close
జాతరమ్మ జాతర మేడారం జాతర!

జాతరమ్మ జాతర మేడారం జాతర!

ఆసియాలోనే అతిపెద్ద జాతర... కుంభమేళా తరవాత దేశంలో జరిగే మహా జాతర... కోటిమంది భక్తులు హాజరయ్యే మేడారం జాతర. అదే సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆ గిరిజన జాతర విశేషాల్లోకి వెళ్తే...

కొయ్య దేవతలూ అశేష భక్తులూ, అంతులేని విశ్వాసాలూ కోయదొరల జోస్యాలూ, పొర్లుదండాలూ శివసత్తుల పూనకాలూ, రంగుల గుడారాలూ ఎడ్లబండ్ల పరుగులూ, కొత్తబెల్లం వాసనలూ... చెట్ల మందులూ...అదో చిత్రవిచిత్రమైన ప్రపంచం. దానికి వేదికే మేడారం.
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కుగ్రామమే మేడారం. అక్కడ జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజనేతరుల్నీ ఆకర్షిస్తూ మహా జాతరగా పేరొందింది. ఈ జాతరకు దేశ విదేశీయులూ భారీ సంఖ్యలో హాజరవుతున్నారట. అక్కడి హుండీలో కనిపించే డాలర్లే అందుకు సాక్ష్యం. జాతర సమయంలో ఏటూరు-నాగారం అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దుతోంది.

మాఘశుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతర, ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరగనుంది. జనవరి 31న సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్ద రాజు గద్దెకు చేరుకోగా, ఫిబ్రవరి 1న  చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెకు వస్తుంది. 2న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటే, మూడో తేదీన అంటే నాలుగోరోజున అధికారిక లాంఛనాలతో అమ్మలిద్దరూ తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది. ఈ మహా ఘట్టాలను వీక్షించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.

వనదేవతలు!
13వ శతాబ్దంలో కాకతీయరాజు ప్రతాపరుద్రుడిని ఎదురించి గిరిజనుల పక్షాన పోరాడిన వీర వనితలే సమ్మక్క-సారలమ్మలు. వీళ్ళిద్దరూ తల్లీకూతుళ్లు. వాళ్లను స్మరించుకుంటూ జరిగే ఈ జాతర, ప్రతాపరుద్రుడి కాలం నుంచీ జరుగుతుందనేది చారిత్రక కథనం. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడైన పగిడిద్ద రాజు పాలించేవాడు. ఆయన భార్యే సమ్మక్క. సమ్మక్క పుట్టుక గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. మేడారానికి చెందిన కోయదొరలు గోదావరీ తీరంలోని అడవికి వేటకు వెళ్లినప్పుడు- అక్కడో పాప పులుల మధ్య ఆడుతూ కనిపించిందట. ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమిరోజున సమ్మక్క అని పేరు పెట్టారట. ఆమె గ్రామానికి వచ్చినప్పటినుంచీ అన్నీ శుభాలు జరిగేవట. పాముకాటుకి గురయినవాళ్లని తన మహిమతో బతికించేదట. సంతానం లేనివారికి పిల్లలు పుట్టేవారట. దాంతో ఆమెను అంతా వనదేవతగా భావించేవారు. తరవాతి కాలంలో ఆమెను పగిడిద్ద రాజు వివాహమాడగా, ఆ దంపతులకు సారలమ్మ, జంపన్న, నాగులమ్మ అని ముగ్గురు సంతానం జన్మించారు.

అప్పట్లో కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి, మేడారం పరగణాలను పాలించేవారు. ఓసారి ఆ ప్రాంతం వరసగా నాలుగేళ్లపాటు అనావృష్టికి గురైంది. ప్రజలంతా కరవుకాటకాలతో అల్లాడుతున్నారు. అయినప్పటికీ ప్రతాపరుద్రుడు పన్ను కట్టాల్సిందే అన్నాడు. దాన్ని వ్యతిరేకించిన కోయదొరలపై యుద్ధం ప్రకటించాడు. కాకతీయ సైన్యం ములుగు సమీపంలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు దగ్గర స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి దిగింది. అప్పుడు పగిడిద్ద రాజు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజుతో కలిసి సైన్యాన్ని మేడారం దగ్గరున్న సంపెంగ వాగు దగ్గర నిలువరించి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. సైనికుల చేతిలో చావడం ఇష్టంలేని కొడుకు జంపన్న సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటినుంచీ అది జంపన్న వాగుగా ప్రాచుర్యం పొందింది. భర్తాబిడ్డలు మరణించారన్న వార్త విన్న సమ్మక్క అపరకాళిలా విరుచుకుపడింది. ఈటెలతో యుద్ధం చేసి సైన్యాన్ని పరుగులెత్తించింది. ఓటమి తప్పదనుకున్న ఓ సైనికుడు ఆమెను దొంగచాటుగా బల్లెంతో పొడిచినట్లు చెబుతారు. అప్పుడామె గాయాలతో ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపునకు వెళ్లి దాని చుట్టూ తిరిగి అదృశ్యమైందట.

కోయదొరలు ఆమెకోసం వెతకగా గుట్టమీద ఓ నెమలినార చెట్టు దగ్గరున్న పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణె కనిపించిందట. అదే సమ్మక్క ఆనవాలుగా భావించి, ఆమెకోసం ఎదురుచూస్తుండగా, ‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదనీ, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలనీ ఆ స్థలంలో గద్దె కట్టించి, రెండేళ్లకోసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరతాయ’నీ ఆకాశవాణి మాటలు వినిపించడంతో అవి సమ్మక్క మాటలుగా భావించి భరిణెతో వెనుతిరిగారట. యుద్ధనీతికి వ్యతిరేకంగా తన సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు కోయరాజ్యాన్ని తిరిగి వారికే ఇచ్చి, సమ్మక్క భక్తుడిగా మారి, ఈ జాతరను ప్రారంభించినట్లు నాటి శాసనాలద్వారా తెలుస్తోంది. సమ్మక్కతోబాటు వీరోచితంగా పోరాడిన సారలమ్మకు మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి గ్రామంలో గుడి కట్టించి పూజించేవారట. మేడారంలో సమ్మక్క జాతర ఉత్సవాలు వైభవంగా జరగడంతో 1960 తరవాత సారలమ్మకు కూడా ఆమె గద్దె పక్కనే గద్దెను నిర్మించారు. అప్పట్నుంచీ మేడారం జాతర, సమ్మక్క-సారలమ్మ జాతరగా ప్రసిద్ధమైంది.

జాతర జరిగేదెలా?
పదిరోజుల ముందునుంచే పూజలు మొదలుపెట్టి, వేర్వేరు ప్రాంతాలనుంచి దేవతా మూర్తులను గద్దెల దగ్గరకు తీసుకురావడం ఈ జాతర ప్రత్యేకత. వెదురుకర్ర, కుంకుమభరిణెలే ఉత్సవమూర్తులు. మొదటిరోజు సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి మేళతాళాలతో ఆరుగురు పూజారులు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ సమయంలో కోరికలు కోరుకుంటూ సాష్టాంగ నమస్కారంతో పడుకుంటారు కొందరు భక్తులు. అప్పుడు పూజారి వారిపై నుంచి నడుచుకుంటూ వస్తారు. దాంతో జీవితం ధన్యమైనదిగా భావిస్తారా భక్తులు. జాతరకు రెండురోజుల ముందే కొత్తగూడ మండలం, పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయల్దేరుతుంది. సారలమ్మ భర్త గోవిందరాజులను ఏటూరు-నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి కాక వంశస్తులు తీసుకురావడం ఆనవాయితీ.

చివరగా సమ్మక్కను కుంకుమభరిణెగా భావించి, చిలుకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్తులు ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా తీసుకొచ్చి, గద్దెమీద ప్రతిష్ఠిస్తారు. వెదురుబొంగుతో చేసిన మొంటెలో గిరిజనులు తయారుచేసిన కుంకుమ వేసి, దాన్ని చిన్నపిల్లాడి నెత్తిన పెట్టి తీసుకువస్తారు. ఆ సమయంలో అధికారిక లాంఛనాలతో గాల్లోకి తుపాకీని పది రౌండ్లు పేలుస్తూ సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. ఆ సమయంలోనే కోరికలు కోరుకుంటే నెరవేరతాయని భక్తులు అమ్మను చూడ్డానికి పరుగులు పెడుతుంటారు. దేవత రాకతో ఆ ప్రాంతం, శివసత్తుల శివాలుతో దద్దరిల్లిపోతుంది. బలులు మొదలవుతాయి. తరవాతి రోజు అమ్మవారి గద్దెను దర్శించి బంగారం(బెల్లం), ధన, వస్తు, ఆభరణ, కోడెరూపంలో మొక్కులు చెల్లించుకుంటారు.

ఏమేమి మొక్కుబడులు?
భక్తుల దృష్టిలో మేడారం సమస్త శుభాలకూ వేదిక.
జంపన్నవాగులో స్నానాలు చేసి శరణాలు చెబుతూ వాగుకి పసుపూకుంకుమలతో పూజలు చేస్తారు. కోరికలు తీరితే ఎడ్లబండ్లు కట్టుకువస్తామనీ, అమ్మవారి రూపంలో వస్తామనీ ఒడిబియ్యం(కొత్తబట్టలో పసుపూకుంకుమ కలిపిన బియ్యం పోసి, వాటిల్లో ఎండిన కొబ్బరి కుడుకలు, రెండు రవిక ముక్కలు, రెండు పోకవక్కలు, ఖర్జూరాలు వేసి నడుముకి కట్టుకుంటారు), ఎదురుకోళ్లు(కోళ్లను గాల్లోకి ఎగరేయడం), గాజులూ, రవికెలు సమర్పించడం, లసిందేవమ్మ మొక్కు(గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మకి సమర్పించడం), నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుంటామని మొక్కుకుని, అంతకు తూగే బెల్లానికి ఇంటి దగ్గరే పూజలు చేసి తీసుకురావడం, మేకపోతులూ కోళ్లూ బలివ్వడం, తలనీలాలివ్వడం, కోడెను సమర్పించడం... ఇలా రకరకాల మొక్కుబడులు చెల్లిస్తారు.

జాతరకు వెళ్లే దారిలో ములుగు దగ్గర గట్టమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈ యాత్ర సఫలం కావాలంటే ఈ అమ్మను తప్పక దర్శించుకోవాల్సిందే అన్న నమ్మకంతో అక్కడ ఆగి వెళతారు.
మేడారం జాతరలోని ఆచారాలూ సంప్రదాయాలన్నీ గిరిజన సంస్కృతిని పట్టిస్తాయి. అయినప్పటికీ చెంచులు, వడ్డెరలు, కోయలు, భిల్లులు, సవరలు, గోండులు... వంటి గిరిజన తెగలతోబాటు హైదరాబాదు, ముంబై మహానగరాలనుంచీ కులమత భేదం లేకుండా ఎందరో అమ్మవారిని దర్శించుకుంటారు. దాంతో ఆ సమయంలో మేడారం మహానగరాన్నే తలపిస్తుంది.
ఏ ప్రాంతం వాళ్లయినా వరంగల్‌ నుంచి ములుగు, గోవిందరావుపేట, పస్రా మీదుగా లేదా ఏటూరు-నాగారం,తాడ్వాయి ద్వారా మేడారానికి చేరుకోవచ్చు.

- జంగిలి కోటేశ్వర్‌రావు, ములుగు, న్యూస్‌టుడే,
ఫొటోలు: సంపత్‌, వరంగల్‌