close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్తకొత్తగా వచ్చేస్తున్నాయ్‌!

కొత్తకొత్తగా వచ్చేస్తున్నాయ్‌!

కొత్త సంవత్సరం వచ్చేసింది. సంబరాలు ముగిశాయి. సావకాశంగా ఓసారి భవిష్యత్తులోకి తొంగిచూస్తే... యాభయ్యేళ్ల తర్వాత మళ్లీ చందమామ మనకు దగ్గరవుతున్నాడు. కృత్రిమ మేధ ఇంటినే కాదు ఒంటినీ అలంకరించనుంది. కమ్యూనికేషన్ల రంగంలో మరో మైలురాయి 5జీ వచ్చేస్తున్నానంటోంది. జీవనశైలి జబ్బులకు మేలైన చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది మన ముందుకు తేనున్న ఇలాంటి కొన్ని విశేషాలు...

మునక్కాడల పులుసూ, మునగాకు పచ్చడీ, టమాటా మునక్కాడల కూరా... పొద్దున్నే నోరూరించే ఈ మునక్కాడల దండకం ఎందుకు గుర్తొచ్చిందంటే మన మునక్కాయ ఈ ఏడాది ‘సూపర్‌ ఫుడ్‌’ బిరుదు తెచ్చుకుంది మరి. మునగ ఆరోగ్యానికి మంచిదని వంటల్లోనే కాదు, ఆయుర్వేద మందుల్లోనూ వాడడం మనకు తెలుసు. అయితే ఆసియా, ఆఫ్రికాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న మునగ రుచిని ఇప్పుడు అమెరికా వాళ్లూ కనిపెట్టేశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగపడే చెట్టు ఏదైనా ఉందీ అంటే అది మునగచెట్టేనని తేల్చేశారు. విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే మునగాకు పొడిని పళ్ల రసాల్లో, స్మూతీస్‌లో చల్లుకుని బలవర్థకమైన ఆహారం తీసుకుంటున్నామని సంబరపడిపోతున్నారు. మునగలో నారింజలోకన్నా విటమిన్‌ సి ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, క్యారట్లలోకన్నా విటమిన్‌ ఏ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, శరీరంలో క్యాన్సర్‌ నిరోధక శక్తిని పెంచుతుందనీ, రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేస్తుందనీ...

ఇలా మునగ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ వరసగా పరిశోధనలు వెలుగు చూడడంతో ఇప్పుడు వారు మునగ చెట్టుకి జైకొడుతున్నారు. మునగ గింజల నుంచి తయారుచేసిన నూనెతో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారుచేస్తున్నారట. ఇవన్నీ చూస్తోంటే ఈ ఏడాది మునగకి చాలా పెద్ద సీనే ఉన్నట్లు కన్పిస్తోంది.

గత ఏడాదే విదేశాల్లో జైత్రయాత్ర ప్రారంభించిన మన పసుపు ఈ సంవత్సరం కూడా సూపర్‌ ఫుడ్స్‌లో ఒకటిగా ప్రస్థానం కొనసాగిస్తుందట. జలుబు నుంచి వృద్ధాప్య ఛాయల్ని తగ్గించడం వరకూ అడుగడుగునా పసుపు ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా మేలు చేస్తుందంటూ అక్కడి పోషకాహార నిపుణులు ఉపన్యాసాలిచ్చేస్తున్నారు. మొత్తానికి పాశ్చాత్య ప్రపంచం సూపర్‌ ఫుడ్స్‌గా పేర్కొంటున్న మొదటి ఐదింటిలో రెండు మనవే.

చందమామని చుట్టొస్తామా!
తారలు దిగివచ్చే వేళా, మల్లెలు నడిచొచ్చే వేళా... చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి... అని పాడుకున్నవారంతా ఇప్పుడిక అందుకు సరంజామా సిద్ధం చేసుకోవచ్చు. చందమామ మీదికి ప్రయాణానికి ఈ ఏడాదే దారి పడబోతోంది. అంగారకుడి మీద కాలనీలు కట్టేస్తామని అమెరికా వ్యాపారవేత్తలు ఎన్నాళ్లుగానో ఊరిస్తున్నారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికన్నా ముందు చందమామనే ఓ పట్టుపట్టేద్దామని ప్రభుత్వాలూ, ప్రైవేటు సంస్థలూ కలిసి ప్రయోగాలు మొదలెట్టేశాయి. చందమామపై గనులను తవ్వేందుకు రోబో జియాలజిస్టులూ అదంతా చిత్రీకరించి భూమికి పంపేందుకు రోబో వీడియాగ్రాఫర్లూ ప్రయాణానికి రెడీ అవుతున్నారు. ఆ పనులన్నిటినీ పర్యవేక్షించడానికి మనుషులతో ఓ అవుట్‌ పోస్ట్‌ కూడా ఏర్పాటుచేస్తారట.

చందమామ మీద మనిషి నడిచి దాదాపు అర్ధశతాబ్దమవుతోంది. ఇన్నాళ్లూ దాని గురించి బయటకు వార్తలేమీ రాకపోయినా పరిశోధకులు తమ పని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా గూగుల్‌ నిర్వహిస్తున్న లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌ పోటీతో చందమామ మళ్లీ చర్చనీయాంశమయింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ పోటీలో ఐదు జట్లు ఫైనల్‌కి అర్హత సాధించాయి. ఈ ఏడాది మార్చి 31లోపల ఇవి చంద్రుడిమీదికి అంతరిక్షనౌకలను పంపాలి. ఆ నౌకలు చంద్రుడి మీద దిగి, 500మీటర్లు ప్రయాణించి, అక్కడి వీడియోలూ ఫొటోలూ పంపించాలి. ఈ మూడు దశలనూ విజయవంతంగా గడువులోపల పూర్తి చేసిన సంస్థకి గూగుల్‌ ప్రథమ బహుమతి కింద 20 మిలియన్‌ డాలర్లు (రూ.128కోట్లకు పై మాటే) ఇస్తుంది. రెండో బహుమతి కింద 5 మిలియన్‌ డాలర్లూ బోనస్‌ ప్రైజ్‌ కింద మరో 5 మిలియన్‌ డాలర్లూ ఇస్తుంది.

యువ ఇంజినీర్లనూ, శాస్త్రవేత్తలనూ ప్రోత్సహించడానికి ఈ పోటీ పెట్టింది గూగుల్‌. పోటీ పడుతున్న సంస్థలన్నీ చంద్రుడి మీద పలు ప్రయోగాలు చేయబోతున్నాయి.

మన దేశంలో బెంగళూరుకు చెందిన టీమ్‌ ఇండస్‌ కూడా పోటీలో ఉంది. ఏడు యువ శాస్త్రవేత్తల జట్లు దానికి సహకరిస్తున్నాయి. ఒక్కో జట్టూ ఒక్కో రంగానికి చెందిన ప్రయోగాన్ని సిద్ధంచేసి చంద్రుడి మీదికి వెళ్లే అంతరిక్షనౌకతో పంపుతుంది. ఈ పోటీ తర్వాత ఇక మనుషుల చంద్రమండల యాత్రకి దారి ఏర్పడుతుందనీ, మరో ఐదేళ్లలో చంద్రుడి మీద ఓ కాలనీనే ఏర్పాటైపోతుందనీ అంటున్నారు పోటీలో ఉన్న మరో సంస్థ ‘మూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వ్యవస్థాపకులు నవీన్‌ జైన్‌. అధికారికంగా ప్రకటించలేదు కానీ నాసా కూడా ఇద్దరు అంతరిక్ష యాత్రికులతో తొమ్మిది రోజుల పర్యటన నిర్వహించేందుకు సన్నద్ధమవుతోందట.

నిజం ‘టైటానిక్‌’ చూడొచ్చు!
ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలు చూసి రావాలని తపించే పర్యటక ప్రియులకోసం... తొలి ప్రయాణమే మహా విషాదంగా మారిన టైటానిక్‌ ఓడ గుర్తుందిగా. దానిపై వచ్చిన సినిమా సూపర్‌ హిట్టు. ఆ ఓడ గురించి ఏ చిన్న వార్త వెలువడినా ఇప్పటికీ ఆసక్తిగా చదువుతారు అన్ని దేశాలవారూ. అలాంటప్పుడు సముద్రగర్భంలో 12,500 అడుగుల లోతున మునిగి ఉన్న ఆ ఓడను చూసొచ్చే అవకాశం కల్పిస్తే..? ఈ ఆలోచనే వచ్చింది బ్లూమార్బుల్‌ ప్రైవేట్ అనే పర్యటక సంస్థకి. దానికీ ఓ కారణముంది. మూడున్నర దశాబ్దాల క్రితం సైప్రస్‌ తీరంలో ‘జెనోబియా’ అనే ఓ పెద్ద ఓడ సామగ్రితో సహా మునిగిపోయింది. ఓడ మునిగిన ప్రాంతం తీరానికి దగ్గరగా ఉండడంతో చాలామంది డైవర్లు ఉత్సాహంగా దాన్ని చూడడానికి వెళ్తుంటారు. చివరికి అదో పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. మధ్యధరాసముద్రంలో ఉండడంతో ‘టైటానిక్‌ ఆఫ్‌ ద మెడ్‌’ అని దాన్ని పిలుచుకుంటున్నారు. మామూలు ఓడకే ఇంత క్రేజ్‌ ఉండడం చూసిన బ్లూమార్బుల్‌ కంపెనీకి నిజం టైటానిక్‌నే చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఫలితమే వచ్చే మేలో మొదలవనున్న పర్యటన. అయితే ఒక్క మాట. దానికో టికెట్‌ కూడా ఉంది మరి. టికెట్‌ ధర అప్పటి టైటానిక్‌లో మొదటి తరగతి టికెట్‌ ధర అంతే. కాకపోతే దాని విలువని ఇప్పటి కరెన్సీ విలువలో తీసుకుంటారు. అంటే కనీసం ఓ లక్ష డాలర్ల (రూ. 65 లక్షలు) పై చిలుకు..!

అంత సాహసం మన వల్ల కాదనుకుంటే మరో ఆఫర్‌ కూడా ఉంది. ఇది అంటార్కిటికాలోని పెంగ్విన్ల సామ్రాజ్యానికి.

ఇప్పటివరకూ ఈ మంచుఖండం మీదికి వెళ్లడానికి వివిధ అంశాలపై అధ్యయనాలు చేసే శాస్త్రవేత్తలకు మాత్రమే అవకాశం ఉండేది. చార్టర్డ్‌ ఫ్లైటూ ఆసక్తీ ఉన్న ధనికులెవరైనా అప్పుడప్పుడూ వెళ్లి చూసొచ్చేవారు. ఈ ఏడాది తొలిసారిగా అర్జెంటీనా నుంచి అంటార్కిటికాకి కమర్షియల్‌ ఫ్లైట్‌ నడపనున్నారు. పర్యటకులు క్యూ కడితే ఇక క్రమం తప్పకుండా విమానాలు నడుపుతారట.

ఇల్లే ఆఫీసు!
2018లో వ్యాపార సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని నిపుణుల అంచనా. ఇప్పటికే అడుగడుగునా మన జీవితాలు టెక్నాలజీ, అంతర్జాలాలతో అనుసంధానమైపోయాయి. నీళ్లు లేకుండా కొన్ని గంటలైనా బతకగలమేమో కానీ నెట్టు లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేమంటోంది యువతరం. ఇది ఇంకా పెరిగి ఇంటినీ ఆఫీసునీ వ్యక్తిగత జీవితాలనీ కూడా ప్రభావితం చేయనుంది. కృత్రిమ మేధా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆటోమేషన్‌ లాంటివి అన్నిచోట్లా ఉనికి చాటబోతున్నాయి. ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకే వెళ్లనక్కరలేదు. ఇంట్లో ఉండి ఆఫీసు పనీ, ఆఫీసులో ఉండి ఇంటిపనీ చేసేసుకోవచ్చు. ఆఫీసులోనే ఉండి ఇంట్లో టీవీ ఆన్‌చేసి మీకిష్టమైన ప్రోగ్రామ్‌ రికార్డు చేసుకోవచ్చు. ఒవెన్‌ సెట్‌ చేయొచ్చు. ఇంటికెళ్లేముందే ఏసీ ఆన్‌చేసి మీకు అవసరమైన ఉష్ణోగ్రత సెట్‌ చేసిపెట్టుకోవచ్చు. ఇన్నాళ్లూ ఎక్కడో ఒకరో ఇద్దరో వాడుతున్న ఇలాంటి హైటెక్‌ హంగులు ఈ ఏడాది సాధారణ విషయాలైపోతాయట. విదేశాల్లో చాలా కంపెనీలు ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగులు తమకు ఇష్టమైన సమయంలో పనిచేసుకోవడానికి వీలుకల్పిస్తే పని వేగంగా, నాణ్యంగా జరుగుతోందని అధ్యయనాల్లో తేలడంతో కొత్తగా వస్తున్న స్టార్టప్స్‌ పూర్తిగా దీని మీదే ఆధారపడుతున్నాయట. దాంతో ఆఫీసు నిర్వహణ ఖర్చు కూడా కలిసివస్తోంది. మన దగ్గర కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మాత్రమే ఇప్పటివరకూ ఆ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే మారుతున్న ట్రెండ్‌ని అందిపుచ్చుకోవడంలో మనమేమీ వెనకబడిపోమనీ ఈ ఏడాది ఆ మార్పు చూస్తామనీ అంటారు డిజిటల్‌ టెక్నాలజీ ట్రెండ్స్‌ నిపుణులు.

కేర్‌టేకర్‌ రోబోలు!
పిల్లల్ని చూసుకునే రోబోలను చైనా, జపాన్‌లలో కొందరు వాడుతున్నారు కానీ ఇతర దేశాలకు అంతగా రాలేదు. అయితే జపాన్‌కి చెందిన గ్లోబల్‌ బ్రిడ్జ్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ తమ శిశుసంరక్షణ గృహాల్లో సిబ్బంది కొరత ఉండడంతో వెవో అనే రోబోలను ఉపయోగిస్తోంది. పిల్లలను పర్యవేక్షించడానికి రోబోలనూ సెన్సార్లనూ కలుపుతూ కొత్త వ్యవస్థను రూపొందించింది. అది విజయవంతం కావడంతో వచ్చే ఏప్రిల్‌ నుంచీ ఇతర దేశాలకూ వాటిని అమ్మబోతున్నట్లు ప్రకటించింది. అంటే ఇక కేర్‌సెంటర్లూ ప్రిస్కూల్స్‌లో పిల్లల్ని ఆయాల బదులు రోబోలు చూసుకుంటాయన్నమాట.

రేషన్‌కి వేలిముద్ర. ఆఫీసుకు వెళ్తే వేలిముద్ర. అది లేకుండా ఇప్పుడు మనం ఏ పనీ చేయలేని పరిస్థితి కదా. అయితే వేలిముద్ర కన్నా చెవి ముద్ర ఇంకా సురక్షితం అని తేల్చారు చాలాకాలంగా దీనిపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు. కాబట్టి భవిష్యత్తులో చెవిముద్రల్నీ వాడుకోవాల్సి రావచ్చు. దుబాయ్‌లో ఇప్పటికే నేరస్థుల్ని పట్టుకునేందుకు పాదముద్రల్ని వాడుతున్నారు. పాదముద్రలంటే- మనిషి నడిచే తీరూ, అవయవాల కదలికా లాంటివన్న మాట. భద్రత కోసం ఎక్కడికక్కడ కెమెరాల నిఘా ఉంచినా ముఖానికి ముసుగులేసుకుని దోపిడీలూ దౌర్జన్యాలూ చేస్తూనే ఉన్నారు. అందుకని నడక ఆధారంగా వ్యక్తుల్ని గుర్తించే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ని తయారుచేసి విజయవంతంగా వాడుతున్నారక్కడ.

త్వరలోనే చెవి ముద్రల్నీ, చేతి ఆకృతినీ కూడా ఇలా భద్రతాపరమైన అంశాలకు వాడేందుకు విధానాలను రూపొందిస్తారట.

వెండితెర జాతర
సినీ అభిమానులకైతే ఈ ఏడాది కనుల విందే. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ ఎన్నెన్నో సినిమాలు ఈ సంవత్సరం వెండితెరలను అలంకరించనున్నాయి. రెండేళ్లుగా రూపుదిద్దుకుంటూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో 2.0 ఏప్రిల్‌లో అభిమానుల ముందుకు రానుంది. 2010లో వచ్చిన రోబో సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఒకేసారి తమిళం, హిందీలలో నిర్మించి 15 భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇక ఇప్పటికే పాటలతో, ట్రైలర్లతో దుమ్మురేపిన త్రివిక్రమ్‌, పవన్‌కల్యాణ్‌ల కాంబినేషన్‌ ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి సందడి చేయనున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’ కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. చిరంజీవి ఇందులో నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ‘జైసింహా’ అంటూ బాలకృష్ణా, ‘భరత్‌ అను నేను’ అంటూ మహేష్‌బాబూ, ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ అల్లు అర్జున్‌... అభిమానుల ముందుకు రాబోతుండగా ‘రంగస్థలం’పై రామ్‌చరణ్‌ మెరవనున్నారు. నానీ ‘కృష్ణార్జున యుద్ధం’ చేయనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌,  వెంకటేశ్‌- తేజ కాంబినేషన్లలో కొత్త సినిమాలూ రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌... ఈ ఏడాది సినీ అభిమానులను ఆశగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. హాలీవుడ్‌లోనూ ఏడాది పొడుగునా విడుదలయ్యేందుకు చాలా సినిమాలు వరసకట్టాయి. జురాసిక్‌ వరల్డ్‌- ఫాలెన్‌ కింగ్‌డమ్‌, అవెంజర్స్‌- ఇన్‌ఫినిటీ వార్‌, ది ఇన్‌క్రెడిబుల్స్‌-2, మిషన్‌: ఇంపాజిబుల్‌6 లాంటి సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

పోటీలే పోటీలు!
ఈ ఏడాది క్రీడాకారులకు సందడే సందడి. ఒలింపిక్స్‌ తర్వాత అంతగా ఆదరణ పొందిన ఆసియా క్రీడోత్సవాలు ఈసారి ఇండొనేషియాలోని జకార్తాలో జరుగుతున్నాయి. ఆగస్టులో మొదలయ్యే ఈ క్రీడలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ-స్పోర్ట్స్‌ను తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీ పడే ఒక అంశంగా చేరుస్తున్నారు. దాంతో ఇప్పటివరకూ ప్రైవేటు పోటీలకు పరిమితమైన ఈ-స్పోర్ట్స్‌ జట్లు ఆసియా క్రీడోత్సవాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే... జకార్తా ఆసియా క్రీడల మౌలిక వసతులన్నీ ఎలాంటి కర్బన ఉద్గారాలూ వెలువడకుండా, పర్యావరణహితంగా ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. యూరోప్‌కి చెందిన ఐఎంఎస్‌ ఈక్యూబ్‌ అనే సంస్థ ఈ నిర్మాణాలను చేపడుతోంది.

నాలుగేళ్లకోసారి జరిగే మంచు ఆటల సంబరాలు - వింటర్‌ ఒలింపిక్స్‌ ఫిబ్రవరిలో దక్షిణకొరియాలో ప్రారంభమవుతాయి. మరో క్రీడాసంబరం ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ కూడా ఈ ఏడాది జూన్‌-జులైలలో రష్యాలో జరుగనుంది. ఫుట్‌బాల్‌ క్రీడకు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే పోటీల్లో మనదేశం పాల్గొనకపోయినా అభిమానుల్లో మాత్రం నంబర్‌ వన్‌ స్థానం మనదేనట. అమెరికా, ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీలలో కలిపి ఎంత మంది ఫుట్‌ బాల్‌ అభిమానులున్నారో అంతకన్నా ఎక్కువ మంది ఒక్క మనదేశంలోనే ఉన్నారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ వచ్చాక ఫుట్‌బాల్‌కి దేశంలో ఆదరణ బాగా పెరిగింది. ఈ ప్రపంచ కప్‌ దానిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

* * *

ఇవన్నీ ఇప్పటివరకూ తెలిసిన... ఈ ఏడాది జరగబోయే విశేషాలు. ఇక తెలియకుండా జరిగేవి ఇంకెన్నుంటాయో! ప్రగతి దిశగా పరిశోధనలూ అధ్యయనాలూ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ప్రయోగదశ దాటి పలు పరీక్షలను తట్టుకుని నిలిచి గెలిస్తేనే అవి ప్రజలదాకా వస్తాయి. పైన చెప్పుకున్నవన్నీ అలా వచ్చినవే. ఇలాంటి ఇంకెన్నో మంచి విశేషాలకు ఈ ఏడాది సాక్షిగా నిలవాలనీ, చరిత్రలో 2018 అభ్యుదయ నామ సంవత్సరంగా నిలవాలనీ ఆకాంక్షిద్దాం.

ఈ చికిత్సలు వచ్చేస్తాయి!