close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కునుకు మంచిదే..!

కునుకు మంచిదే..!

పగటి నిద్ర పనికి చేటు... అంటుంటారు. కానీ నిజానికి పగలు కాసేపు కునుకు తీసేవారు పనుల్ని సమర్థంగా పూర్తి చెయ్యగలరట. వారి మెదడే చురుకుగా ఉంటుందట మరి. అంతేకాదు, మధ్యాహ్నం కొన్ని నిమిషాలపాటు పడుకున్నా ఆరోగ్యరీత్యా ఎన్నో లాభాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.  అవేంటో చూడండి...
 

గటిపూట రోజుకో గంట పడుకుంటే ఆ తరవాత పదిగంటలు అలసిపోకుండా పనిచేసుకోగల శక్తి వస్తుందట. దీన్నే ‘ద స్లో వేవ్‌ స్లీప్‌ నాప్‌’ అని కూడా అంటారు. అంత సమయం కుదరనివాళ్లు కనీసం అయిదు నిమిషాలు నిద్రలోకి
జారుకున్నా మేలేనట. ఇలా పడుకునే సమయాన్ని బట్టి ఎంతసేపు కునుకుతీస్తే ఏయే ఉపయోగాలుంటాయో కూడా చెబుతున్నారు నిపుణులు.

మైక్రో నాప్‌... 2-5 నిమిషాలు
ఆరోగ్యంగా ఉండి వయసులో ఉన్నవాళ్లు మధ్యాహ్నం రెండు నిమిషాలు కునుకు తీసినా శరీరం రీఛార్జ్‌ అయిపోతుంది. ఇక, అయిదు నిమిషాలు కునుకు తీస్తే, రాత్రుళ్లు సరైన నిద్రలేకపోయినా ఆ ప్రభావం
మెదడుమీద పడకుండా అడ్డుకుంటుంది.

మినీ నాప్‌... 5-20 నిమిషాలు
ఈ నాప్‌వల్ల మెదడు ఉత్సాహంగా పనిచేయడంతోపాటు, శరీరానికి కొత్త శక్తి వచ్చినట్లవుతుంది. అంతేకాదు, కొత్త విద్యలను నేర్చుకోవడానికి కావల్సిన నైపుణ్యం కూడా పెరుగుతుంది.

ఒరిజినల్‌ పవర్‌ నాప్‌... 20 నిమిషాలు
దీనివల్ల మైక్రో, మినీ నాప్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు కలగడంతోపాటు, వివిధ రకాల పనుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ఉపయోగపడే జ్ఞాపకశక్తీ సృజనాత్మకతా వృద్ధి చెందుతాయట. అనవసరమైన విషయాల మీద ధ్యాస తగ్గి, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వ్యక్తుల పేర్లూ, ముఖ్యమైన పనులూ తేదీల గురించిన సమాచారం గుర్తుండేందుకు ఈ కునుకు బాగా పనికొస్తుంది. ముఖ్యమైన మీటింగుల ముందు ఈ నాప్‌ తీసుకుంటే మంచిది.

ద నాసా నాప్‌... 26 నిమిషాలు:
నాసా శాస్త్రవేత్తలు మిలటరీ పైలట్ల మీద చేసిన పరిశోధనలో తేలిందేంటంటే పగటిపూట 26 నిమిషాలు పడుకుంటే తరవాత వారి పని సామర్థ్యం 34%, ఏకాగ్రత 54% పెరిగిందట. పని ఎక్కువ ఉన్నపుడు విశ్రాంతి లేకుండా చేసేకన్నా ఓ నాసానాప్‌ తీస్తే ఇంకా బాగా చెయ్యొచ్చన్నమాట.

లేజీ మ్యాన్‌ నాప్‌... 50-90 నిమిషాలు:
షార్ట్‌టర్మ్‌ మెమరీని పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బాగా చికాకుగా ఉండి ఏ విషయం మీదా దృష్టి పెట్టలేనపుడు ఓ గంట పడుకుని లేస్తే ఏకాగ్రత కుదురుతుందట. ఆలోచననూ నిర్ణయాత్మక శక్తినీ పెంచి అంచనాలు వేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఎముకలూ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంద్రియాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.


 

నిద్ర పోటీ

గ్రీకు పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం తేల్చిందేంటంటే... వారానికి మూడుసార్లు కనీసం అరగంట పాటు పగలు కునుకు తీసేవాళ్లలో గుండెసంబంధిత వ్యాధుల వల్ల వచ్చే ఆకస్మిక మరణాల ముప్పు 37శాతం తగ్గుతుందట. ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధులకు గల కారణాల్లో సరైన నిద్రలేకపోవడం కూడా ఒకటి. వాటిని నిరోధించడానికి సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చెయ్యడం ఎంత ముఖ్యమో మధ్యమధ్యలో కునుకు కూడా అంతే ముఖ్యం అనేది మరో పరిశోధన.

గటిపూట కునుకు వల్ల శారీరక శక్తి 11% పెరగడంతో పాటు రాత్రిపూట 12% మెరుగ్గా నిద్రపడుతుందట. అంతేకాదు, మామూలుకన్నా నిద్రలోకి జారుకునే సమయం 14% తగ్గుతుందట.
మ్మో మంచి పనిలో ఉన్నపుడు కునుకు తియ్యడం మొదలుపెడితే మనకు తెలియకుండా ఎక్కువసేపు నిద్రపోతే ఎలా... అనుకునేవారూ ఉంటారు. అందుకే, ఐన్‌స్టీన్‌ ఏదైనా విషయం మీద మరింత స్పష్టత రావాలనుకున్నపుడు చేతిలో పెన్సిల్‌ పట్టుకుని కళ్లుమూసుకునేవాడట. కాస్త గాఢ నిద్రలోకి జారుకోగానే ఆ పెన్సిల్‌ చెయ్యిజారేది. ఆ శబ్దానికి లేచేవాడట.
ఈ ఐడియా ఏదో బాగుంది కదూ..?

గలు మాకసలు నిద్ర రాదు, మరెలా కునుకు తియ్యాలనేవాళ్లూ ఉంటారు. అలాంటివాళ్లు కళ్లుమూసుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నా రక్తపోటు అదుపులోకి వస్తుందట.
చైనా, తైవాన్‌లలో దాదాపు అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల్ని మధ్యాహ్నం అరగంటసేపు పడుకోనివ్వాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. అమెరికా, ఐరోపా దేశాల్లోనూ పవర్‌నాప్‌ పేరుతో భోజనం తర్వాత కాసేపు పడుకుంటారు.

స్పెయిన్‌లో పగటిపూట కునుకు తియ్యడాన్ని ప్రోత్సహించేందుకు 2010 సంవత్సరం నుంచి ‘నేషనల్‌ సియెస్తా ఛాంపియన్‌షిప్‌’ను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారికి పల్స్‌మీటర్‌ని అమర్చుతారు. ఇది ఎవరు నిజంగా నిద్రపోతున్నారో తెలియజేస్తుంది. 20నిమిషాల సమయంలో ఎవరు ఎక్కువసేపు గాఢంగా నిద్రపోతే వాళ్లే ఈ పోటీల్లో విజేతలు.
బాగా అలసిపోయినపుడు కొందరు ఓ కప్పు, కాఫీ లేదా టీ తాగుతారు. అందులో ఉండే కెఫీన్‌ మెదడుని ఉత్సాహపరుస్తుందని. కానీ దానికన్నా కునుకు తీయడంవల్లే ఎక్కువ లాభం కలుగుతుందంటున్నారు నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.