close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆమెకు 2 వేల టీ రుచులు తెలుసు!

ఆమెకు 2 వేల టీ రుచులు తెలుసు!

అభిరుచినే వృత్తిగా మలచుకుని యువతకు కొత్త దారి చూపుతున్న ఈ యువతి స్నిగ్ధ మన్‌చందా. ఆమె సంస్థ ‘స్టోరీ నింజా’ వ్యాపారవేత్తలకు తమ బ్రాండ్‌ విలువ పెంచుకునే సలహాలిస్తుంది. మరో పక్క ఈ ‘టీ సొమేలియర్‌’ మన దేశ తేయాకు పరిశ్రమకు ప్రతినిధి.

డికెళ్తున్న ఆ అమ్మాయి తాగడానికి కాచి చల్లార్చిన నీరు ఇచ్చేది తల్లి. ఓరోజు అమ్మ నీళ్లు కాస్తుండగా అటుగా వెళ్లిన అమ్మాయి సరదాగా ఓ ఏలక్కాయను మరిగే నీళ్లలో వేసింది. రోజంతా నీరు తాగినప్పుడల్లా ఆ వాసన ఆమెకు నచ్చింది. దాంతో రోజూ ఏదో ఒక మసాలాదినుసును నీటిలో వేయడం ఆ రుచిని ఆస్వాదించడం అలవాటైంది. ఆ అలవాటే టీ అంటే ఇష్టాన్ని పెంచింది. అసోంలో టీతోట మేనేజరుగా పనిచేసిన తండ్రి రకరకాల తాజా టీ ప్యాకెట్లను కూతురి కోసం ముంబయి పంపించేవాడు. అలా పదమూడేళ్ల ఆ అమ్మాయికి రకరకాల టీ పొడుల్ని సేకరించడం హాబీ అయింది. బంధువులూ సన్నిహితులూ విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఆమెకు వాటినే బహుమతిగా తెచ్చిచ్చేవారు. తండ్రి ఇచ్చిన పాత ట్రంకుపెట్టెలో తాను సేకరించిన టీ పొడి ప్యాకెట్లన్నీ దాచుకునేది. పెట్టె తెరవగానే వచ్చే టీ పొడుల గుబాళింపు ఆమెకు ఎంతగానో నచ్చేది. ఆ వాసనల్లో తేడా కనిపెట్టడానికి ప్రయత్నించేది. అయితే తన భవిష్యత్తు అంతా ఈ అలవాట్లతోనే ముడిపడి ఉంటుందని అప్పుడామెకు తెలియదు. ఆ అమ్మాయి స్నిగ్ధ మన్‌చందా. మన దేశం నుంచీ టీ సొమేలియర్‌ అయిన పిన్న వయస్కుల్లో ఒకరు.

టీ సొమేలియర్‌ అంటే...
టీకి సంబంధించిన అన్ని విషయాలూ తెలిసిన నిపుణులను, సంబంధిత శిక్షణ పొందినవారిని టీ సొమేలియర్‌ అంటారు. మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ తర్వాత పైచదువుల గురించి ఆలోచిస్తున్న స్నిగ్ధకి తన చిన్ననాటి అలవాటు గుర్తొచ్చింది. టీ గురించే ఎందుకు చదవకూడదూ అనుకుంది. శ్రీలంక వెళ్లి టీస్కూల్‌లో చేరింది. జపాన్‌కి చెందిన ప్రఖ్యాత టీ మాస్టర్‌ నవో కుమెకావా దగ్గర శిక్షణ పొందింది. రోజుకు వందకప్పుల టీ రుచి చూడడం ఆ శిక్షణలో భాగం. తోటల్లో పొద్దున్నే నాలుగింటికి తేయాకు కోస్తారు. సరిగ్గా ఆ టైమ్‌కి తోటకు వెళ్లిపోయేది. సాయంత్రం నాలుగింటి వరకూ జరిగే పనులన్నీ గమనించేది. శిక్షణ సమయంలోనే రెండు వేల రకాల టీ రుచులను ఆమె గుర్తించింది. అక్కడ టీ సొమేలియర్‌గా సర్టిఫికెట్‌ అందుకుని అసలైన టీ మజా ప్రజలకు తెలియజేయాలన్న ఆశయంతో స్వదేశానికి వచ్చింది స్నిగ్ధ.

టీ టేస్టింగ్‌లోనూ శిక్షణ పొందిన స్నిగ్ధ ఎక్కడ వర్కుషాపు జరిగినా తప్పకుండా హాజరయ్యేది. వెళ్లినచోటల్లా కొత్తకొత్త కథలు వినేది. టీ అభిమానుల నుంచీ ఆ కబుర్లు వింటున్న కొద్దీ ఆమెకు తానేం చేయాలో స్పష్టత రాసాగింది. ఫలితంగా వెలసిందే ‘టీట్రంక్‌డాట్‌ఇన్‌’ అన్న వెబ్‌సైట్‌. చిన్నప్పుడు టీ ప్యాకెట్లను దాచిపెట్టుకున్న ట్రంకుపెట్టె గుర్తొచ్చేలా ఆ పేరు పెట్టుకుంది. ఈ వెబ్‌సైట్‌లో టీకి సంబంధించి ఆసక్తికరమైన ఎంతో సమాచారాన్ని పొందుపరిచిన స్నిగ్థ పలురకాల టీ పొడులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. నేరుగా తోటల నుంచి సేకరించిన ఆకులకు ఇతర దినుసులు చేర్చి స్నిగ్ధ స్వయంగా తయారుచేసిన వెరైటీలే అవన్నీ. ‘టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఆ హోదాలో భారత తేయాకు పరిశ్రమ తరఫున విదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటుంది. టీకి మరింతగా ఆదరణ పెంచడానికి ముంబయిలో తరచూ వర్కుషాపులతో పాటు ‘చాయ్‌వాక్‌’లను నిర్వహిస్తుంటుంది. అందులో పాల్గొనేవారంతా హోటళ్లలో రకరకాల టీలు తాగుతూ ఆయా రుచుల గురించి ముచ్చటించుకుంటారు.

స్నిగ్ధ పలుకులు  

వందల రకాల టీలు. అన్నీ ఒక్క మొక్కనుంచే తయారవుతాయి. ఒక్క ఆకుతో లెక్కలేనన్ని రుచులను తయారుచేస్తున్నామంటే ఎంత గొప్పది ఆ ఆకు...!
* టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ మన దేశానిది తొలి వరస. కానీ, టీపై అవగాహన మాత్రం లేదనే చెప్పాలి.
* టీ మన జీవనశైలిలో భాగం. మా దగ్గర అత్యధికంగా అమ్ముడుపోయేది మారిగోల్డ్‌ టీ. బంతిపూరేకలు వేసి చేసే ఈ టీ ఒత్తిళ్లను నివారిస్తుంది.
* ఎప్పటికైనా భారతదేశంలో ఓ అంతర్జాతీయ స్థాయి టీ స్కూల్‌ పెడతా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.