close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఏడాది రుచులివే!

ఈ ఏడాది రుచులివే!  

‘తినడం అనేది కేవలం కడుపు నింపుకోవడానికే కాదు, ఆత్మానందాన్నీ కలిగించాలి’ అంటారు ఆహారప్రియులు. కానీ అలాంటి ఆస్వాదన కొన్ని పదార్థాలవల్లే కలుగుతుంటుంది. వాటిల్లో ఈ ఏడాది అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారపదార్థాలుగా వార్తల్లో నిలిచినవే కిచిడీ, సమోసా, రసగుల్లా. మూడింటికీ ఎలాంటి సారూప్యంగానీ సంబంధంగానీ లేని వాటి కథేంటో చూద్దామా..!

చవులూరించిన రసగుల్లా... 

రసగుల్లా భౌగోళిక సూచిక కోసం రెండున్నరేళ్ల కిందట రెండు రాష్ట్రాల మధ్య మొదలైన రచ్చకు తెరపడిందీ ఈ ఏడాదే. ఎట్టకేలకు బాంగ్లార్‌(బెంగాలీ) రసగుల్లాకే ఆ జిఐ ట్యాగ్‌ దక్కడంతో పశ్చిమ బెంగాలీలు 9 కిలోల రసగుల్లా చేసి మరీ వేడుక చేసుకున్నారు. దాంతో ఆ రాష్ట్ర ప్రజల నోరు మరింత తియ్యగా అయితే, ఒడిశా వాసులకు మాత్రం చేదుమాత్ర మింగినట్లయింది. పాలవిరుగుడుతో చేసిన గుండ్రని బంతుల్ని పంచదార ద్రావణంలో ముంచి చేసేదే రసగుల్లా. దీన్ని బెంగాలీలు తెలుపు రంగులో రబ్బరు మాదిరిగా సాగినట్లుగా చేస్తే, ఒడిశావాసులు ముదురు గోధుమరంగులో మృదువుగా చేస్తారు. అందుకే వాళ్లు బాంగ్లార్‌ రసగుల్లా పేరుతోనూ వీళ్లు జగన్నాథ్‌ రసగుల్లా పేరుతోనూ జిఐ కోసం ప్రయత్నించారు. తీపి వంటకాల తయారీకి పేరొందిన బెంగాలీలు ఇది కచ్చితంగా మాదేనని వాదిస్తే; కాదు, దీని తయారీ అచ్చంగా మాదేననీ 15వ శతాబ్దం నుంచీ చేస్తున్నామనేది ఒడిశావాసుల కథనం. అయితే రూపంలోనూ రుచిలోనూ ఈ రెండూ పూర్తిగా వేరనీ, అందుకే వాటి పుట్టుపూర్వోత్తరాలను దృష్టిలో పెట్టుకోకుండా బెంగాలీ రకం రసగుల్లా కోసమే జిఐ ఇచ్చినట్లు ఆ సంస్థ వివరణ ఇవ్వడంతో రాష్ట్రాల మధ్య సంవాదానికి తెరపడినప్పటికీ రసగుల్లా రుచి భారతీయుల్ని చవులూరించింది. 

తిందామా సమోసా..!

సమోసా తిందామా అని అడగాలేగానీ వద్దనే వాళ్లు ఉంటారా. అందుకేనేమో ఈస్ట్‌ లండన్‌ మసీదుకి చెందిన ముస్లిం ఎయిడ్‌ వలంటీర్లు ఈద్‌ సందర్భంగా 153 కిలోల అతి పెద్ద సమోసాని తయారుచేసి గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించేశారు. ఆ తరవాత దీన్ని ఆ చుట్టుపక్కల పేదప్రజలకు పంచారట. మనదేశంలో తయారుచేయకపోయినప్పటికీ మనదైన రుచిని మరిచిపోలేక అక్కడ సమోసా తయారీని ఓ గొప్ప వేడుకలా చేయడంతో ఇది వార్తల్లోకొచ్చి,సమోసా రుచి ప్రపంచ భారతీయులందరికీ గుర్తొచ్చేలా చేసింది. 

కమ్మని వంట... కిచిడీ!

దేశమంతటా చిరపరిచితమైన ఆరోగ్యకరమైన వంటకం ఇది. అందుకే దీన్ని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదనీ, నవంబరులో దిల్లీలో భారీయెత్తున నిర్వహించిన ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2017 వేడుకకోసం భారతీయ బ్రాండ్‌ ఆహారంగా దీన్ని ఎంపికచేశామనీ కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చింది. దానికితోడు ఆ వేడుకకోసం ప్రముఖ షెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ తన బృందంతో కలిసి 918 కిలోల కిచిడీ చేసి ప్రపంచ రికార్డుని సృష్టించారు. ఆ తరవాత దాన్ని అక్కడికి వచ్చిన అతిథులూ కేంద్ర మంత్రులతోబాటు దిల్లీలోని పేదలకీ పంచారు. కారణమేదయినా ఈ రుచికరమైన పోషకాహారం, మరోసారి అందరికీ ప్రియమైన వంటకంగా మారింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.