close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవును... ఆ సిసింద్రీలే!

అవును... ఆ సిసింద్రీలే!

కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్లతో సమంగా అందులో నటించిన బాలనటులు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. ఇక, కథ పిల్లల చుట్టూ తిరిగేదైతే వాళ్లే కథానాయకులూ నాయికలూ అయిపోతారు. అలాంటి చిత్రాల్లో నటించి మనల్ని మెప్పించి, ఏళ్లు గడిచినా మర్చిపోలేని ముద్రవేసిన ఒకప్పటి బాల నటులే వీళ్లు. మరి, ఇప్పుడేం చేస్తున్నారో చూద్దామా...

చిరంజీవి మేనకోడలు గుర్తుందా..?

మెగాస్టార్‌ ‘జై చిరంజీవ’ చిత్రంతో బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది శ్రియ శర్మ. ఆ సినిమాలో చిరంజీవి మేనకోడలుగానూ ‘దూకుడు’లో సమంత చెల్లెలుగానూ నటించి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన శ్రియ హిందీలో చేసిన ‘చిల్లర్‌పార్టీ’ సినిమాకుగానూ ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును సైతం తెచ్చుకుంది. ఇంతకీ ఇప్పుడేం చేస్తుందంటారా... హీరోయిన్‌ అయిపోయింది. నాగార్జున నిర్మించి ప్రత్యేక పాత్రలో నటించిన ‘నిర్మలా కాన్వెంట్‌’లో శ్రీకాంత్‌, ఊహాల కొడుకు రోషన్‌ సరసన హీరోయిన్‌గా చేసిన అమ్మాయి ఆ చిన్నారే. హిమాచల్‌ ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు తెలుగులో ‘గాయకుడు’ అనే మరో సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది.


ఇప్పుడు యూట్యూబ్‌ స్టార్‌!

‘అమ్మోరు’ సినిమా అనగానే సౌందర్య, రమ్యకృష్ణలతో పాటు ఆ చిత్రంలో అమ్మవారుగా నటించిన పాప కచ్చితంగా గుర్తొస్తుంది. మూడేళ్ల వయసులో ఉషాకిరణ్‌ మూవీస్‌ ‘మనసు మమత’ సినిమాతో బాలనటిగా మారిన సునయన తర్వాత అమ్మ, వసుంధర, తరంగాలు, పోలీస్‌ బ్రదర్స్‌, బాలరామాయణం... ఇలా దాదాపు పాతిక చిత్రాల్లో నటించింది. పెద్దయ్యాక సినిమాలూ సీరియల్స్‌లో నటించడంతో పాటు రేడియో జాకీగానూ పనిచేసిన సునయన ఈమధ్య యూట్యూబ్‌ వీడియోలతో మరోసారి మనందరినీ పలకరిస్తోంది. ఏంటీ ఇంకా గుర్తురాలేదా... యూట్యూబ్‌లో ‘ఫ్రస్ట్రేటెడ్‌ వుమెన్‌’ పేరుతో వస్తున్న వీడియో సిరీస్‌లో అదరగొట్టేస్తున్న ఆ అమ్మాయి సునయనే. ఈ వీడియోలకు స్క్రిప్ట్‌ తనే రాసుకుని సింగిల్‌ షాట్‌లో చేసేస్తుందట.


బుల్లి హీరో పెద్ద హీరో అవుతాడట

‘సూర్యవంశం’ సినిమా గుర్తుంది కదా? అందులో పెద్ద వెంకటేష్‌కి మనవడిగా, చిన్న వెంకటేష్‌కి తనయుడిగా నటించిన బాబు కూడా గుర్తుండే ఉంటాడు. ‘ప్రియరాగాలు’, ‘ప్రేమించుకుందాంరా’, ‘మనసంతా నువ్వే’ ఇలా దాదాపు యాభై సినిమాల్లో కనిపించాడు ఆనంద వర్థన్‌. గాయకుడు పి.బి శ్రీనివాస్‌ మనవడైన ఈ బాలనటుడికి ‘ప్రియరాగాలు’ సినిమాలో చేసిన అల్లరికి గానూ నంది అవార్డు కూడా వచ్చింది. ‘సూర్యవంశం’ చిత్రాన్ని హిందీలో అమితాబ్‌బచ్చన్‌తో రీమేక్‌ చేశారు. అందులోనూ అమితాబ్‌కి కొడుకుగా మనవడిగా ఆనంద్‌నే తీసుకున్నారు. అప్పుడు తన వయసు నాలుగేళ్లే. హిందీ కూడా రాదు. సెట్లో అమితాబ్‌ హిందీ పాఠాలు చెప్పారట. బాలకృష్ణతోనూ ఓ సినిమాలో నటించాడు. సెట్లో బాలయ్యతో కలసి.. సరదాగా క్రికెట్‌ ఆడేవాడట. ఇప్పుడు హీరోలా ఎలా ఎదిగిపోయాడో చూడండి. అన్నట్టు... ఆనంద్‌ ఇప్పుడు కథానాయకుడిగా మారే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. డాన్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది అతడి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.


తూనీగా తూనీగా...

‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘తూనీగా తూనీగా’ అంటూ ఆడిపాడిన చిన్నారి... సుహానీ. అందులో చిన్నప్పటి రీమాసేన్‌లా కనిపించింది. స్వస్థలం ముంబై కాగా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది.
బాల రామాయణం, ప్రేమంటే ఇదేరా, ఎదురులేని మనిషి, ఎలా చెప్పను... ఇలా తెలుగుతో పాటు బాలనటిగా హిందీ, తమిళ, బెంగాలీ భాషల్లో 40 సినిమాల్లో నటించింది సుహానీ. తర్వాత బి.జయ దర్శకత్వం వహించిన ‘సవాల్‌’తో కథానాయికగా మారింది. ‘అనసూయ’, ‘స్నేహగీతం’ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆమెకు సరైన విజయం మాత్రం అందలేదు. ‘ఎప్పటికైనా నేను ఎంచుకున్న రంగంలో రాణించి తీరుతా’ అని ధీమాగా చెబుతోంది.


జేజమ్మ... హీరోయిన్‌ అయింది

‘వీడి చావు పరాయి ఆడదాన్ని తలచుకోవాలంటేనే ఒణుకు పుట్టించేలా ఉండాలి’ అంటూ కళ్లెర్రజేస్తూ, అరుంధతి సినిమాలో సోనూసూద్‌పై కోపాగ్ని విరజిమ్మిన బాల జేజమ్మ పేరు దివ్య నగేష్‌. నటన అంటే ఏంటో తెలియని రోజుల్లోనే దివ్య ఓ బుల్లి తెర ధారావాహికలో కనిపించింది. ‘అరుంధతి’లోని నటనకు గానూ నంది అవార్డు కూడా దక్కింది. ‘పౌర్ణమి’ సినిమా కోసం సంప్రదాయ నృత్యాన్నీ నేర్చుకుంది. తరవాత ‘నేను నాన్న అబద్దం’ అనే సినిమాతో
కథానాయికగా మారింది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ‘వాస్తవం’ అనే చిత్రంలో నటిస్తోంది. కొన్ని తమిళ సినిమాలూ చేసింది.


ఆ గుడ్‌ గర్ల్‌... డాక్టరైంది

లిటిల్‌ సోల్జర్స్‌... ఈ సినిమా విడుదలై 20ఏళ్లు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ చిన్న పిల్లలున్న ఇంట్లో యూట్యూబ్‌లో ఆ సినిమానో ‘అయామ్‌ ఏ వెరీ గుడ్‌ గర్ల్‌’ పాటో ప్లే అవుతూనే ఉంటుంది. అందులో బేబీ కావ్య చేసిన అల్లరి అంత నవ్వు తెప్పిస్తుంది మరి. ఆ సినిమాకుగానూ మూడేళ్లవయసులోనే ఈ చిన్నారి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డుని కూడా అందుకుంది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వైద్యుడు అన్నపరెడ్డి గురవారెడ్డి కూతురే కావ్య. ‘లిటిల్‌ సోల్జర్స్‌’ సినిమా తీసిన గుణ్ణం గంగరాజు, గురవారెడ్డి తోడల్లుళ్లు. నిజానికి ఆ సినిమా తీస్తున్నపుడు కావ్య తల్లిదండ్రులతో పాటు బ్రిటన్‌లో ఉండేది. కానీ గంగరాజు తన సినిమాలోని బన్నీ పాత్రకు కావ్య అయితేనే సరిపోతుందని భావించడంతో పాపను అక్కణ్నుంచి రప్పించారట. ప్రస్తుతం కావ్య ఎండీ చేస్తోంది. త్వరలోనే తనను మనం కార్డియాలజిస్ట్‌గా చూడొచ్చు. ఏడాది కిందట పెళ్లి చేసుకుంది కూడా.


చిట్టి ‘ఇంద్ర’...

చిరంజీవి కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం ‘ఇంద్ర’. అందులో చిననాటి చిరంజీవిలా కనిపించి, స్కూల్‌ యూనిఫామ్‌తో తొడగొట్టి అదరగొట్టిన పిల్లాడు... తేజ. అగ్ర తారల సినిమాల్లో, చిననాటి పాత్ర అంటే చాలు తేజ పేరు గుర్తొచ్చేసేంతలా పేరు తెచ్చుకున్నాడు. ‘వసంతం’, ‘యువరాజు’, ‘ఠాగూర్‌’, ‘బాలు’... ఇలా బాలనటుడిగా తను నటించిన చిత్రాలు దాదాపు యాభై ఉన్నాయి. ఆ తరవాత చదువుపైనే దృష్టి పెట్టాడు. ఈ విరామం సినిమాలపై తనకున్న ప్రేమని ఏమాత్రం తగ్గించలేకపోయింది సరికదా కథానాయకుడు అవ్వాలనే కాంక్షను పెంచింది. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ అనే ఓ యువ దర్శకుడి సినిమాలో నటించడానికి రంగం సిద్ధం అవుతోందని
సమాచారం. ఇదికాక మరో రెండు కొత్త కథలూ చేతిలో ఉన్నాయి.


ఆ బాబు... సుజిత!

‘పసివాడి ప్రాణం’ సినిమాలో చిరంజీవి డైలాగుల్నీ వేసిన స్టెప్పుల్నీ జనం ఎప్పటికీ మర్చిపోరు. దాంతోపాటు చిన్నారి ‘రాజా’ని కూడా. ఆ సినిమా కథంతా ఆ బాబు చుట్టూనే తిరుగుతుంది మరి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సినిమాలో బాబులా కనిపించింది నిజానికి పాప. ఆ చిన్నారే సుజిత. ‘పసివాడి ప్రాణం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కింది.  అన్నిచోట్లా బాబు పాత్రలో  నటించింది మాత్రం సుజితనే. ఆ పాత్రలో అంతలా ఇమిడిపోయింది మరి. అప్పటికి ఆమె వయసు మూడున్నరేళ్లే. చిన్నప్పుడే 45 చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు దొరికిన వాటిలో ఎక్కువ ‘బాబు’ పాత్రలే కావడం విశేషం. సుజిత ఇప్పుడు సీరియల్స్‌లో రాణిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఎన్నో ధారావాహికల్లో తను కీలక పాత్రలు చేసింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.