close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వేసుకుందామా ఓ కిళ్లీ..!

 కిళ్లీ... పేరు వింటే చాలు, ‘ఓ రబ్బా... ఏసుకున్నా కిళ్లీ... ఒరెఒరె... ఒళ్లంతా తిరిగెను మళ్లీ...’ అంటూ ఎన్టీఆర్‌ ఆడి పాడిన పాట గుర్తురాని తెలుగోడు ఉంటాడా. ఆ పాట సంగతెలా ఉన్నా పసందైన విందుభోజనం కడుపారా లాగించాక ఓ చక్కని కిళ్లీగానీ నోట్లో వేసుకున్నామంటే... ఆ అనుభూతే వేరు.

ఎన్ని రకాలో...
సాధారణంగా పాన్‌ రెండు రకాలు. ఆకేసి, సున్నం రాసి, ఖత్తా (ఒక రకం తుమ్మ బెరడు నుంచి తయారుచేసే పొడి)పూసి, వక్క పలుకేసి, ఖర్జూరం, సోంపు వేసి చుట్టేదే సాదా పాన్‌. రెండోది మీఠా. ఆకుల్లో కొబ్బరి పలుకులు, టూటీఫ్రూటీలు, ఎండుపండ్లు, ఖర్జూరం, కిస్‌మిస్‌, బాదం, గుల్‌ఖండ్‌, యాలకులు, వక్కపలుకులు, లవంగాలు జోడించి ఇచ్చేదే మీఠా లేదా స్వీట్‌ పాన్‌. కొంచెం తీపీ మరి కొంచెం మసాలా ఘాటూ కలగలిసిన ఈ పాన్‌, భిన్నమైన రుచితో మైమరపిస్తుంది.కిళ్లీల్లో కాస్త జర్దా(పొగాకు) దట్టించి కట్టి ఇచ్చే జర్దా కిళ్లీల తీరే వేరు. కాస్త మంటా, నిషా కావాలనుకునే కిళ్లీ రాయుళ్లు తప్ప అందరూ వీటిని తినలేరు.కొత్త వాళ్లకయితే వాటి ఘాటుకి తల తిరగడం ఖాయం. ఒకప్పుడు అన్ని రకాల కిళ్లీల్లోనూ కొద్దిపాళ్లలో పొగాకు ముక్కల్ని వేసేవారట కానీ ఆరోగ్యస్పృహతో ఈమధ్య ఎవరూ దాని జోలికి పోవడం లేదనే చెప్పాలి. తమలపాకు ఆరోగ్యానికి ఎంత మేలుచేస్తుందో అందులో వాడే వక్కా, పొగాకులు అంత హాని కలిగిస్తాయి. అందుకే వాటిని తీసేసి మరీ పాన్‌ తయారుచేస్తున్నారు. ఒకవేళ వక్క వాడాల్సి వచ్చినా దాన్ని నానబెట్టి హానికర టానిన్లన్నీ పోగొట్టి మరీ వాడుతున్నారు. అందుకే ఇప్పుడు పాన్‌ తీరు మారింది, ఘాటు తగ్గింది. టర్కిష్‌ కాఫీ, డార్క్‌ చాకొలెట్‌, బటర్‌స్కాచ్‌, స్ట్రాబెర్రీ, రాజ్‌భోగ్‌, చందన్‌, గోల్డెన్‌, సిల్వర్‌, కేసర్‌, ఖుష్‌, కస్తూరి, దిల్‌ఖుష్‌, హీనా, రోజ్‌, పైన్‌ యాపిల్‌, సురభి, మీనాక్షి, రెడ్‌ వెల్వెట్‌, బ్లూ లాగూన్‌, బబుల్‌గమ్‌, బ్లాక్‌ ఫారెస్ట్‌, వాల్‌నట్‌, స్పెషల్‌ పంచరంగి, నవరతన్‌, రజనీగంధ... ఇలా రకరకాల కొత్త రుచుల్లో చవులూరిస్తోంది.

దిల్లీలో 1965 నుంచీ ఉన్న ప్రిన్స్‌ పాన్‌ షాపుకి వెళితే మామిడి, స్ట్రాబెర్రీ, ఐస్‌క్రీమ్‌ పాన్‌లు నోరూరిస్తాయి. కోల్‌కతాలోని శ్రీ పాన్‌ దాబా 110 రకాల పాన్‌లతో ఎప్పటికప్పుడు కొత్త రకాల కిళ్లీలు తయారుచేస్తూ పాన్‌ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఇక, బనారసీ పాన్‌ తీరే వేరు. అందులో వాడే వక్క, సున్నం, ఖత్తా, పొగాకు... అన్నింటినీ శుభ్రంగా కడిగి, రోజుల తరబడి నానబెట్టి, వాటిల్లోని హానికర లక్షణాలన్నీ పోయేలా చేశాకనే కిళ్లీ కడతారు. అందుకే అది జీర్ణశక్తికి మంచిదిగానూ నోటి దుర్వాసనని పొగొట్టేదిగానూ పేరొందింది. అక్కడి కిళ్లీవాలా అందించే విధానం వల్ల కూడా దీనికో ప్రత్యేక రుచి వస్తుందట. బెనారస్‌ ఆకు మందంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు నమలవచ్చు. లడ్డూ రుచితో అందించే కిళ్లీలూ కడుతున్నారు. ఎందుకంటే, ఊయాల్సిన అవసరం లేని పాన్‌లు చుట్టడమే నేటి ట్రెండ్‌. కోవాతో చేసే కిళ్లీ రకాలకు ముంబైకి చెందిన మామా పాన్‌వాలా పేరొందింది. పొగాకు లేకుండా చివరివరకూ నమిలి తినే పాన్‌ల తయారీలో యామూ పంచాయత్‌ పేరొందింది. 1950లో దిల్లీలో ప్రారంభమైన ఇది తొలి పాన్‌ పార్లర్‌ కూడా. దీనికి అనేక బ్రాంచీలూ ఉన్నాయి. మహిళలు నిర్వహిస్తోన్న ఈ పార్లర్‌కి మహిళల ఆదరణా ఎక్కువే. అలాగే కొల్హాపుర్‌కి చెందిన ఇద్దరు మహిళలు ఏకంగా 400 రకాల పాన్‌లతో కిళ్లీప్రియుల్ని అలరిస్తున్నారు.

మనదగ్గరా...
భాగ్యనగరం బిర్యానీకే కాదు, కిళ్లీ రుచులకీ స్వర్గసీమే. జంటనగరాల్లో గల్లీకొకటి చొప్పున ఉన్న పాన్‌ దుకాణాలే ఇందుకు ఉదాహరణ. ప్యారడైజ్‌ సర్కిల్‌ దగ్గరున్న ఏసీ పాన్‌మహల్‌ రాష్ట్రంలో మొదటి ఏసీ కిళ్లీ షాపుగా ఘనతకెక్కింది. కూకట్‌పల్లిలోని చైతన్య ఫుడ్‌కోర్టులో కట్టే మీఠాపాన్‌లో 35 రకాల పదార్థాలు కలుపుతారట. ఆర్డరును బట్టి వెండి, బంగారు రేకులూ కలుపుతారు. నగరంలోని డిమ్మీ పాన్‌ ప్యాలెస్‌ తయారుచేసే 75రకాల పాన్‌లలో 30రకాలు తియ్యనివే. కోల్‌కతా మీనాక్షి నుంచి కుల్ఫీమీఠా వరకూ రకరకాల పాన్‌లతో కిళ్లీప్రియుల మదిని దోచుకుంటుందీ దుకాణం.
నవదంపతులకోసం ప్రత్యేకంగా హనీమూన్‌ పాన్‌ కట్టే దుకాణాలూ ఉన్నాయి. ఆయుర్వేద మందులతోబాటు స్వర్ణభస్మం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలతో స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా తయారుచేసి బంగారు ఫాయిల్‌ చుడతారు. పూర్వం కూడా ఆడవాళ్లకోసం ప్రత్యేక తాంబూలం ఉండేదట.
వరూధిని వేసుకున్న తాంబూలం పరిమళం ఆధారంగానే ఆ చుట్టుపక్కల స్త్రీ ఉందన్న విషయాన్ని ప్రవరాఖ్యుడు గుర్తించినట్లు మనుచరిత్ర చెబుతోంది.
వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేందుకు చందన్‌, రోజ్‌, ఖస్‌ రకాలనీ; శీతాకాలంలో వెచ్చదనాన్ని పంచే కేసర్‌, కస్తూరి, లాల్‌జరి... ఇలా కాలానుగుణంగానూ కిళ్లీలను కడుతున్నారు. ఐస్‌పొడితో ఇచ్చే ఐస్‌పాన్‌ వేసవిలో తింటే ఆ మజానే వేరంటారు పాన్‌ప్రియులు. అందుకే పట్టణం, నగరంతో పనిలేకుండా కిళ్లీవ్యాపారం మూడు ఆకులు, ఆరు పోకలుగా నడుస్తోంది.

ఆరోగ్యానికీ...
హృదయాకారపు తమలపాకు గుండెకీ మంచి ఆహారమే. ఇందులోని సువాసనభరితమైన నూనెలకి బీపీని తగ్గించే గుణమూ ఉంది. అందుకే తమలపాకులో తగు మోతాదులో వేసే వక్కలూ సుగంధద్రవ్యాలూ అన్నీ కలిసి నోటిలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా నోటి దుర్వాసనని దూరం చేస్తాయి. కిళ్లీ లేదా తాంబూలం నమలడంవల్ల లాలాజలం ఎక్కువై జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. డిప్రెషన్‌ కూడా తగ్గుతుందట. దీన్ని నిరంతరం తింటే దంతాలు రంగు మారిపోతాయి. కాబట్టి తిన్నాక నోటిని శుభ్రం చేసుకోవడం మరువకూడదు.

శృంగారానికీ...
చిలకపచ్చరంగులో మెరిసే లేత తమలపాకులూ రేయి నల్లవక్కలూ వెన్నెలంటి సున్నమూ వాటి సరసన ఓ రెండు యాలకులూ కలిపి నోట్లో పెడితే కళ్లముందు స్వర్గం కనిపించకుండానూ నోరంతా సువాసనలతో గుబాళించకుండానూ ఎలా ఉంటుందీ... అందుకే మునిమాపువేళ భోజనానంతరం కబుర్లు చెబుతూ కట్టిన తాంబూలాన్ని వేళ్ల అంచుల్లో చిలుకల్లా చుట్టి, భర్త నోటికి అందించడం ద్వారా కొంగుకి కట్టేసుకునేవారు వెనకటి తరం భార్యలు. ఇప్పుడంతటి తీరికా ఓపికా ఎవరికీ లేవుగానీ ఉండి ఉంటే, ఆధునిక దంపతులు సంతానరాహిత్యంతో ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగాల్సి అవసరం ఉండదని మాత్రం చెప్పవచ్చు.

ఫైర్‌ పాన్‌  

ఆహారపదార్థాల్లో కొత్త రుచులు వస్తున్నట్లే, భోజనానంతరం వేసుకునే కిళ్లీల్లోనూ సరికొత్త రుచులు వస్తున్నాయి. దాన్ని వేసుకునే పద్ధతులూ మారుతున్నాయి. అలా పుట్టుకొచ్చిందే ఫైర్‌ పాన్‌. దిల్లీ, ముంబైలలో మొదలైన ఈ మంట సెగ, ఇటీవల హైదరాబాద్‌కీ సోకింది. దీనికోసం కోల్‌కతా నుంచీ ఆకుల్నీ దినుసుల్నీ మసాలానీ దిగుమతి చేసుకుని మరీ తయారుచేస్తున్నారట. ఇందులో కృత్రిమ రసాయనాలేవీ కలపమనీ సహజమైన మూలికా భస్మాల్ని కలిపి మండించి వినియోగదారుల నోట్లో పెడతామనీ ఇది ఆరోగ్యానికి మంచిదేననీ కిళ్లీవాలాలు చెబుతుంటే, నోరు కాలకుండా జాగ్రత్తగా తినండి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కోహినూర్‌ పాన్‌

ఔరంగాబాద్‌లోని తారా పాన్‌వాలాని పలకరిస్తే అక్కడ చేసే యాభై ఒక్క పాన్‌ రకాల గురించీ సునాయాసంగా చెప్పేస్తాడు. వాటన్నింటిలోకీ ప్రత్యేకమైనదీ ఖరీదైనదీ కోహినూర్‌ పాన్‌. దీన్ని జతగా ఇస్తారట. ఖరీదు ఐదు వేలు. దీనికే ఇండియన్‌ వయాగ్రా అని పేరు. ఇది శృంగారేచ్ఛను పెంచుతుందనీ, దీని ప్రభావం రెండు రోజుల వరకూ ఉంటుందనీ, దీన్ని తిన్నాక ఉమ్మకూడదనీ, కొత్తగా పెళ్లయిన జంటకోసం వేర్వేరుగా కడతామనీ చెప్పుకొస్తాడా పాన్‌వాలా మహమ్మద్‌ సిద్ధిఖీ. ఇందులో కస్తూరి, మస్క్‌, గులాబీ, కుంకుమపువ్వు... వంటి ఖరీదైన దినుసులతోబాటు కొన్ని రహస్య దినుసుల్నీ కలుపుతారట. దీని తయారీ సిద్ధిఖీకీ అతని తల్లికీ తప్ప మరెవ్వరికీ తెలియదట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.