close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇది పోలీస్‌ సేవాదళ్‌!

ఇది పోలీస్‌ సేవాదళ్‌!

సాధారణంగా పోలీసులంటే కొట్లాటలూ, కేసులూ ఇవే గుర్తొస్తాయి. మామూలు జనమైతే పోలీస్‌స్టేషన్లో అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు. కానీ, విజయనగరం జిల్లా పోలీసులు ఈ అభిప్రాయాలను పోగొట్టేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. పాఠశాలలను దత్తత తీసుకుంటూ, వృద్ధుల సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు చేపడుతూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.
ఒక ఆలోచన విద్యార్థుల రేపటి భవితకు బంగారు బాటలు వేస్తుంది. ఒక్క ఆలోచన మలి సంధ్యలో ఉన్న ఎన్నో జీవితాలకు బతుకుమీద ఆశను పెంచుతుంది. అలాంటి ఆలోచనే విజయనగరం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జి.పాలరాజు మనసును సేవవైపు మళ్లించింది. జిల్లాలోని విద్యారంగంపై ఒక ఉద్యమమే సాగించేలా చేస్తోంది. ఉద్యోగంలో భాగంగానే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు పాలరాజు. ఆ సందర్భంలోనే అరకొర సౌకర్యాలతో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలనూ, విద్యార్థుల స్థితిగతులనూ ప్రత్యక్షంగా గమనించారు. జిల్లా అభివృద్ధి సాధించాలన్నా, రేపటి తరం ఉన్నతంగా జీవనం కొనసాగించాలన్నా మంచి విద్యను అందించడమే పరిష్కారమని భావించి ఆ దిశగా మొదటి అడుగువేశారు. ఈ ప్రయత్నంలో మిగతా పోలీసు ఉద్యోగులూ భాగస్వాములవుతున్నారు.

పాఠశాలల దత్తత..
జిల్లాలో మొత్తం 43 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఎస్పీ పాలరాజు సూచన మేరకు ఒక్కొక్క స్టేషనూ దాని పరిధిలోని ఒక్కో పాఠశాలను దత్తత తీసుకుంది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. భవనాలకు మరమ్మతులు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యం... ఇలా అనేక అంశాల్లో పాఠశాలల సమస్యలను గుర్తించడంతోపాటు సిబ్బందితో సంబంధిత ఊరి ప్రజలతో చర్చించి వీలయినంత త్వరగా అవి పరిష్కారమయ్యేలా చూడటం ఇతడి బాధ్యత.

విద్యార్థులతో ఒకరోజు...
పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎస్పీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న 500 మంది విద్యార్థులను ఎస్పీ పాలరాజు తన ఇంటికి ఆహ్వానించి, వారితో రోజంతా గడిపారు. సాయంత్రం
పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ని ఆహ్వానించి, భవిష్యత్‌ లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి, మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని ఎలా ఏర్పరచుకోవాలి లాంటి విషయాలను పిల్లలకు చెప్పించారు. అందరికీ పదో తరగతి పుస్తకాలనూ, నమూనా ప్రశ్నపత్రాలనూ ఇచ్చారు. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసుకునే విద్యార్థుల కోసం గ్రంథాలయంలో పదేళ్లకు గానూ రూ.50వేల రుసుమును పోలీసు శాఖ తరఫున అందించారు.

వృద్ధులకు ఆసరాగా...
వృద్ధాశ్రమాల్లో ఎక్కువశాతం మంది మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులతో బాధపడుతున్నారని తెలుసుకున్న పాలరాజు జిల్లాలో ఉన్న ఆశ్రమాల్లోని వృద్ధులతో స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.వేయి పింఛనులో రూ.950 మందులకే సరిపోతున్నాయని వారు చెప్పడంతో జనరిక్‌ దుకాణదారులతో మాట్లాడి అవే మందులు రూ.250లకే వృద్ధులకు అందించేవిధంగా చర్యలు చేపట్టారు.

మహిళా రక్షక్‌
జిల్లాను పట్టిపీడిస్తున్న మరో అంశం మహిళలపై దాడులు. వీటిని నిర్మూలించడానికి ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొత్తగా మహిళా రక్షక్‌ పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను బొబ్బిలి డీఎస్పీగా పనిచేస్తున్న సౌమ్యలత పర్యవేక్షిస్తున్నారు. వీటితోపాటు మహిళలకోసం ఏయే చట్టాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుపుతూ ఒక ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించారు. ప్రతీ పాఠశాలలోని బాలికలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. వీరు సంబంధిత గ్రామానికి వెళ్లి అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలి, ఎలా వాటిని ఎదుర్కోవాలి లాంటి విషయాల్లో శిక్షణ ఇస్తారు. దీనివల్ల గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలపై జరిగే దాడులు తగ్గాయనీ, భవిష్యత్తులో వీటిని పూర్తిగా నిరోధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామంటున్నారు పాలరాజు. పోలీసుల ఈ ముందడుగును మెచ్చుకోవాల్సిందే కదా!

- కె.మునీందర్‌, ఈనాడు, విజయనగరం డెస్క్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.