close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వసంతానికి వచ్చిపోండి

వసంతానికి వచ్చిపోండి
ఒక బృందావనం అది కోలాహలం

మల్లెలు విరిసే వేళ..
వెన్నెల కురిసే వేళ..
అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది.
అందరూ రంగులు చల్లుకుంటారు.
పాటలు పాడేస్తారు.
ఆటలు ఆడేస్తారు.
శిశిరంలోనే వసంతానికి ఆహ్వానం పలుకుతారు.
వసంత పంచమి నాడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బృందావనంలో కనిపించే దృశ్యాలివి. దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు హోళీకి నలభై రోజుల ముందుగానే  రంగులతో, సంబరాలతో బృందావనమది అందరిదీ అనేలా చేస్తారు. జనవరి 22న వసంత పంచమికి బృందావనం ముస్తాబవుతోంది. రాధాకృష్ణుల వసంతోత్సవానికి మనల్నీ వచ్చిపొమ్మని పిలుస్తోంది!
ఎలా వెళ్లాలి
బృందావనానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్‌ మథుర జంక్షన్‌. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి దిల్లీ వెళ్లే రైళ్లన్నీ మధుర జంక్షన్‌ మీదుగానే వెళ్తాయి. మథుర నుంచి బృందావనానికి 15 కిలోమీటర్లు. బృందావనం, మథుర, చుట్టుపక్కల ప్రాంతాలను తిప్పి చూపించడానికి ట్యాక్సీలు, మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మథుర నుంచి ఆగ్రా దాదాపు 60 కి.మీ.ఎంచక్కా తాజ్‌మహల్‌ కూడా చూడొచ్చు. మథురలో బస ఏర్పాట్లు బాగుంటాయి.
రాత్రిపూట ప్రవేశం లేదు
బృందావనం అనగానే అందరూ అడిగేది నిధి వనం గురించే. గోపికలు శ్రీకృష్ణుడితో అచ్చికలాడిన ప్రదేశం నిధివనం. నేటికీ ప్రతి రాత్రీ గోపికలు నల్లనయ్యతో నాట్యమాడుతారని చెబుతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత నిధివనంలోకి ఎవరినీ అనుమతించరు. తెల్లారేసరికి గోపికలు చెట్లుగా మారిపోతారని అంటారు. ఈ వనంలోని చెట్ల కొమ్మలు పైకి పెరగకుండా.. వయ్యారాలు ఒలకబోస్తూ వంకర్లు తిరిగి.. కిందికి పెరగడం విశేషం. గోపికలతో ఆడి అలసిన కృష్ణుడు అదే వనంలోని రంగ్‌ మహల్‌లో రాధమ్మ ఒడిలో పడుకొని బడలిక తీర్చుకుంటాడని కొందరి నమ్మకం.
బ్రజ్‌ పరిక్రమ
బృందావనం-మథుర జంట పుణ్యక్షేత్రాలు. వీటికి పరిసరాల్లో గోకులం, నంద్‌గావ్‌, గోవర్ధనం, బర్సానా, రాధాకుండ్‌ తదితర ప్రాంతాలు ఉన్నాయి. గోపాల కృష్ణుడి బాల్యం, యౌవనం ఈ ప్రాంతాల్లోనే గడిచింది. రేపల్లె వాసులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఎన్నో ఘట్టాలకు నేటికీ ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయక్కడ. మథురలో కృష్ణ జన్మస్థానం, కాళీయుడి పడగలపై నాట్యమాడిన సందర్భాన్ని తెలిపే కాళీయ ఘాట్‌, చిన్నికృష్ణుడు చిటికెన వేళిపై ఎత్తిన గోవర్ధన గిరి, రాధాకృష్ణులు ఆంతరంగిక ప్రదేశం రాధా కుండ్‌-శ్యామ్‌ కుండ్‌, కంసుడిని సంహరించిన తర్వాత కృష్ణుడు సేదతీరిన ప్రదేశం ఇలా భాగవత కథల్లో భాగమైన ఎన్నో నెలవులు బృందావనం చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తాయి. కిట్టయ్య లీలల్ని తలుచుకుంటూ భక్తులు గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అంతేకాదు కృష్ణుడి బాల్యంతో ముడిపడిన బృందావనం పరిసర ప్రాంతాలన్నీ ప్రదక్షిణగా తిరుగుతుంటారు. దీనినే బ్రజ్‌ పరిక్రమ అంటారు.
బాలకృష్ణుడి చిలిపి చేష్టలు.. గోపాల కృష్ణుడి మాయలు.. రాధాకృష్ణుడి లీలలు.. వీటన్నిటికీ చిరునామా బృందావనం. కన్నయ్య చల్లని చూపు కోసం ఏటా లక్షల మంది భక్తులు బృందావనానికీ, ఆ చెంతనే ఉన్న మథురాపురికీ వస్తూ ఉంటారు. రాధామాధవుల గాథలు తెలుసుకొని మురిసిపోతారు. బృందావనిలో సంచరిస్తూ.. మానసికంగా గోపకిశోరుని మురళీగానాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. భక్తజనులకు ఆధ్యాత్మిక క్షేత్రమిది. పర్యాటక ప్రియులకు ఆహ్లాద కేంద్రం. మునిజనులకు.. తపోభూమి! బృందావనంలోని యమునా తటిపై నల్లనయ్యకై ఎదురుచూసే సాధువులు కనిపిస్తారు. రాధాదేవిని మాయాశక్తిగా ఆరాధించే యోగులూ దర్శనమిస్తారు. ఎవరి ఎదురు చూపులు వారివి. మాఘ శుద్ధ పంచమి వచ్చిందంటే మాత్రం.. అందరి చూపులూ వసంతోత్సవంపై పడతాయి. వసంత పంచమి రోజు బృందావనం, మథురానగరి చుట్టు పక్కల ప్రాంతాలన్నీ పసుపు రంగులో తడిసి ముద్దయిపోతాయి. బృందావన వీధుల్లో అడుగడుగునా దర్శనమిచ్చే ఆలయాలన్నీ పసుపు పూల తోరణాలతో ముస్తాబై దర్శనమిస్తాయి.
పచ్చందనమే..
కృష్ణుడు జన్మించిన జన్మాష్టమి, రాధాదేవి జన్మించిన రాధాష్టమి, హోళి పండగలు బృందావనంతో పాటు మథుర, గోకులం, నందగావ్‌లో వైభవంగా జరుగుతాయి. ఈ పండగలకు ఏమాత్రం తీసిపోని విధంగా వసంతోత్సవం చేసుకుంటారు అక్కడి జనాలు. వీరి ఉత్సాహంలో పాలుపంచుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివస్తారు. వసంత పంచమి నాటికి బృందావన వనాల్లో చెట్లు ఆకులన్నీ రాలి.. నిగనిగలాడే పూలతో నిండుగా దర్శనమిస్తాయి. పసుపు రంగు పూలతో స్వర్ణకాంతులీనుతుంటాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే హోళీని, ఆపై వచ్చే వసంత రుతువును స్వాగతిస్తూ.. వసంతోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. చేమంతులు, బంతులతో ఊరంతా అలంకరిస్తారు. ఆవాల చేనులోని పచ్చగా విరబూసిన పూలను తెచ్చి ఆకాశం నుంచి వర్షిస్తున్నాయా అన్నట్టు చల్లుకుంటారు. పసుపు, చందనం కలిపిన నీటిని ఒకరిపై ఒకరు కుమ్మరిస్తుంటారు. భక్తులందరూ పసుపు పచ్చటి వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. ఆలయాల్లోని విగ్రహాలకు పసుపు పట్టు పుట్టాలనే చుడతారు. పసుపు రంగులో ఉండే రవా కేసరిని ప్రసాదంగా అందజేస్తారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వసంత పంచమి రోజు బృందావనం మొత్తం పసుపు వర్ణంలో మెరిసిపోతుంది. ఈనాటి నుంచి నలభై రోజుల పాటు (హోళీ వరకు) వసంతోత్సవాలు నిర్వహిస్తారు. హోళీ సంబరాన్ని ఇంతకు పదింతలు ఉత్సాహంగా చేసుకుంటారు. నాలుగు రోజుల పాటు బృందావనం వీధులన్నీ రకరకాల రంగుల్లో దర్శనమిస్తాయి.
అడుగడుగున గుడి..
బృందావనం-మథురలో అడుగడుగునా గుళ్లూ, గోపురాలు కనిపిస్తాయి. దాదాపూ అన్నీ కృష్ణ మందిరాలే! అందులో కొన్ని రాధామాధవులు ఇద్దరూ కొలువుదీరిన ఆలయాలున్నాయి. రాధాకృష్ణుల ప్రేమను చాటే ప్రేమ మందిరం, భగవద్గీత గొప్పదనాన్ని చాటే గీతామందిర్‌, ద్వారకాదీశ్‌ ఆలయం, వనవిహారి మందిర్‌, నిధివన్‌ ఆలయం, శ్రీకృష్ణబలరామ్‌ ఆలయం (ఇస్కాన్‌), గోపీనాథ్‌ ఆలయం, శ్రీరాధావల్లభ ఆలయం, రాధారమణ మందిరం ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవే కాకుండా గోశాలలు, ప్రార్థనా మందిరాలు, సేవాసదన్‌లు, వృద్ధాశ్రమాలు ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఈ ఆలయాల నిర్మాణశైలి, వాటి వెనుకున్న కథలు పర్యాటకులకు క్షణం తీరిక లేకుండా చేస్తాయి. ఎందుకాలస్యం ఈ వసంతపంచమికి బృందావనానికి వెళ్లిపోదాం. ఇప్పుడు కుదరకపోతే.. రానున్న హోళీకైనా వెళ్లే ప్రయత్నం చేద్దాం.