close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం!

ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం!

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. కథల ఎంపికని చూసి క్యారెక్టర్‌ ఎలాంటిదో అంచనా వేయమంటారు సినీ పెద్దలు. శ్రీవిష్ణు కథల ఎంపిక గమనిస్తే తనెలాంటివాడో అర్థం అవుతుంది. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ నుంచి ‘మెంటల్‌ మదిలో’ వరకూ తన ప్రయాణాన్ని నిత్యనూతనంగా ఉండేలా చూసుకుంటున్నాడు. తన కొత్త సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ కూడా విడుదలకు సిద్ధమైంది. ఇంతకీ శ్రీవిష్ణు కథేంటో ఓసారి తననే అడిగి తెలుసుకుంటే...

నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను. దాన్ని పొగరని అనుకుంటారు కానీ అది మొహమాటం. ఏ కథా త్వరగా నచ్చదు. అహంకారం అని పొరబడతారు కానీ ‘చేసేదేదో మంచి సినిమానే చేయాలి’ అనే స్వార్థం. సినిమాల్లో అల్లరి చేసినా, హుషారుగా కనిపించినా... స్వతహాగా నేనో అంతర్ముఖుడిని. నా ప్రపంచం నాదే. అలాంటి నా జీవితంతో విడదీయరానంత అనుబంధం ఏర్పరచుకున్న ఒకే ఒక్క విషయం... సినిమా. దానిపై ప్రేమ ఎప్పుడు పుట్టిందో, ఎలా ఎదిగిందో...తెలుసుకోవాలంటే నా బాల్యంలోకి వెళ్లాల్సిందే.

మాది తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది పాలెం అనే చిన్న పల్లెటూరు. చుట్టూ కొబ్బరి చెట్లూ, కాలువలు. కనిపించేంత దూరంలో గోదావరి. ఇటు సముద్రం. చాలా పచ్చగా కళకళలాడుతూ ఉండేది. నాన్న కృష్ణంరాజు... రొయ్యల చెరువు వ్యాపారి. అమ్మ రేణుక. నాకో అక్కయ్య. ‘ఊళ్లో ఉంటే చదువులేం ఎక్కుతాయిలే’ అని నన్ను ఊటీ పంపేశారు. ఎల్‌కేజీ అక్కడ చదివా. కానీ.. ఆ చలికి తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతింది. దాంతో తిరిగొచ్చేశా. కొన్నాళ్లకు మా కుటుంబం అంతర్వేది పాలెం నుంచి భీమవరం వచ్చేసింది. అక్కడ పదో తరగతి వరకూ చదివా. విజయవాడ నలందలో ఇంటర్‌, వైజాగ్‌ గీతమ్‌లో బీబీఎమ్‌ పూర్తి చేశా. చదువంటే అమితమైన ప్రేమగానీ, నిర్లక్ష్యంగానీ ఉండేవి కావు. ఏదో కాస్త అటూ ఇటుగా పాసైపోయేవాణ్నంతే. ఇంట్లో కూడా ఒత్తిడేం చేయలేదు. చిన్నప్పుడు ‘విష్ణు మంచి బాలుడు’ అన్నట్టు ఉండేవాణ్ని. స్నేహితులు కూడా తక్కువే. ప్రసాద్‌, షానవాజ్‌ నా బాల్య మిత్రులు. నా అల్లరంతా వాళ్ల దగ్గరే.
గోదావరోళ్లందరికీ సినిమాలంటే అభిమానం. నాకు మాత్రం పిచ్చి. మా ఇంట్లో ఎన్టీఆర్‌, బాలయ్యల ఫ్యాన్స్‌ ఎక్కువ.

సినిమాల్ని కొని థియేటర్లో ఆడించేవారు. నేను వెంకటేష్‌ అభిమానిని. మలికిపురంలో నాలుగు థియేటర్లుండేవి. ప్రతి ఆదివారం ఏదో ఓ సినిమాకి వెళ్లి తీరాల్సిందే. కొత్త సినిమాలేం రాకపోతే, చూసినవే మళ్లీ చూసేవాణ్ని. ‘ఆ సినిమాలో డైలాగులు బాగున్నాయి, సెంటిమెంట్‌ బాగుంది’ అని మాట్లాడుకుంటుంటే శ్రద్ధగా వినేవాణ్ని. బాగుండడం అంటే ఏమిటో... అర్థం చేసుకునేవాణ్ని. అయితే అప్పట్లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచనలేదు. క్రమక్రమంగా ఆసక్తి మొదలైంది.
స్కూల్‌, కాలేజీల్లో దాదాపుగా అన్ని ఆటలూ ఆడేవాణ్ని. క్రికెట్‌ అంటే నాకు బాగా ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండేవాణ్ని. స్కూల్లో ‘డ్రమెటిక్‌ క్లబ్‌’ అని ఉండేది. ఎవరికి తోచింది వాళ్లు రాసి, దాన్ని స్టేజీమీద ప్రదర్శించాలన్నమాట. నాకు తోచిన కథలు రాసి, ప్రదర్శించేవాణ్ని. అవి చాలామందికి నవ్వు తెప్పించేవి.నా ప్రదర్శనల గురించి మాట్లాడుకునేవారు. అవన్నీ నాలో ఉత్సాహాన్ని నింపేవి.

ఆ తర్వాత నాకేం అనిపిస్తే అది కథగా రాసేవాణ్ని. ఇంట్లో వినిపించాలంటే భయం. స్నేహితులకు చెబుదామంటే మొహమాటం. అందుకే అవన్నీ నా దగ్గరే దాచుకున్నా.

* * *

హాస్టల్స్‌లో ఉండి చదువుకోవడంవల్ల ఆ వాతావరణం నన్ను చాలా మార్చింది. కొత్త వ్యక్తుల పరిచయంతో కొత్త కొత్త విషయాలు తెలిసేవి. నాపై నాకు క్లారిటీ వచ్చింది. మాది చాలా పెద్ద కుటుంబం. ‘అన్నయ్యా’ అని పిలిచేవాళ్లు తొమ్మిదిమంది ఉన్నారు. వాళ్లకు ఎలాంటి సందేహం వచ్చినా నన్నే అడిగేవారు. ఏమైనా అడిగితే... దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని సమాధానం చెప్పేవాణ్ని. దాంతో నాకూ కొత్తవి తెలుసుకునే అవకాశం వచ్చేది.

డిగ్రీ పూర్తయ్యాక.. హైదరాబాద్‌ వచ్చేశా. ఇక్కడే సినిమాల్లో నన్ను నిరూపించుకోవాలన్న ఆశ. నటన అంటే ఆసక్తి ఉన్నా.. లోలోపల ఏదో భయం, సిగ్గు. ‘కెమెరాని ఫేస్‌ చేయగలనా..?’ అనే అనుమానం ఉండేది. అందుకే దర్శకుణ్ని అవ్వాలనుకున్నా. అదీ వీలు కాకపోతే కథలు రాసి రచయితగా స్థిరపడదామనుకున్నా. ఇవన్నీ వీలు కాకపోతే... ఏదో ఓ ఉద్యోగం చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా గడిపేద్దాం అనుకున్నా.

నాలో సిగ్గూ, మొహమాటం పోవడానికి హిమాయత్‌ నగర్‌లో ‘సూత్రధారి’ అనే ఇనిస్టిట్యూట్‌లో చేరా. అక్కడ ఏమీ నేర్పరు కానీ, మనకేం వచ్చో ప్రదర్శించడానికి కావల్సిన ధైర్యం ఇస్తారు. అక్కడ వారితో కలిసి ఓ హిందీ నాటకం వేశాను. అయితే నాకు హిందీ రాదు. ‘నీకు వచ్చిన హిందీ మాట్లాడు చాలు..’ అన్నారు. నాకొచ్చిన అరకొర హిందీతోనే డైలాగులు చెప్పేవాణ్ని. వినేవాళ్లకు అది వెరైటీగా అనిపించింది. అంతే.. ఆ నాటకం పదిహేను సార్లు వేస్తే.. అన్ని సార్లూ నా పాత్ర పండింది. ‘నేను ఎంటర్‌టైన్‌ చేయగలను’ అనే నమ్మకం తొలిసారి కలిగింది. కానీ సినిమాలకూ, నాటకాలకూ తేడా ఉంది. అది తెలుసుకోవడానికి రెండేళ్లు పట్టింది.

స్నేహితుల ద్వారా షూటింగులు చూడ్డానికి వెళ్లేవాణ్ని. అలా సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. పని ఉన్నా లేకున్నా, సెట్‌కి వెళ్లి వాళ్లేం చేస్తున్నారో గమనించేవాణ్ని. కొన్నిసార్లు హీరో పక్కనో, విలన్‌ గ్యాంగ్‌లోనో నిలబెట్టేవారు. అలా దాదాపు పది సినిమాలు చేశా. శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో చిన్న వేషం వేశా.  నటుడిగా రాణించాలంటే డాన్స్‌ రావాలి కదా? అందుకే ఫిల్మ్‌నగర్‌లోని ఓ డాన్స్‌ స్కూల్‌లో చేరా. అక్కడే నారా రోహిత్‌ పరిచయం అయ్యాడు. తనూ తక్కువగా మాట్లాడతాడు. మెల్లమెల్లగా పరిచయం ఏర్పడింది. ‘సినిమాల్లోకి రావాలనేది నా కోరిక. త్వరలోనే ఓ సినిమా మొదలెడుతున్నాం’ అనేవాడు. ఓరోజు తను చేయబోయే సినిమా కథ కూడా చెప్పాడు. విని ‘బాలేదు..’ అని నిర్మొహమాటంగా చెప్పా. నా నిజాయతీ తనకు బాగా నచ్చింది. దాంతో మరింత దగ్గరైపోయాడు. అప్పుడే హీరోల వారసులు సినిమాల్లోకి రావడం ఎక్కువయింది. ‘వాళ్లంతా కమర్షియల్‌ కథలే ఎంచుకుంటారు. వాళ్లకంటే మనం భిన్నంగా కనిపించాలి. అందుకే కొత్త దారుల్లో వెళ్లాలి’ అని అప్పట్లోనే మాట్లాడుకునేవాళ్లం. నిజానికి తన తొలి సినిమా పూరి జగన్నాథ్‌తో. కానీ ఆలోచనలు మారి... కొత్త పంథాలో వెళ్లాలని ‘బాణం’ కథని ఎంచుకున్నాడు.

* * *

‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’తో తొలిసారి కథానాయకుడిగా కనిపించా. దాంతో నా పేరు కాస్త తెలిసింది. రోహిత్‌ సినిమాలు ‘సోలో’, ‘ప్రతినిధి’లు నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’లాంటి మంచి సినిమాలు నాలో నమ్మకాన్ని కలిగించాయి. చివరికి ‘మెంటల్‌ మదిలో’తో కమర్షియల్‌ విజయమూ దక్కింది. దర్శకుడు కిషోర్‌ తిరుమల నాకు స్నేహితుడు. తను ‘ఉన్నది ఒకటే జిందగీ’లో పాత్ర గురించి చెప్పగానే చేస్తానన్నాను. అందులో నటనకి మంచి పేరు వచ్చింది. మున్ముందూ మంచి పాత్రలు వస్తే నిడివి గురించి ఆలోచించకుండా చేస్తాను. ప్రస్తుతం ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘వీర భోగ వసంతరాయ’ సినిమాలు చేస్తున్నా. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ని స్నేహితులతో కలిసి నిర్మించా. చాలా సంతృప్తి నిచ్చిన సినిమా అది. విమర్శకులు కూడా దాని గురించి గొప్పగా రాశారు. కానీ.. డబ్బులు రాలేదు. అందుకు సిద్ధపడే ఆ సినిమా తీశా. ఇప్పుడు ‘నీదీ నాదీ ఒకే కథ’నీ అంతే ప్రేమగా తీశాం. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా.

నాకు సినిమా కష్టాలేం తెలీవు. ఒకవేళ కష్టంగా ఉన్నా... అదేం పెద్ద సమస్య అనుకోను. ఎందుకంటే, నాకు సినిమాలంటే ఇష్టం. ఏదో పెద్ద స్టార్‌ని అయిపోవాలన్న ఆశ నాకు లేదు. కథలు నచ్చితే సినిమాలు చేసుకుంటూ వెళ్తా. లేదంటే కథలు రాసుకుంటా, డబ్బుంటే సినిమాలు తీస్తా. అస్సలు లేకపోతే.. సినిమాలు చూసుకుంటా. ఇంతకు మించిన లక్ష్యాలేం లేవు.. సినిమాకి మించిన ప్రపంచమూ తెలీదు.

రూమ్మేట్‌కీ చెప్పలేదు... 

మా ఆవిడ పేరు ప్రశాంతి. మాది ప్రేమ వివాహం. తను నా క్లాస్‌మేటే. మా కులాలు వేరు. ఇంట్లో చెబితే మా పెళ్లికి ఒప్పుకోరని, చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. నా రూమ్మేట్‌కి కూడా తెలియనంత రహస్యంగా మా పెళ్లి జరిగింది. 13ఏళ్ల కిందట ప్రేమ పెళ్లంటే మా ఊళ్లో మహా పాపం అన్నట్టు ఉండేది పరిస్థితి. అందుకే మా గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇంట్లో వాళ్ల మనసు కరిగి మళ్లీ ఒక్కటవ్వడానికి చాలా కాలం పట్టింది. మా పాపకు ఇప్పుడు మూడేళ్లు. పేరు మ్రిద, శివుడు అని అర్థం.

72 సార్లు చూశా!

నా పూర్తి పేరు రుద్రరాజు విష్ణువర్థన్‌ రాజు. శివరాత్రి రోజున పుట్టానని.. శివుడి పేరు వచ్చేలా పెట్టారు. 
సినిమాల్లోకి వచ్చాక శ్రీవిష్ణు అని మార్చుకున్నా.
* నటన ఎప్పుడైనా సరే.. సహజంగా ఉండాలి. అలా ఉండాలంటే.. దాని కోసం కసరత్తులేం చేయకూడదు. పాత్రని అర్థం చేసుకుని నటిస్తే చాలు. నా పద్ధతి అదే.
* పుస్తకాలు ఎక్కువగా చదవను. ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడితే మాత్రం శ్రద్ధగా వింటా.
* మాంసాహారం అంటే చాలా ఇష్టం. రొయ్యలు, పీతలు, చేపలు అన్నీ ఇష్టంగా తింటా. వండడమూ తెలుసు.
* సినీ పరిశ్రమలో అత్యంత ఆప్తుడు నారా రోహిత్‌. నా మీద నమ్మకంతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’... కథేంటో అడక్కుండానే నటించడానికి ఒప్పుకున్నాడు.
* ఇప్పటి వరకూ పారితోషికం అందుకున్న సందర్భాలు చాలా తక్కువ. ‘బాణం’ కోసం అశ్వనీదత్‌ చెక్‌ ఇచ్చారు. చిన్న మొత్తమే. 
* నిర్మాత సినిమా కోసం ఎగ్రిమెంట్‌ రాయించుకుని నూట పదహారు రూపాయలు అడ్వాన్స్‌ ఇచ్చారు. 
* సింగీతం శ్రీనివాసరావు నా అభిమాన దర్శకుడు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’...ఆయన తీసిన ప్రతీ చిత్రమూ అద్భుతమే. 
* విజయవాడలోని గంగూరులో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ 72 సార్లు చూశా. నన్ను థియేటర్‌ మేనేజర్‌ 
గమనించి పదిహేను రోజుల తర్వాత ఫ్రీగానే సినిమా చూడనిచ్చారు. అదే థియేటర్‌లో నా ‘మెంటల్‌ మదిలో’ ప్రదర్శించడం సంతోషం కలిగించింది.
* హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో ఓ పెద్ద హీరోని కలిసి కథ చెప్పా. ‘చాలా బాగుంది.. మనం చేద్దాం’ అన్నారు. నేను మాత్రం ‘ఈ కథ చెప్పింది మీతో సినిమా చేయడానికి కాదు, కథ బాగా చెబుతున్నానా లేదా అని నన్ను నేను చెక్‌ చేసుకోవడానికి’ అన్నాను. ఎప్పటికైనా ఆ కథని తనతోనే తీస్తా.

- అన్వర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.