close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
2017 ఏక్‌ ప్రేమ్‌ కథా!

2017 ఏక్‌ ప్రేమ్‌ కథా!

ప్రేమకథలు వినడమంటే మనకు మహా ఆసక్తి. ఆ కథ చెప్పేవాళ్లు అప్పుడు ఏమైందంటే... అంటూ చిన్న గ్యాప్‌ తీసుకున్నా సరే, తర్వాత ఏమైందో చెప్పూ... అంటూ తెగ హడావుడి పెట్టేస్తుంటాం. అందులోనూ సెలబ్రిటీల ప్రేమ ముచ్చట్లంటే పండగే. ఇక, వాళ్ల పెళ్లి మనకో హాట్‌ టాపిక్‌. అలా ఈ ఏడాది ప్రేమపెళ్లిళ్లు చేసుకున్న హాట్‌హాట్‌ జంటలేవో ఒకసారి చూద్దామా!

చేతిలోన చెయ్యేసి...

సమంతరూత్‌ ప్రభు సమంత అక్కినేనిగా మారడం సామ్‌ అభిమానులకేకాదు అక్కినేని ఫ్యాన్స్‌కీ సంతోషాన్నిచ్చిన విషయం. పెళ్లి సమయంలో సామ్‌, నాగచైతన్యలు ఎలా ఫీల్‌ అయ్యారోగానీ వాళ్ల అభిమానులు మాత్రం బాగా ఎగ్జైట్‌మెంట్‌కి లోనయ్యారు. ఆ జంట ఫొటోలను తెగ షేర్‌ చేసేస్తూ సందడిచేశారు. ‘ఏమాయ చేసావె’ అంటూ తొలి సినిమా చేసిన ఈ జంట నిజంగానే వలపుమాయలో పడిపోయింది. ఈ విషయం బైటకు తెలియడంతో ఇక, సమంత-నాగచైతన్య కలిసి ఎక్కడ కనిపించినా అదో హాట్‌టాపిక్‌. నాగార్జున కూడా వీళ్ల ప్రేమ విషయం కన్‌ఫర్మ్‌ చేయడంతో, మరి ముహూర్తమెప్పుడు అనే ప్రశ్న మొదలయ్యింది. మొత్తానికి ఈ ప్రేమజంట తమ వలపు ప్రయాణాన్ని ఈ ఏడాది నవంబరులో పెళ్లిదాకా చేర్చుకుంది. ఇటు అబ్బాయి ఇంట్లోనూ అటు అమ్మాయి స్వస్థలంలోనూ కాకుండా ఇద్దరికీ ఇష్టమైన మరోచోట పెళ్లి చేసుకోవడాన్ని ‘డెస్టినేషన్‌ మ్యారేజీ’గా పిలుస్తారు. సామ్‌ చైతూలు కూడా ఈ తరహా మ్యారేజీకే ఓటేసి తమకిష్టమైన గోవాలో సన్నిహితుల మధ్య ఒక్కటయ్యారు.

కొహ్లీ జట్టులోకి అనుష్క!

విరాట్‌కొహ్లీ అనుష్కల లవ్‌స్టోరీ అయితే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్న అసలైన సినిమా కథలా ఊరించింది. 2013లోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించినట్టు మీడియాలో గుసగుసలు వినిపించాయి. తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు ఆ గుసగుసల్ని నిజం చేశాయి. ఒక సమయంలో, విరాట్‌ సరిగ్గా ఆడకపోవడానికి అనుష్కే కారణమంటూ మీడియా దుమ్మెత్తిపోసింది. అసలు నువ్వు ఆ మేగజైన్లలో అందాలు ఆరబోయడం నాకు ఇష్టం లేదంటూ విరాట్‌ ఆమెతో గొడవపడ్డాడట. కొన్నాళ్లు బయటెక్కడా కలిసి కనిపించకపోయేసరికి వీళ్ల బంధం పుటుక్కుమన్నట్టేనంటూ పుకార్లూ బయల్దేరాయి. కానీ తమది విడదీయరాని ప్రేమబంధం అంటూ నిరూపించేందుకే ఈ నెల పెళ్లి పీటలెక్కిందీ జంట. హంగామాకు దూరంగా ఇటలీలో ఈ మధ్యే వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేదికకు పెట్టిన ఖర్చుకంటే అనుష్క ఉంగరానికి పెట్టిన ధర ఎక్కువవడం ఆమె మీద కొహ్లీకున్న ప్రేమకు ఓ నిదర్శనం.

జహీర్‌ జయించాడు!

ఎక్కువగా కెమేరా ఫోకస్‌లేకుండా నడిచిన మరో రకం ప్రేమకథ క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌, బాలీవుడ్‌ నటి సాగరికలది. మిత్రులుగా పరిచయమైన వీళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌ పెళ్లిలో ఒకే స్టేజీమీద కనిపించేసరికి ఇద్దరి మధ్యా ఏదో నడుస్తున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. తర్వాత తాము ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా చెప్పిన ఈ జంట ఈ ఏడాది నవంబరులో ఒక్కటయ్యింది. ఇటు హిందూ సంప్రదాయంలో కాకుండా, అటు ముస్లిం పద్ధతుల్లోనూ కాకుండా సంతకాల పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిందీ జంట.

తన ఫాస్ట్‌బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు వికెట్లను అలవోకగా పడగొట్టే భారత స్టార్‌ క్రికెటర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వలచిన అమ్మాయి మనసునీ తనదైన శైలిలో క్లీన్‌బోల్‌్్డ చేశాడు. తన పక్కింటమ్మాయీ, చిన్ననాటి స్నేహితురాలూ అయిన నూపుర్‌ నాగర్‌ను ఈ ఏడాది నవంబరు 23న ప్రేమించి పెళ్లాడాడు. భారత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కూడా తన సహచరుడు సత్యవ్రత్‌ కాదియాన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. కాదియాన్‌ కూడా జాతీయ స్థాయి రెజ్లరే కావడంతో వివిధ ఈవెంట్ల సందర్భంగా వీళ్లిద్దరూ కలుస్తూ ఉండేవారట. అలా రెజ్లింగ్‌ సాక్షిగా మొగ్గతొడిగిన వీళ్ల ప్రేమకూ ఈ ఏడాదే పెళ్లికార్డు పడింది. టెన్నిస్‌ ప్రపంచపు రారాణి సెరెనా విలియమ్స్‌ కూడా తాను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌ను ఈ సంవత్సరం నవంబరులోనే మనువాడింది. ఇక, ఈ సెలబ్రిటీ జంటలు బయటెక్కడ కనిపించినా పెద్ద వార్తేమీ కాదండోయ్‌... అని 2017 చెబుతోందన్నమాట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.