close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పదండి..ప్రణాళిక ఇదండి

ఎప్పుడెప్పుడు.. ఎక్కడెక్కడికి..
పదండి..ప్రణాళిక ఇదండి  

నడి వేసవిలో రాజస్థాన్‌ పర్యటనకు వెళ్తే ఆనందం ఏముంటుంది. భారీ వర్షాలప్పుడు హిమగిరి సోయగాలు చూస్తానంటే ఎలా కుదురుతుంది. ఒక్కో ప్రాంతం సందర్శించడానికి ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ కాలంలో వెళ్తేనే అసలైన ఆనందం దొరుకుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఎప్పుడు వెళ్లాలి? అక్కడి పర్యాటక ఆకర్షణలు ఏమిటి? ఈ వివరాలు తెలుసుకోండి. ఏ సీజన్‌లో ఏ ప్రాంతానికి వెళ్లాలి, వేసవి సెలవుల్లో ఎక్కడ విహరించాలో..ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించుకోండి.

ఎడారి దారిలో..

చుట్టూ ఉన్న ఎడారే రాజస్థాన్‌ పర్యాటక రంగానికి ఒయాసిస్‌! రాజులు పోయినా.. వారు నిర్మించిన ప్రాసాదాలు నేటికీ ఠీవీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో నిప్పుల కొలిమిలా ఉండే ఈ ఎడారి ప్రాంతం.. శీతాకాలంలో దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో భలేగా ఉంటుంది.
నవంబర్‌-ఫిబ్రవరి పర్యటనకు అనుకూల సమయం. ఇదే సీజన్‌లో ఇక్కడ బికనీర్‌ ఒంటెల పండగ, జైపూర్‌ మ్యూజిక్‌ ఫెయిర్‌, ఫుష్కర్‌ ఫెయిర్‌, జైసల్మేర్‌ ఫెస్టివల్‌ ఇలా సంప్రదాయ పండగలు ఎన్నో జరుగుతుంటాయి. థార్‌ ఎడారిలో జీప్‌ సఫారీ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

జూన్‌-సెప్టెంబర్‌: పేరుకే వానాకాలం. కానీ, ఇక్కడ భారీ వర్షాలేం ఉండవు. ఈ సమయంలోనూ వెళ్లిరావొచ్చు.

దర్శనీయ స్థలాలు: జైపూర్‌, అజ్మీర్‌, బికనీర్‌, పుష్కర్‌, జోధ్‌పూర్‌, జైసల్మేర్‌...

కశ్మీరు లోయలో..

పర్యాటక ప్రియులు ఒక్కసారైనా చూడాలనుకునే ప్రాంతం జమ్మూ కశ్మీర్‌. సంస్కృతి, ఆహార్య వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. హిమగిరి సొగసులు, శ్రీనగర్‌లో హౌస్‌బోటు షికారు మధురానుభూతిని మిగుల్చుతాయి.
జనవరి-ఫిబ్రవరి: దట్టమైన మంచుతో ఉంటుంది. స్కేటింగ్‌ విన్యాసాలు, హిమసీమల్లో విహరించాలని భావించేవారు ఈ సమయంలో వెళ్తుంటారు.

మార్చి-జూన్‌: సమశీతోష్ణంగా ఉంటుంది. పిల్లలతో వచ్చి జాలీగా సెలవులు గడపవచ్చు.

సెప్టెంబర్‌-అక్టోబర్‌: లేహ్‌-లద్దాఖ్‌ దారిలో బైకులు దూసుకుపోతుంటాయి. కశ్మీరు లోయ సౌందర్యం చూడాలంటే ఇది అనువైన సమయం.

దర్శనీయ స్థలాలు: శ్రీనగర్‌, లెహ్‌, లద్దాఖ్‌, ఉదంపూర్‌, పుల్వామా, వైష్ణోదేవి ఆలయం

ఆధ్యాత్మికం.. పర్యాటకం..

దైవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. చార్‌ధామ్‌ యాత్రలోని క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువుదీరాయి. హిమాలయాల సౌందర్యం, హిమనీ నదుల వయ్యారాలు.. ఉత్తరాఖండ్‌ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాయి.
డిసెంబర్‌-జనవరి: మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హిమాలయాల సౌందర్యం చూడాలనుకుంటే వెళ్లొచ్చు.

ఫిబ్రవరి-మే: ప్రశాంత వాతావరణం ఉంటుంది. నైనిటాల్‌, డెహ్రాడూన్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 

జులై-సెప్టెంబర్‌ భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రతికూల సమయం.

అక్టోబర్‌-నవంబర్‌: సాహసక్రీడలకు అనుకూలం. మంచుతెరల్లో ఇక్కడి ప్రదేశాలు మరింత మనోహరంగా కనిపిస్తాయి.

దర్శనీయ స్థలాలు: చార్‌ధామ్‌ యాత్ర (కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌, గంగోత్రి, యమునోత్రి), రుషీకేశ్‌, హరిద్వార్‌, నైనిటాల్‌, అల్మోరా, డెహ్రాడూన్‌

పవిత్ర సంగమం 

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వారణాసి ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. ఆధ్యాత్మిక సుగంధాలు, గంగా, యమున తరంగాలు, నవాబుల హవేలీలు లాంటి ఎన్నో విశేషాల సంగమం ఉత్తర్‌ప్రదేశ్‌.
ఏప్రిల్‌-మే: ఎండలు ఎక్కువ. పర్యాటకుల సందడి తక్కువ. అయితే ఎండలు ఎలా ఉన్నా.. మే మాసాంతంలో పర్యాటకులు కాశి, ప్రయాగ క్షేత్రాలకు వస్తుంటారు.

జులై-సెప్టెంబర్‌: ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఈ సమయంలో హోటల్‌ గదుల అద్దెలు తక్కువగా ఉంటాయి.

అక్టోబర్‌-ఫిబ్రవరి: పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. శివరాత్రి సమయంలో కాశిలో ఆధ్యాత్మిక వైభవం చూసి తీరాల్సిందే!

దర్శనీయ స్థలాలు: వారణాసి, ఆగ్రా, మథుర, లఖ్‌నవు, అలహాబాద్‌ (త్రివేణి సంగమం), అయోధ్య, ఝాన్సి, సారనాథ్‌, ఆలీగఢ్‌, ఫతేపూర్‌ సిఖ్రి

సంప్రదాయాల పట్టుకొమ్మ

వాణిజ్య సంపదతో తులతూగే గుజరాత్‌లో పర్యాటక కేంద్రాలు చాలానే ఉన్నాయి. అతిథులను ఆకర్షించడంలో గుజరాత్‌ పర్యాటక శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తుంటుంది.
సెప్టెంబర్‌-అక్టోబర్‌: గుజరాత్‌లో దసరా, దీపావళి పండగలు ఘనంగా జరుగుతాయి. గుజరాతీయుల సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకోవాలనుకున్నా, ఆహార పదార్థాలు రుచి చూడాలనుకున్నా.. ఇది సరైన సమయం.

నవంబర్‌-ఫిబ్రవరి: ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇదే సమయంలో రణ్‌ ఆఫ్‌ కచ్‌ ఫెస్టివల్‌ కూడా జరుగుతుంది. తెల్లటి ఇసుక తిన్నెల్లో.. వెన్నెలను చూసేందుకు వేలాదిగా పర్యాటకులు తరలి వస్తుంటారు.

దర్శనీయ స్థలాలు: సోమ్‌నాథ్‌ ఆలయం, ద్వారకా, అక్షరధామ్‌, అహ్మదాబాద్‌, సబర్మతి ఆశ్రమం, గిర్‌ అభయారణ్యం...

ఈశాన్య సౌందర్యం

ఈశాన్య భారతంలో పొదిగిన ఏడు రాష్ట్రాలు పర్యాటక రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. సిక్కిం, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ పర్యాటక కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి కట్టిపడేస్తాయి.
నవంబర్‌-ఫిబ్రవరి: చల్లటి వాతావరణం, నిర్మలమైన ఆకాశం ఆహ్లాదాన్నిస్తాయి.

జూన్‌-అక్టోబర్‌: వర్షాలు కురుస్తుంటాయి. ఆకాశంలో కారుమబ్బులు, పర్వత పంక్తులపై మంచు తెరలు ప్రకృతికాంత సరికొత్తగా కనిపిస్తుంది. జలధారలతో లోయలన్నీ పొంగిపోతుంటాయి. పర్యాటకులకు కావాల్సినంత ఆనందం దొరుకుతుంది.

దర్శనీయ స్థలాలు: షిల్లాంగ్‌, చిరపుంజి (మేఘాలయ), జిరో, తవాంగ్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌), మాజులీ, గువాహటి (అస్సాం), ఐజ్వాల్‌ (మిజోరాం), ఇంఫాల్‌ (మణిపూర్‌)

గో.. గో.. గోవా

టీనేజ్‌ కుర్రాడి మొదలు.. ఓల్డేజ్‌ పెద్దాయన వరకు గోవా అనగానే.. లెట్స్‌ గో అంటారు. ఏడాది పొడుగునా పర్యాటకుల సందడి కనిపిస్తుందిక్కడ.
నవంబర్‌-ఫిబ్రవరి: దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. చిన్నా-పెద్దా కార్నివాల్స్‌ జరిగే సీజన్‌ ఇది.

జులై-సెప్టెంబర్‌: ఈ సమయంలో గోవా అందంగా ఉంటుంది. చిరుజల్లుల వేళ బీచ్‌లో విహారం మరచిపోలేని అనుభూతినిస్తుంది.

ఏప్రిల్‌-మే: పర్యాటకుల తాకిడి ఉండదు. ఎండలు తట్టుకునే స్థాయిలోనే ఉంటాయి. ఈ సమయంలో గదుల అద్దె తక్కువగా ఉంటుంది. బడ్జెట్‌ ధరలోనే స్టార్‌ హోటల్‌లో బస చేయవచ్చు.

చూడాల్సినవి: గోవా బీచుల్లో సరదాగా గడపవచ్చు. ఓల్డ్‌ గోవా మొత్తం చుట్టి రావొచ్చు.

తుంగ అల.. హంపి కళ

కర్ణాటకలో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకు కొదవలేదిక్కడ.
అక్టోబర్‌-ఫిబ్రవరి: అనుకూలం. మైసూర్‌ దసరా ఉత్సవాలు, హంపి ఉత్సవాలు ఈ సీజన్‌లోనే జరుగుతాయి. 

జూన్‌-సెప్టెంబర్‌: సీజన్‌ ఓ మోస్తరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువ.

ఏప్రిల్‌-మే: వేసవిలో ఎండలు మెండుగా ఉంటాయి. కర్ణాటక స్వర్గధామం కూర్గ్‌లో మాత్రం వేసవి పసందుగా ఉంటుంది. 

దర్శనీయ స్థలాలు: గోకర్ణం, బెంగళూరు, మైసూర్‌, శ్రీరంగపట్నం, కూర్గ్‌, చిక్‌ మంగళూర్‌, మురుడేశ్వర్‌... 

రుతురాగాల వేళలో..

పడమటి కనుమల్లో ఒదిగిన కేరళలో ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలు, సముద్ర తీరాలు.. ఇలా ఎన్నో!
నవంబర్‌-ఫిబ్రవరి: వాతావరణం బాగుంటుంది. హిల్‌స్టేషన్లు, జలపాతాలు, సముద్ర తీరాలకు వెళ్లొచ్చు.

మే-జూన్‌: నైరుతి రుతుపవనాల రాకతో.. తొలకరి చినుకుల్లో తడిసిపోవాలని పర్యాటకులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు.

ఆగస్ట్‌: ఈ నెలలోనే కేరళ నూతన సంవత్సరాది ఓనమ్‌ పండగ జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడి పల్లెల్లో పడవ పందేలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా జరుగుతుంటాయి.

దర్శనీయ స్థలాలు: అలెప్పీ, తిరువనంతపురం, మున్నార్‌, వాయనాడ్‌, శబరిమల, గురువాయూర్‌ ఇలా ఎన్నో..

ఆధ్యాత్మిక విహారం

ఆధ్యాత్మిక కేంద్రాలు, వేసవి విడిదులు తమిళనాడు పర్యాటక రంగానికి ఊతమిస్తున్నాయి. సంప్రదాయ వేడుకలు విహారయాత్రకు వచ్చే వారికి అదనపు ఆనందాన్ని అందిస్తాయి.