close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పరివర్తన

పరివర్తన
- వలివేటి నాగచంద్రావతి

ప్పుడే ఆఫీసు నుంచి వచ్చి రిలాక్స్‌ అవుతోంది కళ.
‘‘రేపు సెలవు పెట్టేసెయ్యి’’ కూతురికి టీ కప్పు అందించి పక్కన కూర్చుంది రుక్మిణమ్మ.
‘‘ఏం?’’ చూసింది కళ ప్రశ్నార్థకంగా.
‘‘రేపా విజయనగరం కుర్రాడు హౌరాలో వస్తున్నాడు’’ తనకూ టీ కావాలని భార్యకు సంజ్ఞ చేస్తూ చెప్పారు పార్ధసారథి గారు.
‘అంటే... పెళ్ళిచూపులన్నమాట.’ గతుక్కుమంది కళ. మొహంలో గబగబా రంగులు మారినయ్‌. ‘‘నన్ను అడక్కుండా ఎందుకు రమ్మని చెప్పారు?’’ అన్నదయిష్టంగా.
‘‘అదేవిటే, మ్యాట్రిమోనీలో చూసి ‘ఈ అబ్బాయి బాగున్నాడూ’ అంటే తలూపావుగా’’ అంది రుక్మిణి ఆశ్చర్యంగా.
‘‘బావున్నాడూ అంటే- అవునని తలూపానుగానీ రమ్మని చెప్పమనలేదుగా’’ పాయింటు తీసింది కళ.
‘‘అయితే ఇప్పుడేమంటావ్‌?’’ రుక్మిణమ్మకి చప్పున విసుగొచ్చేస్తుంది.
‘‘రావద్దని చెప్పేయండి’’ అంది కళ టీపాయ్‌ మీద కప్పుపెట్టి లేచి వెళ్ళిపోతూ.
‘‘ఏమిటి నీ అభ్యంతరం?’’ తాపీగా అడిగారు పార్ధసారథి గారు.
వెళ్ళబోయేదల్లా నిల్చుండిపోయింది కళ. ఓ క్షణం తటపటాయిస్తున్నట్టుగా ఆగింది.
‘‘నేనొకర్ని ఇష్టపడుతున్నాను నాన్నా’’ అంది తర్వాత మెల్లగా.
‘‘ఆఁ’’ నోట్లోంచి ఆ అక్షరం కూడా బయటవరకూ సరిగ్గా రాలేదు రుక్మిణమ్మకి.
‘ఎంత ధైర్యం... ఎంత ధైర్యం. నా కూతురు మహా బుద్ధిమంతురాలు... ఉద్యోగానికి వెళ్ళినా తల వంచుకు వెళ్ళి తల వంచుకు వచ్చేస్తోందనుకుంటోంది ఇంకా. నేలచూపులు చూస్తూ ఎంత అమాయకంగా కనిపిస్తోందో... ఈ పిల్లేనా నా మొగుణ్ణి నేనే ఎంచుకున్నాను, మీరు మెచ్చి అక్షింతలు వెయ్యండి చాలు- అన్నట్టు మొహాన చెబుతోందీ’ నమ్మశక్యం కావట్లేదావిడకు.
‘‘ఎవరతను?’’ ముందుగా తేరుకున్నది పార్ధసారథిగారే. ఆవేశంగా నోరు తెరిచి ఏదో అనబోతున్న భార్యని మౌనంగానే వారించారాయన.
‘‘మా ఆఫీసులో నాకు సీనియరు. మా టీమ్‌ లీడరాయన. మేమిద్దరం ఒకర్నొకరం ఇష్టపడుతున్నాం. అతన్నివాళో రేపో మీ దగ్గరికి తీసుకురావాలనే అనుకుంటున్నాను’’ తల వంచుకుని నమ్రతగా చెప్పింది కళ.
‘‘దా, ఇటువచ్చి కూర్చో’’ బుజ్జగింపుగా కళని పక్కన కూర్చోపెట్టుకుని వివరాలడిగారు పార్ధసారథిగారు స్థిమితంగా.
హేమంత్‌లో అందరినీ ముందుగా ఆకర్షించేది అతని రూపమే. ప్రాజెక్ట్‌ వర్క్‌లో అతనికి దగ్గరగా మసిలే అవకాశం కళకే ఎక్కువగా ఉండేది. మెల్లమెల్లగా అతని అందానికేకాక ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మొహం మీద చెదరనివ్వని అతని చిరునవ్వుకీ ఎవరితో వ్యవహరించినా గౌరవమివ్వాలనిపించే హుందాతనానికీ తెలీకుండానే అతని ఆరాధనలో పడింది.
ఆ అమ్మాయి ఊహించనిదేమిటంటే- అతను కూడా తనని అభిమానిస్తున్నాడని. ఒక ప్రేమికుల రోజున హేమంత్‌ గులాబీ గుత్తి అందిస్తూ కళకి ప్రపోజ్‌ చేశాడు.
‘‘కాదనటానికి కారణమేమీ కనిపించలేదు నాకు.’’
‘‘ఏ ఊరు వాళ్ళది? అమ్మా నాన్నా,
తోడబుట్టినవాళ్ళు ఎందరు? ఆస్తీ అదీ...’’ ఇంకా ఏవేవో ఆరాలు తీయబోయారు పార్ధసారథిగారు.
‘‘వాళ్ళు మనవాళ్ళేనా?’’ తుపాకీ పేల్చినట్టు వేసింది అసలైన ప్రశ్న రుక్మిణమ్మ.
‘‘కాదు’’ ఓరగా తల్లిదండ్రుల మొహాల వంక పరీక్షగా చూస్తూ చెప్పింది కళ. ఇప్పుడు ఎదురయ్యే పరిణామాన్ని ఎదుర్కొన్న తరవాత, అంచెలంచెలుగా అతను బీసీ అన్న విషయాన్ని చల్లగా
బయటపెట్టొచ్చని.
‘‘ఏమిటీ?’’ తల మీద పిడుగుపడ్డట్టే అదిరిపడింది రుక్మిణమ్మ.
అక్కణ్ణుంచీ తల్లీ తండ్రీ ఇద్దరి నుంచీ బ్రెయిన్‌వాష్‌ మొదలైంది.
‘‘మన వంశమేమిటి, మన సాంప్రదాయమేమిటి, మన ఆచార వ్యవహారాలేమిటి? పెళ్ళంటే కులం, గోత్రం, నక్షత్రం- ఎన్ని లక్షణాలు చూడాలి? అవన్నీ గాలికొదిలేసి కంటికి నదరుగా కనబడ్డాడని తాళి కట్టించేసుకుంటే ఇక్కడ మా పరువేం కావాలి? ‘ఫలానావారి అమ్మాయి ఇలా అట’ అని లోకులు వేలెత్తి చూపిస్తూంటే నలుగుర్లో తలెత్తుకోగలమా? కుటుంబ గౌరవం మంటగలిసిపోదూ. బంధువుల్లో ఎంత తలవంపులు? శుభాలకీ అశుభాలకీ మనల్ని కలుపుకుంటారా... వెలివెయ్యరూ’’ అంటోంది రుక్మిణమ్మ.
‘‘అవన్నీ వదిలెయ్యి. రేపు మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ఎలా రిసీవ్‌
చేసుకుంటుందనుకుంటున్నావు... నేను చెప్తా విను- ఎదురుగా మెచ్చుకుంటారు. మీ ఆదర్శాన్ని అభినందిస్తారే తప్ప అనుసరించరు. దాన్నిబట్టి అర్థంచేసుకో ‘దిగుదిగు అన్నవాడేగానీ దిగేవాడులేడన్న’ సామెతలో ఎంత సత్యముందో. అంతేకాదమ్మాయ్‌, ఈ ప్రేమలూ వ్యామోహాలూ పలచబడ్డాక తిండితిప్పల్లో, అలవాట్లూ పద్ధతుల్లో తేడాలొచ్చి సరిపెట్టుకోలేక మీలో మీరు కలహించుకుంటుంటే ఎవరూ మీకు సర్దిచెప్పరు. ‘ఆనాడే ఆలోచించుకోవద్దా’ అని దెప్పిపొడుస్తారు. ముందుముందు పుట్టబోయే మీ పిల్లలకు ఓ పట్టాన పెళ్ళిళ్ళు కావు. నానా అవస్థా పడాలి. మళ్ళీ సంకరమే వెతుక్కోవాలి. అనుభవం లేదు నీకు. నేను చెబుతున్నా అర్థంచేసుకో’’ అని తండ్రి ఎడాపెడా వాయించేశాడు.
వేటికీ చలించలేదు కళ. ‘‘మేము వ్యక్తిత్వం వచ్చినవాళ్ళం నాన్నా. మాకివేవీ తెలియనివి కావు. మేం ఒకర్నొకరం పూర్తిగా అర్థంచేసుకున్నాం. మీరు చెప్పిన సమస్యలన్నీ మేమిద్దరం కలిసి చర్చించుకున్నాం. అవన్నీ భూతద్దంలో చూసి భయపడితే పెద్దవి. అలాకాకుండా సర్వసామాన్యమైనవిగా ఉపేక్షిస్తే
తేలికవుతాయి. మా ఇద్దరి మధ్యనా
అవగాహనా, సామరస్యం, సహకారం ఉంటే అన్నిటినీ అధిగమించగలమన్న నమ్మకం మాకుంది. మీ ఆశీర్వచనముంటే చాలు’’ అంది కళ నెమ్మదిగానే కానీ స్పష్టంగా.
హతాశులయ్యారు తల్లీ తండ్రీ. తమంత ఎత్తు ఎదిగిన కూతురు- ఇంకేమనగలరు?
‘‘సరే, మీ తాతగారిని ఒప్పించుకో’’ అన్నారు చివరికి పార్ధసారథిగారు. ‘తిరుగులేని అస్త్రం ప్రయోగించాను చూసుకో’ అన్నట్టు మొహం పెట్టి. బంతిని తన తండ్రిగారి కోర్టులోకి విసిరేస్తే మిగతాది ఆయనే చూసుకుంటారు అని ఆయన ధీమా.
ఊహించనిది కాదుగానీ క్షణంపాటు
Œలవరపడింది కళ.
తాతగారిని ఒప్పించటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సనాతనధర్మాల పట్ల విపరీతమైన నమ్మకం ఆయనకి. ఆచార వ్యవహారాలూ పద్ధతులూ మిలటరీ మనిషిలా కచ్చితంగా పాటించే మనిషి. ఆయన దేవతార్చనా నియమనిష్ఠలూ సరిగా సాగవనే ఒక్కగానొక్క కొడుకైన తన తండ్రి దగ్గర కూడా ఉండకుండా సొంత ఊళ్ళోనే ఉండిపోయారు.
ఏకైక మనవరాలైన తనని మహా ముద్దుచేసే తాతగారంటే చాలా ఇష్టం కళకి.
ఇష్టంతోపాటు పండితుడన్న గౌరవం, భక్తి... చాలా భయం కూడా. ఎందుకంటే- తన సిద్ధాంతాలే సరైనవని గట్టిగా నమ్మటమే కాకుండా అవి అందరూ పాటించవలసిన అవసరాన్ని కూడా పట్టుదలగా వాదించి,
వేదాల్లోవీ, ఉపనిషత్తులలోవీ ఉదాహరణలు చూపించి మరీ ఒప్పించగల నేర్పరి తాతగారని కళకి బాగా తెలుసు.
వరుడూ అనగానే జాతకమూ జన్మకుండలీ అడిగే ఆ సనాతనవాది ఈ కులాంతరాన్ని ఆమోదించటమా... నెవ్వర్‌. మరి వీరందరి ఒప్పుదలా లేందే తను ముందడుగు వేయగలదా? ఉహు, కాదు. వద్దంటే హేమంత్‌ని వదులుకోగలదా..? అమ్మో. ‘భగవాన్‌ ఏం చెయ్యటం?’ కళకి దేవుడు గుర్తొచ్చాడు.

* * *

‘‘రేపు పొద్దున్నే బయలుదేరి వస్తున్నారు నాన్న. సాయంత్రం అతన్ని మనింటికి రమ్మని చెప్పు’’ చెప్పారు పార్ధసారథిగారు ముక్తసరిగా.
‘‘ఊ’’ అంది కళ నిర్లిప్తంగా. ‘వచ్చేది తాతగారు కాదు- ఎదురులేని ప్రభంజనం. మేమిద్దరమూ పిల్లకాకులం. ఆయన ఎదురుగా నిలబడి మెప్పించి ఒప్పించటం సాధ్యమేనా’ కళ మనసు కల్లోల సముద్రంలా ఉంది.
తెల్లవారింది.
ఆయన వచ్చే సమయం దగ్గరపడేకొద్దీ టెన్షన్‌ అందరిలో. కళ అయితే అసలు ఏ పనీ చేయలేకపోతోంది. అలా అని ఒకచోట కుదురుగా కూర్చోనూ లేకపోతోంది.
‘‘ప్యాసింజరు వచ్చేసిందట, ఇంకో అరగంట...’’ జనాంతికంగా చెప్పారు- స్టేషన్‌కి ఫోన్‌ చేసి కనుక్కున్నట్టున్నారు పార్ధసారథిగారు.

ఆ అరగంటా దాటింది. గంట... తాతగారు రాలేదు. తండ్రి మొబైల్‌కు ఫోన్‌ చేశారు పార్ధసారథిగారు. సమాధానం లేదు. కంగారు మొదలైంది. స్టేషన్‌కి ఫోన్‌ చేశారు- ‘ప్యాసింజరు కరెక్ట్‌ టైముకే వచ్చి వెళ్ళిపోయిం’దని తెలిసింది. గాభరా ఎక్కువైంది. తల్లికి ఫోన్‌ చేశారు పార్ధసారథిగారు. తండ్రి ఇంటికి చేరలేదని చెప్పకుండా మాటల్లోపెట్టి తండ్రి ఏ కారణాలవల్లో వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదని నిర్ధారణ చేసుకున్నారు.
ఇక ఈ ఊళ్ళో ఆయనకి తెలిసినవాళ్ళెవరూ లేరు. మరెక్కడికీ వెళ్ళే మనిషి కాదు.
చాలా భయపడిపోయారు పార్ధసారథిగారు.
‘ఏమయ్యారు నాన్న. ఆ పల్లెటూరులో ప్యాసింజరు బండి మాత్రమే ఆగుతుంది. అక్కణ్ణించి ఇక్కడికి వచ్చేందుకు- ఎంత బండి లేటయినా పట్టే సమయం మూడు గంటలు. మరి, ఈమధ్యలో ఏమయ్యారు... తోవలో సుస్తీ చేసి ఆగివుంటారా? ఉహూహూ... తండ్రి మంచి ఆరోగ్యవంతుడు, అలా జరిగి ఉండదు. మరైతే ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంటేమన్నా అయ్యుంటుందా?’
ఈ ఆలోచన వచ్చేసరికి గుండె గుబగుబలాడిపోయిందాయనకి.
‘‘నేను పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి రిపోర్ట్‌ ఇచ్చి వస్తాను’’ అన్నారు జోళ్ళు వేసుకుంటూ.
లోపల్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది
కళ ‘‘తాతగారి దగ్గర్నుంచి ఫోన్‌ నాన్నా’’ అంటూ.
అనుమానించిందే. ఆయన స్టేషన్‌ నుంచి ఇంటికొస్తున్న ఆటోకి బైకు ఒకటి డాష్‌ ఇచ్చిందట.
‘కంగారుపడకు. అరుణా నర్సింగ్‌ హోమ్‌, స్టేషన్నుంచి వచ్చే రోడ్‌లో ఉంది,
ఆ ఆసుపత్రిలో ఉన్నాను, వచ్చి తీసుకువెళ్ళు’’ కొడుకుతో అన్నారు ఫోన్‌లో తండ్రి కాశీవిశ్వనాథంగారు.
తక్షణం బయలుదేరారు పార్ధసారథిగారు.
‘‘కొన్ని పాదాల మహత్యం, చూపులకొస్తున్నాడంటేనే ప్రమాదమెదురైంది. జామాతగా వస్తే ఇంకెన్ని గండాలో...’’ పైకి వినబడేటట్టుగానే గొణుగుతోంది రుక్మిణమ్మ,
పాలిపోయిన మొహంతో తండ్రిననుసరించింది కళ కూడా.

* * *

హాస్పిటల్లో డిశ్చార్జ్‌కి చేయాల్సిన తతంగమంతా పూర్తిచేసుకుని గంట తర్వాత ఇంటికి చేరుకున్నారు ముగ్గురూ.
అదృష్టవశాత్తూ కాశీవిశ్వనాథంగారికి పెద్ద దెబ్బలేమీ తగల్లేదు. కానీ, తల ఆటో రాడ్‌కి గట్టిగా గుద్దుకోవడం వల్ల నుదురు చిట్లి కొద్దిగా రక్తం పోయింది. స్పృహ కోల్పోయారు. ఒక బాటిల్‌ రక్తం, రెండు సెలైన్‌ బాటిల్స్‌తో పరిస్థితి మెరుగైంది. గాయాలైన మూడుచోట్ల డ్రెస్సింగ్‌ చేశారు. తెలివి వచ్చాక కొంత కోలుకుని నర్సుని సెల్‌ అడిగి కొడుక్కి ఫోన్‌ చేశారాయన. ఆయన ఫోన్‌ ప్రమాదం జరిగినచోట ఎక్కడో పడిపోయిందట.
‘‘నా వరకూ ఫరవాలేదు కానీ, పాపం ఆ బైకు మీదున్న కుర్రాళ్ళిద్దరికీ గట్టి దెబ్బలు తగిలాయట. వాళ్ళని ఐసీయూలో ఉంచారు. బాగా రక్తం పోవటమేకాదు, కొన్నిచోట్ల ఎముకలు కూడా విరిగాయట. డాక్టర్లు హడావుడి పడుతున్నారు’’ అన్నారు విశ్వనాథంగారు విచారపడుతూ.
కోడలు మడిగా వండి వడ్డించిన పత్యం వంట తిన్నాక ఇంకాస్త తేరుకున్నారాయన.
‘‘ఇవాళ్టికిక ఏ కార్యక్రమాలూ వద్దు,
మీరు విశ్రాంతి తీసుకోండి’’ తండ్రితో అన్నారు పార్ధసారథిగారు.
‘‘వద్దు వద్దు, వాయిదా వేయొద్దు పార్ధూ. నీకు తెలుసుగా తలపెట్టిన పనికి ఆటంకం రావటం నాకిష్టముండదు. నాకేం ఫరవాలేదు, అతన్ని రమ్మని చెప్పు’’ అన్నారు విశ్వనాథంగారు.
తుఫాను హెచ్చరిక ఖరారైంది. కళకి మళ్ళీ మొదలు ఆందోళన- ‘ఏమవుతుందో’ అని. ఇంట్లో వాతావరణం కూడా కాస్తకాస్త వేడెక్కుతోన్న సూచనలు కనపడుతున్నాయి.
సపర్యలు చేసే సాకున తల్లీ తండ్రీ తాతగారి గదిలో చేరారు. పితూరీలు చెప్పే చిన్నపిల్లల్లా ఈడొచ్చిన కూతురు తమ మాట వినటంలేదంటూ వాళ్ళాయనకు చెప్తున్న కంప్లైంట్లు... ఆయన ఓదార్పూ... ఇస్తున్న భరోసాలూ స్పష్టాస్పష్టంగా వినిపిస్తూ ఇంకాస్త భయాన్ని పెంచుతున్నాయి.

‘తనకి తెలుసు, అతను వస్తాడు. అప్పుడు మొదలవుతుంది బోధ. శాస్త్రం, వేదం, ధర్మం, వర్ణసంకరం కారణంగా కలిగే అనర్థాలు. వయసులో ఉన్న పిల్లకారు వాడే ప్రేమా దోమా అనే మాటల్లోని డొల్లతనం... తల్లీ తండ్రీ వల్లెవేసిన నీతులు బుద్ధులే కొత్త సీసాలో - కాకపోతే తాతగారు బహు లౌక్యులు, మాటచాతుర్యం కలవారు.

ఎవర్నయినా ఆయన వాదన కాదనలేని పరిస్థితికి తీసుకువచ్చేస్తారు.
హేమంత్‌ ఎప్పటిలా తన చిరునవ్వుతో ఆయన్ని ఓడించగలడా, అతనికి సాయంగా తానెలా రియాక్టవ్వాలి? తలంతా కందిరీగల తుట్టెలా ఉంది కళకి.
సాయంత్రమైంది. రుక్మిణమ్మ టీ మాత్రం కాచి ఫ్లాస్కులో పోసి పెట్టింది. స్నాక్సు అయినా తెప్పించలేదు- తన విముఖత తెలిసేలా. భార్యాభర్తలిద్దరూ సమరానికి సిద్ధమైనట్టు సీరియస్‌గా ఉన్నారు.
హేమంత్‌ వచ్చాడు. గమ్మత్తేమిటంటే అతను రాగానే నఖశిఖ పర్యంతం ఓ చూపు చూసి ‘ఇతనేనా వరుడు’ అని తిరస్కారంగా అంటారనుకున్న విశ్వనాథంగారు ‘‘నువ్వా నాయనా’’ అన్నారు. ఆయన కంఠంలో దిగ్భ్రమతోపాటు రవ్వంత తడబాటు కూడా.
విస్తుపోతూ చూశారు పార్ధసారథిగారు తండ్రి వంక.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే వేరే సోఫాలో కూర్చోబోతున్న హేమంత్‌ని ‘‘ఇలా రా నాయనా’’ అని మార్దవంగా పిలిచారు తన పక్కన చోటు చూపిస్తూ విశ్వనాథంగారు.
‘ఏమయింది ఈయనకి?’ మావగారి ప్రవర్తనని విడ్డూరంగా చూసింది రుక్మిణమ్మ.
‘‘హేమంత్‌ మీకు తెలుసా తాతగారూ?’’ వారికి దగ్గరగా వెళుతూ అడిగింది కళ.
ఆ మాట వినిపించుకోకుండానే కోడలికి టీ తెమ్మని పురమాయించి హేమంత్‌తో మాటల్లో పడ్డారాయన.
పార్ధసారథిగారు తండ్రికి సంజ్ఞ చేస్తూనే ఉన్నారు విషయంలోకి రమ్మని. ఉహు, ఆయన అవేవీ పట్టించుకోలేదు. ‘‘ఆ యాక్సిడెంట్‌ సమయంలో అక్కడే ఉన్నాడితను’’ అంటూ తన ధోరణిలో రోడ్డు ప్రమాదాలూ జాగ్రత్తలూ జనాల బాధ్యతారాహిత్యమూ వగైరా చర్చిస్తూ మధ్యమధ్య అతని విద్యా ఉద్యోగమూ కుటుంబ వివరాలూ సేకరిస్తూ ఉండిపోయారు.

టీ తాగిన కొద్దిసేపటి తరవాత సెలవు తీసుకున్నాడు హేమంత్‌.
తండ్రితో ఏనాడూ హద్దుమీరి మాట్లాడి ఎరుగని పార్ధసారథిగారు ‘‘ఏమిటి నాన్నా, మీరు చేసింది? అతను మళ్ళీ తిరిగి చూడకుండా చేస్తారనుకుంటే’’ అన్నారు నిష్ఠూరంగా.
సాలోచనగా చూశారు విశ్వనాథంగారు కొడుకు వంక. ‘‘నువ్విలా నిలదీస్తావని ముందే ఊహించాను పార్ధూ’’ అని క్షణం ఆగారు. ‘‘ఆ అబ్బాయి రాగానే ఆత్మీయుణ్ణి చూసిన ఆనందం కలిగింది నాకు. ఎందుకో తెలుసా... ఈరోజు నా ప్రాణం కాపాడిన దేవుడురా అతనూ... అందుకు.’’
‘‘అలా అంటున్నారేమిటి నాన్నా’’ కంగారుపడుతూ చూశారు పార్ధసారథిగారు.
‘‘పొద్దున్న ఏం జరిగిందో నీకు వివరంగా తెలీదు. మెయిన్‌రోడ్‌ ట్రాఫిక్‌ మరీ ఎక్కువగా ఉన్నదని చిన్న సందులోకి తిప్పాడు మా ఆటోని డ్రైవర్‌. ఇది మలుపు తిరిగిందో లేదో ఎదురుగా బైకు- స్పీడుగా వచ్చి ఆటోని బలంగా గుద్దేసింది. ఆటో దఢాలున పైకి లేచి పక్కకి పడిపోయింది. నా తల రాడ్‌కి గట్టిగా కొట్టుకుంది. శరీరం ఎగిరి పక్కనున్న మురిక్కాలువలో పడిపోయింది. ప్రాణం ఎగిరిపోయిందనే అనుకున్నాను- చుట్టూ అరుపులూ ఏడుపులూ- గడబిడ తెలుస్తోంది. నాకంతా అయోమయంగా ఉంది. లేవలేకపోతున్నాను. వాసన, కంపు, అసహ్యం... వైతరిణి దాకా వెళ్ళిపోయానా అనిపిస్తోంది. అప్పుడొచ్చాడీ కుర్రాడు. రెండు చేతులతోనూ ఎత్తుకుని నన్నా నరకం నుంచి లేవదీశాడు. దేనితోనో మురికి తుడిచాడు. తల దిమ్మెక్కడం మూలంగా మాట్లాడలేకపోతున్నాను. కళ్ళు మసకబారినయ్‌... కానీ, లీలగా అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అంబులెన్స్‌లు రావడం... ఆసుపత్రీ, హడావుడీ, ట్రీట్‌మెంట్‌ అన్నీ. ఎవరో- ‘ఈ ముసలాయనకి ‘ఓ’ నెగెటివ్‌ బ్లడ్‌ కావాలి’ అన్నారు. ‘నాది తీసుకోండి’ అంటున్నాడీ అబ్బాయి. ఆ బైకు కుర్రాళ్ళిద్దరికీ గావును ‘చాలా రక్తం కావాల్సి ఉంటుంది, వెంటనే రండ’ని స్నేహితులకి ఫోన్‌ చేస్తున్నాడు. డాక్టర్లేమడిగినా తనే పరుగులు తీస్తున్నాడు.
పార్ధూ ఇవన్నీ ఎంత బాధ్యతగా ఎంత శ్రద్ధగా అది తన పనే అన్నంత సహజంగా చేశాడో తెలుసునా - నా బెడ్డు పక్కనే నుంచొని ‘ఫర్వాలేదు తాతగారూ, మీకేం కాదు, చిన్న దెబ్బలే. తొందరగానే తగ్గిపోతాయి’ అని ఇంత పెద్దవాణ్ణి నాకు ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో మంచీ మానవత్వమనే దైవగుణాల్ని చూశానతనిలో. లేవలేని బలహీనతలో ఉండిపోవటంవల్లగానీ లేకపోతే అతన్ని ఆత్మీయంగా గుండెకు హత్తుకోవాలని ఎంతో బలంగా అనిపించిందా క్షణంలో.
మీరు వచ్చేటప్పటికి అతను నా దగ్గర లేడు. ఐసీయూలో ఆ కుర్రాళ్ళ దగ్గర ఉన్నాడు. పార్ధూ, గుమ్మంలో హేమంత్‌ని చూడగానే ‘అతను మన కులం వాడు కాదు’ అన్న నీ హెచ్చరిక గుర్తువచ్చింది. హఠాత్తుగా ఆ క్షణంలోనే జ్ఞానోదయమూ అయింది.
నేను వైతరిణిలో పడ్డాననుకున్నప్పుడు నన్నుద్ధరించింది నా కులంవాడో మతంవాడో నాకు తెలీదు. ఆ క్షణాన నాకతను వాటికంటే ఉన్నతుడు, అతీతుడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ విలువ మారిపోయిందా?
నేను ఛాందసుణ్ణే కానీ మూర్ఖుణ్ణి కాదు పార్ధూ. కాలానికి తగ్గట్టుగా ధర్మం మారుతుంది, మారాలి. మారుతున్న ధర్మాలకి అలవాటుపడాలి. అదే ధర్మం. అలాకాదూ, కాలానికి ఎదురీదుతానని మొండిపట్టు పట్టడం అవివేకం, బుద్ధిహీనత. నా మనవరాలికి ఇంతకన్నా మంచి భర్త దొరుకుతాడని నేననుకోను. కళ ఎన్నిక సరైనదే’’ సరైన తీర్పిచ్చిన జడ్జిలాగా తృప్తిగా శ్వాస పీల్చి వదిలారు కాశీవిశ్వనాథంగారు.
కళ మౌనంగా వచ్చి తాతగారి కాళ్ళకి నమస్కరించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.