close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనిశ్చితం

అనిశ్చితం
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

‘‘మీ అమ్మగారు ఎందుకో ఏడుస్తున్నారు.’’
కళ్ళు తెరిచిన సిద్ధార్థ తన భార్య వనజ చెప్పిన మాటల్ని వెంటనే అర్థం చేసుకోలేకపోయాడు.
‘‘మా అమ్మ... ఏమిటీ..?’’ అడిగాడు.
‘‘పూర్తిగా మెలకువ తెచ్చుకోండి. మీ అమ్మగారు ఎందుకో ఏడుస్తున్నారు. ఎవరో పోయినట్లున్నారు’’ వనజ మళ్ళీ చెప్పింది.

సిద్ధార్థ తక్షణం మంచంమీంచి లేచి, పడకగదిలోంచి హాల్లోకి నడిచాడు. అతనికి హాల్లో తల్లి కనిపించలేదు. వనజ అతన్ని అనుసరిస్తూ చెప్పింది.
‘‘ఇక్కడ కాదు, బాత్‌రూమ్‌లో.’’

వనజ వంక అతను కొద్దిగా ఆశ్చర్యంగా చూసి కామన్‌ బాత్‌రూమ్‌ తలుపు దగ్గరికి నడిచాడు. తలుపు మీద తట్టబోతూంటే వనజ అతని చేతిని పట్టుకుని ఆపి గొంతు తగ్గించి చెప్పింది- ‘‘ష్‌... ఆవిడ మనకి తెలీకూడదని బాత్‌రూమ్‌లో రహస్యంగా ఏడుస్తున్నారు.’’

అతను తలుపుకి చెవి ఆనించి విన్నాడు. ఆవిడ ఏడుపు స్పష్టంగా వినిపించింది. తన తండ్రి పోయినప్పటి ఏడుపు లాంటిదే అది.
‘‘ఎవరు పోయారో చెప్పిందా?’’ గొంతు తగ్గించి అడిగాడు.
‘‘లేదు. నాకు బాత్‌రూమ్‌లోంచి ఆ ఏడుపు వినపడగానే మిమ్మల్ని లేపాను.’’
‘‘అడగనా?’’
ఆమె తల అడ్డంగా ఊపి చేతిని పట్టుకుని భర్తని మళ్ళీ పడకగదిలోకి తీసుకువచ్చి చెప్పింది. ‘‘ఆవిడ అంత రహస్యంగా ఏడుస్తూంటే ఎందుకని ఎలా అడుగుతారు?’’

‘‘చిత్రంగా ఉంది. కొంపతీసి మా అక్క లేదా తమ్ముడికి కానీ లేదా వాళ్ళ పిల్లలకి కానీ ఏదైనా అయిందంటావా?’’
హాల్లోకి వచ్చి తన తల్లి సెల్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్‌, వాట్సాప్‌ రీసెంట్‌ కాల్స్‌ రికార్డ్‌ని చెక్‌ చేశాడు. ఆ ఉదయం ఒక్క కాల్‌ కూడా రాలేదు. ఇద్దరూ మళ్ళీ పడకగదిలోకి నడిచారు.
‘‘ఏమై ఉంటుందంటావు?’’ సిద్ధార్థ భార్యని అయోమయంగా అడిగాడు.
అకస్మాత్తుగా సిద్ధార్థ ఆరేళ్ళ చిన్నకొడుకు కంఠం వినిపించింది.
‘‘బాత్‌రూమ్‌లో ఎవరు? బయటకి రండి. నేను అర్జెంట్‌గా వెళ్ళాలి...ఇక్కడే పోసెయ్యనా?’’

బయటకి కదిలిన భర్త చేతిని పట్టుకుని ఆపింది. వాడు ఆ గదిలోకి పరిగెత్తుకు వచ్చి వాళ్ళ బాత్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపు కూడా వేసుకోలేదు.
ఇద్దరూ అయిదు నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చారు. హాల్లో సోఫాలో కూర్చున్న తల్లి కళ్ళజోడు పెట్టుకుని పేపరు చదువుతూ కనిపించింది. ఆవిడ ముఖంలో ఏడ్చిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

‘‘తొందరగా లేచావేరా?’’ ఆవిడ కొడుకుని చూసి ప్రశ్నించింది.
‘‘శరత్‌గాడు లేపాడమ్మా. కాఫీ తాగావా?’’ మామూలుగా అడిగాడు.
‘‘ఇంకా లేదు, కలుపుతోంది.’’
‘‘ఏమైనా కావాలామ్మా?’’ ఓ నిమిషం
సందేహించాక అడిగాడు.
ప్రశ్నార్థకంగా చూసింది.
‘‘బ్రెడ్‌ కానీ బిస్కెట్లు కానీ ఇంట్లో లేవు. తెస్తాను కావాలంటే.’’
‘‘ఒద్దొద్దు, ఆకలిగా లేదు.’’

సిద్ధార్థ బాల్కనీలోని వాష్‌బేసిన్‌ దగ్గరికి వెళ్ళి బ్రష్‌ మీద పేస్టు వేసుకున్నాడు. పళ్ళు తోముకుంటూంటే అతనిలో యాంత్రికంగా ఆలోచనలు కలగసాగాయి. తన తల్లి ఏడవడం అబద్ధం కాదు. కానీ, దేనికి అంతలా ఏడ్చింది... ఏమైంది?
ఏం అశుభ వార్త తెలిసింది...తమతో పంచుకోకూడని ఆ అశుభవార్త ఏమై ఉంటుంది?

బాల్కనీలోంచి బాత్‌రూమ్‌లోకి వెళ్ళేముందు భార్యని పిలిచి గొంతు తగ్గించి అడిగాడు- ‘‘నువ్వేమైనా అన్నావా?’’
భార్య మొహంలోని భావాలని గ్రహించాక మళ్ళీ చెప్పాడు- ‘‘ఐ మీన్‌... తెలిసి కాదు, తెలీకుండా..!’’
‘‘ఛ! లేదండీ. నేను నిద్ర లేచాక చూస్తే హాల్లో లేరు, పిల్లల పక్కనా లేరు. బాత్‌రూమ్‌ దగ్గరికి వెళ్తే ఏడుపు విన్నాను.’’
‘‘మా నాన్న గుర్తొచ్చాడేమో!? ఊహు, అది కారణమై ఉండదు...లేదా అయుండొచ్చు కూడా. అడుగుతానుండు’’ సిద్ధార్థ చెప్పాడు.
‘‘అడక్కండి...ఆవిడే చెబుతారేమో చూద్దాం.’’
‘‘నీకు నిజంగా తెలీదా?’’
‘‘తెలిస్తే దాస్తానా? కారణం తెలిస్తే మీకే తెలియాలి.’’
నిన్న ఎవరు ఫోన్‌ చేశారో చూడు.
మా అన్నయ్యో, వదినో చెల్లెలో ఏదైనా పుల్లవిరుపు మాటలు అన్నారేమో!?’’
అతను బాత్‌రూమ్‌లోకి వెళ్ళి బట్టలు విప్పాక బయటనుంచి వనజ కంఠం వినిపించింది.
‘‘లేదు. నిన్న వాళ్ళనుంచి కాల్సేమీ లేవు.’’

అతను హ్యాండ్‌ షవర్ని అందుకుని స్నానం చేస్తూ తల్లి ఆవేదనకి కారణం ఆలోచించసాగాడు. అనేక కారణాలు తట్టాయి. కానీ దేనికీ పొంతన లేదనిపించింది. ఈ వయసులో అంత అకస్మాత్తుగా ఆవిడని అంత రహస్యంగా బాధించేది ఏమై ఉంటుంది?

అతను ఆఫీసుకి వెళ్తూ సోఫాలో నిస్త్రాణగా పడుకున్న తల్లిని అడిగాడు- ‘‘ఒంట్లో బాలేదామ్మా, డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్ళనా?’’
‘‘లేదు, బానే ఉంది’’ ఆవిడ కళ్ళు మూసుకునే జవాబు చెప్పింది.
‘‘ఏదైనా ప్రాబ్లమామ్మా?’’
‘‘లేదు బుజ్జీ, ఏం లేదు’’ లేచి కూర్చుని నవ్వుతూ చెప్పింది.
అది తెచ్చిపెట్టుకున్న నవ్వు అని గ్రహించాడు.
మధ్యాహ్నం వనజ ఫోన్‌ చేసి సిద్ధార్థకి చెప్పింది.
‘‘మీ అమ్మ ఆకలిగాలేదని అన్నం తినలేదండీ.’’
‘‘అయ్యో, అదేం? ...ఇంకా అలాగే ఉందా?’’ అడిగాడు.
‘‘అవును. ‘మీరు డయాబెటిక్‌ అత్తా, తినాలి’ అని బలవంతం చేసినా వద్దన్నారు. ఆవిడ వయసు డెబ్భైరెండు.
ఈ వయసులో ఆవిడని అంతగా బాధించే విషయం ఏమిటో నాకు అంతుబట్టడం లేదు.’’
‘‘సరే, ఇంటికి వచ్చాక అడుగుతాను కానీ రెండుమూడు గంటలకోసారి కాంప్లాన్‌ ఇవ్వు.’’

ఆ తర్వాత సిద్ధార్థ ఆఫీసు పనిని అన్యమనస్కంగానే చేశాడు. పని మధ్యలో టీ బ్రేక్‌లో గ్రీన్‌ టీ తాగుతూ ఆలోచించాడు. అతనికి ఏ కారణం తట్టలేదు. మళ్ళీ అతనికి వనజ నుంచి ఫోన్‌ వచ్చింది.
‘‘ఏమిటీ, తెలిసిందా?’’ ఆత్రుతగా అడిగాడు.
‘‘లేదు. కానీ కొద్దిగా తెలిసిందనే అనుకుంటున్నాను.’’
‘‘ఏం తెలిసింది, చెప్పు.’’
‘‘ఇందాక పేపరు చదివి మళ్ళీ ఏడ్చారండీ.’’
‘‘పేపర్‌ చదివాకా... ఏం వార్త చదివి?’’

‘‘తెలీదు. కానీ, అదే కారణమని గట్టిగా చెప్పగలను. అది ఆవిడ దగ్గర ఉంది. మీరో ‘ఈనాడు’ తెప్పించి చదివి చూడండి, మీకు తెలుస్తుందేమో!’’
సిద్ధార్థ టీ తాగడం ఆపి, లేచి ఫ్యూన్‌కి డబ్బిచ్చి పేపరు తేవడానికి పంపాడు.

అది రాగానే దాన్ని వెంటనే చదవసాగాడు. క్రైమ్‌, రాజకీయ వార్తలేమీ తన తల్లిని బాధించేవి కావు అనుకున్నాడు. వార్తలన్నీ చదివాక ఆలోచించి ప్రకటనల్ని చదవసాగాడు. ఓ పేజీలోని ప్రకటన చదివాక అతనికి అకస్మాత్తుగా తన
చిన్ననాటి రెండు మూడు సంఘటనలు గుర్తుకువచ్చాయి.

* * *

అప్పుడు సిద్ధార్థకి తన వయసెంతో గుర్తులేదు. కానీ, ఓ రాత్రి తన పక్కన పడుకున్న అక్క రెండు మూడుసార్లు ‘అమ్మా, దాహం... మంచినీళ్ళు’ అని పిలుస్తూండటంతో ఆ మాటలకి తనకి మెలకువ వచ్చింది. చూస్తే పక్కన తల్లి లేదు. వెంటనే తను ఏడవసాగాడు.

తన తల్లి తమ పడకగది తలుపు తెరుచుకుని వచ్చి ఏడవద్దని తనని గద్దించి అక్కకి మంచినీళ్ళు ఇచ్చింది.
‘‘అక్కడ పడుకున్నావేం... నాన్నొచ్చారా?’’ అక్క అడిగింది.
వారి తండ్రి వస్తే తల్లి తమపక్కన కాక ఆ గదిలో పడుకుంటుంది.
‘‘రాలేదు. గాలి కోసం కిటికీ తలుపు తెరుచుకుని పడుకున్నాను. పడుకో, నేను అక్కడే పడుకుంటాను.’’
‘‘నాకూ గాలి కావాలి అమ్మా’’ అక్క అడిగింది.
‘‘అల్లరి చేయకుండా పడుకో’’ చెప్పి మళ్ళీ లోపలకి వెళ్ళి తలుపు వేసుకుంది.
మర్నాడు ఉదయం జరిగింది కూడా సిద్ధార్థకి గుర్తుంది. తమ పుస్తకాలూ, స్కూల్‌ బ్యాగూ, యూనిఫారాలూ బయటే ఉన్నాయి.
‘‘వీటిని బయటికి తెచ్చావేం?’’ తను అడిగితే అమ్మ జవాబు చెప్పలేదు.
స్కూలుకి వెళ్తూ రిక్షాలోంచి అక్క అరిచింది.
‘‘రాత్రి అబద్ధం చెప్పావు అమ్మా, ఆ గది కిటికీ తలుపు మూసే ఉంది.’’

మరో రెండు మూడుసార్లు తను నిద్ర లేచేసరికి ఆ తలుపు మూసి ఉండటం, తమ బ్యాగులూ బట్టలూ బయటే ఉండటం జరిగింది. పనిమనిషితో ఆ గది ఊడ్చద్దని కూడా తన తల్లి చెప్పింది.
దారిలోని పోస్టు డబ్బాలో వేయమని తనని స్కూలు దగ్గర దింపే రిక్షా వాడికి ఉత్తరాలు ఇచ్చేది. పోస్ట్‌మేన్‌ ఉత్తరం తెచ్చిస్తే దాన్ని చదువుకుంటూంటే ఆమె మొహంలో ఎంతో సంతోషం కనిపించేది.

తమ చదువుకోసం అమ్మ కాకినాడకి ముప్ఫై కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామం నుంచి వచ్చి, ఓ చిన్న మూడు గదుల పెంకుటింట్లో కాపురం పెట్టింది. తమ తండ్రి గ్రామంలో ఉంటూ వ్యవసాయం పని చూసుకునేవాడు. వారానికోసారి సైకిల్‌ మీద ఇంటికి కావాల్సిన పచారీ సరుకంతా తమ గ్రామం నుంచి తెచ్చేవాడు. తమకి తేగలూ పూతరేకులూ మామిడితాండ్రా కాజాలూ లాంటివి తెచ్చేవాడు. రాత్రి ఉండి మర్నాడు వెళ్ళిపోయేవాడు. ఆ రాత్రి అమ్మ ఆ గదిలో పడుకునేది. కానీ తలుపు వేసేది కాదు.

కొద్దివారాల తర్వాత ఓ ఆదివారం ఉదయం తండ్రి వస్తే అక్క చెప్పింది- ‘‘నిన్నరాత్రి నువ్వు తెచ్చిన పెరుమాళ్ళపురం పాకం గారెలు చాలా బావున్నాయి నాన్నా. పొద్దున నేను లేచేసరికే వెళ్ళిపోయావేం?’’
ఆ మధ్యాహ్నం ఆ గదిలో తమ తల్లిదండ్రులు ఏదో విషయంలో తీవ్రంగా వాదులాడుకోవడం విన్న ఇద్దరూ బిక్కచచ్చిపోయారు. గొంతులు లేవకపోయినా వారిమధ్య పోట్లాట జరుగుతోందని అక్కాతమ్ముళ్ళు ఇద్దరూ తేలిగ్గా గ్రహించారు. కొద్దిసేపటికి తన తల్లి ఏడ్చి ఉబ్బిన కళ్ళతో బయటకి వచ్చింది. తన తండ్రి ఆ రాత్రి ఉండకుండా వెళ్ళిపోయాడు. ఒక్క ఆ రాత్రే కాదు, ఆ తర్వాత ఇంకేరాత్రీ ఆయన రాలేదు. స్కూటర్‌ మీద తన బాబాయే సరుకు తెచ్చిచ్చి వెంటనే వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత తన తండ్రి తన తల్లితో మాటలు పూర్తిగా మానేశాడని కూడా సిద్ధార్థకి గుర్తొచ్చింది. ఊహ వచ్చాక ఒకటి రెండుసార్లు సిద్ధార్థకి గతంలో జరిగింది గుర్తొచ్చింది. కానీ, స్పష్టంగా ఏదీ తెలీలేదు. ‘తన తండ్రి తన తల్లికి మేనమామ కాకపోతే పూర్తిగా విడిపోయేవారేమో! అందుకే లోకం కోసం కలిసే ఉన్నారేమో’ అనుకున్నాడు.

ఓసారి తమని రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్ళింది. ఎవరో తమకి తెలీదు కానీ, వెళ్ళే రైలు వంక చూసి అది కనుమరుగయ్యేదాకా చేతిని ఊపుతూనే ఉంది. ఆ వ్యక్తి ఎవరో తామిద్దరికీ తెలీలేదు. రైలు కనుమరుగయ్యాక కళ్ళల్లోంచి కారే కన్నీళ్ళని తుడుచుకుంది.

పెద్దయ్యాక ఒకటి రెండుసార్లు తనూ అక్కా ఆ విషయం అడిగినా ఆవిడ నోరు విప్పలేదు. దానికీ దీనికీ ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా?

* * *

గతంలో జరిగినవి గుర్తు తెచ్చుకుని దినపత్రికలోని ప్రతీ వార్తా చదువుతున్న సిద్ధార్థకి ఓ పేజీలో మరణవార్తలు కనిపించాయి.
ఆరుగురి ఫొటోలతోపాటు వారు మరణించిన ప్రకటనలని చూశాక, ఆ దినపత్రికలో తన తల్లిని బాధించింది వారిలోని ఒకరి మరణమై ఉండొచ్చని సిద్ధార్థ నమ్మాడు. అది తప్ప, అతనికి ఇంకో కారణం కనిపించలేదు. వాటిలో రెండు ఆడవాళ్ళవీ నాలుగు మగవాళ్ళవీ. ముందు ఆడవాళ్ళ మొహాలు పరిశీలించి చూసి వారి పేర్లు చదివాడు. వాళ్ళు పూర్తిగా కొత్తవాళ్ళు. తర్వాత మగాళ్ళ మొహాలని చూశాడు. ఎవరి మొహమూ గతంలో చూసిన మొహంలా అనిపించలేదు.
ఆ నలుగురిలో ఇద్దరు క్రితంరోజు మరణించారు. మిగిలిన ఇద్దరివీ దశదిన కర్మ ప్రకటనలు. నలుగురిలో ఒకరు తమ జిల్లావాడే. డాక్టర్‌. ఆయన జననం-మరణం సంవత్సరాలనిబట్టి ఆయన వయసు తెలిసింది. ఆయన
ఎంబీబిఎస్‌ ఎప్పుడు చదివాడో లెక్కకట్టాడు. తన అయిదోయేట అతను విద్యార్థి అని గ్రహించాడు. కాకినాడ మెడికల్‌ కాలేజీలోనా? తన ఇంట్లో ఆ సంఘటన జరిగినప్పుడేనా? మిగిలిన ముగ్గురిలో కూడా ఇద్దరు డెబ్భై పైబడ్డవాళ్ళే. వారిలో ఒకరు విజయవాడలో ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. మరొకరు కూడా డాక్టర్‌. అమెరికాలో మరణించాడు. నాలుగోవ్యక్తి వయసు మాత్రమే యాభైనాలుగు.

ఒకవేళ తన ఊహ నిజమై తన తల్లితో ఆ గదిలో గడిపిన వ్యక్తి ఆ నలుగురిలో లేదా ముగ్గురిలో ఒకరై ఉంటే, తన తల్లిది కేవలం శారీరక వాంఛ అయి ఉండదు. అది గాఢమైన మానసిక బంధమై ఉండాలి. శారీరక సంబంధం ఎంత ఆనందాన్ని ఇచ్చినా వారి మరణం అంత బాధించదు. చాలా ప్రేమ కథల్లో అనేక పాపాలు ఉండి ఉంటాయి అని కూడా అనిపించింది. కింద ఇచ్చిన ఒకరి కుటుంబసభ్యుల పేర్లలో ఒకరి కూతురి పేరు తన తల్లి పేరే... ఇంకొకరి మనవడి పేరు తన పేరే.

ఆ ఇద్దరిలో ఒకరా...లేక అది యాదృచ్ఛికమా?

తను ఆఫీసుకి వస్తూండగా సోఫాలో చూసిన తల్లి రూపం గుర్తొచ్చింది. జుట్టు మూడు వంతులు పైగా నెరసి, కళ్ళకి బండ కళ్ళద్దాలూ ముఖంలో ముడతలూ వృద్ధాప్యపు లక్షణాలు కొట్టొచ్చినట్లు కనపడే డెబ్భైరెండేళ్ళ తన తల్లికి ఓ ప్రేమ కథ ఉందని సిద్ధార్థ ఆ మరణ వార్తలు చదివాక ఊహించాడు. తను చాలా సంవత్సరాలుగా కలవని, తన మనసులో అంత బలంగా పాతుకుపోయిన ఒకప్పటి ప్రియుడి మరణం వల్ల ఆవిడ బాధ బయటకి వచ్చిందని కూడా అనుకున్నాడు.

ప్రేమ అనగానే యవ్వనంలోని వాళ్ళు గుర్తుకువస్తారు. ప్రేమ సామ్రాజ్యానికి వారే చక్రవర్తులనీ వారే గాఢ ప్రేమలో పడతారనీ లోకం భావిస్తుంది. ముసలివాళ్ళల్లో ప్రేమించే హృదయం ఉంటుందని ఎవరూ అనుకోరు. నిజానికి ప్రేమ అనిర్వచనీయమనీ, ప్రేమకీ వయసుకీ శరీరానికీ సంబంధం లేదనీ, అది వృద్ధాప్యం వల్ల వాడిపోయి మాయమయ్యేది కాదనీ సిద్ధార్థకి మొదటిసారి తెలిసింది.

అతని సెల్‌ఫోన్‌ మోగింది.
‘‘చెప్పు’’ భార్యని అడిగాడు.
‘‘తెలిసిందండీ’’ అవతల నుంచి వనజ కంఠం ఉత్సాహంగా వినిపించింది.
‘‘ఏం తెలిసింది?’’
‘‘ఆవిడ మరణించినవారి వార్తల్ని చదివి బాధపడ్డారని గమనించాను. ఓసారి చూడండి...వాళ్ళల్లో ఎవరో మీరు గుర్తుపడతారు’’ వనజ చెప్పింది.
‘‘చూశాను, కానీ గుర్తుపట్టలేదు.’’
‘‘అయితే ఆవిడ్నే అడుగుతాను. దశదిన కర్మకి పంపుదాం.’’
‘‘వద్దు. ఇక ఇది ఇంతటితో మర్చిపోదాం. ఈ ప్రసక్తి ఆవిడ దగ్గరకానీ, నా దగ్గరకానీ ఇక ఎప్పుడూ తీసుకురాకు’’ సిద్ధార్థ తన భార్యని అర్థించాడు.
‘నిజమైన ప్రేమ కథకి ఆనందకరమైన ముగింపు ఉండదు. నిజమైన ప్రేమకి అసలు ముగింపే ఉండదు’ లైన్‌ కట్‌ చేసి సెల్‌ఫోన్‌ని పక్కన పెడుతూ అనుకున్నాడు సిద్ధార్థ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.