close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆత్మీయ కౌగిలి!

ఆత్మీయ కౌగిలి!

ఏడుస్తున్న పాపాయిని గుండెల్లో పొదువుకున్న అమ్మ కౌగిలింతకి మించిన లాలన లేదు. ర్యాగింగ్‌ భయంతో వణుకుతున్న అమ్మాయిని భుజం తట్టి గుండెల్లో దాచుకున్న తండ్రి కౌగిలింతకి మించిన భరోసా లేదు. ఆటల్లో గెలిచిన మనవడిని దగ్గరకు తీసుకున్న తాత కౌగిలింతకి మించిన ప్రశంస లేదు. ప్రమాదంలో గాయపడ్డ స్నేహితుడిని ఆర్తిగా చుట్టేసిన మిత్రుడి కౌగిలింతకి మించిన ఓదార్పు లేదు. తనకు వంశాకురాన్ని అందించిన అర్ధాంగిని నిలువెల్లా హత్తుకున్న భర్త కౌగిలింతకు మించిన ప్రేమ లేదు. అవును... కౌగిలింత అంటే ఒక లాలన, భరోసా, ప్రశంస, ప్రేమ. కౌగిలించుకోవడమంటే ‘నువ్వు నాకు ఎంతో ముఖ్యం, చాలా ఇష్టం’ అని మౌనంగా చెప్పడం. (ఈరోజు కౌగిలింతల దినోత్సవం)

గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపని అమ్మ గుండెలకు హత్తుకోగానే, ఠక్కున ఏడుపు ఆపేస్తుంది. కేరింతలు కొడుతూ చిరునవ్వులు ఒలికిస్తుంది. ఆ ఆలింగనంలో పాపాయికి అమ్మ గుండె లోతుల్లోని మాతృత్వపు మమకారం అనుభవమవుతుంది. ఒక నిశ్చింత, భరోసా, ఆనందం అమ్మ కౌగిలిలో అందుతుంది. అందుకే తల్లి కౌగిలి ఓ మహత్తరమైన ఔషధం. దాన్ని మించిన మందు మరెక్కడా దొరకదు. తండ్రి ఆలింగనం కూడా ఇందుకు ఎంతమాత్రం తీసిపోదు.

కౌగిలి... అనుబంధాల లోగిలి..!
తాతయ్యలూ, అమ్మమ్మల ఆలింగనంలోని మమకారపు తడీ అలాంటిదే. ఆ అనుభూతి మల్లెపువ్వులా మంచిగంధంలా గుబాళిస్తూ వాళ్ల మనసులో కలకాలం నిలిచి ఉంటుంది. సెలవులివ్వగానే తాతా అంటూ పరుగున వచ్చి హత్తుకునే మనవడి ఆలింగనం, ఆ తాతకీ అంతే ఆనందాన్ని కలిగిస్తుంది. జీవించాలనే ఆసక్తిని పెంచుతుంది. అత్తలూ పిన్నమ్మలూ బాబాయిలూ మావయ్యలూ... ఇలా ఆత్మీయ బంధువుల పలకరింపులన్నీ అనుబంధాల కౌగిలింతలే... మమతల కోవెలలే.

కొన్ని సందర్భాల్లో కౌగిలి కొండంత అండ. ఆప్తుల్ని కోల్పోయి ఆపుకోలేని దుఃఖంతో ఉన్న స్నేహితురాలిని చేతులతో చుట్టేసి దగ్గరకు తీసుకుంటే కలిగే ఉపశమనమే వేరు. ఆ మౌన ఆలింగనంలో ఎంతో సాంత్వన లభిస్తుంది. ఎక్కడా దొరకని ఓదార్పు దొరుకుతుంది. అలాగే పరీక్ష తప్పి బాధపడుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడో  సోదరులో దగ్గరకు తీసుకున్నప్పుడు కలిగే ఊరట, లక్ష మాటలు చెప్పినా దొరకదు. ఆనందాన్ని వ్యక్తం చేయగలిగేదీ ఆలింగనం ద్వారానే. ఆటల్లో గెలిచినప్పుడు క్రీడాకారులు ఒకరినొకరు హత్తుకుంటూ కేరింతలు కొట్టే సన్నివేశాలన్నీ ఈ రకమైనవే.

గిలిగింతల కౌగిలి!
ప్రేమికుల కౌగిలిలోని గిలిని వర్ణించడం శృంగార కవులకూ కాస్త కష్టమే మరి... అందులోని గమ్మత్తే వేరు. గసగసాలు పోసినా జారనంత గాఢ పరిష్వంగం అనే అర్థం వచ్చేలా ‘గసగసాల కౌగిలింత... గుసగుసల్లే మారుతావు...’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు వేటూరి. దీన్నే గాలి చొరబడని కౌగిలి... అనీ చెప్పొచ్చేమో. ఇది కొత్త జంటలకీ వర్తిస్తుంది. వయసుపైబడేకొద్దీ బాధ్యతల బరువుతో ఆ కౌగిలిలోని బిగువు కాస్త సడలినప్పటికీ ‘కౌగిలి మన ఇల్లయితే... ముద్దే మన పొద్దయితే... ఆనందానికి హద్దేముంది...’ అంటూ ఆనంద పారవశ్యంలో మునిగితేలుతుంటారు భార్యాభర్తలు.

అంటే ఆత్మీయత, ఆప్యాయత, ఆనందం, అభినందన, ఇష్టం, ప్రేమ... బంధం ఏదయినా భావోద్వేగం ఇంకేదయినా ‘నువ్వు నాకు ముఖ్యం’ అని చెప్పడమే కౌగిలిలోని అంతరార్థం. అది ఓ అద్భుతమైన ఔషధం.

కౌగిలింత... మహత్తరమైన మాత్ర..!
ఆ విషయాన్ని గుర్తించే కాబోలు, ‘మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చేమో కానీ ‘అబ్రకదబ్ర ఛూ మంత్రకాళి...’ అంటూ శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ మాదిరిగా ఎవరైనా గుండెలకు హత్తుకుంటే మాత్రం భారమంతా తీరి మనసు కుదుటపడుతుంది, ఒత్తిడి చేత్తో తీసేసినట్లుగా మాయమైపోతుంది,

మనసుకు హాయిగా అనిపిస్తుంది, ఆరోగ్యం మెరుగవుతుంది’ అంటోంది మానసిక వైద్యశాస్త్రం కూడా.

అందుకోసం పొద్దున్నే ఓ నాలుగు, మధ్యాహ్నం మరో నాలుగు, సాయంత్రం ఇంకో నాలుగు... ఇలా మొత్తం రోజుకి పన్నెండుసార్లు శరీరానికి కౌగిలింతల మాత్రలు పడితే జీవితం ప్రశాంతంగా హంసనావలా సాగిపోతుందట. నాలుగింటితో ధీమాగానూ ఎనిమిదింటితో భరోసాగానూ పన్నెండింటితో కులాసాగా జీవించొచ్చు అంటూ ఓ లెక్క చెప్పేసింది ప్రముఖ సామాజిక నిపుణురాలైన వర్జీనియా శాటిర్‌.

కౌగిలింతల దినోత్సవం
ఈ లెక్క సంగతెలా ఉన్నా దీనికి ఆద్యుడు మాత్రం అమెరికాలోని కారో ప్రాంతానికి చెందిన కెవిన్‌ జాబోర్నీ. సనాతన సంప్రదాయాలూ ఆచారాలూ కట్టుబాట్లూ భారతీయులకే పరిమితం. పాశ్చాత్యులంతా స్వేచ్ఛాజీవులు. పబ్లిగ్గానే ముద్దులు పెట్టేసుకుంటారు అని ముఖం చిట్లిస్తాం. కానీ కెవిన్‌ అలా అనుకోలేదు. వృత్తిరీత్యా మానసిక వైద్యుడు అయిన ఆయన, ‘అమెరికన్లు పబ్లిగ్గా తమ భావోద్వేగాలను ప్రదర్శించలేరు. వారికి సామాజిక బంధాలు తక్కువ. అందుకే మానసిక వ్యాధులెక్కువ’ అని భావించాడు. దానికి మందు కౌగిలే అని గుర్తించి, దానికోసం ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించి, 1986లో జనవరి 21ని హగ్గింగ్‌ డేగా రిజిస్టర్‌ చేయించాడు. ఇష్టమైన వాళ్ల స్పర్శవల్ల భావోద్వేగ తీవ్రతలు తగ్గి, ప్రశాంత స్థితికొస్తారనే కౌగిలి సిద్ధాంతాన్నీ ప్రతిపాదించాడు. అది కాస్తా ఆనోటా ఈనోటా పాకి, ఖండాలూ సముద్రాలూ దాటి, ‘ప్రపంచ కౌగిలింతల దినోత్సవం’గా సంబరాలు చేసుకునేలా చేసింది.

నాటి నుంచీ కౌగిలింత, ప్రపంచవ్యాప్తంగా ఓ సామాజిక పలకరింతలా మారింది.
అప్పటివరకూ అమ్మ ప్రేమకో, ఆత్మీయుల అనురాగానికో పరిమితమైన ఆలింగనం, అపరిచితుల్నీ అక్కున చేర్చుకునేలా చేసింది. స్నేహితుల బంధాన్ని మరింత పటిష్ఠం చేసింది.  క్రీడాకారుల్లో ఆనందాన్ని పెంచింది. ఇలా అన్ని రకాల భావోద్వేగాలనూ చక్కగా వ్యక్తం చేయగల చూడచక్కని పులకింతలా మారింది. పాశ్చాత్య దేశాల్లో పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గేందుకు కొందరు వ్యక్తులు గది బయట నిలబడి విద్యార్థుల్ని కౌగిలించుకునే ఏర్పాట్లూ చేస్తున్నట్లు భోగట్టా. కొన్ని ఆసుపత్రుల్లో వ్యాధి త్వరగా తగ్గేందుకు ఒంటరితనంతో బాధపడే రోగులకీ కౌగిళ్లు కొలిచి మరీ రోజుకిన్ని చొప్పున ఇస్తున్నారట. అయితే ఇవన్నీ కృత్రిమ కౌగిళ్లు. వీటిని పక్కనబెడితే సామాజిక సంబంధాల్లో భాగంగా ఇచ్చిపుచ్చుకునే ఆలింగనాలు మనకీ అనుభవేకవైద్యమే. ఇవి సమయం, సందర్భాన్ని బట్టి మారిపోతుంటాయి. అలాగని అన్ని రకాల కౌగిళ్లూ మహత్తరమైనవనే చెప్పలేం. కొన్ని కౌగిళ్లలో మరీ అంత ప్రయోజనం లేకున్నా ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌లా కాసేపయినా ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. అప్పుడప్పుడూ అవి మంచి సంబంధాలు నెలకొనేందుకూ దారితీయవచ్చు. రాజకీయ, సామాజిక కౌగిళ్లన్నీ ఈ కోవకే చెందుతాయి.

కౌగిళ్ల రాజకీయం!
వేమన ఉండి ఉంటే ‘కౌగిళ్లలో రాజకీయనాయకుల కౌగిళ్లు వేరయా...’ అని కచ్చితంగా ఓ పద్యం చెప్పి ఉండేవాడేమో. అవి అవసరార్థ పొత్తులప్పుడు ఒకలాగా, అక్కర తీరి ఒడ్డున పడ్డాక మరోలా ఉంటాయన్నమాట. అంతేనా... పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం వాళ్ల మధ్య ఉన్నా చిరునవ్వులు రువ్వుతూ ఆలింగనం చేసుకోవడం కూడా పొలిటీషియన్లకే సాధ్యం. శాసనసభ, లోక్‌సభ సమావేశాలు మొదలైనప్పుడు ఈ రకమైన ఆలింగనాలు సర్వసాధారణం. ఇవే కాదు, విదేశీ ప్రముఖులు మనదేశానికి వచ్చినా మన నాయకులు అక్కడికి వెళ్లినా గాఢంగా కౌగిలించుకోవడమూ చూస్తుంటాం. అది ఓ సంప్రదాయం మాత్రమే. దేశం దాటగానే ఎవరి పల్లవి వాళ్లదే అయినా ఆ ఫీల్‌ కొన్నాళ్లయినా పనిచేస్తుందని చెప్పవచ్చు.

వీటికితోడు కొన్ని ప్రాంతాల్లో దసరా సమయంలో జమ్మి ఆకుని ఇచ్చి పుచ్చుకునే అలైబలై... వంటి ప్రత్యేక కౌగిలింతల కార్యక్రమాలూ జరుగుతుంటాయి. తలనీ భుజాలనీ అటూ ఇటూ మారుస్తూ చేసుకునే ఆలింగనాలన్నమాట. తెలంగాణకు చెందిన కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఏటా ఈ ప్రత్యేక ఆలింగనాల వేదికను ఏర్పాటుచేసి రాజకీయ నాయకులందరినీ ఆహ్వానించడం అందరికీ తెలిసిందే. ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా సఖ్యతతో కలిసి పనిచేయాలన్న సదుద్దేశంతోనే ఈ వేడుకను ఏర్పాటు చేస్తుండొచ్చు. లేదూ ఆలింగనంలోని మహత్తుని అర్థం చేసుకుని బంధాలని పెంపొందించుకునే ప్రయత్నమూ కావచ్చు. ఈ ఆలింగనాన్ని మనసుకి తాకనీయకుండా మన నాయకులు చొక్కాలకే పరిమితం చేసి కాసేపటికే దులిపేసుకుంటారన్నది వేరే విషయం.

నాటకీయ కౌగిళ్లు!
టీవీ సినీ వేడుకలూ అవార్డు ఫంక్షన్లూ ఫ్యాషన్‌ ర్యాంప్‌లూ ఈ రకమైన కౌగిలింతలకు వేదికలు. ఇటీవల సెలెబ్రిటీలూ వ్యాపారవేత్తలూ భారీయెత్తున చేస్తోన్న పెళ్లి, రిసెప్షన్లలలో కూడా ఒకరినొకరు భుజాలమీదుగా ఆలింగనం చేసుకోవడం పెరిగింది.ఇవే సోషల్‌ హగ్‌లు.  వీటిని ఫక్తు నాటకీయ కౌగిళ్లుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆ క్షణానికి తెచ్చిపెట్టుకున్న ఆనందం తప్ప, మరెలాంటి భావావేశానికీ వీటిల్లో పెద్దగా చోటు ఉండదనే చెప్పాలి. ఇక సినీ, టీవీ నటుల కౌగిళ్ల బంధాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కాకపోతే అది నటన.

ధృతరాష్ట్ర కౌగిలి!
కౌగిళ్ళనేవి ఎలా ఉన్నా వాటివల్ల అంతో ఇంతో మంచే జరుగుతుంది. కానీ హానికరమైన ఆలింగనాలూ ఉంటాయి. ఆ స్పర్శ మనకు సులభంగానే అర్థమైపోతుంటుంది. అందుకే ఇష్టంలేనివాళ్లు కావలించుకుంటే కొండచిలువ చుట్టుకున్నట్లూ తేళ్లూ జెర్రులూ పాకినట్టూ ఉంటుంది అంటుంటారు.

ఈ రకమైన కౌగిళ్లకు నిలువెత్తు నిదర్శనమే ధృతరాష్ట్ర కౌగిలి. తన కొడుకులంతా చనిపోవడానికి కారణం భీముడే అన్న కసితో పైకి ప్రేమ నటిస్తూ భీముణ్ణి తన కౌగిట్లో బందీని చేసి పిండి పిండి చేసేయాలనుకుంటాడు ధృతరాష్ట్రుడు. ఆ పాచికను తెలుసుకున్న లీలా కృష్ణుడు భీముడికి బదులు అతడి ఇనుప విగ్రహాన్ని ఉంచగా, ఆ కౌగిలి బలానికి అది కాస్తా ముక్కలైపోయిందట. భీముడిని హతమార్చినందుకు ముందు సంతోషపడ్డా ‘అయ్యో తప్పు చేశానే’ అని విలపించాడట. అప్పుడు కృష్ణుడు ‘భీముడు మరణించలేదు, నీ కుయుక్తిని గ్రహించి రక్షించాను’ అని హితబోధ చేయడం తరవాతి కథ. కానీ ఆ బాహువుల్లో భీముడు ఉండి ఉంటే ఏమయ్యేవాడో. అంటే కౌగిలి ఎంత మధురమైనదో కొన్నిసార్లు అంత అపాయకరమైనది కూడా. చిప్‌కో ఉద్యమకారులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను కౌగిలించుకోవడం మరో కొత్తకోణం.

ఆలింగనాలు ఎన్ని రకాలో
కౌగిళ్లలో రకాలున్నట్లే, కౌగిలించుకునే తీరుని బట్టీ రకరకాలుగా వర్ణించి చెప్పవచ్చు. ఉదాహరణకు చెంపకు చెంప ఆనిస్తూ తలవరకూ కౌగిలించుకుంటే ఎ-ఫ్రేమ్‌ హగ్‌ అంటారు. సోషలైట్లలో ఈ తరహా హగ్‌లు ఎక్కువ. ఒకరి తల వెనక్కి మరొకరి తల వెళ్లి, భుజాలూ ఛాతీ వరకూ ఒకరినొకరు హత్తుకుంటే దాన్ని హాఫ్‌ హగ్‌ అంటారు. బంధువులూ ఆత్మీయులూ కలిసినప్పుడు ఇలాంటివి తారసపడుతుంటాయి. పక్కనుంచే కౌగలించుకునే బడ్డీ హగ్‌ చిన్ననాటి స్నేహితుల్లో ఎక్కువ. ఇది వాళ్ల మధ్య పెద్దయ్యాకా కొనసాగుతుంది. స్కూలూ కాలేజీ వదిలి వెళ్లే సందర్భాల్లోనూ కనిపిస్తుంది. సుదీర్ఘ విరామం తరవాత కలుసుకోవడానికి వచ్చిన స్నేహితులు ఫ్లయిట్‌ దిగగానే పైకెత్తి గిరగిరా తిప్పేయడాన్ని జాక్‌ ట్విర్ల్‌ హగ్‌ అంటారు.

ప్రేమికుల్ని నిశితంగా గమనిస్తే ఎక్కువశాతం ఒకరి భుజం మీద మరొకరు తల ఆనించుకునే ఉంటారు. దీని పేరే స్లీపీ షోల్డర్‌ హగ్‌. ఒకరిలో ఒకరు ఒదిగినట్లుండే హార్ట్‌ సెంటర్డ్‌ హగ్‌ మాత్రం కచ్చితంగా దంపతులకు మాత్రమే సొంతం. పొడుగ్గా లావుగా ఉన్న వ్యక్తి తనకన్నా పొట్టిగా సన్నగా ఉన్న వ్యక్తిని ఆలింగనం చేసుకుంటే బేర్‌ హగ్‌ అంటారట. మన తెలుగు సినిమాల్లో పెద్దాయన తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో మనవరాలినో భార్యనో ఒంటిచేత్తో దగ్గరకు తీసుకునే సీన్లు చాలానే ఉంటుంటాయి. దీన్నే వన్‌ హ్యాండెడ్‌ హగ్‌ అంటారు.

ఒకరి శరీరం ఒకరికి తగలకుండా చేతులను భుజాల వెనకగా పెట్టే పొలైట్‌ లేదా ఫార్మల్‌ హగ్‌ ఆఫీసుల్లోనూ, అంతదూరం నుంచే చేతులు చాచుకుంటూ అత్యుత్సాహంతో కౌగిలించుకునే హిప్‌ హగ్‌ చాలాకాలం తరవాత కలుసుకున్న ఆప్తుల్లోనూ, అటొకరూ ఇటొకరూ మధ్యలో మరొకరూ ఉండే శాండ్‌విచ్‌ హగ్‌ కుటుంబసభ్యులూ మిత్రుల్లోనూ కనిపిస్తాయి.

పర్వదినాల్లో ముస్లిం సోదరులు చెప్పుకునే ముబారక్‌ హగ్‌లూ; ఆటల్లో జట్టు సభ్యులంతా కౌగిలించుకునే గ్రూప్‌ హగ్‌లూ, క్రష్‌, జెల్లీ హగ్‌లూ.. ఇలా చాలానే ఉన్నాయి.

అసలెందుకీ హగ్‌లన్నీ..?
నవ్వు ఒక ఔషధం అయితే, కౌగిలి పరమౌషధం. అనేక వ్యాధుల నివారణకు బిగి కౌగిలింత అద్భుతమైన చికిత్స అని అనేక పరిశోధనల్లో తేలింది. దాంతో పాశ్చాత్యదేశాల్లో ఫిజియోథెరపీలానే హగ్‌థెరపీ మొదలైంది. కౌగిలివల్ల స్త్రీపురుషులిద్దరిలో ఆక్సీటోసిన్‌ శాతం పెరిగి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ హార్మోన్‌ శాతం తగ్గుతుంది.

ఈ ఆక్సీటోసిన్‌ బంధాన్ని పటిష్టం చేసేందుకు తోడ్పడుతుంది. దాంతో అపరిచితులైనా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంవల్ల కొండంత అండ దొరికినట్లు ఉంటుంది.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సుపరిచితులయితే ఒకరిపట్ల మరొకరికి నమ్మకం కలుగుతుందన్న కౌగిలింతల సిద్ధాంతం పుట్టుకొచ్చింది. దీన్ని లోతుగా పరిశీలించి చూస్తే...

పుట్టిన పాపాయిల్ని కుటుంబసభ్యులంతా ఎత్తుకుని హత్తుకునే ఆ స్పర్శలోని వెచ్చదనం పెద్దయ్యేవరకూ మనసు పొరల్లో దాగే ఉంటుంది. అమ్మ స్పర్శతోబాటు ఆత్మీయులదీ ఆ చిన్నారికి గుర్తే. అందుకే పసివయసులో ప్రేమ పరిష్వంగానికి నోచుకోని పిల్లల్లో ఐక్యూ కాస్త మందగిస్తుందనీ; ఫలితంగా నడవడం, మాట్లాడటం, చదవడం... అన్నీ ఆలస్యమవుతాయనీ భిన్న అధ్యయనాల సారాంశం.

కౌగిలింతవల్ల పాజిటివ్‌ ఎనర్జీ ఒకరినుంచి మరొకరికి ప్రసరిస్తుంది. ఫలితంగా థైమస్‌ గ్రంథి ప్రభావితమై, తెల్ల రక్తకణాలు విడుదలై రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఆలింగనం కండరాల్ని వ్యాకోచించేలా చేయడంతో రక్తప్రసారం మెరుగై కణజాలాలు మృదువుగా మారడంతో గుండెజబ్బులు రావన్నది మరో పరిశోధన. తనువంతా పులకించేలా కౌగిలించుకుంటే నాడీవ్యవస్థలో చురుకు పుడుతుందట. అంటే ఇద్దరి చర్మాల రాపిడికి ఒక రకమైన విద్యుచ్ఛక్తి ఒకరి నుంచి మరొకరికి ప్రవహించి నాడీవ్యవస్థని ప్రభావితం చేస్తుందన్నమాట. కౌగిలిలో చాలాసేపు ఉంటే, సెరటోనిన్‌ పెరిగి ఆనందంగా ఉంటారు. తరచూ కౌగిళ్లలో మునిగితేలే ఆలూమగల మధ్య అభిప్రాయభేదాలు తక్కువని తేలింది.దంపతులూ ప్రేమికులూ ఓ సెకను కౌగిలించుకుంటే చాలు, ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఇది పది నిమిషాలపాటు చేయీ చేయీ పట్టుకుని కూర్చున్నదానితో సమానమట. అమెరికాతో పోలిస్తే ఫ్రెంచ్‌వాళ్లు ఎక్కువ సమయం నులివెచ్చని కౌగిళ్లలోనే కాలం గడుపుతారట. అందుకే అక్కడ విడాకులు తక్కువట. ఏమయినా కౌగిలింతే ప్రేమకీ శృంగారేచ్ఛకీ బీజం.

సమాజం ఏమంటోంది?
కౌగిలి కేవలం ప్రేమికులకీ దంపతులకీ మాత్రమే పరిమితం కాదు. సామాజిక సంబంధాలనీ పెంచి పోషిస్తుంది. ఈ విషయాన్ని స్వీడన్‌ పరిశోధకులు ప్రయోగపూర్వకంగా పరిశీలించారు. ఒంటరిగా జీవించేవాళ్లతో పోలిస్తే సామాజిక సంబంధాలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఒత్తిడిని తట్టుకోగలరు. ఆ బంధాల్లోనూ, అంటీముట్టని వాళ్లతో పోలిస్తే కుటుంబ సభ్యులూ స్నేహితులూ- ఇలా ఎవరితోనయినా ఆత్మీయ స్పర్శ కలిగి ఉండేవాళ్లు మరింత ఒత్తిడిని తట్టుకుని ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలుసుకున్నారు. కౌగిలింత వల్ల ఇవ్వడం, తీసుకోవడం రెండూ తెలుస్తాయి. ఒకరిపట్ల ఒకరికి అవగాహన పెంచేందుకూ అనుబంధాలు బలపడేందుకూ కౌగిలే సరైన పెట్టుబడి. అయితే ఆఫీసుల్లో సహోధ్యాయులూ బాస్‌ల కౌగిళ్లకు మాత్రం అమ్మాయిలు దూరంగా ఉండడమే మేలు. పిల్లలకి అమ్మానాన్నా తాతలూ బామ్మలూ ఆత్మీయ కుటుంబసభ్యులూ తప్ప అపరిచితుల కౌగిళ్లకు దూరంగా ఉండటమూ నేర్పించాల్సిందే. టీనేజీ పిల్లల్లో కౌగిలింతలు పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే అమెరికాలోని కొన్ని స్కూళ్లలో హగ్స్‌మీద బ్యాన్‌ విధించారు. సో, వయసులో ఉన్న పిల్లల ఆలింగనానికి కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిందే.

కౌగిలింత ఓ పలకరింత!
కౌగిలించుకునేటప్పుడు ఎవరినైనా సరే నవ్వుతూనే ఆలింగనం చేసుకోవాలట. అప్పుడే ఆ అనుభూతిని ఆసాంతం ఆస్వాదించవచ్చు. అనుమతి లేకుండా అస్సలు కౌగిలించుకోకూడదు. అందుకే ‘కౌగిలింతే కోరలేదు, కోరితే ఇచ్చేది కౌగిలే కాద’న్నాడో కవి. అదో అసంకల్పిత ప్రతీకార చర్యలా మనసులోంచి రావాల్సిందే. అంతేతప్ప, ‘గతేడాది వెయ్యిమందిని కౌగిలించుకున్నా. ఈ ఏడాది ఆ సంఖ్యను పదివేలకు పెంచాలనుకుంటున్నా’ అని చెప్పే కృత్రిమ కౌగిళ్లరాయుళ్ల గోల మనకి ఇంకా అంతగా సోకలేదనే చెప్పాలి. ఎందుకంటే కౌగిలింతల గురించి ఎవరెంత చెప్పినా తల్లీబిడ్డల మధ్యా స్నేహితులూ క్రీడాకారులూ రాజకీయనాయకులూ తారసపడినప్పుడూ తప్పితే మిగిలిన వాళ్ల మధ్య బహిరంగ ఆలింగనాలనేవి భారతీయ సమాజంలో తక్కువనే చెప్పాలి. కౌగిలి అనేది కేవలం శృంగారపరమైనది అనే భావన మనలో నాటుకుపోవడమే ఇందుకు కారణం కావచ్చు.
ఏదిఏమైనా, కౌగిలింత ఓ ప్రేమపూర్వక పలకరింపు అని గుర్తించి, ఆత్మీయులను అభిమానంగా ఆదరంగా దగ్గరకు తీసుకుంటే కలిగే ఆనందమే వేరు. ఒకసారి ట్రై చేసి చూడండి, పోయేదేముంది... మహా అయితే తిరిగి కౌగిలించుకుంటారు, ఆ ఆనందానుభూతిని మీకూ అందిస్తారు. అంతేకదా..!

అమ్మాయిలూ తెలుసుకోండి!

అమ్మాయిలూ కౌగిలిని ఆనందించినా ఆ విషయంలో ఎప్పుడూ అబ్బాయిలదే పైచేయి. అయితే అమ్మాయిని దగ్గరకు తీసుకునే ప్రేమ పరిష్వంగాలకీ అనేక అర్థాలున్నాయట. వెనకనుంచి వచ్చి మిమ్మల్ని గాఢంగా హత్తుకున్నారూ అంటే నీకు నేనున్నాను, దేనికీ భయపడాల్సిన పనిలేదు అని అర్థం.

* ప్రేమించాలా వద్దా అన్న సంశయంలో ఉన్నవాళ్లు శరీరం దూరంగా ఉంచే నడుంచుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంటారట. వీళ్లతో కాస్త జాగ్రత్త. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంత త్వరగా బయటకు వచ్చేస్తారు.
* భుజాల వెనకగా చేతులు పోనిచ్చి గుండెలకి హత్తుకునే కౌగిలి ఎక్కువగా స్నేహంలోనే కనిపిస్తుంది. అంటే అవతలి వ్యక్తి మిమ్మల్ని స్నేహితురాలుగానే భావిస్తున్నారని అర్థం.

* శరీరాల మధ్య దూరం ఉండి భుజాలమీదుగా హత్తుకుంటే దాన్ని లండన్‌ బ్రిడ్జ్‌ హగ్‌ అంటారు. అంటే మీ మధ్య పూర్తిస్థాయి ప్రేమగానీ బంధంగానీ లేదనే అర్థం.
* రెండు చేతులతో నడుమును చుట్టేస్తూ మీ భుజాలవెనకగా తలవాల్చి నిలువెల్లా హత్తుకుపోతే, ఎంతో నిజాయతీగా ప్రేమిస్తున్నాడని అర్థం. ఇలాంటివాడు కచ్చితంగా మంచి భర్త కాగలడు.

* నవ్వించాలన్న లక్ష్యంతో సినీఫక్కీలో కళ్లలోకి చిలిపిగా చూస్తూ చుట్టూ తిరుగుతూ ఆలింగనం చేసుకుంటారు కొందరు. మీ బాయ్‌ఫ్రెండ్‌ అదే టైప్‌ అయితే అస్సలు చేజారిపోనీకండి. మీ ఆనందమే అతని ఆనందం అన్నమాట.

* కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ కౌగిలించుకుంటే గురుడు గాఢంగా లవ్‌లో పడ్డట్లే. మీ భావాలకు  విలువ ఇస్తున్నట్లూ గుర్తించాలి. వీళ్లతో బంధం కల కాలం ఉంటుందనడంలో నో డౌట్‌... గో ఎహెడ్‌.

నేనిక్కడ... నువ్వక్కడ..!

కెరీర్‌ దృష్ట్యా ఇటీవల భార్యాభర్తలు సైతం చెరోచోట ఉండక తప్పని పరిస్థితి. నేనిక్కడ... నువ్వక్కడ... అంటూ ఎంత సేపు పాడుకోగలరు. అందుకే వాళ్లకోసం వర్చ్యువల్‌ హగ్‌ చొక్కాలూ వస్తున్నాయి. క్యూట్‌ సర్క్యూట్‌ సంస్థ రూపొందించిన వర్చ్యువల్‌ హగ్‌ టీ షర్టులు తొడుక్కుని, హగ్‌మీ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో అప్‌లోడ్‌ చేసుకుని, కౌగిలించుకున్నట్లుగా చేస్తే చాలు... ఆ గిలిగింత షర్టు సెన్సర్ల నుంచి బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కి చేరుతుంది. దాన్ని మెసేజ్‌ చేయగానే అది ఫోన్‌ నుంచి మళ్లీ అవతలి వ్యక్తుల చొక్కాలోని సెన్సర్లకు చేరి అచ్చం కౌగిలించుకున్న అనుభూతే కలుగుతుంది.

కౌగిలింత... మరికొంత..!

కౌగిలి గోడకు కొట్టిన బంతి లాంటిది.  కౌగిలించుకోగానే అవతలి వ్యక్తుల చేతులు కూడా అప్రయత్నంగా అదేపని చేస్తాయి. ప్రతి ఒక్కరూ సగటున నెలకి ఓ గంటసేపు కౌగిలిలో గడుపుతారట. ఏ కౌగిలి అయినా 9.5 సెకన్లలో ముగుస్తుంది. 20 సెకన్లపాటు కౌగిలించుకుంటే ఒత్తిడి కారణంగా తలెత్తే బీపీ, గుండెవేగం వంటివి పెరగకుండా ఉంటాయనీ ఇలా వరసగా 21 రోజులు చేయడంవల్ల ఆక్సీటోసిన్‌ విడుదలై ఆరోగ్యం మెరుగవుతుందనేది ఓ శాస్త్రపరిశోధన. అదెలా అంటే- చర్మంలో సూక్ష్మాతి సూక్ష్మమైన ఒత్తిడి కేంద్రాలు ఉంటాయట. అండాకృతిలో ఉండే వీటిని పాసినియన్‌ కార్పసల్స్‌ అంటారు. ఇవి స్పర్శని గ్రహించి, వేగస్‌ అనే నాడి ద్వారా మెదడుకు చేరవేస్తాయి. వేగస్‌ నాడి అనేది వల మాదిరిగా శరీరంలోని అన్ని అవయవాలకీ అనుసంధానమై ఉంటుంది. అంటే కౌగిలింత ఆ నాడి ద్వారా మెదడు పొరల్ని తాకి ఒళ్లంతా పులకించేలా చేస్తుందట.

- రోజా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.