close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏటిలోని కెరటాలు

ఏటిలోని కెరటాలు
- ఎం.వెంకటేశ్వరరావు

పెద్దన్నయ్య శ్రీపతి శర్మ హైదరాబాదులో ఎడ్యుకేషనల్‌ డిపార్ట్‌మెంట్లో ఆఫీసరు. చిన్నన్నయ్య భాస్కర శర్మ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్లో అసిస్టెంట్‌ మేనేజరు. ఇద్దరూ హైదరాబాదులో ఖరీదైన ఇళ్ళు కట్టుకుని స్థిరపడ్డారు. భాస్కరన్నయ్య ఇల్లు అద్దెకిచ్చి ఉద్యోగరీత్యా ముంబయిలో ఉంటున్నాడు. మూడోవాణ్ణి నేను. నా పేరు అనంతశర్మ. రాజోలు దగ్గర కడలి గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు టీచర్ని. దానికితోడు చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్యం కూడా చేయిస్తుంటాను.

బాల్యం నుండీ రాజోలు, మొగలికుదురు, రాజమండ్రి పరిసరాల్లోనే జీవితం గడుపుతున్న నాకు చిన్నప్పట్నుంచీ అన్నయ్యల్లా బస్తీల్లో మంచి ఉద్యోగం చేస్తూ స్థిరపడాలనుండేది. కానీ, మా నాన్నే నా ఆశ అడియాశ చేశాడు.

* * *

అన్నయ్యలిద్దరికీ నాకూ వయసులో పన్నెండేళ్ళ వ్యత్యాసముండేది. వాళ్ళిద్దరికీ చదువులైపోయాయి. అప్పుడు నాకు ఏడేళ్ళు. పెద్దన్నయ్యకి ఉద్యోగం వచ్చింది.
ఆ సమయంలో నాన్నకి గుండెపోటు రావటంతో హైదరాబాదు తీసుకెళ్ళి బైపాస్‌ సర్జరీ చేయించుకొచ్చారు అన్నయ్యలు.

ఈ విషయం తెలిసి ఊళ్ళోవాళ్ళతోబాటు, నాన్నకి పరిచయస్థులు వచ్చి పలకరించి వెళ్తున్న క్రమంలో... ఆరోజు ఆ ఊరి గ్రామ సర్పంచ్‌, మరో ఇద్దరు పెద్దమనుషులు వచ్చి నాన్నని పరామర్శించి... ‘‘పంతులుగారూ, మీ పెద్ద పిల్లలిద్దర్నీ బాగా చదివించారు... ఇద్దరూ పట్టణాలకెళ్ళిపోయారు. మీకు వయసుతోబాటు ఆరోగ్యమూ సహకరించడం లేదు. ఇన్నాళ్ళలా మీరు తిరిగి పౌరోహిత్యపు పనులు చేయించలేరు. రాబోయే రోజుల్లో మా ఊళ్ళలో మంచీ చెడూ కార్యక్రమాలు జరిపించేదెవరు? కనీసం మీ మూడో అబ్బాయినైనా ఈ వృత్తిలో పెట్టండి...’’ అని వాళ్ళడిగినపుడు నాన్న కాదనలేకపోయాడు.

పౌరోహిత్యం తనతోనే అంతరించిపోవడం ఇష్టంలేని నాన్న- అన్నయ్యలతో తన మనసులోని అభిప్రాయం చెప్పాడు.
‘‘నాన్నా! అనంతాన్ని డిగ్రీవరకైనా చదవనివ్వండి... ఆ తర్వాత వేదం చదువుకుంటాడు’’ అన్నాడు శ్రీపతి.

‘‘కాలం మారుతోంది నాన్నా! చదువులేకుండా వేదాన్నే నమ్ముకుంటే జీవితం
సాగుతుందా?’’ అన్నాడు భాస్కరం.

నాన్న వాళ్ళిద్దరికీ అడ్డు చెబుతూ... ‘‘నేను ఇదే పౌరోహిత్యం మీద నాలుగెకరాల పొలం, రెండెకరాల కొబ్బరితోటా ఏర్పరిచి, మీ ఇద్దర్నీ చదివించలేదా? మీ అక్కయ్యకి పెళ్ళి చెయ్యలేదా? మనం పద్ధతిగా ఉన్నంతవరకూ పౌరోహిత్యం పాడికుండ లాంటిది. మీరన్నట్టు అనంతానికి డిగ్రీ వరకూ చెప్పిస్తే, తర్వాత వాడికీ పల్లెటూళ్ళో ఉండబుద్ధవుతుందా? తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్నాం. ఇవాళ ఏదో నాలుగక్షరం ముక్కలు చదువుకున్నామని ఇన్నేళ్ళూ అన్నంపెట్టిన వృత్తికి అన్యాయం చేసి వదిలిపెట్టి కృతఘ్నలుగా మారటం సభ్యత కాదు. అనంతం వేదం చదువుకుని పౌరోహిత్యాన్ని కొనసాగిస్తాడంతే’’ అన్నాడు నాన్న కరాఖండీగా.

నాన్న మాటకి ఎదురుచెప్పే సాహసం చెయ్యలేదు అన్నయ్యలు.
మరుసటి నెలలోనే నాకు ఉపనయనం జరిపించి, కొవ్వూరులో గాయత్రీ వేద పాఠశాలలో చేర్పించాడు నాన్న. అప్పట్నుంచీ నాకు పధ్నాలుగేళ్ళొచ్చేదాకా వేద పాఠోపాసన చేసి బయటపడ్డాను. అప్పటికి నాన్న ఆరోగ్యం అంతంతమాత్రంగానే
ఉండటంతో, ఆయన చేయించే పురోహితపు బాధ్యత నాపైబడ్డది.

పొలాల్నుంచి వచ్చే ధాన్యం మా ఇంటి అవసరాలకన్నా ఎక్కువగానే ఉండేది. కొబ్బరితోటపై వచ్చే ఆదాయం అదనమే. అన్నయ్యలిద్దరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. నేనూ పల్లెటూళ్ళ పౌరోహిత్యానికి
అలవాటుపడిపోయాను.

ఒక మోపెడ్‌ కొనుక్కున్నాను.
పెద్దన్నయ్య ఇంటికొచ్చినప్పుడు నాతో ప్రైవేటుగా పదో తరగతి పరీక్షకి కట్టించి పాస్‌ చేయించాడు. ఆదాయానికి అలవాటుపడ్డ నాకు చదువు మీద మక్కువ అంతగా ఉండేదికాదు.
నాకు ఇరవైరెండేళ్ళొచ్చాయి. మా ఇంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే తెలిసిన సంబంధాన్ని చూసి నాన్నే నా పెళ్ళి తులసితో జరిపించాడు. ఆమె అమ్మతో మా ఇంటి పరిస్థితుల్ని అనుసరించుకుని నడుచుకునేది.

అన్నయ్యలంత వైభవం నాకు లేకపోయినా దేనికీ ‘దేహీ’ అని ఇతరుల్నీ, ముఖ్యంగా అన్నయ్యల ముందూ చెయ్యిజాపే అవసరం ఉండేదికాదు. నాకు పెళ్ళయిన రెండో సంవత్సరం నాన్నకి మరోసారి గుండెపోటు వచ్చి నిద్రలోనే కన్నుమూశాడు. కర్మకాండలయ్యాక పెద్దన్నయ్య నాతో ‘టీచర్‌ ట్రైనింగ్‌లో సీటిప్పిస్తాను’ చదువుకోమన్నాడు.

‘‘ఇన్నేళ్ళూ లేని చదువు ఇప్పుడు నాకెందుకన్నయ్యా!?’’ అన్నాను.
‘‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదో నాకు అవకాశం ఉంది, మాతోబాటు నీకూ నాన్న చదువు చెప్పించివుంటే... నీ పరిస్థితి మరోలా ఉండేది. ఆ భావన నీకు కలగకూడదనే, కులవృత్తితోబాటు ఓ ఉద్యోగమూ ఉంటే గౌరవంగా, భరోసాగా ఉంటుంది’’ అన్నాడు.

అన్నయ్య మాట తోసిపుచ్చలేక టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేశాను. అన్నయ్య పలుకుబడితో మెగలికుదురులోనే పోస్టింగిప్పించాడు.

* * *

ఆరోజు అన్నయ్య చెప్పిన మాటల విలువ కొన్నేళ్ళ తర్వాత బోధపడ్డది. కాలం మారుతున్నకొద్దీ పల్లెటూళ్ళ మీద పట్నపు పోకడలూ విదేశీ వ్యామోహాలూ వచ్చి వాలిపోవడంతో... ప్రజల్లో ఆస్తికత్వం స్థానాన్ని నాస్తికత్వం
ఆక్రమించసాగింది. ఇంటింటా టీవీ ఇంటర్నెట్లూ వైఫైలూ, చేతుల్లో స్మార్ట్‌ఫోన్లూ నాగరికత పేరుతో వచ్చేశాయి. అంతా ఆన్‌లైన్‌ మయమే. తినే తిండీ, తొడిగే బట్టా, ఆఖరికి కాలికి తొడిగే చెప్పులు కూడా ఆన్‌లైన్లో వెతుక్కుని ఇంటికి వస్తుంటే... భరించలేని బద్ధకం అంటువ్యాధిలా వ్యాపిస్తోందనిపిస్తోంది.

ఆ టెక్నాలజీ ప్రభావం నేను చేయిస్తున్న పౌరోహిత్యం మీదా పడింది. స్మార్ట్‌ఫోన్లో యూట్యూబ్‌ ఆన్‌ చేసి, పొల్లుపోని మంత్రాలతో క్రతువులూ వ్రతాలూ వాళ్ళే చేయించేసుకుంటున్నారు. నాయీబ్రాహణులు కమ్మగా వినిపించే నాదస్వరం యూట్యూబ్‌లో దూరి, వారి స్వరాన్ని నొక్కేస్తోంది. పూజా పునస్కారాలూ నోములూ వ్రతాలూ వారంవర్జాలూ రోజువారీ జాతకాలూ... చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్లలోకొచ్చి నాలాంటివాడి అవసరం కూడా అనవసరమనుకుంటున్న రోజులొచ్చేశాయి.

పాతతరాన్ని పక్కకి నెట్టి, వింతపోకడల కొత్తతరం మారుమూల పల్లెటూళ్ళలో సైతం వేళ్ళూనుకోవడంతో, నాకీ స్కూలు టీచర్‌ ఉద్యోగం లేకపోతే, పది రూపాయలక్కూడా అగచాట్లు పడాల్సొచ్చేదని... అన్నయ్యకి మనసులోనే జోహార్లు అర్పించేవాణ్ణి.

పొలాల మీదా కొబ్బరితోటల మీదా వచ్చే ఆదాయాన్ని అన్నయ్యలిద్దరికీ వాటా ప్రకారం పంపేవాణ్ణి. మొదట్లో వద్దనేవాళ్ళు కానీ నా బలవంతం మీద తీసుకుంటున్నారు.
అన్నయ్యలు మనవాళ్ళయినంత మాత్రాన వదినలు మనలో కలిసిపోతారా? అదీకాక, నాన్న ఆస్తి అంతా నేనొక్కడినే అనుభవిస్తున్నానన్న అపప్రధ అంటకుండా ఉండాలన్న అభిమతంతో, వాళ్ళకి ఆ డబ్బుతో అవసరం లేకున్నా నా తృప్తికోసం పంపుతూనే ఉన్నాను.

నాన్న ఆబ్దీకానికి ప్రతి సంవత్సరం అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వచ్చి పది రోజులు గడిపి వెళ్ళటం ఆనవాయితీగా వస్తోంది.
గత నాలుగేళ్ళుగా వర్షాభావం వల్ల పొలంలో పంటంతా ఎండిపోయింది.
ఈ సంవత్సరం తొలకరికంటే ముందే వానలు మొదలయ్యాయి. అమితోత్సాహంతో అప్పు చేసి మరీ నాట్లు వేయించాను. గతంలోకంటే పంట బాగా పెరగటంతో, అప్పులు తీర్చేయ్యొచ్చన్న ధైర్యం ఏర్పడ్డది.
నా పెద్దకూతురు రమ్యకి పద్దెనిమిదేళ్ళొచ్చాయి. రాజోలులో డిగ్రీ చదువుతోంది.

అనుకోకుండా తెలిసినవాళ్ళ ద్వారా ఈమధ్య ఓ పెళ్ళి సంబంధం వచ్చింది. అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. రమ్యని చూసి, ‘కట్నకానుకలేమీ వద్దు... పెళ్ళి ఘనంగా జరిపించండి చాలు’ అని పెద్ద మనసుతో వాళ్ళన్నారు. అలాగని నా ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి... గుళ్ళో తాళి కట్టించలేనుగా! పైగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా తెలిసినవాళ్ళే. ఇన్నేళ్ళూ వాళ్ళిళ్ళల్లో పౌరోహిత్యం చేయించి, జీవిస్తూ వచ్చి, ఇప్పుడు అమ్మాయి పెళ్ళి చేస్తూ... కనీసం వాళ్ళని పిలవకపోతే బావుంటుందా..? అలాచేస్తే ముందు అమ్మ ఒప్పుకోదు. ఎంత తక్కువలో తక్కువ అయినా పది లక్షలదాకా కావాలి. అన్నయ్యల దగ్గర డబ్బున్నా వాళ్ళనెలా అడగ్గలను? అన్ని లక్షలు అప్పు చెయ్యడం నా మొహమాటానికి పడని విషయం.

అందుకని... అన్నయ్యలకి ఆస్తిలో వాటాలిచ్చేసి, నా వాటాకొచ్చే ఆస్తిలో కొబ్బరితోట అమ్మేద్దామని ఆలోచించాను.

* * *

ఆరోజు ఉన్నట్టుండి అకాలవర్షం మొదలైంది. రెండ్రోజులు ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. ఓపక్క చేతికొచ్చిన పంట ఇంటికి రాకుండానే నీటి పాలయింది. మరోపక్క పాతబడ్డ మా ఇంటి మట్టిగోడ కాస్తా కూలిపోయింది. వర్షం తగ్గాక పొలానికెళ్ళి పంటను చూసేసరికి గుండె చెరువయింది. ఈ ఏడాది ఏపుగా పెరిగిన పంటను చూసి నాలుగేళ్ళ అనావృష్టిని తట్టుకోవచ్చని కలలుగన్న నా కలల్ని...
ఈ అతివృష్టి కన్నీళ్ళతో తుడిచిపెట్టింది.

వచ్చే నెలలో నాన్న ఆబ్దీకానికి అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వస్తారు. వాళ్ళొచ్చేలోపల కూలిపోయిన ఇంటి గోడలు కట్టించాలి.
‘ఎలా... ఎలా..?’ అని ఆలోచిస్తూ...
ఇంటికొచ్చిన నాకు తులసి తన చేతి బంగారు గాజులు తీసిచ్చి, అమ్మి గోడలు కట్టించమని ధైర్యాన్నిచ్చింది. అయిష్టంగానే వాటిని
తీసుకుని, అమ్మేసి, ఇంటిచుట్టూ మట్టిగోడల స్థానంలో ఇటుక గోడలు కట్టించాను.
ఇద్దరన్నయ్యలకీ ఫోన్‌ చేసి, ఆబ్దీకానికి వచ్చినప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడాలని చూచాయగా చెవినేశాను.

* * *

ఎప్పటిలాగే నాన్న ఆబ్దీకానికి అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వచ్చారు.
‘‘ఇల్లు బాగుచేయించి మంచిపని చేశావురా అనంతా!’’ అన్నారే కానీ, ‘ఎంతయిందిరా’ అని ఒక్కరూ అడక్కపోయేసరికి చివుక్కుమనిపించింది.
ఇద్దరూ ఆస్తి పంపకాల విషయం ప్రస్తావిస్తారనుకున్నాను. వాళ్ళొచ్చిన వారం వరకూ ఆ విషయం ఎవరూ ఎత్తలేదు. నోరుతెరిచి అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డుపడుతోంది.

ఆరోజు నాన్న ఆబ్దీకం. ఎప్పుడూ ఆ క్రతువు మనస్ఫూర్తిగా చేసే నేను... ఈసారెందుకో అనాసక్తంగా, అన్యమనస్కంగా చేస్తున్నట్లన్పించింది. పెద్దన్నయ్య కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. చిన్నన్నయ్య రెండో కూతురు మెడిసిన్‌ చదువుతోంది. ఆ పోలిక నా మనసుని పెనుభూతంలా ఆక్రమించుకోవడంతో వాళ్ళముందు నా పిల్లలు పల్లెటూరి చదువులతోనే సరిపెట్టుకోవలసి రావడాన్ని అన్వయించుకోవడం అసాధ్యం కాసాగింది.

రమ్యకి సంబంధం కుదిరింది... పెళ్ళయినా చేద్దామంటే... ‘అందుకూ సహకరించరేమో’ అన్న అలజడిలో నాన్న మీద కోపంతో ‘సవ్య, అపసవ్య, ప్రాచీనావితులు’ యాంత్రికాలే అయ్యాయి. ఓపక్క నాలుగేళ్ళ కరవూ
ఊళ్ళో అప్పులూ, మరోపక్క కూతురి పెళ్ళీ...

ఎదురుగా మండుతున్న హోమం గుండెల్లో మండుతున్నట్టనిపించసాగింది.

* * *

తెల్లవారితే అన్నయ్యలిద్దరూ ఊరెళ్ళిపోతారు. ఆ రాత్రి అన్నయ్యలిద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడదామని, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న గదిలోకి వెళ్ళాను. కానీ, వాళ్ళని అడగటానికి మనసొప్పక కాసేపు కూర్చుని లేచొస్తుంటే, ‘‘అనంతా, ఏమిట్రా అలా ఉన్నావు? కూచో... ఆస్తి పంపకాలు అన్నావట... మా ఇద్దరికీ ఇష్టంలేదురా’’ అన్నాడు పెద్దన్నయ్య.

నా చెవులకామాట పిడుగులా వినిపించింది.
గొంతు పెగల్చుకుని ‘‘ఎందుకని?’’ అన్నాను ఆందోళనగా.

‘‘నీకు ఇంకో కూతురుంది. మున్ముందు బోలెడు ఖర్చులొస్తాయి. ఇప్పుడే ఉన్న ఆస్తి అమ్ముకుని ఏం చేస్తావు?’’ అన్నాడు చిన్నన్నయ్య.

‘‘అప్పటి సంగతి తర్వాత... ముందు ఇప్పటి సంగతి చూడాలిగా. ఏదో అదృష్టంకొద్దీ రమ్యకి మంచి సంబంధం వచ్చింది. పిల్లలకు పెద్ద చదువులు చెప్పించలేకపోయినా, కనీసం పెళ్ళి అయినా చెయ్యాలి కదా!’’ అన్నాను నిష్ఠూరంగా.
‘‘ఎందుకురా అంత ఆవేశపడుతున్నావు? మాకు నాన్న చెప్పించిన చదువే మా జీవనం. మాకు ఉద్యోగాలు లేకపోతే పూట గడవదు. కానీ, నీకు అలాకాదు... తోట, ఇల్లు, పొలం, ఉద్యోగం... అన్నీ స్థిరాస్తులేగదా!’’

‘‘ఆఁ... ఉంది ఉద్యోగం... బతుకీడ్చడానికి బడిపంతులుద్యోగం, కుడి చేతికీ ఎడమ చేతికీ అందని పల్లెటూరి పౌరోహిత్యం, ఆస్తిలో నా వాటా అమ్మితే- నా కూతుళ్ళ పెళ్ళిళ్ళకి కూడా చాలని స్థిరాస్తి’’ అన్నాను ఉక్రోషంగా.
‘‘మేమింకా బతికే ఉన్నాం గదరా! నాన్న పోయిన దగ్గర్నుంచీ మేం వద్దంటున్నా నువ్వు పంపిస్తున్న పొలాల మీద వచ్చే ఆదాయం... రమ్య పేరుతో బ్యాంకులోనే వేస్తున్నాం.

ఆ డబ్బంతా నీదే, వాడుకో. అయినా మేం ఏనాడైనా ఆస్తిలో వాటాలిమ్మని అడిగామా, అమ్మేయమని అన్నామా? నువ్వే అన్నీ ఊహించుకుంటున్నావు’’ అన్నాడు పెద్దన్నయ్య.
‘‘ఆ డబ్బు నాదెలా అవుతుంది?’’
‘‘అనంతా, నాన్న మా ఇద్దరికీ మంచి చదువులు చెప్పించారు, మంచి ఉద్యోగాలు వచ్చి సుఖంగా ఉంటున్నాం. అంతమాత్రాన నీ కష్టం మాకు తెలియదనుకోకు. ఇన్నేళ్ళూ ఆస్తితోబాటు అమ్మనీ కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఉమ్మడిగా ఉన్న ఆస్తిని విడదీసి అమ్ముకుంటే, వచ్చేదానికంటే కోల్పోయేదే ఎక్కువ. ఇన్నేళ్ళూ నువ్వు పంపిన డబ్బంతా ఏడు లక్షలైంది. ఇదిగో దానికి చెక్కు. రమ్య పెళ్ళికోసం నువ్వు అప్పులు చెయ్యక్కర్లా, ఆస్తులు అమ్మక్కర్లా... రమ్య నీకే కాదు, మాకూ కూతురే. మిగిలిన డబ్బు వెళ్ళి పంపిస్తాం. పెళ్ళి పనులు చూడు... పెళ్ళి ఘనంగా జరిపిద్దాం’’ అన్నాడు చిన్నన్నయ్య.

‘‘అన్నయ్యా!’’ అన్నాను ఆర్ద్రంగా.
‘‘రేపే వెళ్ళి తులసికి గాజులు కొనిపెట్టు.’’
‘‘ఇది... ఈ సంగతి... మీకెవరు చెప్పారు?’’
‘‘అమ్మ నీ దగ్గరున్నంత మాత్రాన, నీ ఒక్కడికే అమ్మ కాదోయ్‌. అమ్మ ఇటువంటి విషయాలెప్పుడూ దాచిపెట్టదు’’ అన్నాడు పెద్దన్నయ్య.
అప్పుడు గుర్తొచ్చింది... అమ్మెప్పుడూ చెప్పే- ‘ఏటిలోని కెరటాల్లా తోబుట్టువులు కలిసుండాలిరా!’ అనే మాట... చద్దిమూట లాంటి అమ్మమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.