close
టైల్స్‌నీ అంటిచేయొచ్చు!

టైల్స్‌నీ అంటిచేయొచ్చు!

ఎప్పుడో ఇల్లు కట్టించినపుడు హాల్లో గోడలకు అందంకోసమనీ కిచెన్‌లో నూనె మరకలు పడకుండా ఉంటాయనీ వేయించిన టైల్సు... చూసీ చూసీ మనకు బోర్‌ కొట్టేస్తుంటుంది. కానీ వాటిని తియ్యాలన్నా కొత్త వాటిని వేయించాలన్నా బోలెడంత పని. ఖర్చూ ఎక్కువే అవుతుందన్న భయం. ఇకమీదట ఇలా బాధపడాల్సిన పనేలేదు.  స్టిక్కర్లలా అంటించుకునే టైల్సు మార్కెట్లోకి వచ్చేశాయి మరి.

ల్లంతా ఎంత బాగా కట్టించినా గోడలకీ నేలమీదా టైల్స్‌ వేయించాకగానీ అసలందం రాదు. చూడ్డానికి బాగుంటాయనే కాదు, టైల్సుమీద మురికిని శుభ్రం చెయ్యడం కూడా సులభమే. ఇక, వంటగదీ స్నానాలగదులూ హాల్లో సింకులదగ్గరా... నూనెమరకలూ నీళ్ల మరకలూ పడి గోడలు త్వరగా మురికిపట్టేస్తాయి. అలాంటపుడు మామూలుగా రంగేసిన గోడలు చెత్తగా తయారై ఇంటి అందాన్ని చెడగొట్టేస్తాయి. వాటిని కడగడానికీ కుదరదు. మాటిమాటికీ కొత్తగా రంగులూ వెయ్యలేం. అందుకే, అలాంటిచోట్ల గోడకు కొంతమేర టైల్సు వేయిస్తుంటారు. కాకపోతే అసలు సమస్య ఏంటంటే అందానికీ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది...
అవునుమరి, మనకు చాలా నచ్చి వేయించుకున్న టైల్సే చూడగా చూడగా బాగుండనట్లనిపిస్తాయి. రోజులుమారే కొద్దీ కొత్తరకాల టైల్సు ఎన్నో మార్కెట్లోకి వస్తుంటాయి. అందుకుతగ్గట్లూ మనక్కూడా ఇంటిని అప్పుడప్పుడూ రీమోడలింగ్‌ చేసుకోవాలనిపించినా ఖర్చెక్కువనీ పెద్ద పనవుతుందనీ వెనకాడుతుంటాం. ఇక, గోడలకు టైల్సు వేయించకుండా కట్టించిన ఇళ్లూ ఉంటాయి. వాటికి ఇప్పుడు కొత్తగా టైల్సు వేయించాలన్నా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ సమస్యంతా లేకుండా ఇష్టమైన హీరో పోస్టర్‌ని అంటించినంత తేలిగ్గా గోడకు అంటించుకునేవే ‘అడ్‌హీసివ్‌ త్రీడీ టైల్‌ స్టిక్కర్లు’.

ఎంతో సహజంగా...
ఫైబర్‌ ప్లాస్టిక్‌తో తయారయ్యే వీటిలో మామూలు టైల్స్‌లాంటివాటితోపాటు, మొజాయిక్‌, గాజు, మెటల్‌ తరహావీ వస్తున్నాయి. వీటిని ఖాళీ గోడలమీదే కాదు, ఇప్పటికే ఉన్న పాత టైల్స్‌మీద కూడా అంటించుకోవచ్చు. రకరకాల ఆకర్షణీయమైన రంగులూ డిజైన్లలో త్రీడీ లుక్‌తో వస్తున్న ఇవి చూడ్డానికి రాళ్ల టైల్స్‌ అంత సహజంగానూ అంతకు రెట్టింపు అందంగానూ ఉంటున్నాయి. పైగా ధర కూడా తక్కువే. ఈ స్టిక్కర్లు వాటర్‌ప్రూఫ్‌ కాబట్టి శుభ్రం చేసుకోవడమూ సులభమే. వీటిలో గోడమీద వెదురు సాగు చేసినట్లూ కనిపించే గాజు టైల్సూ బంగారు వర్ణం పూత పూసినవీ లెదర్‌ అందాలకు అక్కడక్కడా రత్నాలు పొదిగినట్లూ ఉన్నవీ... ఇలా బోలెడు రకాలు వస్తున్నాయి. ఇక, ఫైబర్‌ స్టిక్కర్లు కాకుండా ఇంట్లో ఉన్న తెల్లటి టైల్స్‌కి రంగురంగుల డిజైన్లు అద్దేందుకు టాటూ స్టిక్కర్లలాంటి పలుచటి టైల్‌ స్టిక్కర్లూ వస్తున్నాయి. వేరు వేరు సైజుల్లో ఉండే వీటిని నేలమీదా గోడలమీదా వేసిన తెల్లటి టైల్సుమీద అక్కడక్కడా అంటించుకుని ఇంటికి కొత్తందాన్ని తేవొచ్చు. ఇక, మార్బుల్‌ టైల్స్‌లా కాకుండా ఇటుకల్లా ఉండి అంటించేవి త్రీడీ టైల్‌ స్టిక్కర్లలో మరోరకం. అరమీటరు పొడవూ, వెడల్పూ ఉండే ఇవి కూడా తేలికగా ఉండే ఫైబర్‌తో తయారైనవే. వీటిని హాల్లో ఒకవైపున్న గోడమొత్తానికీ అంటిస్తే... ఇల్లే సరికొత్తగా మారిపోతుందనడంలో ఆశ్చర్యంలేదు.
ఇలా... చెప్పాలేకానీ అంటించే టైల్స్‌ డిజైన్లకు ఆన్‌లైన్‌ షాపుల్లో కొదవేలేదు. మరి, మీ ఇంటినీ కొత్తగా మార్చాలనుకుంటున్నారా..?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.