close
చదువు పదోతరగతి... సంపాదన 20 వేల కోట్లు!

చదువు పదోతరగతి... సంపాదన 20 వేల కోట్లు!  

బిహార్‌ అంటే వెనకబాటుతనానికి పేరు. అలాంటి చోట నుంచి వచ్చిన అనిల్‌కుమార్‌ అగర్వాల్‌ దేశం గర్వించదగ్గ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. తాను స్థాపించిన ‘వేదాంత రిసోర్సెస్‌’ ద్వారా ప్రపంచ వ్యాపార పటంలో భారత్‌కు చోటు కల్పించారు. ‘వేదాంత’ ఛైర్మన్‌ కూడా అయిన అనిల్‌, ఫోర్బ్స్‌ భారతీయ శ్రీమంతుల జాబితాలో 44వ స్థానంలో నిలిచారు.  ఒక సాధారణ వ్యాపార కుటుంబానికి చెందిన అనిల్‌ వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారంటే...
 

రసగా సెలవులు దొరికాయంటే పాట్నా నుంచి ఓ రాత్రంతా రైల్లో ప్రయాణం చేసి వారణాసి చేరుకునేవారు అనిల్‌, అతడి స్నేహితుడు శిశిర్‌. అక్కడ రిలీజ్‌ సినిమాలు చూసేసి సాయంత్రం మళ్లీ రైలెక్కి వెళ్లిపోయేవారు. అలా వచ్చినపుడు ఒకవేళ డబ్బు సరిపోకపోతే అన్నానికి బదులు వేడి పాలు తాగేసి ఆకలి తీర్చుకునేవారు. శిశిర్‌ చదువు పూర్తిచేసుకుని వైద్యుడిగా ముంబయిలో స్థిరపడ్డారు. అనిల్‌ కూడా 1976లో 21 ఏళ్లపుడు ముంబయిలో అడుగుపెట్టారు. కానీ ఉద్యోగిగా కాదు, చెత్తను కొనే దళారిగా. ‘పదో తరగతి తర్వాత ఇక చదవననీ, వ్యాపారంలోకి వస్తాననీ నాన్నని అడిగాను. నా ఉత్సాహానికి ఆయన అడ్డుపడలేదు’ అంటూ ఆరోజుల్ని గుర్తుచేసుకుంటారు అనిల్‌. ఆయన తండ్రికి పాట్నాలో ఐరన్‌ గ్రిల్స్‌, గేట్లు తయారుచేసే వ్యాపారంతోపాటు అల్యూమినియం తీగల వ్యాపారమూ ఉండేది. అందులో ఆయనకి చేదోడుగా ఉండేవారు అనిల్‌. తర్వాత సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో ముంబయి వెళ్లారు. అక్కడ నిరుపయోగమైన కేబుల్స్‌లో ఉండే లోహాలను బయటకు తీయించి అమ్మే స్క్రాప్‌ వ్యాపారం మొదలుపెట్టారు.

అదే తొలి కంపెనీ...
1979 ప్రాంతంలో నష్టాల్లో నడుస్తున్న ‘సంషేర్‌ స్టెర్లింగ్‌’ అనే కేబుల్‌ తయారీ కంపెనీ అమ్మకానికి ఉందని తెలిసి దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు అనిల్‌. చేతిలో అంత డబ్బు లేదు. కానీ, అలాంటి అవకాశం మళ్లీ రాదు. అందుకే కొన్ని రోజులపాటు బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగి రుణం సంపాదించి సంషేర్‌ స్టెర్లింగ్‌ని చేజిక్కించుకున్నారు. కానీ దాన్ని లాభాల బాట పట్టించడానికి చాలా కష్టపడ్డారు. 1976-86 మధ్య ఆరేడు వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా జీవితంలో పెద్దగా మార్పు రాలేదు. ‘అనుభవలేమి, నిధుల కొరత, మార్కెట్‌ విస్తరణకు అనుకూల పరిస్థితులు లేకపోవడం... ఇవన్నీ అప్పుడే తెలిసొచ్చాయి’ అని చెబుతారు అనిల్‌. ఇబ్బందుల్లో ఉన్నపుడే నేర్చుకునే అవకాశం వస్తుందని చెప్పే అనిల్‌, ఆ సమయంలోనే యూనియన్లూ, బ్యాంకులూ, ప్రజలూ, ఖాతాదారులూ, యంత్రాలూ... మొదలైన వ్యాపార అంశాల గురించి బాగా అర్థమైందంటారు. కేబుళ్ల తయారీ దగ్గర ఆగిపోతే అనిల్‌ ఇంతవరకూ వచ్చేవారు కాదేమో. వ్యాపారంలో ఎదగాలంటే ఖనిజాల విషయంలో కాస్త లోతుగా వెళ్లాలనుకున్నారు. కేబుళ్ల తయారీకి రాగి, అల్యూమినియం అవసరం. వాటిని అందించే చోటా తానుండాలని గుర్తించి ముడి పదార్థం నుంచి రాగిని వేరుచేసే కర్మాగారాన్ని తమిళనాడులో ప్రారంభించారు. దేశంలో ఆ విభాగంలో అదే మొదటి కర్మాగారం. 1988లో ‘స్టెర్లైట్‌’ పేరుతో ఆ కంపెనీని ప్రారంభించారు. అదే ఏడాది అమెరికా కంపెనీతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని టెలికామ్‌ రంగానికి అవసరమయ్యే ‘జెల్లీ ఫిల్డ్‌ కేబుల్స్‌’ని భారత్‌లో అమ్మేవారు. అప్పట్లో ఆ కేబుల్స్‌ని బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే కొనేది. దానిద్వారా మంచి లాభాలు వచ్చాయి. వ్యాపార విస్తరణకు చేతిలో డబ్బు ఉంది. దాన్ని స్టెర్లైట్‌ మీద పెట్టారు అక్కడా లాభాలు మొదలయ్యాయి. ఆపైన 1995లో మాల్కో(మద్రాస్‌ అల్యూమినియం కంపెనీ) కొన్నారు. 1999లో ఆస్ట్రేలియాలో రాగి గనుల్ని కొన్నారు.

లండన్‌ కేంద్రంగా
భారత్‌లో పెట్టుబడులు పొందే అవకాశం లేకపోవడంతో 1998లో తన కార్యాలయాన్ని ముంబయి నుంచి లండన్‌కు తరలించారు. ప్రపంచ ప్రఖ్యాత మైనింగ్‌ కంపెనీలకు లండన్‌ కేంద్రం కావడం కూడా అందుకో కారణం. తన గ్రూప్‌నకు ‘వేదంత’ అని పేరుపెట్టారు. 2001లో మైనింగ్‌ రంగంలో అతి పెద్ద కంపెనీ అయిన బీహెచ్‌పీ యాజమాన్యంతో పొసగక దాని సీయీవో బ్రియాన్‌ గిల్బర్ట్‌సన్‌ బయటకు వచ్చేశాడని పత్రికల్లో చదివారు అనిల్‌. వెంటనే ఫోన్‌చేసి తన కంపెనీలో చేరమని ఆయన్ని కోరారు. తర్వాత గిల్బర్ట్‌సన్‌ ఇండియా వచ్చి సంస్థ ఆస్తుల్ని చూసి ఛైర్మన్‌గా ఉండేందుకు అంగీకరించారు. బదులుగా ఆకర్షణీయమైన ప్యాకేజీ అందించారు అనిల్‌. తర్వాత మరికొందరు ప్రముఖులు కంపెనీ బోర్డులోకి వచ్చారు. యూపీఏ 2004లో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ నేత పి.చిదరంబరం ఈ కంపెనీ న్యాయవాదిగా, బోర్డు సభ్యుడిగా ఉండేవారు. ప్రముఖుల పేర్లు వినిపించడంతో 2003లో ‘వేదాంత’ లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో విజయవంతంగా లిస్టింగ్‌ అయింది. తర్వాత ‘స్టెర్లైట్‌ ఇండస్ట్రీస్‌’ని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేశారు అనిల్‌. స్టెర్లైట్‌ 2001లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాల్కోలో 51 శాతాన్ని రూ.552 కోట్లకు కొంది. 2002లో మరో ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్‌ జింక్‌లో 55 శాతం వాటాని రూ.768 కోట్లు పెట్టి కొంది. నిజానికి రాజస్థాన్‌లో ఆ కంపెనీకి ఉన్న గనుల్లోని జింక్‌ నిల్వలు నాలుగైదేళ్లలో ఖాళీ అయిపోతాయనే ప్రచారం ఉండేది. అనిల్‌ చేతికి కంపెనీ వచ్చాక మరోసారి అన్వేషణ మొదలుపెట్టి కొత్త నిల్వలు కనుగొన్నారు. ప్రస్తుతం దేశంలో 80 శాతం జింక్‌ అవసరాల్ని ఈ కంపెనీయే తీరుస్తోంది. మరో పాతికేళ్లకు సరిపడా నిల్వలు వారి దగ్గర ఉన్నాయి. ‘ఏదైనా కంపెనీకి విలువ ఉందంటే, దాన్ని చేజిక్కించుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయను’ అంటారు అనిల్‌. ప్రస్తుతం వేదంత గ్రూప్‌... రాగి, జింక్‌, అల్యూమినియం, ఇనుము గనుల తవ్వకాల్లో ఉంది. బ్రిటన్‌కు చెందిన ‘కెయిర్న్‌ ఇండియా’లో సుమారు రూ.50వేల కోట్లు పెట్టి 2011లో వాటా కొన్నారు అనిల్‌. దానిద్వారా ‘ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌’ వెలికితీసే విభాగంలోకి అడుగుపెట్టారు. వేదాంత గ్రూప్‌ ప్రస్తుత ఆస్తుల విలువ రూ.75వేల కోట్లు. దాన్లో అనిల్‌ కుటుంబ సభ్యులకు 69 శాతం వాటా ఉంది. అనిల్‌ వాటా విలువ రూ.20వేల కోట్లు. నాలుగు ఖండాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ‘వేదాంత’... మైనింగ్‌ విభాగంలో ప్రపంచంలో ఆరో అతిపెద్ద సంస్థగా ఉంది. ప్రస్తుత కంపెనీ రుణం రూ.26వేల కోట్లు కాగా, గతేడాది లాభం దానికి రెట్టింపు ఉంది. ‘ఇంతకంటే గొప్ప బ్యాలెన్స్‌ షీట్‌ ప్రపంచంలో మరే కంపెనీకీ లేద’ంటారు అనిల్‌.

అప్పుడే అభివృద్ధి
‘మాది పీవీ నరసింహారావు ప్రభుత్వ నిర్ణయాలతో ఎదిగిన పారిశ్రామికవేత్తల తరం. పరిశ్రమల ఆవశ్యకతను గుర్తించి ఆయన ఎన్నో నూతన విధానాల్ని తీసుకొచ్చారు’ అని చెబుతారు అనిల్‌. గనుల తవ్వకాలవల్ల నష్టం జరుగుతోందని పర్యావరణ పరిరక్షణ విభాగంలో పనిచేసే సంస్థల ప్రతినిధులు కొందరు గతంలో ‘వేదాంత’ కార్యాలయాల ముందు నిరసన తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తే... ‘కొందరికి దేశాభివృద్ధి అక్కర్లేదేమో. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందరికీ నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది. చైనాలో ఇలా ఉండదు’ అని చెబుతూనే, ‘ఈ రంగంలో మిగతావాళ్లు పాతకాలంనాటి పరికరాలనే వాడుతున్నారు. మేం ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టాం. దానివల్ల ప్రకృతికీ, ప్రజలకీ సాధ్యమైనంతవరకూ నష్టం తగ్గించేలా చూస్తున్నాం. ప్రజల్ని ఖాళీ చేయించాల్సిన అవసరం వచ్చినపుడు తగిన నష్టపరిహారం అందిస్తున్నాం’ అంటారు. మన దేశ భూగర్భంలో ఎంతో ఖనిజ సంపద ఉందనీ దాన్ని తవ్వి తీయకుండా విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటూ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామనీ చెబుతారు అనిల్‌. ముడి ఉత్పత్తుల్ని ప్రాసెస్‌ చేసే, వాటి నుంచి పరికరాలు తయారుచేసే కంపెనీలు మన దగ్గరా వస్తే, దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదంటారు. వచ్చే  నాలుగేళ్లలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులతో విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నారు. దాన్లో భాగంగా టీవీ, కంప్యూటర్‌ గ్లాస్‌లను తయారుచేసే యూనిట్‌ని నాగ్‌పూర్‌ చుట్టుపక్కల పెట్టాలని చూస్తోంది వేదాంత. దీంతో ఆ రంగాల్లోని జపాన్‌ కంపెనీలు కొన్ని ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, త్వరలో బొగ్గు, బంగారు, వజ్రాల మైనింగ్‌ విభాగంలోకీ వెళ్లే ఆలోచనా ఉందంటారు అనిల్‌.

మనుషుల్ని చదివేస్తారు!
నిర్వహణ ఖర్చుని తగ్గించి ఉత్పత్తిని పెంచుకుపోవడమే తన ప్రధాన వ్యాపార విధానమనే అనిల్‌...
‘ఎవరైనా నాకు స్ఫూర్తిగా అనిపించినపుడు వారిని పరిచయం చేసుకుంటాను. వారి నుంచి పాఠాలు నేర్చుకుంటాను. వీలైతే వాళ్లతో కలిసి పనిచేస్తాను’ అంటారు. తన రంగంలో లేకపోయినా, ఎవరిలోనైనా గొప్ప లక్షణాలు కనిపించినపుడు వారితో స్నేహానికి వెనకాడరు. ముంబయి వచ్చిన కొత్తలో అల్యూమినియం రంగంలో దిగ్గజం అయిన నరేంద్ర దేశాయ్‌తో పరిచయం ఏర్పరచుకున్నారు. ఇప్పటికీ ఆ పరిచయాన్ని కొనసాగిస్తున్నారు. ‘దేశాయ్‌ హరేకృష్ణ ఉద్యమంలో భాగస్వామి. పారిశ్రామికవేత్తగా ఉంటూనే భక్తుడిగానూ ఉండొచ్చని ఆయన్ని చూసే తెలుసుకున్నాను’ అంటారు అనిల్‌.
‘అనిల్‌ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, దాన్ని చేరుకోవడానికి ఎంతటి రిస్కయినా తీసుకుంటారు. ఆఫ్రికాలో గనుల్ని కొనుగోలుచేసినా, బాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ కంపెనీలను చేజిక్కించుకున్నా అందుకు కారణం ఇదే’నంటారు దేశాయ్‌.
‘నా ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... బిహార్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంత దూరం రావడం ఎంతో సంతృప్తిగా ఉంటుంది’ అంటారు అనిల్‌. ఆయన ప్రస్థానం ప్రతి భారతీయుడికీ ఓ స్ఫూర్తి పాఠమే!

అమెరికాకు పోటీగా

‘గంగ నుంచి పొందింది గంగకి తిరిగిచ్చేయాలి’ అన్న మాటలు వింటూ పెరిగారు అనిల్‌. అందుకే తన సంపాదనలో 75 శాతం సమాజానికే ఇస్తానని ప్రకటించారు. ‘అమెరికా పారిశ్రామికవేత్తలు నెలకొల్పినట్లు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలనేది నా కల’ అని చెప్పే అనిల్‌... ఒడిశాలోని పూరీ సమీపంలో దాని నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు.
* ‘నంద్‌ ఘర్‌’ పేరుతో ప్రభుత్వంతో కలిసి అంగన్‌వాడీలకు కొత్త అర్థం, రూపు ఇస్తున్నారు.  అక్కడ పిల్లలకు పోషకాహారం, ఆరోగ్య పరీక్షలూ, టీవీ, కంప్యూటర్‌ల సాయంతో చదువులూ అందించడంతోపాటు మహిళలకు స్వయం ఉపాధి, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికి 100కుపైగా నంద్‌ఘర్‌లను ప్రారంభించారు.

సైకిల్‌ షికారు

స్నేహితురాలైన కిరణ్‌ గుప్తాతో 21 ఏళ్లకే పెళ్లైంది. అబ్బాయి అగ్నివేష్‌... దుబాయిలో సొంత కంపెనీ ప్రారంభించాడు. అమ్మాయి ప్రియా... మీడియా రంగంలో స్థిరపడింది.
* సైక్లింగ్‌ హాబీ. స్నేహితులతో సైకిల్‌ యాత్రలు చేస్తారు. ఇప్పటికీ స్నేహితుడు శిశిర్‌తో కలసి వారణాసి వీధుల్లో రిక్షాలో విహరిస్తారు.
* ముంబయిలోనూ ఇంటిని కొన్నారు. ఇక్కడ ఆఫీసుండే నారిమన్‌ పాయింట్‌ ప్రాంతంలో శాండ్‌విచ్‌లూ, పానీపూరీలూ అమ్మే బిహారీలతో వారి యాసలో మాట కలుపుతారు. 20 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్నా అనిల్‌కి వ్యాపారం మీదున్న పట్టు ఇంగ్లిష్‌మీద రాలేదు. ఎదుగుదలకు భాషా, చదువూ అడ్డంకి కావనడానికి అదో ఉదాహరణ.
*  ఆధ్యాత్మిక అంశాల్ని చదవడం, వినడం, సంగీతం...అనిల్‌ హాబీలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.