close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంఘే శక్తి కలియుగే

సంఘే శక్తి కలియుగే
- ఉమా మహేష్‌ ఆచాళ్ళ

‘‘డియర్‌ స్టూడెంట్స్‌, నెట్‌వర్క్‌ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని భౌగోళికంగా దూరంగా, విడివిడిగా ఉన్న వ్యక్తులు లేదా సిస్టమ్స్‌ షేర్‌ చేసుకోవటం.  కనెక్టివిటీ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ విల్‌ బెనిఫిట్‌ టు షేర్‌ లిమిటెడ్‌ రిసోర్సెస్‌...’’ కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో టెన్త్‌ క్లాస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ క్లాస్‌ ఇంగ్లిషులో సాగుతోంది.

ఇంతలో ప్యూన్‌ వచ్చి ‘‘సర్‌, మీకేదో రిజిస్టర్డ్‌ పోస్ట్‌ వచ్చింది, పోస్ట్‌మ్యాన్‌ మీ గురించి వెయిట్‌ చేస్తున్నాడు’’ అనడంతో, సీరియస్‌గా పాఠం చెబుతున్న సర్వేశ్వరరావు ‘‘ఎక్స్‌క్యూజ్‌ మీ చిల్డ్రన్‌, ఐ విల్‌ బి బ్యాక్‌ షార్ట్‌లీ’’ అంటూ కొంచెం ఆదుర్దాగా స్టాఫ్‌రూమ్‌కి వెళ్ళాడు.

రిజిస్టర్డ్‌ లెటర్‌ సంతకం పెట్టి తీసుకుని వెంటనే చించి చదవడం మొదలుపెట్టాడు. అదో లాయర్‌ నోటీస్‌. తన కూతురికి డివోర్స్‌ నోటీసు పంపించాడు అల్లుడు. అంతే ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు సర్వేశ్వరరావు. ఒంట్లో నీరసంగా ఉంటోందనీ, ఓ పదిరోజులు ఉండి వెళ్తాననీ వచ్చింది సౌమ్య. అంతకుమించి ఏమీ చెప్పలేదు. అల్లుడు కూడా మంచివాడే. ఊర్లోనే ఉంటారు. కాకపోతే అత్తమామలు కొడుకు కట్నం లేకుండా చేసుకున్నాడని ఒకటి రెండుసార్లు వ్యంగ్యంగా మాట్లాడటం, ముభావంగా ఉండటం వరకూ తనకు తెలుసు. కానీ విషయం ఇంతవరకూ వస్తుందని అనుకోలేదు. పక్కనే ఉన్న గ్లాసులోని మంచినీళ్ళు తాగి, పర్మిషన్‌ పెట్టి ఇంటికి బయలుదేరాడు.
కూతుర్ని అడిగి విషయం తెలుసుకున్నాడు. అల్లుడితో ఏమీ ఇబ్బందిలేదు కానీ, అతను వాళ్ళ పేరెంట్స్‌ని ఎదిరించి మాట్లాడలేడు. వాళ్ళ రెండో అబ్బాయికి ఈమధ్యే పెళ్ళయింది. అవతలివాళ్ళు బాగా కట్నకానుకలు ఇచ్చారట. అప్పటినుంచీ సౌమ్యకి కష్టాలు మొదలయ్యాయి. సర్వేశ్వరరావుకి ఇలాంటి విషయాలు వినడం కూడా కొత్త. వెంటనే లేచి ఇంటిపక్కనే ఉన్న లాయర్‌ని కలిశాడు. లాయర్‌ సందీప్‌ కుమార్‌కు ఊర్లో మంచి పేరుంది.
నోటీసు అంతా చదివిన లాయర్‌ ‘‘మాస్టారూ, మీరేం చేద్దామనుకుంటున్నారు. కాంప్రమైజ్‌ చేసి అమ్మాయిని తిరిగి పంపించాలనా లేక డివోర్స్‌ తీసుకోవాలనా...’’ అని ఇంకా పూర్తిచేయకుండానే, ‘‘అయ్యో, డివోర్స్‌ వరకూ వెళ్ళేంత చెడ్డవాళ్ళు కాదు సర్‌ వాళ్ళు. ఏదో చిన్నచిన్న గొడవలు. వాళ్ళకి ఏమైనా డిమాండ్‌లు ఉంటే తీర్చి పంపించేద్దాం. మీరే ఎలాగైనా వాళ్ళ కాపురం నిలబెట్టాలి’’ అంటూ రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టాడు.
‘‘అయ్యయ్యో మీరు పెద్దవారు, పైగా సౌమ్య మా ఇంట్లో తిరిగిన పిల్ల. ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఆరు నెలల్లో మీ అమ్మాయి చక్కగా తిరిగి కాపురం చేసుకునేలా చూసే బాధ్యత నాది. వాళ్ళని ఎలా మలచాలో నాకు వదిలేయండి. పైగా ఫ్యామిలీ కోర్టు జడ్జిగారు నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచాయన. విడాకులకు అసలు ఒప్పుకోరు. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ లాయర్‌ ధైర్యం చెప్పేటప్పటికి కొంచెం కుదురుకున్నాడు సర్వేశ్వరరావు.

ఆ మర్నాడు ఆదివారం కావడంతో దగ్గరలోనే సొంత ఊరులో ఉన్న పొలానికి వెళ్ళాడు సర్వేశ్వరరావు. ప్రతీ ఆదివారం, పొలంలో ఏదో ఒక పనిచేయడం అతని అలవాటు. కాలువ తవ్వి, పొలానికి నీరుపడుతూ ఉండగా పక్క మడిలో ఉన్న జనార్దన్‌- సర్వేశ్వరరావుని చూసి పరుగుపరుగున వచ్చాడు. ‘‘నమస్తే మాస్టారూ, ఎప్పుడొచ్చారు?’’ అంటూ సర్వేశ్వరరావు చేతిలోని పార అందుకోబోయాడు.
‘‘ఆ నమస్తే జనార్దన్‌గారూ, ఇప్పుడే వచ్చాను. బాగున్నారా, అబ్బాయి ఎలా ఉన్నాడు?’’ అంటూ పార పక్కన పడేసి, కాళ్ళు కడుక్కుని గట్టుమీద కొచ్చాడు సర్వేశ్వరరావు. జనార్దన్‌వాళ్ళ అబ్బాయి సర్వేశ్వరరావు స్టూడెంట్‌. బాగా చదువుతాడు.

‘‘మీ దయవల్ల బాగానే ఉన్నాడు సర్‌. మొన్న మా అబ్బాయికి హైదరాబాద్‌లో కాలేజీలో సీటు వచ్చినప్పుడు, మీరు చెప్పినట్టుగానే మీ అబ్బాయిని కలిశాం. స్టేషన్‌కి వచ్చి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం దగ్గర నుంచి, మా అబ్బాయిని కాలేజీలోనూ హాస్టల్‌లోనూ జాయిన్‌ చేసి, నన్ను తిరిగి రైలు ఎక్కించడం వరకూ మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు. మీ అబ్బాయే లేకపోతే ఆ పట్నంలో మేము చాలా ఇబ్బందిపడేవాళ్ళం. మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేం మాస్టారూ. మధ్యాహ్నం మీరు భోజనం మా ఇంట్లోనే చేయాలి’’ అన్నాడు జనార్దన్‌ ఆప్యాయంగా.

‘‘అయ్యో, ఇందులో మేం చేసిందేముంది. మీ అబ్బాయి తెలివైనవాడు, కష్టపడ్డాడు. మంచి కాలేజీలో సీటు వచ్చింది. ఇక భోజనం సంగతి- నేను క్యారేజ్‌ తెచ్చుకున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి’’ అనగానే,
‘‘సరే మాస్టారూ, మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మొహమాటపడకుండా అడగండి, ఉంటాను’’ అంటూ బయలుదేరాడు జనార్దన్‌.

* * *

‘‘హలో...’’ అన్నాడు ఫోన్‌ ఎత్తి విసుగ్గా డాక్టర్‌ సుఖ్‌సాగర్‌. అది హైదరాబాద్‌ నుంచి విశాఖ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్‌ ఏసీ కూపే. ముందురోజు హైదరాబాద్‌లో ఓ కాన్ఫరెన్స్‌కి అటెండ్‌ అయి, ట్రాఫిక్‌జామ్‌ వల్ల ఫ్లైట్‌ మిస్‌ అయితే, ట్రైన్‌లో వస్తున్నాడు డాక్టర్‌ సుఖ్‌సాగర్‌. వస్తూ వస్తూ అన్నయ్య దగ్గర ఉంటున్న అమ్మని కూడా తీసుకొచ్చాడు. విపరీతమైన వర్షాలవల్ల ట్రాక్‌ పోయిందట, ట్రైన్‌ బాగా లేటయింది. ఏదో పల్లెటూర్లో పొలాల మధ్య ఆగిపోయి దాదాపు నాలుగు గంటలైంది. అమ్మ డయాబెటిక్‌. ఏదో ఒకటి తిని టాబ్లెట్‌ వేసుకోవాలి. ఓవర్‌నైట్‌ జర్నీయే కదా అని బ్యాగ్‌లో ఏమీ పెట్టుకోలేదు. తనకి క్లినిక్‌ టైమ్‌ అయిపోతోంది. పేషెంట్‌లు వెయిట్‌ చేస్తూ ఉంటారు. పొద్దున్నే కాఫీ తాగటం అలవాటు. పదవుతోంది. వర్షంవల్లేమో ట్రైన్‌లో కూడా అమ్మే కుర్రాళ్ళు ఎవరూ రావటం లేదు. ఇంత చిరాగ్గా ఉండగా అతని ఫోన్‌ మోగింది. అందుకే ఆ విసుగు. ‘‘గుడ్‌ మార్నింగ్‌ డాక్టర్‌, మా అబ్బాయికి విపరీతమైన కడుపునొప్పిగా ఉంది. మీ క్లినిక్‌ దగ్గర వెయిట్‌ చేస్తున్నాం. రిసెప్షన్‌లో అడిగితే మీరు ఎప్పుడు వస్తారో తెలియదు అంటున్నారు. కొంచెం అర్జంటు సర్‌, అందుకే మీకు డైరెక్ట్‌గా ఫోన్‌ చేస్తున్నాను’’ అవతల నుంచి ఎంత పొలైట్‌గా మాట్లాడినా, ప్రస్తుతం అతనున్న పరిస్థితివల్ల డాక్టర్‌ నిభాయించుకోలేకపోయాడు.

‘‘అందుకని నాకు డైరెక్ట్‌గా ఫోన్‌ చేస్తారా. నేనిక్కడ ట్రైన్‌లో ఉన్నాను. ఎప్పుడొస్తానో తెలియదు. అవసరమైతే వెయిట్‌ చెయ్యండి, లేదంటే మీ ఇష్టం’’ అంటూ విసురుగా ఫోన్‌ పెట్టేశాడు డాక్టర్‌ సుఖ్‌సాగర్‌.
ఇంకో అరగంట గడిచింది. అమ్మ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. పడుకునే ఉంది కానీ, తేడా తెలుస్తోంది. అతనికీ నెమ్మదిగా ఆకలి మొదలైంది. కూపే కావటంతో ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియటం లేదు. ఇంతలో ఎవరో డోర్‌ కొట్టారు. డోర్‌ ఓపెన్‌ చేసి చూస్తే ఎదురుగా ఓ వ్యక్తి పల్లెటూరి వేషధారణలో ఉన్నాడు. ఓ చేతిలో ఫ్లాస్క్‌, మరో చేతిలో టిఫిన్‌ పొట్లాలు.

ముందు అమ్మకి పెట్టి, మందులేసి, తానూ ఇష్టంగా తిన్నాడు. అతనికి ఆ టైమ్‌లో ముందురోజు రాత్రి పార్టీలో సగం తిని వదిలేసిన ఆరువేల రూపాయల అనార్కలి బటర్‌ చికెన్‌ గుర్తొచ్చింది.

‘‘అయ్యా, తమరు డాక్టర్‌గారాండీ?’’
‘‘అవును, నేను డాక్టర్‌ సుఖ్‌సాగర్‌’’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘అయ్యా, మాది నరసింగపల్లండి. మా సర్పంచ్‌గారు మీకు ఇవి ఇచ్చి రమ్మన్నారండి’’ అన్నాడతను వినయంగా- ఆ రెండూ బెర్త్‌ మీద పెడుతూ.
‘ఎవరతను, ఎందుకు ఇవన్నీ పంపారు, ఆయనకి ఎవరు చెప్పారు?’ ఇవేమీ అడగలేదు డాక్టర్‌ సుఖ్‌సాగర్‌. మొహమాటం, ఆశ్చర్యం... వీటన్నిటికంటే ఆకలి బలమైంది. ‘‘ఆ సరే, సరే... థ్యాంక్‌ యూ’’ అంటూ వాలెట్‌ తీసి అయిదొందలు ఇవ్వబోయాడు.
‘‘అయ్యా, వద్దండి... ఉంటానండి’’ అంటూ కొంచెం వెనక్కి వెళ్ళాడు ఆ వ్యక్తి దండ కట్టుకుని.
‘‘మరి, మీ ఫ్లాస్క్‌ మీకు ఎలా ఇవ్వాలి. పోనీ, ఓ నిమిషం ఉంటారా... కాఫీ తాగేసి ఇచ్చేస్తాను’’ అని డాక్టర్‌ అనగానే-
‘‘అయ్యా, ఫర్లేదండి, మీతోనే ఉంచండి. మీరు నింపాదిగా తాగండి. ఉంటానయ్యా’’ అంటూ అలాగే వెనక్కి వెళ్ళి తలుపేసి వెళ్ళిపోయాడా వ్యక్తి.
అతను వెళ్ళింది ఆలస్యం - ముందు ఓ కప్పు కాఫీ అమ్మకి ఇచ్చి, తానూ తాగి, అప్పుడు ఓపెన్‌ చేశాడు టిఫిన్‌ పొట్లాలు. మల్లెపువ్వుల్లా ఉన్న వేడివేడి ఇడ్లీలు దాదాపు డజను ఉన్నాయి. అరిటాకులో కట్టటంవల్ల ఆ ఆవిరికి అరిటాకు వాసన కూడా తగిలి ఘుమఘుమలాడిపోతున్నాయి. పక్కనే పోపేసిన గట్టి కొబ్బరి చట్నీ. ముందు అమ్మకి పెట్టి, మందులేసి, తానూ ఇష్టంగా తిన్నాడు. అతనికి ఆ టైమ్‌లో ముందురోజు రాత్రి పార్టీలో సగం తిని వదిలేసిన ఆరువేల రూపాయల అనార్కలి బటర్‌ చికెన్‌ గుర్తొచ్చింది. అది కూడా ఇంత రుచిగా అనిపించలేదు. పూర్తిగా తినడం అయిపోయాక అప్పుడు తీరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ‘అసలు ఎవరు పంపారు. ఇంతకీ ఇది తనకోసమేనా లేక వేరేవాళ్ళది పొరపాటున తనకొచ్చిందా? ఒకవేళ అదే జరిగితే అతను మళ్ళీ వస్తే...’ ఇలా ఆలోచిస్తూ ఉండగా, అతన్ని ఎక్కువ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేని ట్రైన్‌ నెమ్మదిగా కదిలింది.

* * *

అది డాక్టర్‌ సుఖ్‌సాగర్‌ క్లినిక్‌. డాక్టర్‌ లేట్‌గా రావడంతో క్లినిక్‌ చాలా రష్‌గా ఉంది. రిసెప్షనిస్ట్‌ని రిక్వెస్ట్‌ చేస్తున్నాడు సర్వేశ్వరరావు. ‘‘మేడమ్‌, పేషెంట్‌ కండిషన్‌ కొంచెం క్రిటికల్‌గా ఉంది. కొంచెం త్వరగా పంపిస్తారా, ప్లీజ్‌...’’
‘‘సర్‌, డాక్టరుగారు ఇప్పుడే వచ్చారు. మీకన్నా ముందు చాలామంది పేషెంట్‌లు ఉన్నారు. వీళ్ళలో రెండు నెలలక్రితం అపాయింట్‌మెంట్‌ తీసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కొంచెం వెయిట్‌ చెయ్యాలి’’ అంది రిసెప్షనిస్ట్‌ విసుగ్గా.
మరో పది నిమిషాలు చూశాడు సర్వేశ్వరరావు. లాభంలేదు, కుర్రాడు కడుపునొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. ఇక వెయిట్‌ చెయ్యడం మంచిదికాదని, మళ్ళీ రిసెప్షనిస్ట్‌ దగ్గరికి వెళ్ళి ‘‘మేడమ్‌, జస్ట్‌ మీరు ఒక్కసారి లోపలకి వెళ్ళి, ఎవరో ఫ్లాస్క్‌ తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పండి చాలు’’ అన్నాడు. రిసెప్షనిస్ట్‌ అర్థంకానట్లు వింతగా చూసింది.

‘‘మేడమ్‌, అదొక్కటీ చెప్పండి చాలు’’ అన్నాడు ఈసారి కొంచెం కటువుగా.
అయిష్టంగానే ఇంటర్‌కాంలో చెప్పింది ఆ అమ్మాయి.
అంతే మరుక్షణం, డాక్టర్‌ సుఖ్‌సాగర్‌ తన ఛాంబర్‌లోంచి బయటకువచ్చి రిసెప్షనిస్ట్‌ని అడిగాడు ‘‘ఎవరు, ఫ్లాస్క్‌ గురించి వచ్చింది?’’ అని ఆత్రంగా.
పక్కనే ఉన్న సర్వేశ్వరరావు ‘‘సారీ సర్‌, నేనే’’ అన్నాడు కొంచెం ఇబ్బందిగా.
‘‘ఓ మీరా, ప్లీజ్‌ కం ఇన్‌సైడ్‌’’ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.
లోపలికి వెళ్ళగానే ‘‘ముందు పేషెంట్‌ ఎవరో చెప్పండి, ఆ తర్వాత ఫ్లాస్క్‌ విషయం మాట్లాడదాం’’ అన్నాడు నవ్వుతూ డాక్టర్‌.
‘‘సర్‌, ఈ అబ్బాయి నిన్న రాత్రి నుంచీ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అపెండిసైటిస్‌ అని అనుమానం. కొంచెం చూడండి ప్లీజ్‌’’ అన్నాడు సర్వేశ్వరరావు.
‘‘ఓ తప్పకుండా - బాబూ, ఇలా రా, ఇక్కడ పడుకో’’ అని ఆ అబ్బాయిని ఎగ్జామిన్‌ చేస్తూ ‘‘రాత్రి ఏం తిన్నావు?’’ అని అడిగాడు.
‘‘రాత్రి బయట ఎగ్‌ నూడుల్స్‌ తిన్నాను సర్‌’’ అన్నాడు ఆ అబ్బాయి భయంభయంగా.
‘‘వామిటింగ్‌ అయిందా?’’ అడిగాడు డాక్టర్‌.
‘‘లేదు సర్‌, వికారంగా ఉంది. కడుపునొప్పి ఎక్కువగా ఉంది’’ అన్నాడా కుర్రాడు బాధగా ఏడుస్తూ.
‘‘ఓకే నాన్నా, లేచి కూర్చో’’ అని, సర్వేశ్వరరావుకేసి తిరిగి ‘‘నథింగ్‌ టు వర్రీ సర్‌, జస్ట్‌ ఫుడ్‌ పాయిజనింగ్‌ అయింది అంతే. మెడిసిన్స్‌ ఇస్తాను, సాయంత్రానికి తగ్గిపోతుంది’’ అంటూ బజర్‌ నొక్కి, నర్స్‌ని పిలిచి ‘‘సిస్టర్‌, ఈ అబ్బాయికి ఓ.ఆర్‌.ఎస్‌. ఇచ్చి ఎమెసిస్‌ చేయించండి’’ అంటూ మందులు రాసి ఇచ్చాడు. నర్స్‌ ఆ కుర్రాడిని పక్కనే ఉన్న రూమ్‌కి తీసుకెళ్ళింది.

‘‘థాంక్యూ డాక్టర్‌’’ అని సర్వేశ్వరరావు అనగానే-
‘‘ఇట్స్‌ ఓకే సర్‌’’ అంటూ, ‘‘ఇప్పుడు చెప్పండి సర్‌... అసలు మీరు ఎవరు, ట్రైన్‌లోకి ఆ టిఫిన్‌, కాఫీ ఎలా పంపారు?’’ అన్నాడు కుతూహలంగా.

సోషల్‌ నెట్‌వర్క్‌ అంటే కేవలం మెసేజ్‌లు పంపుకోవడం కాదు, మనుషుల్ని కలుపుకోవటం. మనకున్న వనరుల్ని పరిపూర్ణంగా వాడుకోవటం. ఇది సంభవం. ఇది నా అనుభవం.

‘‘అదా సర్‌, ఈ అబ్బాయి పొద్దున్నే కడుపునొప్పి అంటే, మీ క్లినిక్‌కి తీసుకొచ్చాను. మీ స్టాఫ్‌ మీరు రావటం లేటవుతుందంటే మీకు నేనే ఫోన్‌ చేశాను. మీరు చెప్పినదాన్నిబట్టి, మీరు ఏ ట్రైన్‌లో ఉన్నారో కనుక్కుంటే లక్కీగా అది మా ఊరే అని తెలిసింది. అక్కడ జనార్దన్‌ అని - ఆ ఊరి సర్పంచ్‌, మాకు తెలుసున్నాయన. విషయం చెప్తే, ఆయనే మీకు ఫలహారం అదీ ఏర్పాటు చేశారు. నిజానికి ఆ విషయం చెప్పకూడదు. కానీ మిమ్మల్ని కలిసే అర్జెన్సీలో చెప్పవలసి వచ్చింది, ఐ యామ్‌ సారీ సర్‌. బై ది వే నా పేరు సర్వేశ్వరరావు, ఈ ఊర్లోనే కె.వి.లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను.’’

‘‘నిజంగా చాలా థ్యాంక్స్‌ సర్‌. మీ స్నేహితుడు చేసిన హెల్ప్‌ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సిట్యుయేషన్‌ అటువంటిది. నైస్‌ టు మీట్‌ యూ, మీకుగానీ మీ స్నేహితుడికిగానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్‌ చెయ్యండి. మీ నంబర్‌ ఇవ్వండి, సేవ్‌ చేసుకుంటాను’’ అన్నాడు డాక్టర్‌ నవ్వుతూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి.

ఆ కుర్రాడికి వామిటింగ్‌ అయ్యి, కొంచెం కడుపునొప్పి తగ్గాక, టాబ్లెట్స్‌ కొని, బయటికి వచ్చాక ఫోన్‌ వచ్చింది సర్వేశ్వరరావుకి. ‘‘మాస్టారూ, నేను మీ నైబర్‌ని. హైకోర్టులో పనుంటే నిన్నే హైదరాబాద్‌ వచ్చాను. మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదనీ, మీరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళారనీ నా మిసెస్‌ చెప్పింది. ఇప్పుడెలా ఉంది, మీరెక్కడున్నారు?’’ అంటూ ఆత్రంగా ఫోన్‌ చేశాడు లాయర్‌ సందీప్‌ కుమార్‌.
‘‘మీరేం కంగారుపడకండి సర్‌, కొంచెం ఫుడ్‌ పాయిజన్‌ అయింది అంతే! ఇప్పుడు బానే ఉన్నాడు. డాక్టరుగారు ఏం ఫర్వాలేదన్నారు. మందులు తీసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి చేరాక మీ అబ్బాయి చేత మాట్లాడిస్తాను’’ అన్నాడు సర్వేశ్వరరావు.
‘‘చాలా థ్యాంక్స్‌ మాస్టారూ, సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. మీ రుణం తీర్చుకోలేను’’ అన్నాడు సందీప్‌ ఉద్వేగంగా.
‘‘అయ్యో, అంత మాటనకండి సర్‌... మీరు చేసిన సాయం ముందు ఇదెంతపాటి. ఆరోజు మీరు ఆ విషయాన్ని అంత జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసి, జడ్జిగారిచేత వాళ్ళకి కౌన్సిలింగ్‌ ఇప్పించడంవల్లే కదా వాళ్ళు మారారు. ఈరోజు మా అమ్మాయి సంతోషంగా భర్తతో కాపురం చేసుకుంటోంది. అదంతా మీ చలవే. ఉంటాను సర్‌. బాబుని ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ ఫోన్‌ చేస్తాను’’ అంటూ ఫోన్‌ పెట్టేసి, ఆటోని పిలిచాడు సర్వేశ్వరరావు.

* * *

‘‘డియర్‌ స్టూడెంట్స్‌, మీకు మొదట్లో నెట్‌వర్క్‌ గురించి చెప్పాను గుర్తుందా. ఇది ఫ్రీ పీరియడ్‌ కాబట్టి మీకో విషయం చెబుతాను. ఇది పాఠాలకి సంబంధించినది కాదు, జీవితానికి సంబంధించినది. ఆదిమానవుల కాలంలో మనుషులు ఎవరి గుహల్లో వాళ్ళు ఉండేవారు. చక్రం కనిపెట్టాక అభివృద్ధి మొదలైంది. మనిషి సంఘజీవి అయ్యాడు. నెట్‌వర్క్‌ కనిపెట్టాక గ్లోబు కాస్తా గోళీకాయంత అయింది. ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్‌కి రెండడుగుల పొడవూ, మూడడుగుల వెడల్పూ రిజిస్టర్‌ ఉండేది. ఇప్పుడు మన బెడ్‌రూమ్‌లో పడుకుని మరీ నాలుగు నెలల ముందే బుక్‌ చేసుకోగలుగుతున్నాం. అలాగే బ్యాంకింగ్‌. కానీ ఒక్కోసారి మనుషులు మళ్ళీ గుహల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మన పక్కింట్లో ఏం జరుగుతోందో తెలియనంత సొరంగాలు తవ్వేసుకున్నాం. ఇదే నెట్‌వర్క్‌ మనుషులని కూడా కలపాలి. సోషల్‌ నెట్‌వర్క్‌ అంటే కేవలం మెసేజ్‌లు పంపుకోవడం కాదు, మనుషుల్ని కలుపుకోవటం. మనకున్న వనరుల్ని పరిపూర్ణంగా వాడుకోవటం. ఇది సంభవం. ఇది నా అనుభవం. ఏ నెట్‌వర్క్‌ త్రూ శాటిలైట్‌, ఏ నెట్‌వర్క్‌ త్రూ హార్ట్‌ బీట్‌ ఏజ్‌ వెల్‌. మన భాషలో చెప్పాలంటే ‘సంఘే శక్తి కలియుగే...’ ఇలా సాగుతోంది అతని జీవిత పాఠం.
కాబోయే ఓ టీచర్‌, ఓ రైతు, ఓ లాయర్‌, ఓ డాక్టర్‌ శ్రద్ధగా వింటున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.