close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వారెవ్వా... ఏం ఉద్యోగాలు..!

వారెవ్వా... ఏం ఉద్యోగాలు..!

ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, బ్లాగర్‌, గూగుల్‌ మ్యాప్స్‌... అన్నింటినీ మనం వాడుతున్నాం. కానీ వీటి ఆధారంగా చేసే కొన్ని బిందాస్‌ ఉద్యోగాలు ఉన్నాయని మీకు తెలుసా?! బ్రిటన్‌ రాణి ట్విటర్లో ట్వీట్లు చేయడమూ మంచి ఉద్యోగమేననీ, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్‌ పెట్టడమూ ఒక వృత్తేననీ విన్నారా. అలా, ఈ మధ్యే పుట్టుకొచ్చి, సూపర్‌కూల్‌ జాబ్‌లుగా పేరు తెచ్చుకున్న కొన్ని టెక్‌బేస్డ్‌ ఉద్యోగాలపై మీరూ ఓ లుక్కేయండి, అవకాశం వస్తే మీ లక్కును ట్రైచేయండి!

పెద్దయ్యాక ఏం ఉద్యోగం చేస్తావు అనడిగితే డాక్టరో లాయరో ఇంజినీరో... మరేదో చెప్పే రోజులు పాతవైపోయాయి. నా చదువు అయ్యేప్పటికి ఏ కొత్త ఉద్యోగం కనిపిస్తే అందులో దూరిపోతా అనే రోజులు మొదలయ్యాయి. మరి సాంకేతికత ఆధారంగా వస్తున్న ఉద్యోగాలు ఇంటరెస్టింగ్‌గా ఉంటుండటంతో పాటు మంచి వేతనాన్నీ అందిస్తుంటే ఎవరైనా వీటికే ఓటేస్తారుగా!

రాణిగారి ట్వీటర్‌
ట్విటర్‌... రాజకీయ నాయకులూ, పారిశ్రామిక వేత్తలూ, మేధావుల నుంచి కాస్త టెక్నాలజీ తెలిసిన సగటు మనుషులదాకా అందరూ వాడుతున్న సామాజిక మాధ్యమం. ప్రభుత్వాలకు వినతులూ, సమస్యలకు పరిష్కారాలూ అన్నీ ఇందులోనే జరిగిపోతున్నాయి. అందుకే బ్రిటన్‌ రాణి కూడా ఈ మాధ్యమం మీద దృష్టి పెట్టారు. రాయల్‌ ట్వీటర్‌ కావాలంటూ నోటిఫికేషన్‌ను విడుదల చేసి మరీ ఒక ఉద్యోగిని నియమించుకున్నారు. రాణి తరఫున ట్వీట్లు చేయడం సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించిన అప్‌డేట్‌్్స పెడుతూ రాణిగారిని ఎప్పుడూ వార్తల్లో ఉంచడం ఈ రాయల్‌ ట్వీటర్‌ పనన్న మాట. ఇంతకీ రాణిగారు దీనికిచ్చే జీతం ఎంతో తెలుసా ఏడాదికి నలభై లక్షల రూపాయలకు పైనే!

లగ్జరీ బ్లాగుల్లో రివ్యూ...
బ్లాగుల్లో రివ్యూలు రాయడం టెక్‌జనాలు చాలా మందికి అలవాటైన పనే. అయితే విలాసవంతమైన భవనాలను అద్దెకిచ్చే సంస్థ థర్డ్‌హోమ్‌ ప్రపంచ వ్యాప్తంగా తనకున్న భవనాల్లోని ఒక పన్నెండింటిలో మూడు నెలల పాటు ఉండి అక్కడి ప్రత్యేకతల్ని ఫొటోల్లో బంధించి వాటి గురించి బ్లాగులో రాసే ఉద్యోగాన్ని ఏర్పాటు చేసింది. అక్కడున్న సౌకర్యాలను ఉచితంగా పొందుతూ ఆ అనుభవాలను గురించి రాసినందుకు గాను నెలకు సుమారు ఆరున్నర లక్షల రూపాయల జీతాన్ని చెల్లిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విలాసవంతమైన హోటళ్లలో బసచేస్తూ వాటి మీద రివ్యూ రాసేందుకు హోటల్‌ రివ్యూయర్లను నియమించుకుంటున్నాయి ప్రముఖ ట్రావెల్‌ సంస్థలు. ఇందుకుగాను సంవత్సరానికి ముప్ఫై లక్షలకుపైగా నజరానా చెల్లిస్తున్నాయి.

గూగుల్‌ మ్యాప్స్‌లో దారి వేయండి...
గూగుల్‌ మ్యాప్స్‌... మనం ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లాలన్నా చక్కగా దారి చూపించేయగల టెక్నాలజీ. బస్‌లూ, కార్లకే కాదు ఇప్పుడు టూ వీలర్లకూ దారి చూపుతోంది. ఈ సౌకర్యం కల్పించడం కోసం గూగుల్‌ ఎర్త్‌ ‘బైసైకిల్‌ మ్యాపర్‌’ను నియమించుకుంటోంది. ఈ ఉద్యోగులు చేయాల్సిందల్లా మంచి డిజిటల్‌ కెమేరా వెనక అమర్చిన ఒక సైకిల్‌ మీద కార్లు వెళ్లలేని సందుల్లోకి తిరుగుతూ ఆ ప్రాంతాలను కెమేరాలో బంధించడమే. దీనికోసం గూగుల్‌ వీళ్లకు చెల్లిస్తున్న జీతం ఏడాదికి ముప్ఫైఏడు లక్షలకు పైనే!

రివ్యూ చేస్తే చాలు...
సెల్‌పోన్లు మొదలు పిల్లలు ఆడుకునే బొమ్మల దాకా కొత్త కొత్త ఎలక్ట్రానిక్‌ వస్తువులు రోజూ మార్కెట్‌ను ముంచెత్తుతూనే ఉన్నాయి. ఎంత గ్యాడ్జెట్‌ ప్రియులైనా అది ఎలా పనిచేస్తుంది, వాడుతున్న వాళ్ల అనుభూతి ఏంటి అనే విషయాల్ని నెట్లో వెతికి తెలుసుకోకుండా మాత్రం ఆ గ్యాడ్జెట్లను కొనేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. అందుకే దాదాపు పెద్ద కంపెనీలన్నీ వివిధ గ్యాడ్జెట్లను వాడటంలో అనుభవం, అందులోని టెక్నికల్‌ అంశాల మీద పట్టూ, వాటి గురించి రివ్యూ రాయడంలో నేర్పూ ఉన్న వారికి గ్యాడ్జెట్‌ రివ్యూయర్లుగా పదవినిచ్చి ఏడాదికి సుమారు యాభై లక్షల రూపాయల దాకా ముట్టజెపుతున్నాయి.

ఇంటర్న్‌షిప్‌లోనూ ఆదాయం...
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభావవంతమైన పోస్టులు పెట్టడమే అర్హతగా ప్రఖ్యాత విలాసవంతమైన షిప్పుల సంస్థ రాయల్‌ కరీబియన్‌ ఒక కొత్త ట్రైనింగ్‌ ట్రెండ్‌కి తెరతీసింది. వాళ్ల షిప్పుల్లో మూడువారాల సమయంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే అవకాశాన్ని కల్పించడంతో పాటు ఆ ప్రయాణంలోని మనోహర దృశ్యాల్ని అందంగా కెమేరాలో బంధించి వాటికి చక్కని కామెంట్లని జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వారిలో ఒక్కొక్కరికీ రెండున్నర లక్షల రూపాయల్ని ముట్టజెప్పింది.
కొత్త కొత్త వీడియోగేమ్‌లు ఆడటం చాలా మందికి ఇష్టమైన వ్యాపకం. ఇదే పని చేస్తూ, ఆ గేముల్లో ఇంకా ఏ ఫీచర్లు ఉంటే మరింత మజా వస్తుందన్న విషయాలను చెబుతూ ఏడాదికి ముప్ఫైఏడు లక్షల రూపాయలకు పైగా సంపాదించేస్తున్నారు వీడియోగేమ్‌ టెస్టర్‌లుగా పనిచేస్తున్న ఉద్యోగులు. ఆడుతూ పాడుతూ పనిచేస్తూ అబ్బో అనిపించే జీతాలందుకోగలగడం గొప్ప విషయమే కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.