close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దివ్యాంగులకు ఇక్కడ అన్నీ ఉచితం!

దివ్యాంగులకు ఇక్కడ అన్నీ ఉచితం!

కాళ్లూ చేతులూ లేకపోవడమే ఎంతో పెద్ద కష్టం. దానికితోడు పేదరికం వేధిస్తుంటే, తల్లిదండ్రులు దూరమైతే... అది ఇంకెంత పెద్ద కష్టమో చెప్పనక్కర్లేదు. అలాంటివారిని అక్కున చేర్చుకుని ఉచితంగా వసతి సౌకర్యాలు
కల్పిస్తూ చదివించి ఉద్యోగాలు సంపాదించుకునేంత వరకూ సాయపడుతోంది ఆ సంస్థ. శస్త్రచికిత్సలు సైతం చేయించి ఎంతోమందికి కొత్త జీవితాన్నిస్తోంది. అదే వేగేశ్నఫౌండేషన్‌.

పోలియోతో నడవలేని పరిస్థితుల్లో ఉన్న నాగరాజు పేదరికంతో చిన్న వయసులోనే కొచ్చిన్‌ ఎక్స్‌ప్రెస్‌లో భిక్షాటన చేసుకుంటూ బతికేవాడు. ఆ రైల్లో శబరిమల నుంచి వస్తూ అతడిని చూసిన వంశీరామరాజు తల్లడిల్లిపోయాడు. ‘నాతో వచ్చేయ్‌, నీ బాగోగులన్నీ చూసుకుంటా, చదివిస్తా...’ అని హైదరాబాద్‌కి తీసుకొచ్చి వేగేశ్న ఫౌండేషన్‌లో చేర్పించారు. ఆ సంస్థ ఆయన స్థాపించిందే. నాగరాజుకి శస్త్రచికిత్స చేయించినా ఫలితం ఉండదని తెలిసి ఫిజియోథెరపీ చేయించడంతోపాటు క్యాలిబర్ల సాయంతో నడిచేలా శిక్షణ ఇచ్చారు. వేగేశ్నలోకొచ్చాక ఓనమాలు నేర్చుకున్న అతడు హిందీ పండిట్‌ కూడా పూర్తిచేశాడు. ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటూ భార్యా పిల్లలతో హాయిగా ఉంటున్నాడు. 1988లో ప్రారంభమైన వేగేశ్న  సంస్థ ఇలా దాదాపు రెండువేలమంది దివ్యాంగులకు కొత్త జీవితాన్నిచ్చింది.

ఇలా మొదలైంది
‘వైకల్యం... అంటేనే పెద్ద కష్టం. దానికి పేదరికం కూడా తోడైతే ఎంత బాధో చెప్పనక్కర్లేదు. అందుకే, పేద వికలాంగులకు అండగా ఉండేందుకు ఓ సంస్థను స్థాపించాలనుకున్నారు రామరాజు. విరాళాల కోసం ప్రవాస భారతీయుల్ని సంప్రదించగా న్యూయార్క్‌లో ఉంటున్న వేగేశ్న వెంకటరాజు యాభైవేల డాలర్లు(సుమారు రూ.32.4లక్షలు) విరాళంగా ఇచ్చి వేగేశ్న పేరుతో ఆశ్రమాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరారు. అలా మొదట సరూర్‌నగర్‌లోని అద్దె ఇంట్లో ప్రారంభమైన వేగేశ్న ఫౌండేషన్‌(ఫోన్‌ నంబరు 9849023852) తర్వాత హయత్‌నగర్‌ మండలం కుంట్లూర్‌లో రెండెకరాల స్థలంలో భవనాల్ని నిర్మించుకుని అక్కడికి మారింది. తల్లిదండ్రులు లేని, పేద కుటుంబం నుంచి వచ్చిన దివ్యాంగులెవర్నైనా అయిదేళ్ల వయసునుంచీ ఇక్కడ చేర్పించొచ్చు. వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ పదోతరగతి వరకూ తమ పాఠశాలలోనే చదివిస్తుందీ సంస్థ.

అయిదొందలకు పైనే
ప్రస్తుతం ఈ పాఠశాలలో 500 మంది వరకూ విద్యార్థులున్నారు. వీరిలో మూడొందలమందికి పైగా విద్యార్థులు వేగేశ్న వసతి గృహాల్లోనే ఉంటారు. కాస్త నడవగలిగి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పిల్లలు పాఠశాల బస్సుల్లో వస్తారు. పదోతరగతి పూర్తయ్యాక విద్యార్థుల ఆసక్తిని బట్టి కళాశాలల్లో చేర్పించి పైచదువులు చదివిస్తోంది వేగేశ్న. అమ్మాయిలకు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోనే ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులు కూడా ఉన్నాయి. ఇలా... ఇక్కడ చదువుకున్న ఎంతోమంది దివ్యాంగులు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

వేగేశ్నలో విద్యార్థుల్ని వైద్య సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తుంటారు. శస్త్రచికిత్సతో వైకల్యం నయమవుతుందనుకున్నవారికి దాతల సహకారంతో ఆపరేషన్లు సైతం చేయిస్తుంటారు. ఇప్పటివరకూ వెయ్యిమందికి పైగా దివ్యాంగులకు చికిత్స చేయించి నడవగలిగేలా చేశారు. రోజూ ఫిజియోథెరపీ చేయించడం వల్ల కొంతమంది విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడింది. ‘నేను నాలుగో తరగతిలో ఉన్నపుడు వేగేశ్నలో చేర్పించారు. అక్కడ నాకు ఫిజియోథెరపీ చేయించి నడవగలిగేలా చేశారు. ఆ సంస్థవల్లే డిగ్రీ పూర్తిచేశా. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తున్నా’ అంటుంది నల్గొండకు చెందిన వి.కళ్యాణి. వంశీ రామరాజు ప్రభుత్వోద్యోగాన్ని సైతం వదిలి గత ముప్ఫై ఏళ్లుగా ఈ సంస్థను నడిపిస్తున్నారు. వివిధ దేశాల్లో ఘంటసాల ఆరాధనోత్సవాలూ బాలూ సంగీతోత్సవాలనూ నిర్వహించడంద్వారా వేగేశ్నకు నిధులను సమకూరుస్తారాయన. ‘దివంగత డా. సి.నారాయణ రెడ్డి ఇచ్చిన నిధులతో సంస్థకు తొలి సొంత భవనాన్ని నిర్మించాం. ఎంతోమంది దాతలు ఇచ్చే విరాళాలతోనే ఇది నడుస్తోంది’ అంటారు రామరాజు. ఆయనతోపాటు ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బాల త్రిపురసుందరి, సుంకరవల్లి శైలజ కూడా వేగేశ్న చేసే సేవలో తమవంతుగా పాలు పంచుకుంటున్నారు. వేలమంది దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన వేగేశ్నకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

- తేరాల రంజిత్‌కుమార్‌, ఈనాడు, హైదరాబాద్‌
ఫొటోలు: భాస్కర్‌, న్యూస్‌టుడే, హయత్‌నగర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.