close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫిట్‌నెస్‌ మంత్ర @ 2017

ఫిట్‌నెస్‌ మంత్ర @ 2017

శారీరక దారుఢ్యం అనేది ఆటగాళ్లకీ రక్షణదళాలకీ సినీనటులకీ మాత్రమే అనుకునే రోజులు పోయాయి. అంతా ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారు. నిరంతరం ఓ మంత్రాన్ని జపిస్తున్నారు. అదే ఫిట్‌నెస్‌. దానికోసం ఏటా మార్కెట్లోకి వస్తోన్న అత్యాధునిక గ్యాడ్జెట్లనీ సొంతం చేసుకుంటున్నారు. అలా ఈ ఏడాది వచ్చినవాటిల్లో అత్యుత్తమ ఫిట్‌నెస్‌ గ్యాడ్జెట్లుగా ప్రాచుర్యం పొందినవాటిల్లో కొన్ని...
ఫిట్‌నెస్‌కోసం తీసే పరుగులో భారత్‌ కూడా అగ్రదేశాలతో పోటీపడుతోంది. ముఖ్యంగా నేటి యువత ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఫిట్‌నెస్‌ను జీవనశైలిలో భాగం చేసుకుంటోంది. సంప్రదాయ యోగా, కసరత్తులతోబాటు ఏరోబిక్స్‌, జుంబా, ఏరియల్‌ యోగా, పైలేట్స్‌, కిక్‌బాక్సింగ్‌... ఇలా రోజుకోరకం ట్రెండ్‌తో పుట్టుకొచ్చే జిమ్‌లూ ఫిట్నెస్‌ సెంటర్లను ఆశ్రయిస్తోంది. అదే సమయంలో ఆధునిక ఫిట్‌నెస్‌ గ్యాడ్జెట్లనూ సొంతం చేసుకుంటోంది. దాంతో ఈ ఏడాది ఫిట్‌నెస్‌ మార్కెట్‌ ఏకంగా రెండున్నర వేల కోట్ల వృద్ధితో సుమారు ఏడువేల కోట్ల రూపాయలకు చేరుకుంది.

జాబ్రా ఇయర్‌ఫోన్స్‌

చాలామందికి జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు చెవులకు హెడ్‌ఫోన్లు ఉండాల్సిందే. అందుకోసమే ఇప్పుడు రకరకాల వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లు వస్తున్నాయి. కానీ అవన్నీ చాలా బరువుగా ఉండటంతో అంత సౌకర్యంగా అనిపించవు. అందుకే జాబ్రా ఎలైట్‌ స్పోర్ట్‌ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఇయర్‌ఫోన్స్‌ తేలికగా ఉండటమే కాదు, అచ్చంగా వ్యాయామం చేసేవాళ్లకోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేశారట. పైగా ఇవి గుండెెవేగం మీదా ఓ లుక్కేస్తాయట. కాబట్టి చెవితోపాటు హృదయమూ పదిలమే మరి.

హ్యాపీ ఫోర్క్‌

కొంతమంది ఫిట్‌గా ఉండేందుకు క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తారు. టైమ్‌కి నిద్రపోతారు. కానీ తినేటప్పుడు మాత్రం నియంత్రించుకోలేరు. వాళ్లకోసమే ఈ హ్యాపీ ఫోర్క్‌. తింటుంటే ఇందులోని సెన్సర్లు కంపనాలు సృష్టిస్తూ తినే వేగాన్ని నియంత్రిస్తాయి. నిమిషానికి ఎన్నిసార్లు స్పూనుని నోట్లో పెట్టుకుంటున్నారు, ఎంతసేపు తింటున్నారు, ఎన్ని క్యాలరీలు తిన్నారు... వంటి విషయాలన్నీ అందులోని మినీ యూఎస్‌బీ ద్వారా మొబైల్‌లోకి వచ్చేస్తాయి. దీన్ని శుభ్రంగా కడుక్కోవచ్చు.

ఫిట్‌బిట్‌ ఆల్టా హెచ్‌ఆర్‌

  దృఢంగానూ ఆరోగ్యంగానూ ఉండాలంటే వ్యాయామంతోబాటు శరీరానికి మంచి నిద్ర కూడా అవసరమే. ఆ విషయాన్ని గుర్తించే ఫిట్‌బిట్‌ కంపెనీ ఆల్టా హెచ్‌ఆర్‌ పేరుతో ఈ ట్రాకర్‌ను రూపొందించింది. సాధారణ ఫిట్‌నెస్‌ ట్రాకర్లూ స్మార్ట్‌వాచీల్లోని ఫీచర్లన్నింటినీ కలిపి రూపొందించిన ఈ ట్రాకర్‌ను చేతికి పెట్టుకుంటే చాలు, ఇందులోని సెన్సర్లు నడక, క్యాలరీలు, గుండె వేగాలను లెక్కించడం...వంటి విషయాలతోబాటు నిద్ర సరిగ్గా పోయామా లేదా అన్నదాన్నీ గుర్తించి తెలియజేస్తుంది. దాంతో శరీరానికి సరిపడా నిద్రపోతున్నామా లేదా అన్నది తెలుసుకుని జాగ్రత్తపడొచ్చు.

సెన్సోరియా స్మార్ట్‌ సాక్స్‌

చాలామంది బ్రిస్క్‌వాక్‌తోపాటు పరిగెత్తడం కూడా చేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ సాక్సు వేసుకుంటే, పరిగెత్తినప్పుడు ఇందులోని సెన్సర్లు మడమలమీద పడే ఒత్తిడిని గుర్తించి, మీ పరుగుతీరును- అంటే మీ కదలికల్నీ వేగాన్నీ లెక్కించి ఆప్‌ ద్వారా తెలియజేస్తాయి. దాన్నిబట్టి వేగాన్ని పెంచాలా తగ్గించాలా పరిగెత్తేటప్పుడు పాదాలు నేలను సరిగ్గా తాకుతున్నాయా... వంటి అన్ని విషయాలనీ వివరంగా చెబుతుంది. అంటే ఒక రకంగా వర్చ్యువల్‌ కోచ్‌లా పనిచేస్తుందన్నమాట.

నాబొసొ యోగా మ్యాట్‌

ప్రపంచంలోకెల్లా హైటెక్‌ యోగా మ్యాట్‌ ఇదేనేమో.  ఎందుకంటే ఇది హాయిగా కూర్చునేందుకే కాదు, విన్యాసాలనూ తేలిగ్గా చేసేలా చేస్తుందట. ఇందుకోసం నిపుణుల బృందం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాట్‌లను క్షణ్ణంగా పరిశీలించి మరీ దీన్ని రూపొందించింది. కూర్చున్నా నిలుచున్నా ఇందులోని సెన్సర్లు చేతులూ పాదాల్లోని నరాలను ప్రేరేపించి, కండరాలమీద ఒత్తిడి కలిగించడంవల్ల చర్మం సులభంగా వంగుతుందట. ఈ మ్యాట్‌ తేలిగ్గా ఉండటంతో ఎక్కడికైనా సులభంగానూ తీసుకెళ్లొచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.