close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంతోశాల

సంతోశాల
విదేశీ విహారం-భూటాన్‌

హలో. హలో.. హ్యాపీగా ఉన్నారా! లేరా! స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు.. ఎఫ్‌బీలో ఫ్రెండ్స్‌.. టీవీలో సీరియల్స్‌.. థియేటర్‌లో సినిమాలు.. ఇన్ని ఉన్నా.. హ్యాపీగా లేరా! నెలకోసారి చిన్నదో.. పెద్దదో టూర్‌కు వెళ్తున్నా.. సంతోషం దొరకడం లేదా! విహారానికి వెళ్తే ఏం లాభం.. అక్కడ కూడా చేతిలో చరవాణి.. చెవుల్లో స్వరవాణి.. వాట్సప్‌లో వేకింగ్‌ మెసేజ్‌.. ఎఫ్‌బీలో గుడ్‌నైట్‌ పోస్ట్‌.. ఇన్ని ఉచ్చుల మధ్య చిక్కుకున్నాక సంతోషం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది. వీటన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉందా! చలో భూటాన్‌. అక్కడా స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తాయి. కానీ, త్రీజీలు.. ఫోర్‌జీలు.. జీహుజూర్‌ అంటూ వెంటపడవు. చూట్టూ వేధించే వైఫైలూ ఉండవు. ఫలితం.. ఆల్‌ హ్యాపీస్‌! పైగా వేసవిలో వెళ్తే.. చల్లదనం బోనస్‌గా లభిస్తుంది.
భూటాన్‌ హ్యాపీ కంట్రీ! కొండల్లో నెలకొన్న ఈ చిట్టి దేశ జనాభా ఎనిమిది లక్షలకు ఇటే ఉంటుంది. చాలామంది బుద్ధం శరణం గచ్ఛామి అనేవాళ్లే! ఊరూరా బుద్ధిజం ఆనవాళ్లే! డొంకల్లో, నదీ తీరంలో, కొండ వాలులో.. ఎక్కడ చూసినా బౌద్ధ మఠాలే కనిపిస్తాయి! పెద్ద, పెద్ద ఆరామాల్లో వందల మంది బౌద్ధ సన్యాసులుంటారు. వారి దగ్గరా స్మార్ట్‌ఫోన్లు కనిపిస్తాయి. చిన్నారి బౌద్ధ భిక్షువుల చేతుల్లోనూ చరవాణి ఉంటుంది. కానీ, టెక్నో పొడ అంతగా లేకపోవడంతో హ్యాపీగా ఉన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో  భూటానీయులు చాలా వెనుకబడి ఉన్నారు. ఆ దేశంలో టీవీ 1999లో మొదలయ్యిందంటే.. ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, పర్యావరణాన్ని పరిరక్షించడంలో వాళ్లు అందరికన్నా ముందున్నారు.
అదే తారక మంత్రం
బౌద్ధపథంలో నడిచే భుటాన్‌లో.. గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం, భూమి స్వచ్ఛం. ఆ భూమిలో పండే ఆహార ధాన్యాలు కూడా స్వచ్ఛం. ఆ దేశంలో సాగుబడి నూటికి నూరు శాతం సేంద్రియ బాటలో సాగుతోంది. భూమి, నీరు కలుషితం కానంత వరకూ ఏ దేశవాసులైనా హ్యాపీగా ఉండొచ్చని అంటారు భూటానీయులు. ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో ఒకటిగా భూటాన్‌ గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే భూటాన్‌లో హిమాలయాల సోయగాలు, కొండలు, కోనలు చెప్పుకొంటూ పోతే.. ఎన్నో ఆకర్షణలు. పర్యాటకంపై దృష్టిసారిస్తే ఆ దేశం ముఖచిత్రమే మారిపోతుంది. అక్కడి పాలకులు మాత్రం.. మాస్‌ టూరిజాన్ని ప్రోత్సహించరు. వేలం వెర్రిగా జనాలు వచ్చిపడటాన్ని ఇష్టపడరు. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి సాధించే అభివృద్ధి అవసరం లేదంటారు. ‘బయటి నుంచి వచ్చే వాళ్లు.. దీన్నో పర్యాటక కేంద్రంగానే చూస్తారు. కానీ, మా నివాస స్థానంగా గుర్తించరు. పర్యావరణానికి కీడు తలపెడతారు. ఇది మా దేశం. దీన్ని కాపాడుకోవడం మా ప్రాథమిక విధి. పర్యావరణ ప్రేమికులను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం, ఆదరిస్తాం’ అంటారు భూటానీయులు.
పారో పరిసరాల్లో..
భూటాన్‌ రాజధాని థింపూ. కానీ, ఇక్కడ విమానాశ్రయం లేదు. దేశంలో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం పారో నగరంలో ఉంటుంది. అక్కడి నుంచి రాజధానికి దూరం 55 కిలోమీటర్లు. చుట్టూ కొండలు, గుట్టలతో ఉండే పారో విమానాశ్రయంలో దిగగానే మంచుతెరలు స్వాగతం పలుకుతాయి. ఆ తెరల చాటు నుంచి ఆకాశాన్నంటే పర్వతాలు కనిపిస్తాయి. పారో ఎయిర్‌పోర్ట్‌ సౌందర్యం చూడటంతోనే పర్యాటకులకు ఆనందం మొదలవుతుంది. కొండల నడుమ ఉన్న లోయలో పారే పారో నది, తీరం వెంట విస్తరించిన జనావాసాలు, బౌద్ధారామాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. పారోలో నేషనల్‌ మ్యూజియం, పురాతన కట్టడాలు అన్నీ ఆనందాన్ని పెంచేవే!
థింపూ నుంచి పునాఖ దాకా
పారో ఇచ్చిన హుషారు నుంచి తేరుకోక ముందే థింపూ చేరుకోవాలి. ఇక్కడ రెస్టారెంట్లు బాగుంటాయి. భారతీయ వంటకాలూ దొరుకుతాయి. శాకాహారులు ఆందోళన పడాల్సిన పనిలేదు. మన దగ్గర మూడురెట్ల ధర వెచ్చించి కొనే ఆర్గానిక్‌ ఫుడ్‌.. అక్కడ అందుబాటు ధరలోనే లభిస్తుంది. 51.5 మీటర్ల బుద్ధుడి కాంస్య విగ్రహం థింపూలో ప్రధాన ఆకర్షణ. మంచి ట్యాక్సీ డ్రైవర్‌ను, గైడ్‌ను పట్టుకోగలిగామా.. భూటాన్‌ పర్యటన మరింత సంతోషంగా సాగిపోతుంది. ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లాలన్నా.. వంద కిలోమీటర్ల దూరం లోపే ఉంటుంది. టాంగో, చెరి మఠాలు, డోకులా పాస్‌, పునాఖా ఇవన్నీ థింపూ నుంచి 50-80 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పునాఖాలో భూటాన్‌ జానపద వైభవం కనిపిస్తుంది. ఇది ఒకప్పుడు భూటాన్‌ రాజధాని. పునాఖా నుంచి థింపూ మీదుగా పారో చేరుకుంటే భూటాన్‌ పర్యటన ముగిసినట్టే!


రూ.17 వేల నుంచి..

భూటాన్‌ సందర్శనకు ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు బోలెడన్ని ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నారు. మూడు రోజుల నుంచి వారం రోజుల నిడివి ఉన్న ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీల ధరలు రూ.17,000 నుంచి రూ.75,000 (ఒక్కొక్కరికి) వరకు పలుకుతున్నాయి. ప్యాకేజీల హడావుడి ఇప్పటికే మొదలైంది. ముందస్తుగా సన్నద్ధం అయితే మంచి ప్యాకేజీలు లభించే అవకాశం ఉంది. వేసవి సీజన్‌ మొదలయ్యేనాటికి భారతీయ రైల్వే కూడా ప్రత్యేక ఆఫర్లు  ప్రకటిస్తుంది.


శిఖరాగ్ర ఆరామం

పారో పరిసరాల్లో ఉన్న పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనది తక్త్సంగ్‌ మఠం (టైగర్‌ నెస్ట్‌). ఈ బౌద్ధారామాల సమూహం పారో పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన పర్వతంపై ఉంటుంది. క్రీస్తుశకం ఏడో శతాబ్దంలో పద్మసంభవ అనే బౌద్ధ గురువు ఇక్కడ ధ్యానం చేశాడని చెబుతారు. 16వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాలు వెలిశాయి. పదివేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతంపైకి ఎక్కడం కత్తిమీద సామే. కొండపైకి మెట్ల మార్గం ఉంది. ఏటవాలుగా ఉండే మెట్లు ఎక్కాలంటే ఒంట్లో శక్తి, ఓపిక కావాల్సిందే! భూటాన్‌ సందర్శనకు వచ్చిన పర్యాటకుల్లో చాలామంది తిరుగు ప్రయాణంలో టైగర్‌ నెస్ట్‌ సందర్శిస్తారు.


వేసవిలో భలే భలే..

క్టోబర్‌, నవంబర్‌ నెలల్లో భూటాన్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అది దాటితే మళ్లీ వేసవి అనుకూలంగా ఉంటుంది. మార్చి రెండో వారం నుంచి మళ్లీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 9 డిగ్రీలు నమోదవుతుంది. చలికాలంలో మనదగ్గర ఉన్నట్టుగా అన్నమాట. అందుకే వేసవిలో భూటాన్‌ విహారం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది.


వెళ్లాకే అనుమతి

కోల్‌కతా, దిల్లీ నుంచి పారోకు విమాన సర్వీసులు ఉన్నాయి. పారో చేరిన తర్వాత విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌లో అనుమతి తీసుకోవాలి. కనీసం అరునెలల గడువున్న పాస్‌పోర్టు, ఓటర్‌ ఐడీ కార్డు గానీ, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం ఉండాలి. పారో, థింపూ నగరాలతో పాటు భూటాన్‌ అంతా చుట్టిరావాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి బౌద్ధ ఆలయాలు సందర్శించడానికీ.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనుమతి ‘టెంపుల్‌ పర్మిట్‌’ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అనుమతులన్నీ టూర్‌ ఆపరేటర్లు ఏర్పాటు చేస్తుంటారు. భారత్‌ రూపాయి భూటాన్‌ రూపాయితో సమానం. ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలోనే మన రూపాయిలను భూటాన్‌ కరెన్సీగా మార్చుకోవాలి.
మరో మార్గం
* భూటాన్‌కు రోడ్డు మార్గంలో కూడా వెళ్లొచ్చు. ముందుగా కోల్‌కతా చేరుకోవాలి. నగరంలోని సిల్ధా రైల్వే స్టేషన్‌లో కాంచన్‌కన్యా ఎక్స్‌ప్రెస్‌ (ప్రతిరోజూ రాత్రి 8.30) ఎక్కి హాసిమారాలో దిగాలి.
హాసిమారా నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఇండో- భూటాన్‌ సరిహద్దు ఉంటుంది. ట్యాక్సీలు ఉంటాయి. ఒక్కొక్కరికి రూ.150 నుంచి రూ.200 తీసుకుంటారు.
* సరిహద్దు దాటిన తర్వాత.. అక్కడే రీజనల్‌ ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం ఉంటుంది. పాస్‌పోర్ట్‌తో పాటు ఓటర్‌ ఐడీ లేదా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం అధికారులకు చూపిస్తే వీసా లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నార్గేలామ్‌ గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి పారో, థింపూ నగరాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.


10,300 అడుగుల ఎత్తులో