close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వేదం... అందరి నోటా!

వేదం... అందరి నోటా!

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో అక్షరాభ్యాస మంత్రాలతోపాటు వేద ఘోష వినిపిస్తోంది. కుల, మత, వర్గ బేధాలు లేకుండా వేదం అందరి జీవన నాదం అవుతోంది. ఇక్కడ వేద విద్యానంద భారతీస్వామి స్థాపించిన వేదపీఠం బాలికలకూ వేదం నేర్పిస్తూ ఓ నవ్య పథానికి శ్రీకారం చుడుతోంది.
గోదావరి గలగలలూ, నది ఒడ్డున పచ్చని చెట్లూ, వాటిపై వాలే పక్షుల కిలకిలారావాలూ, మరోపక్క సరస్వతీ మాత ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసాలతో వినిపించే మంత్రాలు... ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర వాతావరణానికి వేద విద్యానంద భారతీస్వామి ఆనందపరవశుడయ్యారు. ఆధ్యాత్మికత ఉట్టిపడే బాసరలో ఆశ్రమం ఏర్పాటుచేయాలనే ఆలోచన ఆయన మనసులో కలిగింది.  భక్తులకు ప్రవచనాలు బోధించడానికి బదులుగా గురుకులాన్ని స్థాపించి చిన్నారులకు వేదం నేర్పించాలనుకున్నారు. ప్రస్తుతం దేశంలో పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తోంది. భావితరాలు భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను మరచిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తపనతో వేదభారతీ పీఠానికి పునాది వేశారు.

నలుగురితో మొదలై...
తిరుపతిలోని వ్యాసాశ్రమంలో, ఆపైన వారణాసిలోని సంపూర్ణానంద సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యానంద భారతీస్వామి... ‘వేద భారతి మిషన్‌’లో భాగంగా కొన్నాళ్లు అమెరికాలో భారత సంతతి పిల్లలకు వేదాలు బోధించి వచ్చారు. వేద పీఠం ప్రారంభించడానికి అదీ ఓ కారణం. 2010లో నలుగురు విద్యార్థులతో బాసరలో వేద విద్యాలయం ప్రారంభమైంది. వేదాల్ని కొందరికే ఎందుకు పరిమితం చేయాలంటూ సమాజంలో అన్ని కులాలూ, వర్గాలకూ గురుకులంలో చేరొచ్చని పిలుపునిచ్చారు విద్యానంద. ఆడపిల్లలు వేదం చదవకూడదనే నియమాన్ని పక్కనబెట్టి వాళ్లకి సైతం వేదాల్ని నేర్పిస్తున్నారు. ప్రస్తుతం 72 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ గురుకులంలో వేదాల్ని అభ్యసిస్తున్నారు. మొదట రెండేళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే చేరారు. కానీ క్రమంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది తల్లిదండ్రులకు ఈ వేద పాఠశాల గురించి తెలిసింది. దాంతో తమ పిల్లల్ని చేర్పించడానికి ముందుకు వచ్చారు. రూపాయి కూడా తీసుకోకుండా విద్యార్థులకు వసతి, మంచి భోజనం అందించడంతోపాటు చక్కని క్రమశిక్షణా నేర్పుతున్నారు.

గణితమూ చెబుతారు...
కేంద్ర మానవ వనరులశాఖ గుర్తింపు కలిగిన ఉజ్జయినీలోని ‘మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్ఠాన్‌’కి అనుబంధ సంస్థగా వేదభారతీ పీఠం ఉంది. ఒకనాడు శ్రీకృష్ణుడు వేద విద్య చదువుకుందీ ఇక్కడేనంటారు. 6-12 తరగతులు ఇక్కడ చదివేందుకు అవకాశం ఉంది. వేదం ప్రధానంగా బోధన ఉంటుంది. సంస్కృతం, ఆంగ్లం, సైన్స్‌, గణితం ఇతర సబ్జెక్టులుగా ఉంటాయి. ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థులకు వేదాన్ని నేర్పుతుండగా, ఇద్దరు సంస్కృత ఉపాధ్యాయులున్నారు. వీరికి జీతభత్యాలను వేద పీఠమే భరిస్తుంది. పైన చెప్పిన సబ్జెక్టులకు అదనంగా సంగీతం, భరతనాట్యం లాంటి కళల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. సంగీతం నేర్పడానికే ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. పాఠశాలలో పన్నెండో తరగతి పూర్తిచేసిన వాళ్లు వేదంలోనే పైచదువులకు వెళ్లొచ్చు. పాఠశాల ప్రారంభంలో చేరినవారు ప్రస్తుతం పదకొండో తరగతి చదువుతున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు విలువనిచ్చేవారూ, ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారూ తమ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు. వేద పాఠశాల పనితీరూ, లక్ష్యాలూ నచ్చి దాతలు సైతం అండగా నిలుస్తున్నారు. భోజనశాల నిర్వహణకు అయ్యే ఖర్చుని అందివ్వడంతోపాటు తరగతి గదుల్నీ, వసతి గదుల్నీ నిర్మించి ఇచ్చిన దాతలు చాలామంది ఉన్నారు. చిన్న గుడిసెలో ఆరంభమైన వేదపీఠం దినదినాభివృద్ధి చెందుతోంది. విద్యార్థులు సైతం తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. చతుర్వేదాలను ఆపోశన పడుతున్నారు. బాసరలో ఎలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం జరిగినా వేదపీఠం విద్యార్థులు తమ ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి వేద ప్రవాహ ఝరికి అబ్బురపడని ఆహుతులు లేరు. వేదాలను విద్యార్థులు రాగయుక్తంగా పలికేతీరు శ్రోతల్ని ఆనంద పరవశులను చేస్తుంది. ఈ ఆశ్రమం సరస్వతీ మాత ఆలయానికి సమీపంలో, బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో
ఆహ్లాదకరంగా ఉంటుంది.

నిత్య హారతి
గత కార్తీక పౌర్ణమి నుంచి దక్షిణ గంగా వేద నిత్యహారతి పేరిట బాసరలోని గోదావరికి నిత్యహారతి ఇచ్చేందుకు వేదవిద్యానంద నిర్ణయించారు. కార్యక్రమానికి అనుగుణంగా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక పూజా పరికరాలతో వేద పాఠశాలలోని బాలికలూ, బాలురకు హారతి విధానం నేర్పించారు. ఈ నిత్య హారతి కార్యక్రమంతో గోదారి తీరం మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఈ విద్యాపీఠం బాసర ఖ్యాతిని మరింత పెంచుతోంది.

- వసంత్‌ కుమార్‌, న్యూస్‌టుడే బాసర

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.