close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గిఫ్ట్‌

గిఫ్ట్‌
- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌

ఇటువైపు నేను... అటువైపు వాడు... మధ్యలో టేబుల్‌పై అరవైనాలుగు గళ్ళ నలుపు-తెలుపు చెస్‌బోర్డ్‌. రెక్కలు తొడిగిన పావురాల్లాంటి తెల్ల పావుల్ని చకచకా ముందుకు నడిపిస్తూ... స్వైరవిహారం చేస్తూ వాడు. చిక్కటి చీకటిని కప్పుకున్న నల్లటి పావుల్తో అడుగేయడమే అతి కష్టంగా పుట్టెడు దిగుల్తో నేను. ఆట మహా రంజుగా సాగుతుంటే గంటలు క్షణాలుగా గడిచిపోతున్నాయి.
నా రక్తం పంచుకుని పుట్టినవాడే...
నా గుండెలమీద తంతూ నా కళ్ళెదురుగా పెరిగినవాడే... ఈరోజు ఈ చదరంగం ఆటలో ప్రత్యర్థిగా ఎత్తుకు పైఎత్తు వేస్తూ నాకే చెమటలు పట్టిస్తున్నాడు.
తొలినాళ్ళలో వీడికి చదరంగం నేర్పిన నాకే ఆశ్చర్యం కలిగే రీతిలో ఎంత ఎదిగిపోయాడు?
చదరంగంలోని గళ్ళ వంక వాడు చురుగ్గా చూస్తే చాలు... నా గుండెల్లో గుబులు, కసుక్కున చురకత్తి దిగినంత బాధ. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే నన్ను వరించే ఓటమి. ఆ బాధ కూడా హాయిగా ఉంటుందనీ ఆ ఓటమి కూడా అవధుల్లేని ఆనందాన్నిస్తుందనీ తెలుసుకున్న తర్వాత ప్రతి సాయంత్రం పదేపదే ఆ రెండు అనుభూతుల్నీ ఆహ్వానిస్తూ వస్తున్నాను.
ఆలోచిస్తుండగానే ‘చెక్‌’ అంటూ నవ్వాడు వాడు. చేష్టలుడిగి చూస్తూ నేను.
‘‘మరో ఆట వేద్దామా?’’ అన్నాడు. ‘మళ్ళీ ఓడతావా?’ అన్నట్లు వినిపించింది నాకు.
చిన్నగా నవ్వాను. చెస్‌బోర్డ్‌ మీద కార్తీక్‌ మళ్ళీ పావులు సర్దడం మొదలుపెట్టాడు.
ఓసారి పోగ్రెస్‌ రిపోర్ట్‌ చూసీచూడకుండానే సంతకం పెట్టేస్తుంటే, గమనించిన వాడు- ‘‘మార్కులు చూడు డాడీ! అన్ని సబ్జెక్టుల్లోనూ నైంటీ దాటాయి’’ అన్నాడు.
‘‘నాకు తెలుసురా... చదువులో నువ్వెప్పుడూ వెనకుండవని. కానీ, చదరంగంలోనే నాతో ఓడిపోతున్నావు చూడు... అది భరించలేకపోతున్నాను. ఒక్కసారి... ఒక్కసారైనా గెలవరా... అప్పుడు ఆకాశం అరచేతికి అందినంత ఆనందాన్ని అనుభవిస్తాను’’ అన్నాను.
అంతే! ఆ తర్వాత వాడు స్కూలు వేళలు మినహాయిస్తే ఇంట్లో ఎప్పుడూ చెస్‌బోర్డు ముందే కనిపించేవాడు. నేనూ ఫ్యాక్టరీ పనివేళలు మినహాయిస్తే వాడెదురుగా చదరంగం ఆడుతుండేవాడిని. ఒక్కోసారి నేనందుబాటులో లేని సమయాల్లో ఒంటరిగానే వాడు చెస్‌
ఆడుతుండేవాడు.
‘‘మీ పిచ్చి వాడికంటించి వేడుక చూస్తున్నారా?’’ నా భార్య సునీత కస్సుమనేది.
‘‘చదువుసంధ్యలు మానేసి ఆ అరవైనాలుగు గళ్ళకేసి చూస్తుంటే వాడి బతుకు బాగుపడ్డట్టే’’ సణిగేది.
‘‘ఓసి పిచ్చిదానా! అరవైనాలుగు కళలూ ఆ అరవైనాలుగు గళ్ళలోనే ఉన్నాయే.
చదరంగం అల్లాటప్పా ఆట కాదు, మేధో క్రీడ. అందులో రాణిస్తే జీవితాన్నిస్తుంది. ఎలా జీవించాలో నేర్పుతుంది’’ చెప్పేవాడిని.
అయినా, ఆమె ధోరణి ఆమెదే. చక్కగా చదువుకుంటున్న కుర్రాడిని చెడిపేస్తున్నానని విరుచుకుపడుతుంటుంది.
‘‘నీకు చదరంగం అంటే అంత ఇష్టమా నాన్నా?’’ అడిగేవాడు కార్తీక్‌.
‘‘నా ప్రాణం’’ నా సమాధానం.
ఔను, నాకు చిన్నప్పటి నుంచీ చెస్‌ అంటే విపరీతమైన ఇష్టం.
ఆ ఆట మా నాన్న నేర్పాడు.
కళ్ళు మూసుకున్నా కూడా చెస్‌బోర్డులోని అరవైనాలుగు గళ్ళు కళ్ళముందు నిలిచి ‘కథాకళి’ ఆడేవి. మేలుకున్న వెంటనే చెస్‌బోర్డు ముందు కూచుంటే అవే పావులు ఆత్మీయంగా ‘హలో’ చెప్పేవి. చెస్‌ ప్లేయర్‌ కావాలన్నదే నా జీవితాశయం.
అన్నీ సజావుగా సాగితే ఇప్పుడు ఓ ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా కాకుండా చెస్‌ ప్లేయర్‌గా దేశానికే వన్నెతెచ్చి ఉండేవాడినేమో! స్కూల్‌ స్థాయిలో చెస్‌లో ప్రతిభ కనబరుస్తుండగానే అకస్మాత్తుగా ఓరోజు ఇంటి కప్పు కూలిపోయింది.
నాన్న చనిపోయాడు. ఏ అర్ధరాత్రివేళో ఆదమరిచిన నిద్రలో నా కళ్ళను వరించిన బంగారంలాంటి నా కల చేజారిపోయింది.
అనివార్యంగా మీదపడ్డ కుటుంబ భారం, బాధ్యత. చదువు కూడా అంతంతమాత్రంగా సాగింది. దాంతో ‘చెస్‌’ అనే రెండక్షరాల్ని నా జీవితం అతి దారుణంగా వెలివేసింది. బంగారు బాల్యం దాటి బాధ్యతల బరువుతో కూడిన యవ్వనంలోకి అడుగిడి సాదాసీదా ఉద్యోగినై పెళ్ళి
చూపుల్లోనే నన్నెంతగానో ఇష్టపడిన సునీతకి భర్తనై సంసారం సాగిస్తుంటే... మళ్ళీ నా కల-
కార్తీక్‌ రూపంలో కళ్ళెదుట నిలిచింది.
కార్తీక్‌... నేను జారవిడుచుకున్న కలని సాకారం చేసి బహుమతిగా నాకిస్తాడు. భవిష్యత్తులో వాడు పెద్ద చెస్‌ ప్లేయర్‌గా నిలిచి ప్రపంచం ముందు నా స్వప్నాన్ని అందంగా ఆవిష్కరిస్తాడు... ఇది ఇప్పుడు మెలకువలోనూ నిద్రలోనూ నా కన్రెప్పల్ని అలరిస్తున్న అందమైన కల.
కార్తీక్‌ మొన్నమొన్నటిదాకా నాతో ఓడిపోయాడు. ఓడిపోతున్నకొద్దీ కళ్ళనిండా కసితో రగిలిపోయేవాడు.
అలాంటి సమయంలోనే వాడిని దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుని చెంపల్ని నిమురుతూ ఓదార్చుతూ ‘‘ఓడిపో... ఇంకా ఇంకా ఓడిపో. గెలుపు మంత్రాన్ని బోధించేది ఓటమి ఒక్కటే. ఒక్కసారి గెలుపు రుచి తెలిసిన తర్వాత తిరిగి ఓడిపొమ్మన్నా ఓడిపోవు. అందుకే, ఓటమిని సంపూర్ణంగా, సంతృప్తికరంగా ఇప్పుడే అనుభవించు. అది చెప్పే పాఠాల్ని మెదడుకు ఎక్కించుకో. ఓటమిని మాత్రం మనసుకు ఎక్కించుకోకు’’ చెప్పేవాడిని.
నా ఆత్రంకొద్దీ చెప్తున్నానే కానీ... నా మాటల్ని అర్థంచేసుకునే వయసూ మనసూ వాడికి లేవని నాక్కూడా తెలుసు.
అనూహ్యంగా మూడు నెలల క్రితం మొదటిసారి వాడి చేతుల్లో ఓడిపోయిన తర్వాత- ఇక, నా ‘గురు’త్వాకర్షణ శక్తి వాడిపై పనిచేయదని అర్థం చేసుకున్నాను.
అంతే! ఆ సాయంత్రమే సరూర్‌నగర్‌లోని చెస్‌ కోచ్‌ని సంప్రదించాను.
వారానికి మూడు క్లాసులు... నెలకి మూడువేలు. ముచ్చటగా మూడువారాల శిక్షణ తర్వాత ఓ సాయంత్రం వాడితో కూచుని చెస్‌ ఆడితే తెలిసింది... ప్రత్యర్థి అంచనాలను మించి ఎత్తులు వేస్తున్నాడని. అంతేనా, గతంలోకన్నా వాడికి నన్ను ఓడించడం మహా తేలికైపోయింది. ఆ తర్వాతి నుంచీ నాకు ఆ ఓటమిని స్వీకరించడం ‘షరా మామూలైంది.
మా ఇంటికి సరూర్‌నగర్‌ కొంచెం దూరమే. హైదరాబాద్‌ చెస్‌ అకాడమీకి అనుబంధంగా అక్కడ నడుపుతున్న చెస్‌ కోచింగ్‌ సెంటర్‌కి ఎక్కడలేని ప్రాముఖ్యత ఉంది. పైపెచ్చు చెస్‌ కోచ్‌ సుందరం వ్యక్తిగత శ్రద్ధతో ప్రతి ఒక్కర్నీ తీర్చిదిద్దుతాడనే పేరుంది. దాంతో, కోచింగ్‌ సెంటర్‌ కాస్త దూరమైనా కార్తీక్‌ని అక్కడ చేర్చాను. వారంలో మూడు రోజులు సాయంత్రాలు పనులెన్నున్నా వాయిదా వేసి మరీ వాడిని నా బైక్‌పై తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాడిని. వాడిని తీసుకొస్తున్న సమయంలో మామధ్య మాటలన్నీ చదరంగం చుట్టే తిరుగుతుండేవి.
‘‘నాన్నా... ఇవాళేం నేర్చుకున్నావ్‌?’’
ఆత్మీయంగా అడిగేవాడిని.
ఒక్కొక్కటిగా విడమర్చి చెప్పేవాడు కార్తీక్‌. ఆషామాషీగా కాకుండా చెస్‌ క్రీడను ప్రొఫెషనల్‌గా ఆడడం ఎలాగో, కోచ్‌ చెప్తున్న విషయాలు కార్తీక్‌ ద్వారా వింటుంటే అప్పటికప్పుడే కార్తీక్‌ గ్రాండ్‌ మాస్టర్‌ అయినంత ఆనందం కలిగేది.
‘‘సరూర్‌నగర్‌ ఏరియాకే మనం మారిపోతే ఎలా ఉంటుంది?’’ ఓరోజు రాత్రి అంది సునీత.
‘‘ఏం...ఇక్కడ ఈ ఇల్లు బాగోలేదా?’’ అడిగాను.
‘‘ఇక్కడైనా ఎక్కడైనా అద్దె ఇల్లే కదా... వారంలో మూడు రోజులు కార్తీక్‌ని చెస్‌
క్లాసులకు తీసుకెళ్ళేందుకు మీరు పడుతున్న హైరానా గమనించి ఆ ఏరియాకే మారితే సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నా’’ అంది తాంబూలం చేతికందిస్తూ.
ఆ సమయంలో ఆమెలో నాకు ‘కార్యేషు మంత్రి’ కనిపించింది. సునీత సలహా నచ్చడంతో సరూర్‌నగర్‌ ఏరియాలో ఇంటికోసం వేట ప్రారంభించాను. రెండ్రోజులు బైక్‌పై తిరిగితే మంచి పోర్షన్‌ లభించింది. వెంటనే సునీతనూ కార్తీక్‌నీ వెంటేసుకుని మరీ ఆ పోర్షన్‌ చూపించాను. సింగిల్‌ బెడ్‌రూమ్‌ పోర్షన్‌ అది. హాల్‌, కిచెన్‌, బెడ్‌రూమ్‌తోపాటు స్టోర్‌రూమ్‌ కూడా ఉంది.
ఆ స్టోర్‌రూమ్‌ను చూస్తూనే అన్నాడు కార్తీక్‌ ‘‘డాడీ, ఈ చిన్ని రూమ్‌లో మనం టేబుల్‌ వేసుకుని చెస్‌ ఆడుకోవచ్చు. ఎంచక్కా కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ వీచే ఫ్రెష్‌ గాలి పీలుస్తూ ఎత్తుకు పైఎత్తు వేస్తుంటే... ఓహ్‌! ఆ మజాయే వేరు’’
ఆ రూమ్‌ని చుట్టేస్తూ ఎగిరి గంతులేస్తూ నానా హంగామా చేస్తున్నాడు వాడు.
ఆ రూమ్‌ని చూసిన తర్వాత కార్తీక్‌ చెప్పిందే కరెక్టనిపించింది నాకు. వాడి ఆశ తీర్చడానికి ఎంత వేగిరం ఆ పోర్షన్‌లోకి మకాం మార్చేద్దామా అని తొందర కలిగింది. వెంటనే, ఇంటి ఓనర్‌ని కలుసుకుని అడ్వాన్స్‌ ఇచ్చి రెండ్రోజుల్లో ఇంట్లోకి చేరిపోతామనే సమాచారం అందించిన తర్వాత కానీ నా గుండె కుదుటపడలేదు.
కార్తీక్‌ స్టోర్‌రూమ్‌ని బాగా డెకరేట్‌ చేశాడు. కిటికీకి కర్టెన్లు అమర్చాడు. చెస్‌ ఆడుతున్నప్పుడు మాత్రం ఆ కిటికీకున్న ఆ కర్టెన్లను పక్కకు
జరిపేవాడు. ఆ రూమ్‌లో చెస్‌ ఆడుతుంటే మా ఇద్దరిలోనూ నవ్యోత్సాహం ఉరకలెత్తేది.
స్టోర్‌ రూమ్‌ కిటికీలోంచి చూస్తే అక్కడో విశాలమైన మైదానం. సాయంత్రాల్లో మేం ఇక్కడ చెస్‌బోర్డు ముందు కూచుంటే... అక్కడ ఆ మైదానంలో క్రికెట్‌ ఆడుతూ కొంతమంది పిల్లలు. బలమైన బౌలింగ్‌తో అంతెత్తున
బంతి గాల్లో గింగిరాలు తిరుగుతుంటే ‘క్యాచ్‌’ కోసం మైదానమంతా సందడి చేస్తూ పరుగులు పెడుతూ వాళ్ళు.
ఫోర్లూ సిక్సర్లూ కొడుతుంటే వాళ్ళలో హుషారే హుషారు. వికెట్లు పడిపోతుంటే అరుపులూ కేకలూ కేరింతలూ. ఆ గోల
వినిపిస్తున్నప్పుడల్లా కిటికీలోంచి మైదానం వైపు చూస్తూ కార్తీక్‌.
‘‘ఇంత వయసొచ్చిన నాకే ఆ గోలతో ఏకాగ్రత దెబ్బతింటోంది. వాడి ఇబ్బంది కూడా ఇదేనేమో?’’ కొన్నాళ్ళకు నాలో కలిగిన ఆలోచన అది. కానీ, కార్తీక్‌ ఇక్కడ చెస్‌బోర్డుపై చకచకా ఎత్తులు వేస్తూనే గల్లీ క్రికెట్‌ క్రీడావీక్షణంలో మునిగిపోయేవాడు.
‘‘డిస్టర్బవుతున్నావా?’’ అడిగాను
ఓరోజు వాడిని.
‘‘నో..నో! ఎంజాయ్‌ చేస్తున్నాను’’
అన్నాడు వాడు.
ఓరోజు సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి తొందరగానే వచ్చి స్టోర్‌రూమ్‌లో చెస్‌బోర్డు ముందు కూచుని వాడికోసం ఎదురుచూస్తున్నాను. ఎంతకీ వాడు రావడం లేదు. అస్సలు ఇంట్లో ఉన్న జాడే లేదు.
అదే విషయాన్ని సునీతను అడిగాను.
‘‘ఔను, వాడు ఇంట్లో లేడు. ఇప్పుడే వస్తానంటూ ఫ్రెండ్‌ని కలిసేందుకు కాబోలు బయటకి వెళ్ళాడు’’ సమాధానమిచ్చింది సునీత. ఆ సాయంత్రం వాడితో నేను చెస్‌ ఆడలేదు. ఆ ఒక్కరోజే కాదు... ఆ తర్వాత వరుసగా నాలుగు రోజులూ ఆడలేదు.
ఆ సాయంత్రం నేనొక్కడినే చెస్‌బోర్డు ముందు కూచుని సరదాగా పావులు కదుపుతూ యధాలాపంగా కిటికీలోంచి మైదానంలోకి చూశాను. నా చూపు పెద్దదైంది.
వాడే... వాడే... కార్తీక్‌. వాడి చేతిలో క్రికెట్‌ బ్యాట్‌. బ్యాటింగ్‌ చేస్తున్నాడేమో... విసురుగా వచ్చి వికెట్‌ తాకబోయిన బాల్‌ని అతి లాఘవంగా కొట్టాడు. అంతే, ఆ బంతి ఆకాశాన్ని అందుకునేందుకు కాబోలు గాల్లో తేలుతూ వెళ్తుంటే... ‘క్యాచ్‌’ కోసం పరుగులు తీస్తూ కుర్రాళ్ళు.
‘‘సిక్సర్‌...’’ అరిచారెవరో.
అంత దూరం నుంచి కూడా కార్తీక్‌
పెదాలపై వెలిగిపోతూ నవ్వు.
‘‘వీడు క్రికెట్‌ ఎప్పుడు నేర్చుకున్నాడు?’’ నాలో ఆశ్చర్యం.
అంతలోనే నాలో సందేహం... కార్తీక్‌కి క్రికెట్‌పై ఎప్పుడు ఆసక్తి కలిగింది. సరిగ్గా... ఇక్కడే, ఈ స్టోర్‌రూమ్‌లో కూచుని కిటికీ తెరల్ని తొలగించి మైదానంలోకి చూస్తూ చెస్‌ ఆడుతూ ఆడుతూ ఆ క్రికెట్‌ ఆటపై మనసు పారేసుకున్నాడా?
చెస్‌ క్రీడాకారుడిగా ఎదిగి నా కల సాకారం చేస్తాడనుకున్న కార్తీక్‌ ఇప్పుడు క్రికెట్‌ ఆడుతున్నాడు. మైదానంలో జలపాతంలా పరుగులు తీస్తున్నాడు. గాల్లో ఎగిరిపడుతున్న బంతిని పట్టుకునేందుకు ఎగిసిపడుతున్న కడలి కెరటంలా ఎగురుతున్నాడు. ఒంటిని విల్లులా వంచి బంతిని బాణంలా విసుర్తున్నాడు. శరీరాన్ని కదల్చకుండా గంటలకొద్దీ ఆడే చదరంగం స్థానంలో ఎక్కడలేని వ్యాయామ విన్యాసాలు చేస్తూ మైదానంలో వాడు చెమటలు కక్కుతున్నాడు.
గంటన్నర తర్వాత వాడు ఇంటికి వచ్చాడు. వస్తూనే వాష్‌రూమ్‌లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ ముఖం కడుక్కుని టవల్‌తో తుడుచుకుంటూ నాకెదురుపడ్డాడు.
‘‘సారీ డాడీ’’ అన్నాడు కార్తీక్‌.
‘‘సారీ ఎందుకు?’’ అన్నాను నేను.
‘‘ఈమధ్య నీతో చెస్‌ ఆడలేనందుకు’’ అన్నాడు వాడు.
‘‘ఇట్స్‌ ఓకే’’
‘‘ఇప్పుడో ఆట వేద్దామా?’’ అన్నాడు వాడు.
‘‘మూడ్‌ లేదు’’ అన్నాను నేను.
‘‘అర్ధరాత్రి లేపినా చెస్‌ ఆడేందుకు ఉత్సాహం చూపించే నీకు మూడ్‌ లేకపోవడమా?’’ అన్నాడు ఆశ్చర్యంగా వాడు.
‘‘మూడ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒక్కోసారి మారుతుంటుంది. పంధా మార్చుకుంటుంది’’ అన్నాను నేను.
మర్నాడు కార్తీక్‌ పుట్టినరోజు.
‘‘డాడీ, నాకు ఏం బహుమతి ఇస్తావు?’’ నేను బయటకి వెళ్ళబోతుంటే అడిగాడు కార్తీక్‌.
‘కల...’ ఆ మాట పెదాల నుంచి బయటకి రాకుండానే వాడికి ‘టాటా’ చెప్పి వెళ్ళిపోయానక్కడ నుంచి.
ఆ సాయంత్రం-
‘‘ఇదిగో నీ పుట్టినరోజు బహుమతి’’
అందించాను వాడికి.
ఆ కానుకను అందుకోగానే వాడి కళ్ళలో మెరుపు, ఆశ్చర్యం!
‘‘డాడీ..!’’ అన్నాడు వాడు.
‘‘ఔను... ఇది ఇప్పటి నీ కల. చెస్‌ ఒకప్పటి నా కల. కన్రెప్పల మాటున కొన్నేళ్ళుగా నలిగిన నా కలకు నీ ద్వారా కొత్త రంగులు వేయాలని నేనాశించడం నిజంగా అన్యాయం. సాకారం చేయమంటూ బలవంతంగా నా కలని నీపై రుద్దడం నేరం. నాకున్నట్లే నీ కళ్ళలోనూ కొన్ని కలలు సప్తవర్ణాల ఇంద్రధనుస్సుల్లా వెల్లి విరుస్తాయన్న సంగతి ఇప్పుడే తెలిసింది. అందుకే... ఇదీ నా కానుక’’ ఆ మాటల్ని కూడా బయటికి చెప్పలేదు నేను. కారణం... అర్థం చేసుకునే వయసూ మనసూ వాడికి లేవు. ఎందుకంటే, వాడు ఏడో తరగతి చదువుతున్న పన్నెండేళ్ళ కుర్రాడు మరి.
ఇప్పుడా కుర్రాడి చేతుల్లో నేనిచ్చిన బహుమానం ఉంది.
ఆ బహుమానం... క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.