close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బైక్‌పైన పాకిస్తాన్‌ వరకూ పర్యటించా..!

బైక్‌పైన పాకిస్తాన్‌ వరకూ పర్యటించా..!

‘జీవితం బోర్‌ కొట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడూ విహార యాత్రలకి వెళ్లాలనేది తెలిసిందే. దానికి కాస్త సాహసం కూడా తోడయితే వచ్చే కిక్కే వేరు. అందుకే బైక్‌మీద రాజస్థాన్‌ని చుట్టి వచ్చా’ అంటున్నాడీ ముంబై కుర్రాడు వరుణ్‌ గంప.
నా ప్రయాణంలో తొలి మజిలీ చిత్తోడ్‌గఢ్‌. భన్సాలీ ‘పద్మావత్‌’ సృష్టిస్తోన్న కలకలం గురించయినా ఆ ప్రదేశాన్ని చూసి రావాలనిపించింది. చిత్తోడ్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రాణి పద్మినీతోబాటు, నాటి చిత్తోడ్‌ ఖిల్లా కూడా. దాని కారణంగానే నగరానికి ఆ పేరు వచ్చింది. సుమారు 280 ఎకరాల్లో విస్తరించిన ఈ కోటను చూడాలంటే ఓ వాహనమూ చరిత్ర తెలియాలంటే గైడ్‌ సహాయమూ తప్పనిసరి. కోట ప్రాంగణంలో 84 చెరువులు తవ్వించి, వాటి ద్వారా నాలుగు కోట్ల లీటర్ల నీటిని ఒడిసి పట్టుకునేవారట. ప్రస్తుతం వాటిల్లో 22 మాత్రమే మిగిలి ఉన్నాయి. కోటలో అన్నింటికన్నా ఎక్కువగా ఆకర్షించేది సరస్సు మధ్యలోని పద్మినీ దేవి రాజమందిరమే. చిన్నగా అందంగా ఉంది. పద్నాలుగో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణా రతన్‌సింగ్‌ భార్య రాణి పద్మినీకి దేశంలోకెల్లా అందగత్తె అని పేరు. అది విన్న దిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ మీద దండెత్తకుండా ఉండాలంటే ఆమెనోసారి చూడాలని కబురుపంపగా, అద్దంలో చూపించడానికి ఒప్పుకుంటారు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన ఖిల్జీ, కోటద్వారం వరకూ సాగనంపడానికి వచ్చిన రతన్‌సింగ్‌ను బంధించి, రాణిని తనతో పంపిస్తేనే రాజును విడిచిపెడతాననీ, లేదంటే దాడి తప్పదనీ షరతు
పెడతాడు. మోసాన్ని మోసంతోనే గెలవాలని తలచిన రాణి పద్మిని, చెలికత్తెలతో తరలివస్తాననీ అందుకోసం 700 పల్లకీలు పంపమనీ ఖిల్జీకి వర్తమానం పంపమంది. ఆ పల్లకీల్లో రాజపుత్ర సైనికులు ఆడవేషాల్లో వెళ్లి, రాజుని విడిపించుకుని వస్తారు. అవమానాన్ని భరించలేని ఖిల్జీ దండెత్తి రాజపుత్రులను ఓడిస్తాడు. ఆ కబురు విన్న పద్మిని మూడువేల మంది అంతఃపుర కాంతలతో కలిసి మంటల్లోకి దూకి ఆత్మహత్య(జోహార్‌) చేసుకుంటుందనేది ఓ చారిత్రక కథనం. నాటి జోహార్‌ గుర్తుగా ఏటా మార్చిలో ఇప్పటికీ పెద్ద తిరునాళ్లు జరుగుతుంటాయక్కడ.అది చూశాక 1440లో మాల్వా, గుజరాత్‌ సుల్తానులపై సాధించిన విజయానికి గుర్తుగా మహారాణా కుంభ కోటకు పశ్చిమాన నిర్మించిన విజయస్తంభం దగ్గరకు వెళ్లాను. ఈ భవనంలో తొమ్మిది అంతస్తులు ఉన్నాయి. దీనికి సమీపంలోనే కృష్ణ భగవానుడికే అంకితమైన మీరాబాయి గుడి ఉంది.

కుంభలగఢ్‌లో...
అక్కడి నుంచి ఉదయ్‌పూర్‌ మీదుగా కుంభల్‌గఢ్‌ వెళ్లాను. మేవాడ్‌ రాజులకి చిత్తోడ్‌ తరవాత అత్యంత ముఖ్యమైన ఖిల్లా కుంభలగఢ్‌. 36 కిలోమీటర్ల పొడవైన ఈ కోట సరిహద్దు గోడ, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా తరవాత ప్రపంచంలోనే పెద్దగోడగా చెబుతారు. ఈ గోడ వెడల్పు ఎక్కువ. అత్యంత క్లిష్టమైనవిగా పేరొందిన ఆరావళీ పర్వతాల మీద కట్టడం ఈ గోడకున్న మరో విశిష్టత. ఏ యుద్ధంలోనూ కుంభల్‌గఢ్‌ రాజులు ఓడిపోకపోవడానికి కారణం ఇదేనట. కోటలోపల నుంచే శత్రుసేనల కదలికల్ని అంచనా వేసేందుకు ఎత్తైన టవర్లు నిర్మించారు.

అక్కడి నుంచి దగ్గరలోని రణక్‌పుర్‌ ప్రాంతంలోని పాలరాతి జైనమందిరానికి వెళ్లాను. దీన్ని 1445లో ఓ జైన వ్యాపారి రాణా కుంభ సాయంతో నిర్మించాడట. అందుకే రాణా పేరుమీదుగా దీనికి రణక్‌పూర్‌ అని పేరు పెట్టారు. జైన తీర్థంకరుడైన భగవాన్‌ ఆదినాథుణ్ణి ప్రతిబింబించే ఈ మందిరాన్ని కట్టడానికి 50 సంవత్సరాలు పట్టింది. దీనికోసం 1444 స్తంభాలను వాడారు. వీటిల్లో ఏ ఒక్క స్తంభమూ మరో దాన్ని పోలి ఉండదు. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తారు. ఇక్కడ కురచ దుస్తులు ధరించకూడదు. అందుకే
ప్రాంగణంలో అద్దెకు దుస్తులు ఇస్తారు.

జైసల్మేర్‌లో...
అది చూశాక  జోధ్‌పూర్‌ మీదుగా జైసల్మేర్‌కు వెళ్లాను. థార్‌ ఎడారికి ఆనుకుని ఉండే ఈ ప్రదేశంలో భరించలేని వేడి. దీన్ని చూడాలంటే అక్టోబరు-మార్చి అనుకూల సమయం. అందుకే ఇక్కడి ప్రజలు ఆరునెలలు పర్యటక వృత్తుల్లోనూ మిగిలిన ఆరు నెలలూ వేరే ప్రాంతాలకి వెళ్లి ఉద్యోగాలు చేసుకోవడం చేస్తుంటారు. ఇక్కడ మొదటగా చూడాల్సింది జైసల్మేర్‌ కోట. 1970వరకూ ఈ ప్రాంతానికి పెద్దగా పర్యటకులు వచ్చేవారు కాదు. కానీ 1975లో సత్యజిత్‌రే తీసిన సోనార్‌ ఖిల్లా అనే బెంగాలీ సినిమాలోని కథ అంతా ఈ కోట చుట్టూ తిరుగుతుంది. చిత్రీకరణ కూడా అక్కడే జరిగింది. అప్పటినుంచీ ఈ కోటకు సందర్శకుల తాకిడి పెరిగింది. అప్పటి రాజవంశీయులు కోటనే నివాసిత ప్రదేశంగా చేసి పేద ప్రజలకోసం లోపల ఇళ్లు కట్టించడం ఈ కోటకున్న మరో విశిష్టత. తరాల నుంచీ నివసిస్తున్న వాళ్లెందరో ఈ కోటలో కనిపిస్తారు. లోపల హోటళ్లూ దుకాణాలూ ఉంటాయి. అక్కడి హోటళ్లలో గదులు బుక్‌ చేసుకోవచ్చు. కోటలోపల 12వ శతాబ్దంలో కట్టిన జైన మందిరాలు చూడ్డానికి చాలా బాగున్నాయి.

జైసల్మేర్‌లో హవేలీలు చాలానే ఉన్నాయి. వాటిల్లో చూడదగ్గది పట్వాన్‌ కా హవేలీ. దాని తరవాత జైసల్మేర్‌లో కట్టించిన కృత్రిమ సరస్సు గడిసార్‌ చూసి, హోటల్‌ వాళ్లు ఏర్పాటుచేసిన డెజర్ట్‌ క్యాంపునకు వెళ్లా. ముందు జైసల్మేర్‌కి 50 కి.మీ. దూరంలోని శాండ్‌ డ్యూన్‌కి తీసుకెళ్లారు. అక్కడినుంచి ఎడారి మొదలు. ఎడారి వరకూ జీపులోనూ ఆ తరవాత దాదాపు 5 కి.మీ. ఒంటెమీద ప్రయాణించాక క్యాంపు వచ్చింది. అప్పటికే సూర్యాస్తమయం అయింది. ఎడారి మధ్యలో చుట్టూ ఏమీలేకుండా అస్తమిస్తోన్న ఆ భానుణ్ణి చూడటం కళ్లకు పండగే. ఎముకలు కొరికేంత చలిలో నక్షత్రాలను చూస్తూ పడుకోవడం మరచిపోలేని అనుభవం.

మర్నాడు ఎంతగానో ఎదురుచూస్తున్న తానోట్‌ మందిరానికే నా ప్రయాణం. ఇది పాకిస్థాన్‌ సరిహద్దుకి సమీపంలో ఉంది. పశ్చిమ భారతానికి చిట్ట చివరి గ్రామం కూడా ఇదే. థార్‌ ఎడారి మధ్యలోంచి బార్డర్‌ రోడ్స్‌ సంస్థ కట్టించిన రహదారిమీద ప్రయాణం. ఎక్కడా చిన్న గుంత కూడా లేదు. ఈ దారిలో నేరుగా శత్రుదేశం సమీపంలోని మందిరానికి చేరుకున్నా. ఆలయంలోపల హింగ్లాజ్‌ దేవి కొలువుదీరింది. ఈ మాతను సైనికులు భక్తిగా కొలుస్తారు.

1965 పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో శత్రుమూక భారత్‌లోకి చొచ్చుకుని వచ్చేందుకు ఈ ప్రాంతంలో మూడు వేల బాంబుల్నీ ఫిరంగి గుళ్లనీ ప్రయోగించగా వాటిల్లో ఒక్కటీ పేలలేదట. అది అంతా మాత ప్రభావమేనని భావించిన భారత్‌ సేనలు రెట్టించిన ఉత్సాహంతో పాక్‌ సేనల్ని తరిమికొట్టాయి. నాటి పాకిస్తాన్‌ జనరల్‌ ఈ మందిరం ప్రాశస్త్యం విని, దాన్ని చూడాలని అర్జీ పెట్టుకుని మరీ వచ్చి స్వయంగా పూజలు జరిపించాడట. యుద్ధం ముగిశాక సరిహద్దు దళాలు ఆ మందిరాన్ని తమ అధీనంలోకి తీసుకుని పునరుద్ధరించారు. ఇక్కడ సైనికులే పూజారులు. ప్రతిరోజూ సాయంత్రం సైనికులంతా కలిసి మాతకి హారతిచ్చి పాటలు పాడటం చూసి తీరాల్సిన దృశ్యం.

లోంగెవాలాలో...
అక్కడినుంచి పది కిలోమీటర్ల దూరంలోని బార్డర్‌ పోస్ట్‌కు వెళ్లాను. ఇది భారత్‌-పాక్‌లకు సరిహద్దు. ఇక్కడికి వెళ్లాలీ అంటే జైసల్మేర్‌లో ముందే అనుమతి తీసుకోవాలి. ప్రతిరోజూ పదిమందికి మించి అనుమతి ఇవ్వరు. అక్కడ ఫొటోలు తియ్యడం, ఫోన్లు మాట్లాడటం నిషిద్ధం. అక్కడ పెద్ద ఇనుప కంచె ఉంది. సైనికులు పహారా కాస్తూ కనిపించారు. తరవాత అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని లోంగెవాలాకి వెళ్లా. బార్డర్‌ సినిమాకి మూలం ఇక్కడ 1971లో జరిగిన యుద్ధమే. భారత్‌-పాక్‌ల మధ్య జరుగుతున్న ఆ యుద్ధంలో భారత్‌ గెలుస్తున్న తరుణంలో పాకిస్తాన్‌ పశ్చిమాన ఆకస్మిక దాడి చేసేందుకు పన్నాగం పన్నింది. డిసెంబరు 4న లోంగెవాలాను ముట్టడించడం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలనుకుంది. ఆ సమయంలో అక్కడ పంజాబ్‌ రెజిమెంట్‌కి చెందిన 23 మంది ఆఫీసర్లూ 124 మంది సైనికులు మాత్రమే పహారా కాస్తున్నారు. దాడి గురించి తెలుసుకున్న మేజర్‌ కుల్‌దీప్‌సింగ్‌ కేంద్ర కార్యాలయానికి సమాచారాన్ని అందించగా, ఉదయానికిగానీ అదనపు బలగం పంపడం వీలు కాదనీ అప్పటి వరకూ వేచి ఉండాలని చెప్పింది. అప్పుడు మేజర్‌ ముందున్న దారులు రెండే. ఒకటి ఓటమిని ఒప్పుకుని పోస్టు ఖాళీ చేయడం లేదా రాత్రంతా పోరాడుతూ పొద్దున్నే వచ్చే అదనపు బలగాల కోసం ఎదురుచూడటం. విషయాన్ని సైనికులకు చేరవేయగా వాళ్లంతా పోరాడేందుకే ఓటేశారు. దాదాపు రెండు వేలమంది శత్రువులు దాడికి దిగిన సమయంలో మేజర్‌, ప్రతి బంకర్‌ దగ్గరకూ వెళ్లి, సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ పోరాటం సాగించి పోస్టును కాపాడుకున్నారు. ఉదయానికి భారత వాయుదళం రంగంలోకి దిగి శత్రుమూకలమీద బాంబులవర్షం కురిపించడంతో పాక్‌ సైన్యం పలాయనమైంది. ఆ యుద్ధంలో పాక్‌కు గట్టి దెబ్బ తగిలింది. 200మంది చనిపోయారు. 34 భారీ యుద్ధ ట్యాంకుల్నీ వందలాది యుద్ధ వాహనాలనీ కోల్పోయింది. అక్కడ నిర్మించిన మ్యూజియంలో నాటి పరికరాలన్నీ ప్రదర్శనకు ఉంచారు. వాటిని చూస్తుంటే మన సైన్యం పరాక్రమం కళ్లముందు కదిలింది. మర్నాడు జైసల్మేర్‌లోని వార్‌ మ్యూజియాన్నీ, రాజుల సమాధులకోసం ఏర్పాటుచేసిన బడా బాఘ్‌నీ సందర్శించి, ఎనలేని ఉత్సాహానందాలతో
బైక్‌మీద తిరుగుప్రయాణమయ్యాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.