుడిగా ఏటా మురిపెంగా గుర్తుచేసుకున్నా... ఆఖరికి అశుభవాక్కులు వినపడినప్పుడు ‘శివశివా’ అని చెవులు మూసుకునే సున్నితత్వాన్ని ప్రదర్శించినా... తరతరాల తెలుగువారి సాంస్కృతిక జీవితంలో బోళాశంకరుడిది ప్రత్యేక స్థానం. జానపద కళల్లో, బైరాగి తత్వాల్లో, పాటల్లో, ఆటల్లో ఆ నటరాజ ముద్ర ప్రస్ఫుటం. అందుకే ఆ ఆదిదేవుడి తత్వం నేటికీ ఒక జీవన మార్గం.
హాలాహలాన్ని కంఠంలో, అగ్నిని ఫాలనేత్రంలో దాచుకుని కూడా చల్లని వెన్నెల్లాంటి వరాలు కురిపించే విలక్షణ దైవం హరుడు. భేషజాలకూ వైభవాలకూ దూరంగా నిరాడంబర జీవిత ప్రాముఖ్యం తెలిపి, లౌకిక జీవితంలోని మనందరికీ దారి చూపే తత్వం శివతత్వం. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, సమస్త జీవరాశి పట్లా దయతో మెలగడం, ప్రేమను నలుగురితో పంచుకోగలగడం... ఇవన్నీ ఆ తత్వంలో అంతర్లీనంగా కనిపించే అంశాలే. ఉన్నతికి దోహదపడే సోపానాలే.
పాలసముద్రము సిల్కెయాళ
నిను పాగల్‌గానిగ జేస్తిరయ్య!
అమృత మిడిసిపెట్టి ఇషమా..?
శబ్బాష్‌రా... శంకరా!!
అంటూ... తనికెళ్ల భరణి ‘ఆటగదరా శివా’లో ఆ దేవదేవుడి గురించి ఎంత చక్కగా చమత్కరించారు.
అమృతాన్ని సేవించేటప్పుడూ, అంతా కలిసి విందులూ, వినోదాలూ చేసుకునేటప్పుడూ అక్కడ శివుడి ఊసే ఉండదు. కానీ లోకాన్ని గడగడలాడించిన గరళాన్ని తాగాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరికీ శంకరుడే కావాలి. అయినా సరే విషాన్ని తాగేందుకు ఒక్క క్షణం ఆలోచించడు ఆ దేవదేవుడు. పట్టుబట్టలు కట్టే దేవుళ్లలో త్రిశూలధారి పేరే ఉండదు. కానీ మందమైన కరి చర్మం కట్టాలంటే అతడే దిక్కు. గంగస్నానాల పుణ్యం అందరికీ కావాలి కానీ ప్రళయ రూపంలో వచ్చే గంగమ్మను అడ్డుకోవాలంటే శివయ్యే రావాలి. భక్తుల వేషంలో వచ్చి కోర్కెలు కోరిన రాక్షసులకైనా వరాలిచ్చే శంకరుడి లాంటి బోళాదేవుడు, దీనబాంధవా నీవే దిక్కని వేడినంతనే కరిగిపోయే అల్పసంతోషీ ఇంకెక్కడా కనిపించడు. అలాంటి నవనీత హృదయుడిని శరణు శరణని మోకరిల్లితే చాలు వశుడైపోతాడు, పరమసంతోషంతో నెత్తినపెట్టేసుకుంటాడు.

నిరాడంబరం...
దేవదేవుడూ, పశుపతీ అయిన ఆ పరమేశ్వరుడు ఆడంబరాలకు దూరంగా ఉంటాడు. భిక్షాటనే జీవనాధారం. రుద్రభూమే శాశ్వత స్థానం. ఎప్పుడూ పులితోలు కప్పుకుని తిరుగుతుంటాడు. ఆభరణాల ఊసేలేదు సరికదా విషపునాగులను మాలలుగా ధరించి మురిసిపోతుంటాడు. రుద్రాక్షల్ని దండలుగా గుచ్చుకుని హారాలంటాడు. పోనీ, సిగలోని చంద్రుడినైనా చూసి ముచ్చటపడదామంటే అదీ కుదరదు. ఆ జడలను పట్టుకు వేలాడేవాడు వెన్నెల సోనలు వెదజల్లే నిండు చంద్రుడేం కాదు కళాకాంతీలేని సన్నని చంద్రవంక. రంకెలేయలేని ముసలి ఎద్దే వాహనంగా ఊరేగుతాడు. ఇక శివుడి చుట్టూ ఉండే పరివారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకటో రకం ప్రమథ గణం. నందికి నందే సాటి, భృంగికి భృంగే పోటీ. వీరినే మగపెళ్లివారిగా తీసుకుని పర్వత రాజు ఇంటికి ధూంధాంగా బయలుదేరాడట పశుపతి. వియ్యాలవారు ఈ దండు మొత్తాన్నీ చూసి ముక్కునవేలేసుకున్నారట. పర్వతరాజు వీరిని ఎలా సంబాళించుకురాగలడోననీ, పార్వతి సంసారం ఎలా సాగుతుందోననీ భయపడ్డారట. ఇంత సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నవాడు జగతికి ఏ రీతిన సందేశమివ్వగలడని సంశయించవచ్చు. అక్కడే ఉంది చిదంబర రహస్యం. కలియుగంలోని మనుషుల తీరు చంద్రశేఖరుడికి తెలిసినట్టుగా మరొకరికి తెలీదు. వెయ్యి చెబితే పదో పరకో అవగాహన చేసుకునే మనస్తత్వం మనది. కాబట్టే తనను తాను తక్కువగా చేసుకున్నట్లు కనిపిస్తూ నేలమీద నడవడమంటే ఇదేనంటూ మనిషి జీవితం ఇలానే ఉండాలంటూ సందేశాన్ని అందిస్తున్నాడు. ‘మామూలు మనుషులుగా ప్రేమ స్వరూపులుగా మెలగండి, ఆడంబరాలను నెత్తికెక్కించుకోకుండా మానవత్వంతో జీవించండి’ అనే హితోక్తులను తన ప్రవర్తన ద్వారా అందరికీ చెబుతున్నాడన్నమాట.

అర్ధనారీశ్వరం...
జగతికి తల్లీతండ్రీ అయిన శివపార్వతులు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేరు. విచిత్రమేంటంటే ఆదిదంపతులైన వీరివి భిన్న నేపథ్యాలు. పార్వతీ దేవి హిమవంతుని కుమార్తె. సిరిగలవారింట పుట్టిన పిల్ల. యువరాణి. బాల్యం నుంచీ భోగభాగ్యాలు అనుభవించింది. కానీ, జంగమయ్యను చేరాక అదంతా మటుమాయమైపోయింది. వల్లకాడులో సంసారం నడపమంటాడు. భవతీ భిక్షాందేహీ అంటూ కపాలం పట్టుకుని ఊరంతా తిరుగుతుంటాడు. రూపమయినా చక్కనిదా అంటే అదీకాదు. ఎగుడు దిగుడు కన్నులతో ఉంటుంది. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు, తక్కువచేసి మాట్లాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకల మీదికి తెచ్చుకుంటాడు శివుడు. కానీ ఆయన్ని పల్లెత్తుమాటయినా అనని మహా ఇల్లాలు పార్వతి. కఠోర తపస్సుచేసి మరీ శివుడిని తనవాడిగా చేసుకున్న ఆ తల్లికి ఆయన గురించి తెలియనిది అంటూ ఏదీ ఉండదు కదా! గంగమ్మను తెచ్చి సిగలో ఉంచుకున్నా లోకం కోసమే శివయ్య ఆ పని చేశాడని అర్థం చేసుకోగలిగింది. తనకంటే ప్రమథగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ మరోలా ఆలోచించలేదు. తనను నమ్మినవారిని నట్టేట ముంచని భర్త ప్రవర్తనను గర్వంగా చెప్పుకుంది. క్షీరసాగరాన్ని
మధించే వేళ అమృతం పుడితే ఎవరో తాగుతారట. కామధేనువూ, కల్పతరువూ వేరెవరో తీసుకుంటారట. కానీ, కాలకూటం వెలువడినప్పుడు మాత్రం తన భర్తదగ్గరకే పరుగులు తీస్తారట. అయినాసరే కట్టుకున్నవాడు చేస్తున్న పని లోకరక్షణ కోసమే అయినప్పుడు తన పసుపుకుంకాలకు ఢోకా ఉండదన్న ధైర్యం ఆమెది. లయకారకుడయిన పతిని ఏ విషమయినా ఏం చేయగలుగుతుందని తనను తానే సమాధాన పరుచుకుంది. సర్వమంగళ అయిన తనకు చింత ఎందుకని సర్ది చెప్పుకుంది.
శంకరుడు నిశ్చలంగా విషాన్ని సేవిస్తుంటే ఆయన పక్కన అంతకంటే నిశ్చింతగా నిలవగలిగింది. రాయిలాంటి భర్తను రాగమయుడిగా, అనురాగమయుడిగా, ప్రేమస్వరూపుడిగా చేయగలిగింది. సదాశివుడూ అంతే, ఏ సందర్భంలోనూ సతికి అడ్డుచెప్పింది లేదు. ఆమె నిర్ణయాలను కోరికలను ప్రశ్నించిందీ లేదు. ఆమె స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఆమెవే అనుకునేవాడు. ఈశ్వరుడు జటాధారిగా, తోలుదుస్తులతో నడయాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో సర్వాలంకారశోభితయై అలరారుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆది దంపతులుగా వీరు జగత్ప్రసిద్ధమైంది ఇందుకే.

భక్తికి వశం...
శివుడిని శరణు కోరిన మార్కండేయుడు యమపాశం నుంచి బయటపడి చిరంజీవి అయ్యాడు. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన అనంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగర తీరంలో సైకత లింగాన్ని ప్రతిష్ఠించి, అర్చించి పాపవిముక్తుడయ్యాడు. శివుడికి తన కన్నులనే అర్పించిన తిన్నడు భక్తకన్నప్పగా ప్రసిద్ధి చెందాడు... ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో మహాభక్తుల చరితలు మనకు దృష్టాంతాలుగా కన్పిస్తాయి. అలాంటి నిగర్వి, నిరాకార, నిర్గుణ, నిరాడంబరుడైన నిలాక్షుడి ప్రేమానురాగాలు తెలిపే గాథలు అనంతం. ఎల్లలు లేనిది ఆయన మమకారం. ‘శివా’ అని ఆర్తిగా పిలిస్తే, మరుక్షణం చెంతనిలిచే ఆశ్రిత వత్సలుడాయన. అంతేనా, ఆ భక్తవశంకరుడి వాత్సల్యానికి సురాసుర భేదం లేదు. అందుకే కదా, భస్మాసురుడు ఆ నీలకంఠుడి నుంచి అవలీలగా వరాన్ని పొందగలిగాడు. ఎవరి తలమీద చెయ్యి పెడితే వాడే బుగ్గయి పోతాడన్న భరోసా దక్కించుకున్నాడు. శివుడి మీదనే ఆ వరబలాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అప్పుడిక ఆ రాక్షసుడి బారినపడకుండా తప్పించుకునేందుకు ఆ కైలాసనాథుడు నానాయాతనా పడాల్సివచ్చింది. రావణాసురుడూ అలాగే కదా ఆ పరమపావనుడిని ప్రసన్నం చేసుకున్నది. ఇక్కడే అంతర్లీనమైన ఒక ధర్మసూక్ష్మం ఉంది. దుష్టుల పట్ల జాగరూకతతో మెలగడం మనిషిలక్షణం. దుర్మార్గుడిని సైతం ప్రేమించగలగడం దైవత్వం. పశుపతి అసలైన దైవం కాబట్టే రాక్షసుల విషయంలోనూ దయనూ ప్రేమనూ ప్రకటించగలిగాడు. ఆ దిశగా యోచన చేసి తీరాలంటూ మానవాళికి హితవు చెప్పాడు.

మనలోని దైవం...
శివుడిని ప్రథమ దేవుడూ దేవాది దేవుడూ మహాదేవుడూ అంటూ ధ్యానించినా దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో అని కీర్తించినా ఆయనలోనూ మనిషికి మల్లేనే కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. కామం, క్రోధం, వాత్సల్యం, హాస్యచతురత, అనంతమైన ప్రేమ, అంతులేని అనుగ్రహం ఆయనలోనూ అగుపిస్తాయి. తనను ఒకింటివాడిగా చేద్దామని ప్రయత్నించిన మన్మథుడిని దహించివేస్తాడు శంకరుడు.  రతీదేవి బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్న తర్వాత కానీ మదనుడికి మరో జన్మ దక్కలేదు. ఈశ్వరుడు కోపంతో చేసినా, ప్రేమతో చేసినా ఆయన చేసిన ప్రతీ పనీ జగత్కల్యాణ కారకమవుతుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలా మనిషే శివుడూ దేవుడే మానవుడూ అని చాటిచెప్పడం వెనక కారణం లేకపోలేదు. ఎవరైనా ఎవరితోనయినా సరిపోల్చుకోవాలంటే పోలికలుంటేనే సులభవుతుంది. మనలాంటి వాడే శివుడూ అనుకుంటేనే అతగాడిని పలకరిస్తాం, నమస్కరిస్తాం. ఆయన దారిలో వెళ్లడం మొదలెడతాం. ఆయన తత్వాన్ని మనతత్వంగా మలచుకుంటాం. మహనీయులుగా రూపాంతరం చెందుతాం. ఇంతటి మార్మిక తార్కిక సిద్ధాంతం పార్వతీపతిలో లీనమై ఉంది. కాబట్టే, శంకర భగవత్పాదులు ‘శివ’ అనే రెండక్షరాలు పలికితే పాపాలన్నీ పటాపంచలయి పోతాయని చెప్పారు.

స్త్రీవాదం...
కైలాసనాథుడిని మించిన స్త్రీవాది, మహిళాపక్షపాతి మరొకరు ఉండరని చెప్పడానికి ఉదాహరణలు అనేకం. ఆడవారు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మనం ఇప్పుడు ప్రసంగాలిస్తున్నాం. కానీ, యుగాలనాడే ఈ వాదన వినిపించడమే కాదు, ఆచరణకు దిగిన ఆదిదేవుడు ఆయనే. తనలో అర్ధభాగాన్ని ఇచ్చానని ఈశ్వరుడెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సహజంగా, స్వతంత్రంగా ఆయన దేహంలో ఆమె కలిసిపోయింది. అలా ఆమె కలవడానికి అనువుగా మనసా వాచా కర్మణా తనను తాను మార్చుకోగలిగాడు. అంతెందుకు... ప్రదోషవేళలో తానొక్కడే ఆడిపాడి ఆనందించడు. నటరాజుగా నృత్యకేళీ విలాసాల్లో తేలుతున్నప్పుడూ శంకరుడు ఒంటరి కాదు. ఆదిశక్తితో కలిసి నర్తిస్తూ మహదానందభరితుడవుతాడు. ఆ ఆటను చిత్కళగా భావించి గౌరవిస్తాడు. అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఈ ముక్కంటికి మించిన స్త్రీవాది ఎవరుంటారు? ఇంకా చెప్పాలంటే పార్వతమ్మ ముచ్చటపడి తయారుచేసి, ప్రాణం పోసి మరీ ఇంటి ద్వారపాలకుడిగా నియమించుకున్న బాలుడిని రెండు ముక్కలుగా చేసేస్తాడు ముక్కోపి. విషయం తెలిసి ఆమె ఘొల్లుమంటుంది. ఆమెను శాంతింపజేయడానికి ఏనుగు తలను తెచ్చి మరీ పిల్లాడికి అతికిస్తాడు. వినాయకుడిగా అక్కున చేర్చుకుంటాడు. గణాధిపతిగా అధికారాన్ని కట్టబెడతాడు. భార్యకు అంతగా విలువనిచ్చే పతి మహేశ్వరుడు.

ప్రకృతే రూపం...
సదా ధ్యానముద్రుడై కనిపించే ఆ పరమ శివుడి రూపం, ఆభరణాలూ, ఆయుధాలూ... ప్రతీదీ ఓ ప్రతీకే. త్రిశూలం సత్వ రజః తమో గుణాలకు ప్రతీక. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్థ చింతనకు మరోరూపం. ఏనుగంటే నిలువెత్తు గర్వం. వాటన్నింటినీ జయించినవాడు శివుడు. మనమూ వీటిని విడనాడాలి అని తెలిపేదే శివతత్వం. నంది ధర్మానికీ, సర్పాలు నిర్భయత్వానికీ నిదర్శనం.

ఆద్యంతరహితుడూ పంచభూతాత్మక స్వరూపుడూ అయిన మహా శివుడిని ‘నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంతో ధ్యానిస్తాం. ఈ మంత్రంలోని అయిదు బీజాక్షరాలూ విశ్వంలోని పంచభూతాలకూ ప్రతీకలు. ఇందులో న - భూమి, మః - జలం, శి - వాయువు, వా - అగ్ని, య - ఆకాశతత్వాలకు సూచికలుగా నిలుస్తున్నాయి. ఈ పంచభూతాల రూపాల్లో వెలసిన పంచభూత లింగాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నాయి. కంచిలో ఆ ముక్కంటి పృథ్వీలింగ రూపంలో ఆవిర్భవించాడు. తిరువణ్ణామలైలో తేజోరూపంలో ఉన్న అరుణాచలేశ్వరుడు అగ్నికి గుర్తు. జంబుకేశ్వరంలో జలలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో వాయులింగంగా... ఆ పరమశివుడు పూజలందుకుంటున్నాడు. ప్రకృతే శివుడూ శివమే ప్రకృతి అన్న సత్యాన్ని మానవాళికి చాటి చెప్పడమే ఇందులోని ఆంతర్యం, అంతరార్థం కూడా.
స్వార్థ చింతన, అసత్య భాషణం, కష్టాలకు కుంగిపోవడం, ప్రాణకోటిపట్ల దయలేకుండా ఉండటం... ఇలాంటి అవలక్షణాలే మన బాధలకూ కష్టాలకూ హేతువులు. వీటిని ఎలా దూరం చేసుకోవాలో, మనిషి మనిషిగా ఎలా బతకాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మనల్ని మనం ఎలా ఆవిష్కరించుకోవాలో తెలిపేదే శివతత్వం. ఒక్కమాటలో చెప్పాలంటే శివతత్వాన్ని అర్థం చేసుకోవడమంటే శివుడిలా మెలగడమే.

అంతా భ్రమని తెలుసు, బతుకంటే బొమ్మలాటనీ తెలుసు, కథని తెలుసు, కథలన్నీ కంచికే చేరుతాయనీ తెలుసు. అయినా జరిగేదీ జరుగుతోందీ నిత్యమనీ శాశ్వతమనీ భావించే అజ్ఞానపు మిడిసిపాటు మనిషిది. అనుకున్నది జరగకపోయినా, అనుకోని కష్టమొచ్చినా భరించలేని మనస్తత్వం... ఇలా చెప్పుకొంటూ పోతే మానవుల్లో తర్కించాల్సినవీ సరిచేసుకోవాల్సినవీ ఎన్నో. వీటన్నింటికీ శివ తత్వాన్ని అనుసరించడమే మనిషికి మార్గం. శివయ్యలా ప్రేమిస్తే, అలానే ఆదరిస్తే, అదేవిధంగా ఆలోచిస్తే... సమస్త విశ్వంలోనూ శివతత్వమే వెల్లివిరుస్తుంది. ప్రతి మనిషిలోనూ శివుడే కనిపిస్తాడు.

తెలుగు నేలపై...

పంచారామాలకు నెలవై, అష్టాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగమైన తెలుగు నేల నలుచెరగులా పరచుకున్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఎన్నో... మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని తెలిపే కథలూ, గాథలూ చిరస్మరణీయం. మూర్తి రూపంలోనూ, లింగాకారంగానూ పూజలందుకునే దైవం శివుడు. కానీ, లింగ రూపమే అందులో ప్రధానమైంది. ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని విశ్వసిస్తారు నాయనార్లు. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలను అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొంటారు. అందులో కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున లింగం ఒకటి. ఈ క్షేత్రం
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆది శంకరాచార్యులు శివానందలహరిని ఇక్కడే రాశారని ప్రతీతి.

* పురాణాల ప్రకారం తారకాసురుడు నేలకూలడంతో అతనిలోని ఆత్మలింగం అయిదు ముక్కలైంది. దేవతలు ఆ అయిదింటినీ అయిదు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఆ ప్రసిద్ధ క్షేత్రాలే పంచారామాలుగా
ఆ దేవదేవుని ఆవాసాలుగా వెలుగొందుతున్నాయి. అవే ఆంధ్రప్రదేశ్‌లోని... దక్షారామం (ద్రాక్షారామం, తూ.గో. జిల్లా), కుమారారామం (సామర్లకోట, తూ.గో. జిల్లా), క్షీరారామం (పాలకొల్లు, ప.గో. జిల్లా), సోమారామం (భీమవరం, ప.గో. జిల్లా), అమరారామం (అమరావతి, గుంటూరు జిల్లా). ఇవికాక శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగేశ్వరం, చిత్తూరులోని కపిలతీర్థం, పశ్చిమ గోదావరిలోని ముక్తేశ్వరం, గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ, కర్నూలులో మహానంది, అదే జిల్లాలోని యాగంటి ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి.

* తెలంగాణలో సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రామప్పదేవాలయం, వరంగల్‌లోని ఐనవోలులో కాకతీయులు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం, కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి దేవాలయం, వేములవాడలో చాళుక్య రాజులు నిర్మించిన కోడెమొక్కులరాజరాజేశ్వరస్వామి దేవాలయం... నేడు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్రలో’ నల్గొండ జిల్లా పానగల్లు ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీనమైన పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం ఇక్కడివే.

లింగోద్భవ కాలమే...

మన ముఖ్యమైన పండగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుతాం.ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా పూజలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైంది. దీన్ని అత్యంత విశిష్టమైందిగా భావిస్తారు. సృష్టి స్థితికారకులైన బ్రహ్మదేవుడికీ శ్రీమహావిష్ణువుకూ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంమీద వాగ్వాదం మొదలైంది. ఒక్కోజామూ గడిచేకొద్దీ వాదాల వేడి పెరుగుతోంది. వారిని శాంతింప చేయమంటూ దేవతలంతా ముక్కంటికి మొరపెట్టుకున్నారు. లయకారుడైన ఆ కైలాసనాథుడు తేజోలింగరూపాన వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సందేహాలు తీర్చాడు. అపోహలు పారదోలాడు. ఆ రోజు... బహుళ చతుర్దశి. భక్తకోటికి పరమ పవిత్రమైన శివరాత్రి.దిగంబరుడు లింగరూపంలో అవతరించిన కాలమే లింగోద్భవ పుణ్యకాలం. భక్తకోటికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి.ఉపవాసం శారీరక శుద్ధికీ, జాగారం చేస్తూ ధ్యానం చేయడం మనోశుద్ధికీ ఉపకరిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

- దంతుర్తి లక్ష్మీప్రసన్న

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.