close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మమ్మీలను చూసొచ్చాం..!

మమ్మీలను చూసొచ్చాం..!

ఈజిప్టు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి పిరమిడ్లూ మమ్మీలూ మహా అయితే నైలునదీ మాత్రమే. కానీ అంతకుమించిన అద్భుత కళాసంపద కూడా ఆ ఎడారి నేలలో ఉందని అక్కడకు వెళ్లాకే తెలిసింది అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ గ్రామానికి చెందిన డా.కె.పుష్ప.

శంషాబాద్‌ నుంచి అబుదాబి మీదుగా కైరో చేరుకున్నాం. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పిరమిడ్ల దగ్గర జరిగే సౌండ్‌ అంట్‌ లైట్‌ షోకు వెళ్లాం. ఆ రోజు పౌర్ణమి. పండు వెన్నెల్లో ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్‌ కళ్లముందు కనబడేసరికి ఒళ్లు గగుర్పొడిచింది. అక్కడ గంటసేపు స్ఫింక్స్‌ స్వగతంతో నడిచిన సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఆకర్షించింది. మర్నాడు ఉదయం గైడు సాయంతో పిరమిడ్ల వద్దకు చేరుకున్నాం. మంచు కారణంగా దగ్గరకు వెళితేగానీ పిరమిడ్లు కనిపించడం లేదు. ముందుగా గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గీజా దగ్గరకు వెళ్లాం. దాన్ని ఫారో కూఫూ క్రీ.పూ. 2560 - 2540 మధ్య నిర్మించాడట. అప్పట్లో మనిషి సృష్టించిన కట్టడాల్లోకెల్లా ఎత్తైనదిగా గీజా పిరమిడ్‌ పేరొందింది.

గీజా పిరమిడ్‌లో...
గ్రేట్‌ పిరమిడ్‌కు రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఫారో చక్రవర్తి కోసమైతే, రెండోది ప్రజలకోసమట. సందర్శకులను ఒక ద్వారం నుంచే అనుమతిస్తున్నారు. లోపలకు వెళ్లి కింగ్స్‌ ఛాంబర్‌ను చూశాం. దీంట్లోనే కూఫూ తనకోసం నిర్మించుకున్న సమాధి ఉంది. ప్రస్తుతం నాలుగు పిరమిడ్లను మాత్రమే సందర్శకులకు అనుమతిస్తున్నారు. ఒక్కో పిరమిడ్‌ వెనక మూడు చిన్న పిరమిడ్లను రాణులకోసం నిర్మించారు. అవి చూశాక దగ్గర్లోనే ఉన్న వ్యాలీ ఆఫ్‌ నైలులోని స్ఫింక్స్‌ చూడ్డానికి వెళ్లాం. మనిషి మొహం, సింహం శరీరం గల  పౌరాణిక రూపమే స్ఫింక్స్‌. ఒక సున్నపురాతి కొండనే ఆ విధంగా మలిచారట. ఆ ముఖం ఫారో కాఫ్రాది అని చెబుతారు. దీన్ని క్రీ.పూ. 2613- 2494లో నిర్మించినట్లు తెలుస్తోంది.

తరవాత మజిలీ ఈజిప్టు మ్యూజియం... అందులో 1,20,000కి పైగా పురాతన వస్తువులూ 12 మమ్మీలూ ఉన్నాయి. దీన్ని 1902లో నిర్మించారట. 2011లో ఈజిప్టులో జరిగిన తిరుగుబాటులో కొన్ని విగ్రహాలనూ రెండు మమ్మీలనూ ఆందోళనకారులు ధ్వంసం చేశారట. ఇందులో ప్రధానంగా చూడదగ్గది టూటన్‌కామెన్‌ మమ్మీని ఉంచిన బంగారు శవపేటిక. ఇది ప్రపంచంలోకెల్లా ఖరీదైన శవపేటికగా పేరొందింది. అప్పట్లో ఆయన ముఖానికి 14 కిలోల బంగారు తొడుగు తొడిగారు. ఆయనకోసం చేయించిన బంగారు మంచం, కుర్చీ, నగలు కూడా అక్కడ ఉన్నాయి. తరవాతిరోజు కైరోలోని ఒక మార్కెట్‌ని సందర్శించాం. ఈజిప్షియన్లలో అత్యధికులు ముస్లింలే. ముఖ్య భాష అరబ్బీ. కైరోలో చాలావరకూ ఇండ్లకు ప్లాస్టరింగ్‌ చేయడం తక్కువ. అక్కడ వర్షపాతం చాలా తక్కువ. దాంతో ముందు మాత్రమే చేస్తారట.

ఆస్వాన్‌ నగరంలో...
మర్నాడు ఆస్వాన్‌ సిటీకి బయలుదేరాం. ఆస్వాన్‌లో ఆనకట్టను ‘హై డ్యామ్‌’ అని పిలుస్తారు. ఈ నిర్మాణంవల్ల లోతట్టు ప్రాంతం ముంపునకు గురైంది. అందులో ఆస్వాన్‌ ఆలయం, ఫిలై ఆలయం, ఆబుసింబల్‌ ముఖ్యమైనవి. అయితే యునెస్కో సహకారంతో వాటిని ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. ఈ చుట్టుపక్కల న్యూబియన్‌ అనే పురాతన తెగ ఉన్న గ్రామం కూడా ముంపునకు గురయింది. వారి భాష న్యూబియన్‌. దీనికి లిపి లేదు. వారికి తప్ప ఎంత ప్రయత్నించినా వేరే ఎవరూ ఆ భాష నేర్చుకోలేరని తెలిపాడు గైడ్‌. వాళ్లను అత్యంత ప్రాచీన ఈజిప్షియన్లుగా చెప్పవచ్చు.

మరబోటులో వెళ్లి ఫిలై ఆలయాన్ని సందర్శించాం. ఇందులోని దేవత పేరు ఐసిస్‌. ప్రాచీన ఈజిప్షియన్లు నిర్మించిన చిట్టచివరి ఆలయం ఇదేనట. దీన్ని వాళ్లు దేవతలుగా ఆరాధించే ఓజిరిస్‌, ఐసిస్‌లు పుట్టిన ప్రదేశంగా విశ్వసిస్తారు. కాలక్రమంలో క్రిస్టియన్లు దీన్ని చర్చిగానూ ఉపయోగించారు. పురాతన ఈజిప్షియన్లు తాము ఆరాధించే దేవతలని మానవరూపంలో కాకుండా జంతురూపంలోనే ఎక్కువగా పూజించేవారు. అందుకే ఆలయగోడలమీద ఎద్దు, గద్ద, నక్క, మొసలి రూపంలో మలిచిన విగ్రహాలన్నీ ఆ కోవకే చెందుతాయి. నైలునదిలో ఆస్వాన్‌ నుంచి లక్సర్‌కు పడవలో బయలుదేరాం. దారిలో పిరమిడ్లకోసం తవ్విన గ్రానైట్‌ క్వారీనీ, అసంపూర్తిగా వదిలేసిన ఓబిలిస్క్‌నీ చూశాం. ప్రాచీన ఈజిప్షియన్లు ఒంటిరాయి స్తంభాలను నిర్మించి వాటిమీద రాజుల గురించి చెక్కించేవారు. నైలునది దక్షిణం నుంచి ఉత్తరానికి 6,853 కిలోమీటర్లు ప్రవహించి, రెండు పాయలుగా చీలి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈజిప్టు మొత్తం నైలునది మీదే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే అక్కడివాళ్లంతా ‘నో నైల్‌, నో ఈజిప్ట్‌’ అంటుంటారు. ఎక్కడో చిన్న చిన్న పాయలుగా మొదలైన నైలు నది ఈజిప్టుకే వరప్రదాయని అని చెప్పవచ్చు. పడవలో సాయంత్రం ఆరు గంటలకు కొమాంబు ఆలయానికి చేరుకున్నాం. ఈ ఆలయాన్ని మొసళ్ల దేవతకోసం నిర్మించారు. 22 మొసళ్లనూ గుడ్లనూ మమ్మీలుగా చేసి ప్రదర్శిస్తున్నారు.

మర్నాడు ఉదయం నాలుగు గంటలకు ఆబుసింబల్‌ దర్శించడానికి బయలుదేరాం. 300 కి.మీ. దూరం సహారా ఎడారిలోనే ప్రయాణం. దారిలో ఒక్క ఊరు కూడా కనబడదు. గొప్ప ఫారో చక్రవర్తిగా పేరొందిన రామ్‌సీస్‌ ఖిఖి  నిర్మించినదే ఆబుసింబల్‌ ఆలయం. ఆనకట్ట కారణంగా ముంపునకు గురవడంతో దీన్ని ఇక్కడకు తరలించారు. ఇది రెండు ఆలయాల సముదాయం. ఒకటి రామ్‌సీస్‌ కోసమైతే, రెండోది ఆయన భార్య నెఫెర్‌టారికోసం. ఇది ఒకటే రాతితో నిర్మించిన భారీ విగ్రహాల సముదాయం. ఆ అద్భుత శిల్పకళా సంపదను దర్శించి, తిరిగి ఓడ దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. అక్కడినుంచి ఓడలోనే ఎడ్ఫుకి చేరుకున్నాం. ఉదయం ఏడు గంటలకు గుర్రపుబగ్గీలో ఎడ్ఫు ఆలయానికి చేరుకున్నాం. గద్ద ముఖం, మనిషి శరీరంతో గల హోరస్‌ దేవతకు చెందిన ఆలయం ఇది.ఇక్కడి ఆలయాలన్నీ ముందు భాగం వెడల్పుగానూ ఎత్తుగానూ లోపలికి వెళ్లే కొద్దీ వెడల్పూ ఎత్తూ తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న భారీ కుడ్యాలనూ స్తంభాలను చూస్తే ఔరా అనిపించక మానదు. గోడలమీద అప్పట్లోనే ఆపరేషన్లకు అవసరమైన వస్తు సామగ్రినీ కాన్పు సమయంలో తల్లిని కూర్చోబెట్టిన దృశ్యాలనూ చెక్కడం చూసి ఆశ్చర్యపోయాం. చివరి రోజు లక్సర్‌ పట్టణాన్ని సందర్శించాం. ఇది ఫారోల రాజధాని నగరం. ఇక్కడ ముఖ్యంగా చూడదగ్గవి నాలుగు. మార్చురీ టెంపుల్‌ ఆఫ్‌ హాట్సెప్పట్‌, కార్నక్‌ టెంపుల్‌, వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌, లక్సర్‌ ఆలయాలు. హాట్సెప్సట్‌ టెంపుల్‌ ఓ సూర్యదేవాలయం. ఈ ప్రదేశంలో దొరికిన శిథిలాలతో దీన్ని పునర్నిర్మించారు. ఇందులోని వర్ణచిత్రాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వేల సంవత్సరాలు గడిచినా ఎండకు ఎండినా రంగులు మాత్రం వెలసిపోలేదు. అక్కడి నుంచి వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌కు బయలుదేరాం.

సమాధుల్లో మమ్మీలతో..!
ఈజిప్టుని పాలించిన ఫారో చక్రవర్తులు మరణానంతర జీవితం ఉంటుందని విశ్వసించేవారు. అందుకోసమే భారీ యెత్తున పిరమిడ్లు నిర్మించుకున్నారు. క్రీ.పూ. 1069 నాటికి క్రమంగా వాటిమీద ఇష్టం తగ్గి, సమాధులు నిర్మించుకోవడం ప్రారంభించారు. పిరమిడ్‌లలో ఉంచిన మమ్మీలనూ సంపదలనూ దుండగులు కొల్లగొడుతుండటం కూడా ఒక కారణం కావచ్చు. దాంతో  తమ సమాధులను భద్రంగా ఉండేందుకు ఈ వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌ను ఎన్నుకున్నారు. ఈ భూభాగమే సహజసిద్ధంగా ఏర్పడిన పిరమిడ్‌ ఆకారంలో ఉంటుంది. దాంతో తరవాతి కాలానికి చెందిన ఫారోలు తాము జీవించి ఉండగానే తమ అభిరుచికి అనుగుణంగా తమ సమాధులని ఇక్కడ తీర్చిదిద్దుకున్నారు. అలాంటివాటిల్లో టూటన్‌కామెన్‌ సమాధి ఒకటి. కైరో మ్యూజియంలోని మమ్మీలన్నీ ఇక్కడ బయటపడినవే. ప్రస్తుతం ఈ వ్యాలీలో కేవలం మూడింటిలోకే ప్రవేశం ఉంది. భూమిలోపలి పొరల్లో గుహలుగా తొలిచి మరీ వీటిని నిర్మించారు. అద్భుత కుడ్యచిత్రాలతో కూడిన టూటన్‌కామెన్‌ సమాధిలో అతని మమ్మీని సందర్శించాం. ఆ సమాధిలో అనేక వస్తువులతోబాటు బంగారు తొడుగూ టూటన్‌కామెన్‌ మమ్మీ బయటపడ్డాయట. మమ్మీనీ, చెక్క శవపేటికనీ ఇక్కడ సందర్శనకు ఉంచి మిగిలిన సంపదను కైరో మ్యూజియంకు తరలించారు. చివరగా లక్సర్‌ ఆలయానికి వెళ్లాం. ఇది 66 ఎకరాల్లో నిర్మించిన 132 భారీ స్తంభాల సముదాయం. ఇక్కడ రహదారికి ఇరువైపులా మానవశరీరం పొట్టేలు ముఖం కలిగిన విగ్రహాలున్నాయి. పిరమిడ్లతోబాటు ఈజిప్షియన్ల కళాసంపదనీ చూశామన్న తృప్తితో వెనుదిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.