close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ట్రంకుపెట్టె ఖరీదు లక్షల్లో!

ఖరీదైన పెన్నులో, రకరకాల నాణాలో, నగలో సేకరించడం మీకు అలవాటా?వారసత్వంగా సంక్రమించిన కళాఖండాలు మీ దగ్గర ఉన్నాయా? వాటిని భద్రపరచడమే కాక అప్పుడప్పుడూ అందంగా ప్రదర్శిస్తారు కూడానా? అయితే ఈ ట్రంకు పెట్టెలు మీకోసమే.
ఖతార్‌ రాజకుటుంబం ఓసారి జయపుర వచ్చింది. వారు బస చేసిన హోటల్‌ షోకేసులోని ట్రంకు పెట్టె వారిని ఆకట్టుకుంది. వివరాలు తెలుసుకుని షోరూంకి వెళ్లారు. అక్కడి ట్రంకుపెట్టెల అందాన్నీ, పనితనాన్నీ చూసి ఆశ్చర్యపోయిన వారు వెంటనే ఎనిమిది పెట్టెలకోసం ఆర్డరిచ్చారు. అవి చేయడానికి ఏడాదిపైనే పడుతుందన్నా సరేనన్నారు. రకరకాల అత్తరు సీసాలు పెట్టుకోవడానికి రాజు కోసం ఒక పెట్టె ప్రత్యేకంగా ఆర్డరిచ్చారు.

రాజకుటుంబమేమిటీ, ట్రంకుపెట్టె చూసి ఆశ్చర్యపోవడమేమిటీ... అంటారా! వీటి ప్రత్యేకత అదే. హుందాగా రాజసాన్ని ప్రదర్శించే ఆధునిక డిజైనర్‌ ట్రంకుపెట్టెలివి. మూసినప్పుడు మాత్రమే ట్రంకుపెట్టెల్లా కన్పిస్తాయి. తెరిస్తే... వార్డ్‌రోబ్‌, డ్రెసింగ్‌ టేబుల్‌, డీజే కన్సోల్‌... ఏదన్నా కావచ్చు. అన్నీ వేటికవే ప్రత్యేకం. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా మంచి లెదర్‌తో తయారుచేస్తారు. ధర మాత్రం లక్షల్లోనే. మనదేశంలోని బడా వ్యాపారులూ, బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు విదేశాలకు చెందిన బిలియనీర్లు కూడా సంవత్సరాల తరబడి వేచి చూసి మరీ ఆ ట్రంకుల్ని కొంటున్నారు.

వారసత్వం
పేరొందిన యూరోపియన్‌ కంపెనీలకు దీటుగా విలాసవంతమైన ట్రంకుపెట్టెల్ని తయారుచేస్తున్న ఆ భారతీయ సంస్థ ‘ట్రంక్స్‌ కంపెనీ’. మెరూన్‌, నేవీబ్లూ లాంటి రంగుల్లో, నాణ్యమైన లెదర్‌తో అలనాటి వృత్తినైపుణ్యాన్నీ నేటి ఆధునిక జీవనశైలినీ ప్రతిబింబిస్తూ, మెరిసే ఇత్తడి అలంకరణలతో
రాచఠీవిని ప్రదర్శిస్తూ మనసు దోచుకుంటున్న ఈ పెట్టెల వ్యాపారాన్ని మొదలుపెట్టింది ఇద్దరు సోదరులు. రాజస్థాన్‌కి చెందిన ప్రియాంక్‌, పరితోష్‌ మెహతాలకు కుటుంబవ్యాపారం ఉంది. ఆ పని మీద యూరోప్‌ వెళ్లినప్పుడు సంపన్నుల ఇళ్లలో కొన్ని ట్రంకుపెట్టెల్ని చూశారు. వారసత్వ సంపదను ప్రతిబింబించే వినియోగవస్తువులకు ఎప్పుడూ విలువ ఉంటుందని గమనించిన ఆ అన్నదమ్ములకు ఓ ఆలోచన వచ్చింది. వారి సొంత ఊరు జయపురని మించిన వారసత్వం ఇంకేముంటుంది? అదే వారి సృజనకు స్ఫూర్తిగా నిలిచింది. సొంతంగా ఒక కంపెనీ పెట్టి భారతీయ వారసత్వాన్ని ప్రతిఫలించే ట్రంకుపెట్టెలు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు. ఆరేళ్ల క్రితం సంగతిది. అన్నదమ్ములిద్దరూ రెండేళ్లపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి ట్రంకుపెట్టెల తయారీకి కావలసిన ముడి సరుకుకోసం అన్వేషించారు. నిపుణులైన పనివారిని వెదికి పట్టుకున్నారు. ఇటలీ నుంచి లెదర్‌, చెన్నై నుంచి స్వీడ్‌ లాంటివి దిగుమతి చేసుకున్నారు.పారిస్‌కి చెందిన డిజైనర్‌ లివియోని ప్రధాన డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఇత్తడితో అదనపు హంగుల్ని స్వయంగా డిజైన్‌ చేశారు. వినియోగదారు అభిరుచి మేరకు వాటికి బంగారం, వెండి పూత వేయిస్తారు. వింటేజ్‌ సన్‌ గ్లాసెస్‌నుంచి విస్కీ సీసాల వరకూ, వజ్రాల ఆభరణాలనుంచి వాచ్‌కేసుల వరకూ, క్రికెట్‌ కిట్‌ నుంచి స్పీకర్‌ సెట్ల వరకూ యజమానుల అభిరుచులను ప్రతిబింబించే చక్కని ట్రంకుపెట్టెల తయారీకి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లు తిరిగేసరికల్లా నాణ్యమైన డిజైనర్‌ ట్రంకుల కోసం ఏడాదైనా వేచి చూసే వినియోగదారులు ఆ కంపెనీ సొంతమయ్యారు. పైకి మామూలు పెట్టెల్లాగే కన్పించే వీటి లోపల అరల్ని ఆయా వ్యక్తుల అవసరాలను బట్టి తీర్చిదిద్దుతారు. వస్తువు ఆకృతికి తగినట్లుగా పెట్టెలోపలి స్థలాన్ని డిజైన్‌ చేస్తారు. మంచి వెల్వెట్‌ వస్త్రంతో లైనింగ్‌ వేస్తారు. నగల పెట్టెలైతే పైకి ఏ మాత్రం కన్పించకుండా లోపలే తాళం వేసుకునే వీలూ ఉంటుంది. ఆర్డరిచ్చాక సైజుని బట్టి తయారీకి నెల నుంచి ఆర్నెల్ల సమయం తీసుకుంటారు.

వారసత్వ సంపదని దాచుకోవడమే కాదు, అప్పుడప్పుడూ గర్వంగా ప్రదర్శించాలి కూడా. అందుకు వీలుగా రూపొందించే ఈ పెట్టెల్లోపల చిన్న చిన్న ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉంటాయి. వీరు రూపొందించిన క్లచ్‌ల ధర రూ.48వేల నుంచీ మొదలవుతుంది. ట్రంకులు సైజుని బట్టి సాధారణంగా 3, 4 లక్షల రూపాయలుంటాయి. అత్యంత ఖరీదైన ట్రంక్‌ను రూ.18 లక్షలకు తయారుచేసిచ్చారు.
ఇదండీ ఈ ట్రంకుపెట్టెల కథ! ఒక చిన్న ఆలోచన ఆరేళ్లు తిరిగేసరికి ఈ అన్నదమ్ముల్ని కోటీశ్వరుల్ని చేసింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.