close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒంటరితనాన్ని గెలిచేద్దాం!

ఒంటరితనాన్ని గెలిచేద్దాం!

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది...
ఇది సినిమా పాటే కాదు, జీవిత పాఠం కూడా.
ఎందుకంటే- ఎంత పెద్ద కుటుంబం ఉన్నా ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ ఒంటరితనం అనుభవంలోకి వస్తుంది.
ఆధునిక జీవనశైలి ఫలితంగా ఇప్పుడీ ఏకాకి జీవితాలు
అభివృద్ధి చెందిన దేశాలను కుదిపేస్తున్నాయి.
ఈ సమస్యను ఎదుర్కొనడానికి బ్రిటన్‌ ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒంటరితనంపై జరుగుతున్న పరిశోధనలు
ఆసక్తికరమైన అంశాలను వెల్లడిస్తున్నాయి.
జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాయి.
‘అబ్బ... కాసేపు బయటకు పోయి ఆడుకోండి. నన్ను ఒంటరిగా వదిలేయండి...’ అని విసుక్కున్న అమ్మల్ని చూశాం. ఉమ్మడి కుటుంబాల్లో కాసింత ఏకాంతం కోసం తపించిపోయిన జంటల్నీ చూశాం. అదంతా ఒకప్పటి సంగతి.
ఆ అమ్మే ఇప్పుడు ఏం చేయాలో తోచక, పలకరించేవారు లేక ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతోంది. ఏకాంతం ఎక్కువైపోయిన జంటలు అనవసరపు తగవులాటలతో బంధాన్నే బలిపెడుతున్నాయి.
ఎందుకిలా మారిపోయింది?
ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ఏకాంతం దొరికితే అపురూపంగా ఆస్వాదిస్తాం. కానీ ఎప్పుడూ ఒంటరిగానే ఉండాల్సి వస్తే... మనిషిని అది భయపెడుతుంది. ఈ రెండిటి మధ్యా నిజానికి చాలా పలుచని తెర ఉంది. అంతం లేని ఏకాంతమే ఒంటరితనంలోకి దింపుతుంది. మారిన సమాజ స్వరూపమూ, సాంకేతికత ప్రధానంగా సాగుతున్న ఆధునిక జీవనశైలీ ఈ పరిస్థితికి ప్రధానకారణాలు. ఒకప్పటి సమష్టి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు. అసలే చిన్న కుటుంబాలు. ఆపైన చదువులూ ఉద్యోగాలతో నలుగురూ నాలుగు చోట్ల ఉంటున్నారు. ‘ఎవరికి వారు గిరిగీసుకున్నట్లుగా చట్రాల్లో ఇరుక్కుపోయి జీవిస్తున్నారు. మనిషి సంఘజీవి అన్న విషయాన్ని మర్చిపోతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు సామాజికశాస్త్రవేత్తలు.

అన్ని వయసులవారినీ...
ఒంటరితనం ఇప్పుడు అన్ని వయసులవారినీ ఇబ్బంది పెడుతున్న సమస్య. యువత నుంచీ వృద్ధులవరకూ అందరూ దీని బారినపడుతున్నారు. అంతర్ముఖుల్లో ఇది మరీ ఎక్కువ. రకరకాల పరిస్థితులకు తోడు మనిషి స్వభావమూ ఒంటరితనానికి దారితీస్తుంది. ఉద్యోగం కోసమో పైచదువుల కోసమో కుటుంబాన్ని వదిలి వెళ్లడమూ, ప్రేమలో విఫలం కావడమూ, వివాహితులైతే ఉద్యోగరీత్యా భాగస్వామికి దూరంగా ఉండాల్సి రావడమూ, విడాకులు తీసుకోవడమూ, భాగస్వామి మరణమూ... ఇలా పలు రకాల పరిస్థితులు ఒంటరి జీవితాలకు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. ఒంటరిని అన్న భావన ఒకసారి మనసులోకి చొరబడితే వారు సమూహంలోనూ ఒంటరితనాన్నే అనుభవిస్తారు. నిజానికి అదో సంక్లిష్టమైన భావోద్వేగ స్పందన అంటారు మానసికనిపుణులు. సరైన సమయంలో దాన్ని గుర్తించి బయటపడకపోతే కొంతకాలానికి అదే జబ్బుగా పరిణమిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

లావణ్య కాలేజీ టాపర్‌. పట్టా చేతికందుతూనే మంచి ఉద్యోగం తెచ్చుకుంది. అంచెలంచెలుగా పదోన్నతులు అందుకుని మూడు పదులు నిండేసరికల్లా మేనేజరు స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో పెళ్లి వెనకబడిపోయింది. కెరీర్‌లో ఓ స్థాయికి చేరుకున్న ఆమెకు ఇప్పుడు కావల్సినంత తీరిక. కానీ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్దామంటే అందరికీ పెళ్లిళ్లైపోయాయి. వాళ్లు తమ సంసారాలతో బిజీ. ఆఫీసులో పెళ్లికాని అమ్మాయిలతో మాట్లాడదామంటే హోదా అడ్డొస్తుంది. దాంతో తోడు ఎవరూ లేకా, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేకా ఆమె ఖాళీ సమయమంతా ఇంట్లో టీవీ ముందూ, ఫోనుతోనూ గడిపేస్తోంది. చూస్తూ చూస్తూ కొన్నాళ్లకే బాగా లావైపోయింది. చీటికీ మాటికీ చికాకుపడుతోంది. ఒంటరితనం ఆమె జీవితాన్ని శాసించడం మొదలెట్టింది. కెరీర్‌లో విజయం సాధిస్తూ త్వరత్వరగా ఉన్నత స్థాయికి వెళ్తున్నవారికి ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఎదురవుతోందట. వారు తమ తోటివారితో సామాజిక జీవనానికి దూరమవుతున్నారు.

కేరళలో డెబ్బైఐదేళ్ల ఓ వృద్ధురాలు కిరాణా కొట్టుకెళ్లి సరుకులు తీసుకుని రూ.500 నోటు ఇచ్చింది. అది పాత నోటు. వాటిని రద్దుచేసి కొన్ని నెలలైపోయింది, చెల్లదన్నాడు దుకాణదారు. ఆమెకు అర్థం కాలేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లింది. అక్కడా ఆమెకు అదే సమాధానం ఎదురైంది.
నిస్పృహతో కుప్పకూలిన ఆమెను అధికారులు వెంట ఉండి ఇంటికి తీసుకెళ్లారు. ఆమె ఇంట్లో మూట కట్టి ఉన్న నాలుగు లక్షల విలువైన పాతనోట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఆమె విద్యావంతురాలే. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరైంది. కానీ ఇంట్లో టీవీ లేదు, వార్తాపత్రిక లేదు. భర్త మరణించాడు. పిల్లల్లేరు. నిస్సహాయురాలైన తనను ఎవరైనా మోసం చేస్తారేమోనన్న భయం ఆమెను ఒంటరిని చేసింది. బంధువులకూ చుట్టుపక్కలవారికీ దూరం చేసింది. అందుకే నోట్ల రద్దు విషయం ఆమెకు తెలియలేదు.
డబ్బు సంగతి పక్కనపెడితే ఈ సంఘటన ఒంటరి వృద్ధుల పరిస్థితికి నిదర్శనం. ఆమె లాంటి వాళ్లు పల్లెల్లో చాలామందే ఉంటారు. ఇక పురుషుల పరిస్థితి మరీ దారుణం. తమ పనులు తాము చేసుకోవడం రాకా, వేళకింత తిండి పెట్టేవారు లేకా భాగస్వామిని కోల్పోయిన పురుషులు త్వరగా మరణానికి చేరువవుతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిజానికి ఇలాంటి సామాజిక అంశాలగురించి ఆలోచించడం, తదనుగుణంగా చర్యలు తీసుకోవడం మనలాంటి దేశాల్లో ఇంకా రాలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. యూరోప్‌లో సామాజిక శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పెరుగుతున్న ఒంటరితనం గురించి ప్రణాళికాకర్తలను హెచ్చరిస్తున్నారు. అది ఎంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందో వివరిస్తున్నారు.

సోషల్‌ మీడియా పాత్ర
ఓ తండ్రి కొడుకుని కాలేజీ దగ్గర దించడానికి బైక్‌ మీద వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పెద్ద దెబ్బలే తగలడంతో ఇద్దరూ ఆస్పత్రిలో చేరారు. ప్రమాదం సంగతి తెలిసి తండ్రి స్నేహితులూ సహోద్యోగులూ ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ తండ్రిని చూడడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. పండ్లూ టిఫిన్లూ తెచ్చేవారు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవారు. నిజానికి కొడుకుకన్నా తండ్రికి ఎక్కువ గాయాలే అయ్యాయి. కానీ స్నేహితులతో కబుర్లు చెబుతూ ఆయన తన నొప్పుల్ని మర్చిపోయాడు. త్వరగా కోలుకున్నాడు.
కాలేజీలో చదువుతున్న అబ్బాయికీ వందల్లో స్నేహితులున్నారు. కానీ చూడడానికి ఒక్కరూ రాలేదు. అందరూ అతని సోషల్‌మీడియా ఖాతాల్లో ‘సారీ, గెట్‌వెల్‌ సూన్‌ బ్రో’ అన్న సందేశాలు రాశారు. ప్రమాదం జరగడానికి కొద్ది రోజుల క్రితమే తండ్రీకొడుకుల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఫోను వాడకం తగ్గించమన్న తండ్రికి సోషల్‌ మీడియాలో తనకెంత మంది స్నేహితులున్నారో చూడమంటూ గర్వంగా చూపించాడు కొడుకు. వారందరితో టచ్‌లో ఉండడం తనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాదించాడు. ఆ సంఘటన గుర్తొచ్చింది అబ్బాయికి. వర్చువల్‌ స్నేహాలకీ వాస్తవ స్నేహాలకీ తేడా తెలిసింది.

ఇది కథ కాదు, వాస్తవం. అందుకు నిదర్శనం బ్రిటన్‌ పరిస్థితి.
సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువయ్యే కొద్దీ ఒంటరితనం పెరుగుతోందని అక్కడ జరిగిన అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. యూరోప్‌లో సోషల్‌మీడియా వాడకం బ్రిటన్‌లోనే ఎక్కువ. అందుకే ఆ దేశం ‘ఒంటరితనపు రాజధాని’... అన్న పేరు తెచ్చుకుంది. ఈ రెండిటికీ సంబంధం ఏమిటీ అంటే... ఏకాస్త తీరిక దొరికినా ఫోనులో సామాజిక మాధ్యమాలను చూసుకుంటూ గడిపేస్తున్నారట ప్రజలు. దాంతో మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. లండన్లో బీబీసీ ఓ పోల్‌ నిర్వహించింది. అందులో పాల్గొన్నవారిలో 33 శాతం తమ పొరుగున ఎవరు నివసిస్తున్నారో తమకు తెలియదని చెప్పారట. ‘ఒంటరితనం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. సాంకేతికంగా కమ్యూనికేషన్‌ ఎంతో అభివృద్ధిచెందిన ఈ కాలంలో మనసు విప్పి మాట్లాడుకునే తోడు లేక ఒంటరితనంతో బాధపడేవారి సంఖ్య పెరగడం విచారకరం’ అంటారు అమెరికాలో సర్జన్‌ జనరల్‌గా పనిచేసిన వివేక్‌ మూర్తి.

పరిస్థితుల ప్రభావం
‘నాకెవరున్నారు’... ఈ మాట ఎవరో ఒకరి నోటివెంట తరచూ వింటూనే ఉంటాం. కానీ కాస్త తాత్వికంగా ఆలోచిస్తే... ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ అని కవి ఏనాడో రాసిన మాటలు గుర్తొస్తాయి. రెక్కలొచ్చిన పిల్లలు తమ జీవిత గమ్యాలను వెదుక్కుంటూ వెళ్లిపోవడం ఎంత సహజమో రెక్కలు అలసిన పెద్దలు ఒంటరిగా విశ్రాంతజీవితం గడపాల్సి రావడమూ అంతే సహజం. విధి వక్రించి భాగస్వామి దూరమైతే మిగిలినవారికి ఒంటరితనంతో సహవాసం చేయక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో పై ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. వారు ఒక్కసారి తమ చుట్టూ ఉన్నవారి జీవితాలను పరిశీలిస్తే సమాధానం తేలిగ్గానే దొరుకుతుంది. తోబుట్టువులూ కన్నబిడ్డలూ ఎంతమంది ఉన్నా వారందరికీ సొంత కుటుంబాలుంటాయి. ఆ బాధ్యతలను వదిలేసి వచ్చేయడం ఎవరికీ సాధ్యం కాదు. రమ్మనడం సబబూ కాదు. మరి అటువంటప్పుడు ఆ ప్రశ్నకు జవాబేమిటి? మన కాలక్షేపం మనం వెదుక్కోవడమే.

ఎన్నిటికో ఇది మూలం
ఒంటరితనం ఇప్పుడు మరో పెద్ద ఆరోగ్య సమస్యగా మారబోతోందంటున్నారు వైద్యులు. ఇది కేవలం మానసిక సమస్య కాదనీ వైద్య, సామాజిక సమస్య అనీ వివరిస్తున్నారు. జీవనశైలి సమస్యలుగా ఇప్పటివరకు ముందువరసలో నిలుస్తున్న స్థూలకాయం, పొగతాగడం, పోషకాహారలోపం లాంటి వాటికన్నా ఇదే పెద్ద సమస్య అవుతోందట. ఎందుకంటే...
* ఒంటరితనం మానసికంగా పలు ఇతర సమస్యలకు దారితీస్తుంది. కుంగుబాటుకీ దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. అంతేకాదు... ఆందోళన, మతిమరుపు, మాదకద్రవ్యాల వాడకం, స్కిజోఫ్రీనియా, ఆల్జీమర్స్‌ లాంటి సమస్యలకు కారణమవుతుంది. ఇవన్నీ మనిషిని దీర్ఘకాలం వేధించే సమస్యలు.
* ఒంటరితనం ముఖ్యంగా ఆయుష్షుని తగ్గిస్తుంది. భాగస్వామిని కోల్పోయి ఒంటరితనంతో బాధపడేవారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎంచుకోకపోతే త్వరగా మృత్యువుకు చేరువవుతారని అధ్యయనాలు చెప్తున్నాయి.
అనారోగ్యంగా ఉన్నా, చిన్నచిన్న ప్రమాదాలేమైనా జరిగినా ఎవరూ తోడు ఉండరు కాబట్టి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోయి కుంగుబాటుకు లోనైతే అది విపరీతపరిణామాలకు తావిస్తుంది.ఆత్మహత్యలకూ దారితీస్తుంది.
* ఎవరికోసం జీవించాలి... అన్న నిర్వేదంతో చాలామంది ఒంటరివారు తమ గురించి తాము పట్టించుకోరు. అప్పటివరకూ ఉన్న ఆరోగ్యకరమైన అలవాట్లనూ వదిలేస్తారు. నిద్ర పట్టదు. శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులు వారి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయి.
* ఒత్తిడి ఏ రకంగా మనిషికి తెలియకుండా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందో ఒంటరితనం కూడా వారికి తెలియకుండానే వారి ఆరోగ్యం మీద పరోక్షంగా ప్రభావం చూపుతుంది.
* పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఒంటరితనాన్ని ఈ కాలపు పెద్ద జబ్బుగా పరిగణిస్తున్నారు. అధిక జనాభాతో పాటు సామాజికంగా క్రియాశీల సంబంధాలు కలిగి ఉండే మన సమాజంలోనూ ఇలాంటి పరిస్థితులు- ప్రత్యేకించి నగరాల్లో ఇప్పుడిప్పుడే కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు.
* ఒంటరిగా ఉండేవాళ్లు ప్రపంచాన్ని తమకు అనువుగాని ప్రదేశంగా పరిగణిస్తారు. దాంతో వారి రక్షణ వ్యవస్థ గాడి తప్పుతుంది. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్లూ, క్యాన్సర్లూ, గుండె జబ్బులూ ఎక్కువగా వస్తాయి. స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిసోల్‌ స్థాయులూ, బీపీ పెరుగుతాయి.
దాహం, ఆకలీ, తీవ్రమైన నొప్పీ మనిషిని భౌతికంగా ఎలా బాధిస్తాయో ఒంటరితనమూ అలాగే బాధిస్తుందంటారు యూనివర్శిటీ ఆఫ్‌ షికాగోకి చెందిన న్యూరోసైంటిస్ట్‌ జాన్‌ కాసియాపో. అందుకే దీన్ని ప్రాణాల్నే హరించగల జబ్బుల జాబితాలో చేర్చారు.

ఎదుర్కొనగలం...
నిజానికి కాస్త అప్రమత్తంగా ఉంటే ఒంటరితనాన్ని ఎదుర్కొనడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. అయితే అది సమస్య స్థాయికి వెళ్లకముందే చర్యలు తీసుకోవాలన్నది వారి అభిప్రాయం. పిల్లలు పది పన్నెండేళ్ల వరకూ అమ్మానాన్నల సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. టీనేజ్‌లోకి వచ్చాక ప్రైవసీ కోరుకుంటారు. ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడతారు. ఆ పిల్లలే ఇంకాస్త పెద్దవారై ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే ఒంటరితనంతో బాధపడతారు. ఏకాంతానికీ ఒంటరితనానికీ తేడా తెలుసుకోవాలి. పరిస్థితులకు తగినట్లుగా పరిష్కారాలు వెదుక్కోవాలి. కొత్త ప్రాంతంలో ఉండాల్సివచ్చినప్పుడు అక్కడి వారితో మమేకం కావడం... ఒంటరివారమన్న భావనని పోగొడుతుంది. సోషల్‌మీడియా వాడకాన్ని పరిమితం చేసుకుని ప్రత్యక్ష స్నేహబంధాల్ని కొనసాగించాలి.

ఏ వయసువారైనా సరే తమకు తగిన, అభిరుచి ఉన్న వ్యాపకం ఏదో ఒకటి పెట్టుకోవాలి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, ఆటలు, ఆధ్యాత్మికం... ఏవైనా సరే. రోజూ కొంత సమయం మనసుకు నచ్చిన వ్యాపకంలో నిమగ్నమైతే ఒంటరితనమనేది దరిదాపుల్లోకి రాదు. రకరకాల అభిరుచులకు తగినట్లు ఎన్నో సంఘాలు పనిచేస్తున్నాయి. సాహసయాత్రల నుంచి తీర్థయాత్రల వరకూ నిర్వహిస్తున్నాయి. ఆటల పోటీలూ సాహితీ సమావేశాలూ సంగీత కచేరీలూ ఏర్పాటుచేస్తుంటాయి. అవేవీ ఇష్టం లేకపోతే ఆఖరుకు ఓ పెంపుడు జంతువును తెచ్చుకున్నా సరే. ఇలాంటి వ్యాపకాల వల్ల ఒంటరితనాన్ని అధిగమించడమే కాదు, చురుగ్గానూ ఆరోగ్యంగానూ ఉంటారు. ఇప్పుడు బ్రిటన్లో మొదలైన కొత్త మంత్రిత్వ శాఖ ముందున్న పని అదే. మానవసంబంధాలను మెరుగుపరిచే దిశగా సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించడం.

* * *  

కొత్తగా ఆశ్రమంలో చేరిన శిష్యుడు అడవికి వెళ్లి చీకటి పడ్డా తిరిగి రాకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లాడు గురువు. ఓ వాగు పక్కన ఏడుస్తూ కూర్చుని కనిపించాడు శిష్యుడు. దగ్గరికెళ్లి ఎందుకిక్కడ కూర్చున్నావని ప్రశ్నించాడు గురువు.
‘నేను ఒంటరివాడిని. అమ్మానాన్నల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో మీ దగ్గరికి వచ్చాను. మీ శిష్యులు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయారు’ అని ఫిర్యాదు చేశాడు. గురువు అతడి వెన్నుతట్టి పక్కన కూర్చున్నాడు.
‘ఈ వాగు తిన్నగా వెళ్లక ఎందుకు ఇన్ని వంకరలు తిరిగింది’? ప్రశ్నించాడు గురువు.
‘రాళ్లూ రప్పలూ అడ్డొచ్చాయి కాబట్టి తప్పుకుని వెళ్తోంది’ సమాధానమిచ్చాడు శిష్యుడు.
‘కదా..! మనిషి కూడా అంతే. ఒక తల్లి కడుపున పదిమంది పుట్టినా ఎవరి బతుకు వారిదే. ఎవరి చావు వారిదే. ఎవరికోసమూ ఎవరూ ఆగరు. కొత్తవాడివైన నువ్వు జట్టును వదిలి దూరంగా వెళ్లడం పొరపాటు.
అమ్మానాన్నలు లేరని ఆశ్రమాన్ని వెదుక్కుంటూ వచ్చావు. రేపు నేను లేకపోయినా మరో చోట నువ్వు బతకగలగాలంటే ఆ వాగులోని నీళ్లలాగా అడ్డువచ్చిన అవరోధాలను తప్పుకుంటూ ముందుకు సాగడం నేర్చుకోవాలి’ చెప్పాడు గురువు.

ఆ మంత్రి ఏం చేస్తారు?  

మనదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనంద మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌ ‘ఒంటరితనం’ సమస్యను ఎదుర్కొనడానికి ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది. బ్రిటన్‌కి ఇప్పటికే యూరోప్‌లో ‘ఒంటరితనానికి రాజధాని’ అన్న ముద్ర పడింది. కొంతకాలంగా అక్కడి సామాజిక కార్యకర్తలు ఈ అంశంపైన ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా యువతరం ఒంటరితనం గుప్పిట్లో చిక్కుకుని నలిగిపోతున్న వైనం సామాజికశాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. ఇదో పెద్ద అంటువ్యాధి స్థాయిలో ఆరోగ్యరంగానికి సవాలుగా నిలుస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. రేపటి దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలైన యువతరం నిర్వీర్యమైపోతే దేశం చిక్కుల్లో పడుతుందని భావించిన అక్కడి ప్రభుత్వం సత్వరం స్పందించింది. ఫలితమే కొత్తగా ఏర్పడిన మినిస్టర్‌ ఫర్‌ లోన్లీనెస్‌ శాఖ. ఈ శాఖ కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. సృజనాత్మక పరిష్కారాలు కనుగొనడం ద్వారా ఒంటరితనాన్ని ఎదుర్కొనడంలో ప్రజలకు తోడ్పడడానికి ఈ మంత్రిత్వ శాఖ కృషిచేస్తుంది.

ఒక మోతాదులో అదీ అవసరమే!

ఒంటరితనం ప్రమాదకరమైనా ఒక మోతాదులో అదీ అవసరమేనట. అందుకే ఒంటరితనానికి భయపడడం మానేయమంటున్నారు నిపుణులు. ఆస్వాదించగల స్థాయిలో ఏకాంతాన్ని అనుభవించడమే మేలంటున్నారు.
* కాసేపు ఒంటరిగా ఉండడం రోజువారీ ఒత్తిళ్లనుంచి బయటపడేస్తుందంటారు ‘ద కాల్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’ అనే పుస్తకం రాసిన డాక్టర్‌ ఎస్టర్‌. ఆ సమయాన్ని జీవించడానికి కావలసిన ఇంధనంగా పేర్కొంటారామె. ఒంటరితనం అలసటనుంచి తేరుకునే శక్తినీ ఏకాగ్రతతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్నీ ఇస్తుంది.
* సృజనాత్మకంగా ఆలోచించాలన్నా ఏకాంతమే కావాలంటున్నారు ‘క్వైట్‌’ రచయిత్రి  కెయిన్‌. డార్విన్‌ నుంచి పికాసో దాకా అందరూ అలా ప్రేరణ పొందినవాళ్లే అంటారామె. తరచూ కాసేపన్నా ఒంటరిగా గడిపేవాళ్లే ఇతరులతో సత్సంబంధాలను కొనసాగించగలుగుతారట. తమ గురించి తాము తెలుసుకోవడానికీ ఇతరులతో అనుబంధాన్ని విశ్లేషించుకోడానికీ ఈ ఒంటరితనం తోడ్పడుతుందట. ఏకాంతంలో అంతఃశోధన చేసుకునేవారు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకుని సహానుభూతి చూపగలుగుతారట.
* ఎవరైనా సరే, ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నవారైనా సరే... రోజూ కాసేపు ఏకాంతంగా గడపాలి. ఇష్టమైన సంగీతం వింటూనో, చల్లని గాలికి సేదదీరుతూనో, ఏమీ లేకపోతే ఆలోచనల్లో లీనమయ్యో... గడిపితే మనసు సేదదీరుతుంది. ఇది ఇప్పటి శాస్త్రవేత్తలే కాదు అలనాటి కవి రూమీ కూడా అన్నారు - ‘కాసేపు మీ గదిలో ఏకాంతంగా ఉండడం మీకు మీరు ఇచ్చుకునే విలువైన కానుక’ అని.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.