close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోనసీమ వెళ్తున్నారా

కోనసీమ వెళ్తున్నారా
మూడు రోజులూ మధురానుభూతులే!

హైదరాబాద్‌ నగరం..
జనంతో కిక్కిరిసిపోయి..
గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లతో సతమతమవుతూ..
రోడ్డెక్కేవారికి చుక్కలు చూపిస్తోంది.
మరి ఇలాంటి నగరం ఒక్కసారిగా బోసిపోతే..
ఈ మాట వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..
అవును.. ఒకసారి భాగ్యనగరిని తడిమిచూస్తే
పూర్తిగా బోసిపోవడం సాధ్యం కాదు కానీ..
జనాల సందడి బాగా తగ్గిపోయే సందర్భాలు రెండే రెండు ఉంటాయి.
ఒకటి వేసవి ఎండలవేళ..
రెండోది సంక్రాంతి సందళ్లకు..
అవును.. ఎండ నడినెత్తిన మండిస్తున్న వేళ అత్యవసరమైతే తప్ప బయటకొచ్చే జనాలు తగ్గిపోవడంతో.. నిత్యం రద్దీతో నలిగిపోయే పట్టణం కాస్తా బక్కపల్చగా మారిపోతూ ఉంటుంది.
అదే సంక్రాంతి విషయానికొస్తే.. ఎక్కడెక్కడినుంచో వచ్చి.. ఇక్కడి స్థిరపడిన కుటుంబాలు.. ఈ పండగవేళ సొంత ఊళ్లకు పయనమవడంతో నగరం ఖాళీ అవుతుంది...
గతంలో సంక్రాంతివేళ.. నగరం ఖాళీ అయిన ఉదంతాలు ఎన్నో చూశాం..
రిప్పుడు మళ్లీ సంక్రాంతి వచ్చేసింది..
సందడి ఇప్పటికే తారస్థాయికి చేరుకుంది..
బస్సులు.. రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి..
అన్నట్లు సంక్రాంతి పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేది గోదారి జిల్లాలే...
అక్కడి సంక్రాంతి సంబరాలే వేరు.
గోదారోళ్లంతా అల్లుళ్ల పండగంటూ ఎంతో ఆడంబరంగా పిలుచుకునే ఈ సంక్రాంతి పండక్కి, కోనసీమకు విడదీయలేని అనుంబంధం ఉందనడం అతిశయోక్తి కాదేమో...
అత్తారింట్లో అల్లుళ్ల సందడి... బావా బామ్మర్దుల ముచ్చట్లు, మరదళ్లతో సరసాలు, ఘుమఘుమలాడే పిండివంటలు, అరిటాకు భోజనాలు, ఎరుపెక్కించే తాంబూలాలు, హుషారెక్కించే కొత్త సినిమాలు, ఉత్సాహాన్నిచ్చే కోడి పందేలు, భక్తిభావానికి ప్రతీకలుగా నిలిచే అమ్మవార్ల జాతరలు, సత్తా చూపించే ప్రభల తీర్థాలు... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో, ఎన్నెన్నో సంక్రాంతి సంబరాలకు నిదర్శనాలు..
అవును అచ్చమైన సంక్రాంతి అక్కడే కనిపిస్తుంది. ఆ పండుగ మూడు రోజులూ తెలియకుండానే గడిచిపోతాయి. తిరుగు బస్సెక్కాలంటే ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. నీరసం ఆవహించేస్తుంది. ఇదంతా సంక్రాంతి మహత్యమే.
సరే.. గోదారోళ్లు ఎటూ.. సొంతూళ్లకు బ్యాగ్‌ సర్దుతారనుకోండి..
మరి.. మిగతావాళ్ల మాటేమిటి... గోదారి జిల్లాల్లో తమకంటూ బంధుగణం లేని వాళ్లు... అక్కడి పండగ సంబరాలను కళ్లారా చూడాలని ఆశించేవాళ్ల కోరిక   తీరదా..
తీరకపోవడానికి ఏముందిలెండి..
మనసుంటే మార్గముంటుంది.. ఏమంటారు... బయల్దేరుతున్నారా మరి...
బసకు లోటు లేదు
టూరును ఇలా ప్లాన్‌ చేసుకోండి..
ఈసారి భోగి ఆదివారం.. మకర సంక్రాంతి సోమవారం వచ్చాయి. అంటే వరుసగా రెండు రోజులు సెలవులు కలిసొచ్చేశాయి.
ఇక కనుమ రోజు.. ప్రభుత్వోద్యోగులకు ఎటూ ఆప్షన్‌ హాలీడే అవకాశం ఉండనే ఉంటుంది. మిగతా వాళ్లు ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే.. గోదారి సంక్రాంతిని ఓ మధురానుభూతిగా మిగిల్చేసుకోవచ్చు.
కోనసీమలో పండుగ వాతావారణాన్ని తిలకించాలంటే ప్రధానంగా రాజమండ్రి, రావులపాలెం, అమలాపురం, రాజోలు కేంద్రాలను ఎంచుకోవచ్చు.
ఈ నాలుగు ప్రాంతాల్లోనూ లాడ్జీలు అందుబాటులో ఉంటాయి. పైగా తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయి. అలాగే పాలకొల్లు-రాజోలు మధ్య ఉండే దిండి రిసార్ట్స్‌ విడిదికి బావుంటుంది. వాళ్లిచ్చే ప్యాకేజీలను ఓసారి నెట్‌లో చెక్‌చేసుకోండి. ఇక హైదరాబాద్‌లో రాత్రి బయల్దేరితే ఈ నాలుగు ప్రాంతాల్లో దేనికైనా సరే తెల్లారేసరికల్లా చేరుకోవచ్చు.
లాడ్జీలో దిగాక కాలకృత్యాలు, స్నానపానాదులు ముగించుకుని అక్కడే ఓ ట్యాక్సీ మాట్లాడేసుకోండి.. ఈ నాలుగు ప్రాంతాల్లోనూ బస్టాండ్లకు సమీపంలో ట్యాక్సీ స్టాండ్లు ఉంటాయి.
మొదటి రోజు ద్రాక్షారామం (పంచారామాల్లో ఒకటి), ర్యాలీ (జగన్మోహినీ కేశవస్వామి... ముందువైపు మహా విష్ణువు, వెనుకవైపు జగన్మోహినీ రూపం), అయినవిల్లి (సిద్ధి వినాయకస్వామి), మురమళ్ల (శ్రీ భద్రకాళీ సమేత శ్రీవీరేశ్వర స్వామి) అప్పనపల్లి (బాలబాలాజీ) క్షేత్రాల సందర్శన పెట్టుకోండి. వీటిని ఒక్కరోజులోనే చూసి వచ్చేయొచ్చు. ఈ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు దారిలో   ఎదురయ్యే పల్లె ప్రాంతాల్లో భోగిమంటలను ఆస్వాదించొచ్చు. ఇంటింటా ముగ్గులు, పట్టు పరికిణీలతో సందడి చేసే యువతులు, కొత్త డ్రెస్సులతో షికార్లు చేసే కుర్రాళ్లు... రోడ్లన్నీ ఎక్కడ చూసినా సందడి సందడిగానే కనిపిస్తాయి. మీరు ఏ ఇంటికి వెళ్లినా.. ఆయ్‌..! రండి.. అంటూ ప్రేమగా పలకరించే ఆప్యాయతే కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.. సంక్రాంతి సంబరాలు చూడటానికి వచ్చామని చెప్పండి చాలు.. ఇక ఆ తర్వాత వాళ్లే చూసుకుంటారు.. మీ ఆనందమంతా..
క రెండో రోజు మకర సంక్రాంతి.. దీన్నే పెద్ద పండగ అని కూడా అంటారు. పిండివంటలతో ఊర్లన్నీ ఘుమాయించేస్తూ ఉంటాయి. చుట్టాలతో ఇళ్లన్నీ కళకళలాడుతూ ఉంటాయి.
మీరు ఎక్కడ బస చేసినా.. ఉదయాన్నే అయిదింటికల్లా బయటపడండి...
మంచు కురిసేవేళలో.. పచ్చటి పొలాలతో కూడిన కోనసీమను పలకరించడమే కాదు.. నిక్కరు-నోట్లో చుట్టతో నడుచుకుంటూ, సైకిళ్లపై వెళ్తూ సగటు గోదారోడు మిమ్మల్ని పలకరిస్తాడు. చూడటానికి భలే ఉంటాయి ఆ దృశ్యాలు. ఏమాత్రం సంకోచించకుండా.. పల్లెటూళ్లలో పాక హోటళ్లల్లో అడుగుపెట్టండి.. వాటికి   బోర్డులు కూడా ఉండవు.. కాసేపు భేషజాలు పక్కనపెట్టేయండి... నేనేంటి.. నాన్సెన్స్‌.. ఇక్కడ టిఫెను తినడమేంటని అనుకోకండి.. ఒక్కసారి రుచిచూడండి.. కొబ్బరి చట్నీ, సెనగ చట్నీ, నెయ్యి-కారప్పొడిలతో ప్లేటులో పెట్టిచ్చే వేడివేడి ఇడ్లీలను ఆబగా లాగించేయండి. ఏం ఫర్వాలేదు. పల్లీ చెట్నీలతో పిడచకట్టుకుని పోయిన మీ నోటికి కొత్త రుచుల్ని చూపించండి. అలాగే మీ ప్రయాణంలో అంబాజీపేట ఎటూ తగులుతుంది. అక్కడ ఆగండోసారి.. పొట్టిక్కలకు ప్రసిద్ధి చెందిందీ ప్రాంతం. పనస ఆకుల్లో వండిపెట్టే ఈ పదార్థాన్ని ఇడ్లీ పిండితోనే తయారుచేసేటప్పటికీ దీని రుచే వేరు. వీలుంటే పొట్టలో ఓ పక్కన పడేయండి. వీటన్నిటిని ఎప్పటికీ మర్చిపోలేరు. అంబాజీపేటకు పక్కనే 4 కిలోమీటర్ల   దూరంలో (రాజోలు వెళ్లే దారిలో) లంకల గన్నవరం అనే ఓ చిన్న పల్లెటూరు ఉంటుంది. అక్కడో అడుగు వేయండి. డొక్కా సీతమ్మ గారి పేరు వినే ఉంటారు కదా.. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొంది, బ్రిటిష్‌ వారి గౌరవాన్ని పొందిన సీతమ్మగారు మెట్టినిల్లు ఈ ఊరే. రోజుకు వందల సంఖ్యలో అతిథులకు ఒంటిచేత్తో వండిపెట్టిన ఘనత ఈవిడ సొంతం. చాలామందికి తెలియదు కానీ, ఆవిడ నివసించిన ఊరు, ఇల్లు చూసేందుకు ఎక్కడెక్కడినుంచో లంకల గన్నవరం వస్తూ ఉంటారు. వారి వారసులు అక్కడే ఉన్నారు కూడా. ఆ ఇంటిని కూడా చూసి వస్తే మీ పర్యటనకు అదో తృప్తి అనే చెప్పుకోవచ్చు.
ఇలా పొద్దున్నే మొదలెట్టే మీ ప్రయాణంలో కోనసీమలోని అంతర్వేది (లక్ష్మీ   నరసింహస్వామి), పాలకొల్లు (క్షీరా రామలింగేశ్వరస్వామి- పంచారామాల్లో ఒకటి), భీమవరం (సోమేశ్వరస్వామి-పంచారామాల్లో ఇది కూడా భాగమే, ప్రఖ్యాత మావుళ్లమ్మ తల్లి ఆలయం) చుట్టి వచ్చేయండి ఆ ఒక్కరోజులోనే.
అన్నట్లు భీమవరం దాకా ఎటూ వెళ్తారు కాబట్టి.. వీలుంటే కోడి పందేలను కూడా చూసి వచ్చేయండి.(ప్రభుత్వ అనుమతి లభించి అవి జరుగుతున్నట్లయితే). పాలకొల్లులో ఆగినప్పుడు లీలామహల్‌ సందులో ఇప్పటితరానికి పరిచయం లేని కుంపట్లపై మూకుడు పెట్టి, దాంట్లో మినపపిండి వేసి పైన మూతపెట్టి దానిపై బొగ్గుల నిప్పులు వేసి దోరదోరగా కాల్చిపెట్టే మినప రొట్టెలను వదిలిపెట్టకండేం...
ఇలా రెండో రోజు గడిపేశారు కదా..
క మూడో రోజున సరాసరి రాజోలు వచ్చేయండి. గోదారి గట్టు ఎక్కేయండి. అక్కడి నుంచి గోదారి-కొబ్బరి తోటల దృశ్యాలను తిలకించండి.. మీకు మీరే మైమరచిపోతారు. గోదారి ఒడ్డున పడవలు ఉంటాయి. ఓ పడవ మాట్లాడుకోండి. జస్ట్‌ అవతలివైపునకు అరగంటలో చేరిపోతారు. అక్కడన్నీ లంక తోటలే. ఆ తోటల్ని పాడుచేయకుండా.. ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తామంటే వద్దనేవారు ఎవరూ ఉండరు. ఓ గంటసేపు అలా తిరిగొచ్చేస్తే కలిగే మధురానుభూతే వేరు.
ఇక మధ్యాహ్నంపూట చుట్టుపక్కల ఊళ్లు చక్కబెట్టండి. ఎందుకంటే ప్రభల తీర్థాల సందడి మొదలయ్యేదే అప్పుడు మరి. జగ్గన్నతోట, శివకోడు, పొదలాడ, నాగుల్లంక, మాచవరం, మందపల్లి, వానపల్లి, గొల్లవిల్లి, తొండవరం, ముక్తేశ్వరం, నేదునూరు, కాట్రేనికోన వంటి 80కి పైగా ప్రదేశాలు ప్రభల తీర్థాలకు పెట్టింది పేరు. జగ్గన్నతోట తీర్థానికి 400 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. భిన్న అలంకృతులతో, నిలువెత్తు ప్రభలతో ఇసకేస్తే రాలనంత జనాలతో జరిగే ఈ తీర్థాలు కోనసీమకే తలమానికం. హైదరాబాద్‌లోని కోఠి సెంటర్‌లో దొరికే సామాన్లే అక్కడా ఉండొచ్చు. కానీ, ఆ తీర్థాల్లో అవే ప్రత్యేకంగా నిలుస్తాయి. అన్నట్లు వస్తూ వస్తూ బెల్లం జీడులు, ఖర్జూరపు పళ్లు కొనుక్కుని రావడం మర్చిపోకండేం.
అన్నీ తిరిగొచ్చి.. హాయిగా రాత్రి మీ స్వస్థలానికి బయల్దేరండి.
సంక్రాంతి సంబరాలను తలచుకుంటూ... మధురానుభూతుల్ని నెమరేసుకుంటూ..
ఓ చక్కటి అనుభూతిని మదిలో నింపుకోవడానికి చాలు ఈ మూడు రోజులూ.. మరింకేం. బయల్దేరుతున్నారా... సంక్రాంతి పండక్కి..
గమనిక: ఎలాగూ వెళ్తున్నాం కదా అని ఈ మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాలనూ కవర్‌ చేసేద్దామని ప్రయత్నించకండి.. అలా చేయాలనుకుంటే ఏ ఒక్కదాన్నీ ఆస్వాదించలేరు. మీకు ఎక్కువ సమయం ఉండి.. మరో రెండు రోజులు ఎక్కువ కేటాయించగలమని భావిస్తేనే.. ఆ చుట్టుపక్కల మరిన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టండి.

-బెహరా శ్రీనివాసరావు, రాజోలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.