close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్ఫూర్తి కిరణాలు

ఎంత మంచి పనులెన్ని చేసినా ఎవడో దూషించకుంటాడా శ్రీకృష్ణుడు ఎంతటివాడైనా శిశుపాలుడు లేకుంటాడా... అన్నారో కవి.
నిజమే... ఈ రోజుల్లో ఏదైనా మంచి పని చేయాలన్నా ఎన్నో అవరోధాలూ అవహేళనలూ.అయినా సరే, వాటన్నిటినీ సహించి కొందరు అడుగు ముందుకే వేస్తారు. సాటిమనిషి కష్టానికి స్పందిస్తారు, భావితరాలకు మేలు చేయాలని తపిస్తారు. ఆ కోవలోకే వస్తారు ఈ స్ఫూర్తి కిరణాలు... మంచీ చెడూ సంఘటనలెన్నింటికో మౌనసాక్షిగా 2017 వీడ్కోలు తీసుకుంటున్న ఈ తరుణంలో వారి స్ఫూర్తిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

వారిది ‘హక్కుల’ చదువు

మనదేశంలో రకరకాల పాఠశాలలున్నాయి. కేంద్ర, రాష్ట్ర సిలబస్‌లతో పాటు అంతర్జాతీయ సిలబస్‌లను నేర్పే బడులూ ఉన్నాయి. కానీ యూపీలోని కొన్ని బడుల్లో అమ్మాయిలకు వారి హక్కుల గురించి నేర్పిస్తారు. తద్వారా జీవితాన్నీ, సమాజాన్నీ మార్చుకోమని చెబుతున్న డాక్టర్‌ ఊర్వశీ సాహ్ని ఈ ఏడాది సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు అందుకున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు చదువుకోవడం అంత తేలికైన పని కాదు. స్త్రీవిద్యకు ఏమాత్రం విలువివ్వని సమాజంలో లైంగిక హింసా, బాలకార్మికతా, బాల్యవివాహాలూ... లాంటి వాటన్నింటినీ తప్పించుకుని అమ్మాయిలు బడి దాకా రావడమే కష్టం. అందుకని వారికి ప్రోత్సాహమిచ్చే పాఠ్యాంశాలకే ప్రాధాన్యమిస్తారు ఊర్వశీ సాహ్ని. ఆమె నిర్వహిస్తున్న స్టడీ హాల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో స్త్రీల హక్కుల్ని పాఠాలుగా విడమరచి చెప్తారు. ఊర్వశి మంచి పాఠశాలలో చదువుకున్నారు. పెళ్లయ్యాక, విదేశాల్లో పై చదువులు చదివేటప్పుడు తెలిసిందామెకు- అప్పటిదాకా చదివిన చదువు తన గురించి తాను తెలుసుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడలేదని. తన మీద తనకి నమ్మకం కలిగించే చదువు ఎంత ముఖ్యమో అర్థమయ్యాక ఆమె వెనుదిరిగి చూడలేదు. స్వదేశానికి వచ్చి లఖ్‌నవూలో పట్టణంలోని పేదల పిల్లలకూ, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకూ, గ్రామీణ బాలబాలికలకూ వేర్వేరుగా విద్యాసంస్థల్ని ప్రారంభించారు. వీటన్నిటిలోనూ స్త్రీవాద దృక్పథం నుంచి విద్యాబోధన సాగుతుంది. విద్యార్థుల్లో పరిపూర్ణ వ్యక్తిత్వం రూపుదిద్దుకునేలా ఆ బోధన ఉంటుంది. ఆ బడుల్లో చదువుకున్న అమ్మాయిలు ఇప్పుడు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. విద్యతో సామాజిక మార్పునకు ఊర్వశి చేస్తున్న కృషికి గుర్తింపుగా సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ఇండియా -2017 అవార్డూ పలు అంతర్జాతీయ అవార్డులూ లభించాయి.

మనసున్న వైద్యుడు

వైద్యం గురించి సమాజంలో ఎన్నో రకాల అభిప్రాయాలు. వైద్యం వ్యాపారమైపోతోందనీ, అనవసరంగా పరీక్షలు రాసి రోగుల్ని దోచుకుంటారనీ ఎన్నో ఆరోపణలు. ఈ వైద్యుడి గురించి తెలిస్తే అవన్నీ మారిపోతాయి. రోగుల అవస్థ వైద్యులను ఎంతగా కదిలిస్తుందో చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ ఈ డాక్టర్‌.

డాక్టర్‌ ఎస్‌.రాజశేఖరన్‌ కోయింబత్తూరులోని గంగా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి. వెన్నెముక శస్త్రచికిత్సలో నిపుణులు. రోడ్డుప్రమాదాల్లో గాయపడి విరిగిన, చితికిన ఎముకలతో అచేతనావస్థలో రోజూ ఎందరో వస్తుంటారు ఆ ఆస్పత్రికి. కొన్ని ప్రాణాలు చికిత్స చేసేవరకూ కూడా నిలవవు. కొందరు ప్రాణాలు నిలబెట్టుకుని వైకల్యంతో బయటపడతారు. స్క్రూలూ రాడ్లూ హుక్కులూ వాడి ఎముకలను అతికి మరికొందరిని నిలబెట్టాల్సి వస్తుంది. ఆస్పత్రిలో నిత్యం చూసే ఈ దృశ్యాలు ఆయన్ని తీవ్రంగా బాధించాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గించే చర్యలు ఎందుకు తీసుకోరంటూ సూటిగా న్యాయస్థానాన్నే ప్రశ్నించారు. చట్టాలనూ, భద్రతా నియమాలనూ కచ్చితంగా అమలుచేస్తే ప్రమాద మరణాల్లో 90 శాతం తగ్గించవచ్చంటూ ఎంతో వివరంగా ఆయన ఇచ్చిన నివేదిక న్యాయమూర్తులనూ ఆలోచింపజేసింది. ప్రమాదాల్లో మూడు నిమిషాలకొకరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారనీ, వారిలో సగానికి పైగా యువకులేననీ, ఇది దేశానికీ తీరని నష్టమనీ ఆయన వివరించారు. నిజానికి ఆయన వేసిన రిట్‌ పిటిషన్‌ను రహదార్ల రవాణా మంత్రిత్వ శాఖ వ్యతిరేకించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం దాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారించింది. గత నవంబరులో రోడ్డు భద్రతకు 25 కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రహదారుల నిర్మాణంలో నాణ్యతను పెంపొందించడంతో మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రజలూ తీసుకోవాల్సిన చర్యల వరకూ ఎన్నో ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. సామాజిక బాధ్యతతో స్పందించిన డాక్టర్‌ రాజశేఖరన్‌ స్ఫూర్తిని న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.

వారాంతాల్లో అదే పని!

బీచ్‌లంటే అతనికి సముద్రమంత ప్రేమ. ఆ బీచ్‌లలో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ చెత్త అలల వెంట సముద్రంలోకి చేరి జలచరాల పాలిట ప్రళయంగా మారుతున్న వైనం అఫ్రోజ్‌ని ఆలోచింపజేసింది. తానే స్వచ్ఛ బీచ్‌ కార్యక్రమం చేపట్టాడు. ఐరాస అవార్డుతో పాటు ప్రధాని మోదీ ప్రశంసల్నీ అందుకున్నాడు.

ముంబయిలోని వెర్సోవా బీచ్‌ని శుభ్రంచేయడానికి నడుం బిగించాడు వృత్తిరీత్యా న్యాయవాది అయిన అఫ్రోజ్‌. అతడిని చూసి స్ఫూర్తిపొందిన కొందరు యువకులూ, సమీపంలోని మురికివాడల ప్రజలూ చేయి కలిపారు. అప్పుడప్పుడూ అమితాబ్‌ లాంటి బాలీవుడ్‌ తారలూ వచ్చేవారు. ‘బీచ్‌లో ఏముంటాయి- ప్లాస్టిక్‌ కవర్లూ కాగితాలేగా, వాటిని ఏరడం ఎంతసేపు’ అనుకుంటే పొరపడినట్లే. అఫ్రోజ్‌షా ట్విటర్‌ ఖాతాలోని ఫొటోలూ వీడియోలూ చూస్తే ఆ పని ఎంత కష్టమో తెలుస్తుంది. ప్రపంచంలో అతి పెద్ద బీచ్‌ క్లీనప్‌ కార్యక్రమం ఇదేనంటూ ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ వారు అఫ్రోజ్‌కి ‘ఛాంపియన్‌ ఆఫ్‌ ద ఎర్త్‌’ అవార్డునిచ్చి సత్కరించారు. రెండున్నర కిలోమీటర్ల బీచ్‌లో అడుగడుగూ గాలిస్తూ టన్నుల కొద్దీ చెత్తను ఎత్తిపెడితే కనీసం దాన్ని తీసివేసే పని కూడా పారిశుద్ధ్య శాఖ చేపట్టలేదు. మరోపక్క వలంటీర్లకు రౌడీల వేధింపులు. విసిగిపోయి ఇంక తమ వల్ల కాదనీ మానేస్తామనీ ట్వీట్‌ చేశాడు అఫ్రోజ్‌. అది చూసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ డిసెంబరు మొదటి ఆదివారం స్వయంగా వచ్చి అఫ్రోజ్‌ బృందంతో కలిసి బీచ్‌ శుభ్రం చేశారు. దాంతో అధికారులూ దిగి వచ్చారు. ఇలా ఆటంకాలను అధిగమిస్తూ అఫ్రోజ్‌ బృందం పని చేస్తోంది. ప్రతి శని, ఆది వారాలు చేయాల్సిన పనుల వివరాలను ముందుగానే అఫ్రోజ్‌ ట్విటర్లో పెడతాడు. అది చూసి వలంటీర్లందరూ వచ్చేస్తారు.

తప్పొకరిది... శిక్ష మరొకరికా?

జాతీయ రహదారుల పక్కన మద్యం షాపులు ఉండడాన్ని అందరూ చూశారు. దాని పరిణామాల్ని మాత్రం హర్మన్‌సింగ్‌ చూశాడు. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలికావడం చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఫలితమే ఈ ఏడాది అమల్లోకొచ్చిన మరో చరిత్రాత్మక తీర్పు.

ఇరవై ఏళ్ల క్రితం సంగతి. హర్మన్‌సింగ్‌ సిద్ధూ ఉద్యోగం చేసుకుంటూ వారాంతాల్లో స్నేహితులతో షికార్లకు వెళ్లేవాడు. ఓరోజు అతను ప్రయాణిస్తున్న కారు గొయ్యిలోపడింది. హర్మన్‌ వెన్నెముక దెబ్బతింది. రెండేళ్ల పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలబారిన పడి అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రిలో చేరుతున్నవారిని చూశాడు. పలు ప్రమాదాలకు కారణం డ్రైవర్లు మద్యం తాగి వాహనం నడపడమేనని తెలుసుకున్నాడు. జాతీయ రహదారుల పక్కనే మద్యం దుకాణాలు ఎందుకుంటాయో అప్పుడు అర్థమైంది. సహ చట్టం కింద ప్రశ్నించి మద్యం షాపుల గణాంకాలన్నీ సేకరించాడు. ప్రధాన రహదారుల వెంట మద్యం దుకాణాలు లేకుండా చూస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేశాడు. న్యాయస్థానం అతని అభిప్రాయంతో ఏకీభవిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. చక్రాల కుర్చీలో కూర్చుని చరిత్రాత్మక తీర్పుకి కారణమైన హర్మన్‌ మరో పక్క ఎరైవ్‌సేఫ్‌ అనే ఎన్జీవోనీ నిర్వహిస్తున్నాడు. రోడ్డు భద్రతా చర్యలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస లాంటి సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నాడు.

అడుక్కోవడమా... ఆత్మగౌరవమా...

హైదరాబాద్‌లో జీఈఎస్‌ సమావేశాల నేపథ్యంలో బిచ్చగాళ్లందరినీ ఆశ్రమాలకు తరలించేశారు అధికారులు. అదే సమయంలో యూపీలో ఓ యువకుడు భిక్షుక వృత్తిని నిర్మూలించే దిశగా చట్టాలకు పదును పెట్టమని కోరుతూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాడు. ఆ యువకుడు శరద్‌ పటేల్‌.

పల్లెటూళ్లో పుట్టి పెరిగిన శరద్‌ పైచదువులకు పట్టణానికి వెళ్లినప్పుడు మొదటిసారి బిచ్చమెత్తుకునేవాళ్లను చూశాడు. పట్టెడన్నం కోసం చేయిచాచి అడుక్కుంటున్న దృశ్యం ఆ రైతుబిడ్డను కలచివేసింది. సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే పరిచయంతో సహ చట్టం గురించి తెలుసుకున్నాడు. దాని సహాయంతో పలు వివరాలు సేకరించాడు. పునరావాస కేంద్రాలున్నాయి. నిధులొస్తున్నాయి. ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా ఒక్కరు కూడా అందులో ఆశ్రయం పొందడం లేదు. పైగా చట్టం ప్రకారం చూస్తే అవి బిచ్చగాళ్ల జైళ్లు కానీ సంస్కరణ కేంద్రాలు కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల తప్ప ఎవరూ ఇష్టంతో భిక్షాటన చేయరనీ వారికీ ఆత్మగౌరవం ఉంటుందనీ నమ్మే శరద్‌ వారిని సంస్కరించే బాధ్యత తన భుజాల మీద వేసుకున్నాడు. అధికారులను ఒప్పించి వారికి రేషను కార్డులు ఇప్పించాడు. వృత్తి విద్య శిక్షణల్లో చేర్పించాడు. కొందరు రిక్షాలు తొక్కుతున్నారు. వాళ్ల పిల్లల కోసం తానే స్కూలు పెట్టాడు. ‘బద్లావ్‌(మార్పు)’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి రెండేళ్లలోనే వందలాది జీవితాల్లో మార్పు తెచ్చాడు శరద్‌. బిచ్చగాళ్లను సంస్కరించడం ఎవరివల్లా అయ్యే పని కాదంటూ మొదట నిరుత్సాహపరిచినవారే ఇప్పుడు శరద్‌ని అభినందిస్తున్నారు.

ప్రాణం కన్నా పరువు ఎక్కువా?

పరువు ముందు ప్రాణం లోకువైంది. పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు కౌసల్య భర్త పెద్దల పగకి బలయ్యాడు. తనలా మరెవరూ బాధపడకూడదంటే కన్నవారి మీద పోరాడక తప్పదనుకుంది కౌసల్య.

కులాంతర వివాహం చేసుకున్నందుకు తమిళనాడుకు చెందిన కౌసల్య, ఆమె భర్త శంకర్‌లపై కిరాయి గూండాలతో దాడి చేయించారు ఆమె తల్లిదండ్రులు. ఆ దాడిలో కౌసల్య కొనప్రాణాలతో బయటపడగా శంకర్‌ ప్రాణం కోల్పోయాడు. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మేజరైన తన హక్కు. అలాంటప్పుడు పెద్దలు ఏ అధికారంతో తనకింత అన్యాయం చేశారో ఆమెకు అర్థం కాలేదు. కన్న కొడుకును కోల్పోయిన అత్తమామలకు అండగా నిలబడింది. పరువు పేరుతో ఇలా ఎంతమంది ప్రాణాలు తీస్తారని ప్రశ్నిస్తూ న్యాయస్థానానికి వెళ్లింది. కన్నవారిని కోర్టుకి రప్పించడం బాధగానే ఉన్నా మరెవరికీ అలాంటి అన్యాయం జరగకూడదని తానే ఎదురు తిరిగింది. ఏడాదిన్నరపాటు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆమె ఎదుర్కొన్న ప్రశ్నలూ అవమానాలకు లెక్కే లేదు. జరిగింది అన్యాయమేనని భావించిన జిల్లా కోర్టు కౌసల్య తండ్రి సహా ఆరుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఇటీవలే తీర్పు వెలువరించింది. కన్నతండ్రినే ఉరికంబమెక్కిస్తావా అంటూ ఎన్నో గొంతులు ఆమెను ప్రశ్నించాయి. ‘కన్నబిడ్డనే చంపుతావా అని ఎవరూ వాళ్లను అడగలేదెందుకు’ అన్నది కౌసల్య ప్రశ్న. కోర్టు తీర్పుతోనైనా కుల వివక్ష కారణంగా జరిగే పరువు హత్యలు ఆగుతాయన్నది ఆమె ఆశ.

పర్యావరణ ‘పాఠం’

పర్యావరణమూ కాలుష్యమూ నదుల సంరక్షణా... ఈ ఏడాది ఎక్కువగా విన్పించిన మాటలు. కానీ మాటలు చేతల్లోకి మారాలంటే మాత్రం మెహతా లాంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది. వారు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయాలి. న్యాయస్థానం దానికి వత్తాసునివ్వాలి. అప్పుడే తోలుమందం ప్రభుత్వాలు ఒక అంగుళమైనా కదులుతున్నాయి.

వృత్తిరీత్యా న్యాయవాదీ ప్రవృత్తి రీత్యా పర్యావరణవేత్తా అయిన ఎంసీ మెహతా పర్యావరణశాస్త్రాన్ని  విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టమని ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. విచారించిన న్యాయస్థానం సానుకూలంగా తీర్పు ఇచ్చింది. రెండున్నర దశాబ్దాలైనా ఆ తీర్పు అమల్లోకి రాలేదంటూ మళ్లీ పిటిషన్‌ వేశారాయన. స్పందించిన న్యాయస్థానం ఈ ఏడాది తాజాగా ప్రభుత్వాల్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చామనీ రాష్ట్రాల పరిధిలో తామేమీ చేయలేమనీ ఇంకా 300లకు పైగా విశ్వవిద్యాలయాలు ఈ ఆదేశాలను అమలుచేయడం లేదనీ ప్రభుత్వం సమాధానమిచ్చింది. అదీ పాతికేళ్ల తర్వాత సుప్రీం తీర్పు అమలు పరిస్థితి.

ఇదొక్కటే కాదు, గంగానది కాలుష్యంపై మెహతా పోరాటం మూడు దశాబ్దాల క్రితమే మొదలైంది. పత్రికల్లో ‘మంటల్లో గంగానది’ అనే వార్త చూసి ఆశ్చర్యపోయిన మెహతా ఆసక్తితో అక్కడికి వెళ్లారు. ఓ వ్యక్తి సిగరెట్‌ వెలిగించుకుని అగ్గిపుల్ల నీళ్లలో పడేస్తే ఒక్కసారిగా మంటలు లేచాయి.
ఆ మంటలు ఆర్పడానికి 30 గంటలు పట్టింది. ఓ కర్మాగారం నుంచి వస్తున్న వ్యర్థాలు నదిలో కలుస్తున్నచోట అగ్గిపుల్ల పడడంతో మంటలు లేచాయి. అన్ని గంటలపాటు నీళ్ల మీద మంటలు మండాయంటే ఏ స్థాయిలో రసాయనాలు నీళ్లలోకి చేరివుంటాయోనన్న ఆలోచన మెహతా చేత సుప్రీంకోర్టులో తొలి ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయించింది. గంగానదిని పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు. ఇలా నదిలోకి కాలుష్యాలను వదలడం వారి నమ్మకాన్ని వమ్ముచేయడమేననీ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమేననీ ఆయన న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విచారించిన న్యాయస్థానం నదిలోకి వ్యర్థాలను వదులుతున్న ట్యానరీలను మూయించింది. నదిని ఆనుకుని ఉన్న నగరాలూ పట్టణాలనన్నిటినీ మురుగునీటి శుద్ధి ప్లాంటులు నిర్మించుకోమని ఆదేశించింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ గంగానదిలో కలుస్తున్న కాలుష్యాల గురించి ఎన్నో కేసులు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటినీ మెహతా కేసుతో కలుపుతూనే ఉంది న్యాయస్థానం. ఎప్పటికప్పుడు కొత్త ఆదేశాలు ఇస్తూనే ఉంది. ఇప్పటివరకూ దాదాపు ఏడువేల కోట్ల రూపాయలు గంగానది ప్రక్షాళనకోసం ఖర్చుపెట్టారు. కానీ ఫలితం ఏమీ లేదంటారు ఇప్పటికీ ఆ కేసును వదలని మెహతా. ఇలాంటి పట్టువదలని విక్రమార్కుల్ని చూసినప్పుడే రేపటి మీద ఆశలు చిగురిస్తుంటాయి.

వారికి ప్రశ్నించడం నేర్పి...

అగ్రవర్ణాల్లో పుట్టిపెరిగినవారికి దళితుల కష్టాలు ఏం తెలుస్తాయనే వారికి లెనిన్‌ రఘువంశీ గురించి తెలియదనే చెప్పాలి. కులాల ఆధిపత్యమూ పితృస్వామ్యమూ ప్రజల జీవితాలను శాసిస్తున్న గ్రామాలవి. అణచివేతా అక్రమాలూ నిత్యకృత్యాలు. అలాంటి చోట నిరుపేద దళితులకూ స్త్రీలకూ ప్రశ్నించే గొంతు ఇచ్చిన వ్యక్తి లెనిన్‌ రఘువంశీ.

రఘువంశీ తాత గాంధేయవాది. ముంబయిలో తాత దగ్గర పెరిగిన లెనిన్‌కి కబీర్‌ నుంచీ అంబేడ్కర్‌ వరకూ గొప్ప గొప్ప వ్యక్తుల సిద్ధాంతాల గురించి అవగాహన కలిగింది. వాటన్నిటినుంచి తనదైన పద్ధతినీ సిద్ధాంతాలనూ రూపొందించుకున్నాడు. భారతదేశమంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న గొప్పదేశం. మరో పక్క నుంచి చూస్తే ఇక్కడి సమాజం ఎన్నో రకాల వివక్షలకు మూలం. ఈ పరిస్థితి అతడిని ఆలోచింపజేసింది. కుల వ్యవస్థ పట్ల విముఖత దళితుల సమస్యలను బాగా అర్థం చేసుకునే వీలు కల్పించింది. అణచివేతా వనరుల దోపిడీ పేదలపై చూపుతున్న ప్రభావాన్ని అర్థం చేసుకున్న లెనిన్‌ పీపుల్స్‌ విజిలెన్స్‌ కమిటీ ఆన్‌ హ్యూమన్‌ రైట్స్‌ అనే సంస్థను ప్రారంభించాడు. బాలకార్మికులందరినీ బడికి పంపే ప్రయత్నంతో సంస్థ పని ప్రారంభించింది. గృహహింసకు వ్యతిరేకంగా స్త్రీలను చైతన్యపరిచింది. మనుషులందరినీ సమానంగా చూడాలని చెప్పినందుకు గ్రామస్థులనుంచి ఎదురైన బెదిరింపులకు లెక్కే లేదు. పోరాడిన కేసులకు అంతే లేదు. లెనిన్‌ మాత్రం బెదరలేదు. దళితులను వేధించిన పోలీసులపై కేసులు పెట్టడానికీ వెనకాడలేదు. నేరాల్ని నిరూపించి 50 మంది పోలీసులకు శిక్ష పడేలా చేశాడు. భార్య శ్రుతీ స్నేహితులూ సంస్థ కార్యకర్తలతో కలిసి బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ దాదాపు 250 గ్రామాలను జనమిత్రగ్రామాలుగా మార్చాడు. ఉత్తరాది లోని పలు రాష్ట్రాలకు తమ కార్యక్రమాలను విస్తరించాడు. స్వతంత్ర భారతదేశంలో దళితుల పరిస్థితుల గురించి లెనిన్‌ రాసిన పుస్తకానికి మంచి పేరొచ్చింది. హక్కుల ఉద్యమకారుడిగా అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకున్న లెనిన్‌ వివక్ష బాధితులకు అండగా నిలిచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం తమ ప్రధాన కర్తవ్యమంటాడు.

ఓ పిల్లవాడు స్నేహితులతో కలిసి బడికెళ్తున్నాడు. ఆ దారిలో రోడ్డు మీద ఓ పెద్ద బండరాయి ఉంది. అడ్డంగా ఉన్నా పక్కనుంచీ వెళ్తున్నారే తప్ప ఎవరూ దాన్ని తీసే ప్రయత్నం చేయలేదు. ఈ అబ్బాయి ఆ రాయిని పక్కకి తోయడానికి ప్రయత్నించాడు. ‘ఆహా వచ్చాడండీ భీముడు...’ అంటూ పిల్లలందరూ నవ్వారు. ఆ అబ్బాయి కూడా నవ్వుతూ బడికెళ్లిపోయాడు. మర్నాడు మళ్లీ ఆ బండరాయిని కదిపే యత్నం చేశాడు. ఈసారి పిల్లలంతా తలా ఒక చెయ్యీ వేశారు. రెండు రోజులు పదిమందీ ప్రయత్నించేసరికి పాతుకుపోయిన రాయి కాస్త కదిలింది. అది చూసి కుర్రాళ్లకి హుషారొచ్చింది. ఓరోజు ఇంకా గట్టిగా ప్రయత్నించారు. రాయిని పక్కకి తోసేశారు. రోడ్డు మీద గుంతను మట్టితో పూడ్చేశారు. సంతోషంతో చిందులు వేశారు. అప్పటివరకూ రోడ్డు మీద అడ్డంగా ఉన్న రాయిని చూసీచూడనట్లు పక్కనుంచీ వెళ్లిపోయిన పెద్దలంతా పిల్లల్ని మెచ్చుకున్నారు.
రాయిని అడ్డు తొలగించాలన్న ఆలోచన వచ్చిన ఆ కుర్రవాడే ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌.
కొత్తదారిలో నడిచే మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే...
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే...
ఆ ఒక్క అడుగే వెనక వచ్చేవాళ్లకో బాట వేస్తుంది!
అదే రేపటి వెలుగుబాట అవుతుంది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.